Previous Page Next Page 
కృష్ణవేణి పేజి 39


    మర్నాటి వుదయం రేణు ఫోన్ చేసింది-"గుడ్న్యూస్ వేణూ! శాంతకి పాపాయి పుట్టిందట రాత్రి. వాళ్ళ తమ్ముడొచ్చాడు మాయింటికి. వెళ్ళి చూసి వద్దామా?" అంది సంతోషంగా. ఆవార్త నన్నూ ఎంతో సంతోషపర్చిందిగానీ, అప్పటికప్పుడు వెళ్ళి చూసివచ్చే పరిస్థితిలో లేను. తల చాలనొప్పిగా వుంది. ఒంటరిగా పడుకోవాలనిపిస్తూంది.
    "నేనిప్పుడెక్కడికీ రాలేను రేణూ! తలనొప్పిగా వుంది. నువ్వెళ్ళి చూసిరా ! నేను తర్వాత చూస్తాలే శాంతనేమీ అనుకోవద్దని చెప్పు" అన్నాను.
    "అదేమిటి కృష్ణవేణీ? శాంత పాపాయిని-శాంతనీ చూడాలని నీకు తహతహగా లేదూ? నువ్వు రాకపోతే నేనూ వెళ్ళను"
    "సరే! సాయంత్రం వెళ్దాం. ఇప్పుడు కాదు" అన్నాను. శాంత అదృష్టవంతురాలు. ధైర్యం చేసి కోరుకున్న మనిషిని చేసుకొంది. కష్టమో, సుఖమో సహిస్తూ సంసారం చక్కదిద్దుకొంది. ప్రతీ ఆడదీ కోరే విధంగా తల్లి కాగలిగింది. అంత భాగ్యం మాత్రం ఎంత వాళ్ళకి! జీవితంలో ఏ అనభవమూ లేకుండా రాలిపోయే వాళ్ళెంతమంది లేరు!
    సాయంత్రం రేణు వచ్చింది.
    "నేను రాను. నువ్వెళ్ళిరా!" అన్నాను. అన్నానే గానీ ఒక్కసారి శాంతనీ, పాపాయినీ చూసివస్తే .. అనిపించింది.
    "సరే! పద తర్వాత పరిస్థితులెలా వుంటాయో ఏమో! శాంతని చూసి వస్తాను." అంటూ లేచాను.... రేణు తెల్లబోయినట్టయింది.
    
