Previous Page Next Page 
కృష్ణవేణి పేజి 37


    "..............................."
    "పవిత్రమైన నీ హృదయంలో ప్రముఖ స్థానం ఇచ్చి ఎలా తోసి వేశావు వేణూ? నన్ను మర్చిపోతావా? నీ మాధవ్ ని...."
    "............................."
    "ఒక్కమాట చెప్పు వేణూ! నేను కావాలని నీమనసు ఆరాటపడటంలేదా? చెప్పు వేణూ!" మాధవ్ గొంతు గద్గదికమైంది. చూస్తుండగానే మాధవ్ కళ్ళలో నీరు తిరిగింది. మాధవ్ ఏడుస్తున్నాడు. నా మనసు విలవిల్లాడింది. మాధవ్ వంటి మగవాడు కన్నీరు కార్చటం సామాన్య విషయం కాదు. మవునంగా మాధవ్ చెంపల తుడిచాను, మాధవ్ నా చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు.
    "పెళ్ళయిన వాడినని అనుమానిస్తున్నావా? నన్ను నమ్మలేవా?"
    "నా స్నేహం క్షణికమని భావించకు వేణూ!"
    "ఇద్దరం మా యింటికి వెళ్ళి పోదాం. కాదనకు నాకోసం నీ మాధవ్ కోసం.....అంగీకరించు వేణూ! ఎన్ని కోరికలు పుట్టించావో....ఎన్ని ఆశలు రేకెత్తించావో మర్చి పోతున్నావా? నేనేం కావాలి వేణూ? వెన్నవంటి నీమనసు ఎందుకింత పాషాణమై పోయింది వేణూ?"
    నిజంగా నా మనసు పాషాణమే అయింది మాధవ్. ఎన్ని విధాలా ఎంతదీనంగా వేడినా... ప్రాధేయ పడినా కరగనంత కాఠిన్యత నింపుకొంది. మాధవ్ పై నుండే ఆ కరుణా- ఆ సానుభూతీ ఏమయ్యాయో- మాధవ్ కన్నీటికైనా అంత విలువ లేకుండా ఎలా పోయిందో నేను చెప్పలేను. ఇప్పటికీ అది నాకు అర్ధంగాని విషయమే. అన్నిటికీ ఒకే సమాధానం చెప్పాను-"నన్ను మర్చిపో.....మాధవ్! ఇంకేమీ చెప్పలేను."
    దూరాన అస్తమిస్తున్న సూర్యబింబంలా మాధవ్ మొహం ఎర్రబారి పోయింది. చూపులు శూలాలయి గుచ్చుకుంటూంటే తట్టుకోలేకపోయాను. సౌమ్య మూర్తి మాధవ్ లో అంత క్రోధం దాగి ఉన్నందుకు ఆశ్చర్యపోయాను.
    ఏం? ఆ శ్యామసుందర్ అంత అందగాడా? ఆస్థిపరుడని మోజు పడ్డావా? "నిన్నంతగా ఆకర్షించగలిగాడేమిటి?" మాధవ్ హేళన చేసినా నేను సౌమ్యంగానే అన్నాను-" నన్ను అను మాధవ్! ఆ విషయంలో ఆయన ప్రసక్తి అవసరం. నేను చెప్పిన కారణాలు వేరు."
    "అవును నీ దృష్టి అకస్మాత్తుగా పరువు ప్రతిష్ఠ లలో పడి చిక్కుకుంది. నువ్వు కాపాడుకోవాలనుకొంటూన్న పరువు ప్రతిష్టల్ని బజారు పాలు చేసి నీ బ్రతుకు నాశనం చెయ్యాలంటే ఘన కార్యం కాదు. కాని కృష్ణవేణీ! నీలా నేను కృతఘ్నున్ని కాను. నమ్మించి మోసం చెయ్యటం నీకు చేతనైంది. నాకు కాదు."
    సిగ్గుతో తలదించుకున్నాను. మనసులోనే మాధవ్ సహృదయతకు జోహార్లు అర్పించాను. మాధవ్ ఏనాడైనా నా రహస్యాలు బయట పెడతాడేమోనన్న భయం నాకు లేదు. అంతులేని అనురాగంతో నన్ను గుండెల అదుముకొనే మాధవ్ కీ నా మీద కోపం వచ్చింది. మాధవ్ సన్నిధికోసం తపించి పోతున్న నేను మాధవ్ ని తిరస్కరించాను. -"దూరంగా కూర్చోడానికి ఇంత దూరం వచ్చానా?" అంటూ అధికారంగా వచ్చి ఒళ్ళో తలవంచుకు పడుకునే మాధవ్ నేనా సమీపంలో వున్న సంగతే మరిచినట్టు శిలా ప్రతిమలా వుండి పోయాను. ఎన్నో చిలిపి కబుర్లతో మాధవ్ ని విసిగించే నాకు మాధవ్ ని పల్కరించడానికి ధైర్యం చాలటం లేదు.