                             *    *    *

    శాంత పడుకున్న గదికిటికీలు మూసి చీకటిగా వుంది. శాంత పాపాయిని దగ్గరగా జేర్చుకొని పడుకొని వుంది. పై కిటికీ తలుపులు తీశాను. శాంత కళ్ళు తెరిచి చూసి నవ్వింది. రేణూ, నేనూ పాపాయి దగ్గర చేరి గుడ్డలు తొలగించి చూశాము. పాపాయి తెల్లగా దృఢంగా వుంది. కళ్ళు మూసుకొని తల్లికడుపులోకి ముడుచుకు పడుకొంది. బుల్లి పాపాయిని చూస్తూన్నకొద్దీ ముద్దేసుకొచ్చింది. మృదువుగా బుగ్గ తాకాను. పాప వులిక్కిపడింది.
    "అబ్బ! ఎంత సున్నితమే నీ కూతురు" అంటూ రేణు పాప బుగ్గ నొక్కింది. శాంత నవ్వి పాపకు గుడ్డ కప్పుతూ-"పాపని గిల్లటానికి నీచేతులెలా వస్తున్నాయ్? చాలుగానీ, ఇక అంటుకోకుండా వేరే కూర్చోండి. మా అమ్మ చూసిందంటే గొడవ చేస్తుంది" అంది. ఇద్దరం మంచానికి కాస్త దూరంగా కుర్చీలు జరుపుకొని కూర్చున్నాం.
    "పాపావాళ్ళ నాన్నకీ, నాయనమ్మకీ కబురు చేశారా?" అన్నాను.        
    "తెల్లవారు ఝామునే టెలిగ్రాం ఇచ్చారు. అందితే ఈ సరికి పాప నాన్న బయల్దేరి వుంటారు కూడా".
    "కూతుర్ని చూసి చాల మురిసి పోతాడు వాళ్ళ నాన్న. ఇంతకీ పాప ఎవరి పోలికంటావ్ శాంతా?" అంది రేణు.
    "ఏమో! నాకు తెలీదంటూ మా అమ్మ వాళ్ళ నాన్నగారి పోలికే అంటారు" అంది శాంత. ఎవరి పోలికో నీకు తెలీదు మరి. "పోనీ గానీ పాపకి చక్కని పేరు పెట్టాలి శాంతా!"
    "అయ్యో! వాళ్ళనాన్న ఏనాడో నిర్ణయించి వుంచుకున్నారు. కొడుకుపుట్టినా సరే సరోజేనట. ఇక పాపకి వేరే పేరేమిటి? ఆ సరోజాదేవే ఈవిడ" అంది శాంత పాపని నిమురుతూ.
    "సరోజ పేరు పాపకి పెట్టటం సమంజసమే శాంతా! అందుకే నీకు కూతురు పుట్టింది" అన్నాను. శాంత నవ్వింది. శాంత నవ్వులో ఎన్నో కళలు కన్పించాయి, హృదయంలో పొంగులెత్తుతూన్న ఆనందానికి బాహ్యరూపం ఆ నవ్వు. అందుకే అంత నిండుగా చల్లగా వుంటుంది.
    "మరి పాపకి పాలియ్యి శాంతా! చూస్తాను" అంది రేణు చిలిపిగా.
    "ఛ! వూరుకో," అంది శాంత నవ్వుతూ.
    "సిగ్గెందుకేమిటి? మేం చూడకూడదా?" అన్నాను నేను నవ్వుతూ రేణుకి సపోర్ట్ గా.
    "ఛ! నువ్వుకూడా ఏమిటే? ఇప్పుడేం పాలు? నేను అన్నం తినేవరకు పాపకు పోత పాలే" అంది శాంత.
    శాంత బడలికగా అలిసినట్టు కన్పిస్తున్నా ఆరోగ్యంగా వుంది. ఏకష్టమూ లేకుండా సుఖంగానే ప్రసవం జరిగిందనుకోవచ్చు. కొంతసేపు ఆ విషయాలు కూడా చెప్పింది.
    "ఈ లెక్క చేసేకంటే తేలిగ్గా ఇద్దరు పిల్లల్ని కనొచ్చుననే దానిని కదా రేణూ? నేను చెప్తున్నాను. ఎంత బండలెక్కయినా చెయ్యటం పిల్లల్ని కనటంకన్నా లక్ష రెట్లు తేలికే" అంటూ నవ్వింది శాంత. రేణు లెక్కలు చేయలేనప్పుడల్లా -"  ఛీ! బండలెక్క. ఇది చెయ్యటం కంటే తేలిగ్గా ఇద్దరి పిల్లల్ని కనొచ్చు" అంటూ తెగ విసుక్కొనేది. నవ్వుకోలేక చచ్చిపోయేవాళ్ళం. ఆ చిన్నతనం, ఆ బడి జీవితం, అంతా ఒక కమ్మని కలగా మాత్రం తలపుకొస్తుంది - తర్వాత మాటల, ప్రసంగం నా మీదకు మళ్ళింది.
    "రేణు చాలాసార్లు వస్తూనే వుందిగానీ నువ్వు అసలు రావటమే మానేశావేం కృష్ణవేణీ? ఏమి టలా చిక్కిపోయావ్?" అంది శాంత.
    "నేనేం చిక్కిపోయాను? వదినా వాళ్ళు అలానే అంటున్నారు. నాకేం చిక్కుతున్నట్టు తెలీటం లేదు మరి" అన్నాను.
    "పెళ్ళి కబుర్లేం చెప్పవేం?" అంది మళ్ళీ పదినిముషాలు సంతోషంగా వున్నానంటే తిరిగి అంతా గుర్తుకొచ్చి మామూలు పరిస్థితే అయిపోయింది. ఏమీ మాట్లాడకుండా వూరుకున్నాను.
    "అదే విషయం మనసులో వుంచుకుని బాధ పడుతున్నావు కృష్ణవేణీ! నాకు తెలీదా? అందుకే చిక్కిపోయావ్. నెమ్మదిగా మనసు మార్చుకోవాలి గానీ ఏమిటిది చెప్పు".
    "కృష్ణవేణికి కోపం వస్తే వస్తుంది గానీ అది ఇప్పుడే అభిప్రాయంతో వుందో తెలుసా శాంతా? నాకు బ్రతకాలనే లేదు. నేను బ్రతికి వుండి ఏం అనుభవించాలి? అంది నిన్న ఇందాక నిన్ను చూడటానికి వచ్చేముందు..... పద చూసి వస్తాను. తర్వాత పరిస్థితి ఎలా వుంటుందో ఏమో" అంది.
    "రేణూ!...." నేను చిరాకు పడ్డాను.
    "మాధవ్ మొన్న