    నెమ్మదిగా మాధవ్ చేతిని చేతిలోకి తీసుకున్నాను. చెంప కానించుకున్నాను. మాధవ్ లో చలనం కలిగింది. ఆలోచనల నుంచి తేరుకున్నాడు. నా చేతిలోంచి చేతిని తీసుకున్నాడు.
    "మాధవ్!" అప్రయత్నంగా పిలిచాను.    
    "ఒద్దు కృష్ణవేణీ! ఆ అధ్యాయం దాటి పోయింది. నువ్వు పిలవటం నేను పిలిపించుకోవటం ఇక జన్మంలో ఆఖరి సారి."
    మాధవ్ లో కోపం లేదు, ఆవేశం లేదు. తీరని దుఃఖం వుంది. ఆవేదన వుంది. నేను తెలుసుకోగలను. హృదయమంతా బాధతో నిండివుంది.
    "ఆనందం అంటే ఏమిటో తెలియకుండా, రాయిలా వుండిపోయిన నన్ను అలానే వుండనిస్తే ఈ నాడీ వేదన లేకపోవును కృష్ణవేణీ! మరిచి పోలేని మమతలు రేపి నీదారిన నువ్వు తప్పుకుంటున్నావు. స్వర్గాలు చూపిస్తానని శిఖరాలకి తీసి కెళ్ళి అగాధంలోకి త్రోసి వేస్తున్నావు. కాని నీ కాదు వినోదం. ఇప్పటికీ జీవితంలో రెండుసార్లు మోస పోయాను కృష్ణవేణీ! రెండు సార్లు.' మవునంగా విన్నాను.
    "దూరాన ఎక్కడో మెరిసింది నక్షత్రం' ఆ మెరుపు క్షణకాలం నాజీవితంలో పడి మాయమైంది. శాశ్వతంగా వుండిపోతుందని మురిసి పోయాను." మాధవ్ కళ్ళు నిండుకుంటున్నాయి. "కాని కృష్ణవేణీ! మనసు ఒకచోటా-తనువు మరొకచోటా నువ్వయినా సుఖపడతావని నేను అనుకోను."
    నాకు ఒక్కసారిగా సంతోషం దుఃఖం కలిసి పొంగుకొచ్చాయి. నన్ను అర్ధం చేసుకున్నావ్ మాధవ్!" అంటూ మాధవ్ ఒడిలో మొహం దాచుకున్నాను.
    "నువ్వులేని చోట నేను సుఖపడను మాధవ్! నీకులేని సుఖం నాకువద్దు. కోపంతో ఆవేశంతో నువ్వన్న మాటలు నిజం కాదు మాధవ్! ఎప్పుడూ నా మనసు నిన్ను కోరుతుంది. నీకోసం ఆరాటపడుతుంది. నామీద ఇంకెప్పుడూ కోపం తెచ్చుకోవద్దు మాధవ్! నీకు లేని సుఖం నాకెక్కడిది?'
    "కాదు కృష్ణవేణీ! నువ్వు సుఖపడాలి. సంతోషంగా వుండాలి. ఈ దౌర్భాగ్యుడి కోసం నువ్వు అల్లరి పడకూడదు. నా కన్నా అన్ని విధాలా అధికుడు. ఆ శ్యామ సుందర్ ని పెళ్ళి చేసుకో నిన్ను సౌభాగ్యవతిగా ఆశీర్వదిస్తాను."
    "మాధవ్!" వెక్కివెక్కి ఏడిచాను.
    "వెళ్తాను కృష్ణవేణి!" మాధవ్ లేచి నిలబడ్డాడు.
    "మాధవ్!" అంటూ మాధవ్ కాళ్ళని చుట్టుకొని బావురుమన్నాను. నన్ను వదిలించుకోబోయాడు. విడిచి పెట్టలేదు. "ఒక్కసారి నిండుగా హృదయాని హత్తుకొని ముద్దు పెట్టుకో మాధవ్! ఒక్కసారి"
    "ఒద్దు కృష్ణవేణి! నాకు పరాయివాళ్ళని తాకే అలవాటు లేదు."
    "మాధవ్! ఎలా మాట్లాడుతున్నావ్ మాధవ్? నేను నీకు పరాయిదాన్నా? కాను మాధవ్! కాను, నా కళ్ళలోకి చూసి చెప్పు. నన్నప్పుడే పరాయిదాన్నిగా దూరం చేస్తున్నావా మాధవ్? ఒక్కసారి ముద్దుపెట్టుకో. బ్రతుకంతా గుర్తుంచుకుంటాను. లేకపోతే నిన్ను వెళ్ళనివ్వను."
    మాధవ్ ఒంగి నన్ను లేవదీశాడు. గాఢంగా గుండెలకదుముకున్నాడు. నిండుగా పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. మాధవ్ కళ్ళలో నీళ్ళుజారి నా బుగ్గల మీద పడ్డాయి. మాధవ్ హృదయం మీద పడి వెక్కివెక్కి ఏడిచాను. మాధవ్ నా శిరస్సు మీద గడ్డం ఆన్చి నిశ్శబ్దంగా రోదించాడు.
    మాధవ్ ఎలా విడిపోయాడో ఇంటికెలా చేరానో నాకు గుర్తులేదు.
    
                               *    *    *

                    

    నేను హాల్లోకి వెళ్ళేసరికి గేట్లోంచి అన్నయ్య కారు దూసుకొచ్చింది. హారన్ వింటూనే వదిన హాల్లోకొచ్చింది. అన్నయ్య హడావిడిగా వస్తూ - "తార పోయిందే రోజా! బలవంతంగా చచ్చి పోయింది" అన్నాడు. మెట్ల కేసి వెళ్తూన్న దాన్ని ఆగిపోయాను. ఆశ్చర్యంగా అన్నయ్య కేసి చూశాను. అన్నయ్య రెండు చేతుల్లో తలపట్టుకు సోఫాలో కూర్చుండి పోయాడు.
    తార ఎవరో నాకు బాగా గుర్తు రావటం లేదు. ఆ పేరు విన్నట్టు మాత్రం అనిపించింది-"తార ఎవరు వదినా?" అన్నాను వదిన కేసి చూస్తూ.
    "మీ అన్నయ్య చాలాసార్లు చెప్తూంటారు గుర్తులేదా? ఎప్పుడూ ఏవో మందులకోసం ఆస్పత్రి కొస్తూంటుందనీ..... మీ అన్నయ్యని అన్నయ్యా అని పిలుస్తుందనీ.....వదిన ఇంకా చెప్పబోతూంటే నాకు గమ్మున గుర్తు కొచ్చింది. అవును, తార ! చాల బీద కుటుంబంలో అమ్మాయి. తండ్రి ఏదో చిన్న వుద్యోగస్థుడు. తారకి బోలెడు మంది చెల్లెళ్ళూ, తమ్ముళ్ళూ ఎప్పుడూ ఎవరికో ఒకరికి ఏవో జబ్బులు- వైద్యాలూ అన్నయ్య ఆస్పత్రి వాళ్ళింటికి చాలా దగ్గిర కావటంతో తారేమందులకోసం వస్తుంటుందట. అన్నయ్యతో చాల చనువుగా మాట్లాడుతుందట. అన్నయ్యా అని పిలుస్తుందట. తారంటే అన్నయ్యకి కూడా ఎంతో అభిమానం. చాలాసార్లు తారని గురించి ఇంట్లో చెప్తూంటాడు. తార ఎంతో అందమైందట కూడా. ఆ తార చచ్చిపోయిందని గుర్తు రాగానే ఆశ్చర్యం వేసింది.
    "తార! ఎందుకు పోయింది వదినా?" అన్నాను వదిన అన్నయ్య దగ్గరగా వెళ్ళింది-"ఎందుకు పోయింది? జబ్బు చేసిందా? మీరు వైద్యం చెయ్యలేదా?" అంది.
    అన్నయ్య తలెత్తి చూశాడు. కళ్ళలో నీళ్ళు నిలిచి వున్నాయి. నాకు తెలిసినంత వరకూ అన్నయ్య అలా ఎప్పుడూ బాధపడలేదు.
    "జబ్బుచేసి పోతే బాగానే ఉండేదిరోజా! అంత తొందర పడుతుందాని నేననుకోలేదు. తార చావుకి నేను కారణమేనేమో" అన్నాడు. ఒదినా, నేనూ కూడా మవునంగా నించున్నాము. "నిన్న ఉదయం ఆస్పత్రి కొచ్చింది. మందు తీసుకొని నాగదిలో కొచ్చి కూర్చుంది. నేనూ అంత బిజీగా లేను. తారతో కబుర్లు వేసుకున్నాను. మాటల సందర్భంలో-నాకు పెళ్ళి కుదిరింది అన్నయ్యా!" అంది మామూలుగా. నేను ఆశ్చర్యంగా చూశాను ఇంతసేపూ చెప్పవేం మరి? అదా సంగతి? అన్నయ్య దగ్గిర సిగ్గుపడుతున్నావేమిటి? ఇంతకీ ఏమిటి విశేషాలు? బావగారికేం పని?" అంటూ సంతోషంతో ఎన్నో అడిగాను. తార నవ్వింది. ఆ నవ్వు నిండుగా వుందో లేదో నేను గమనించలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS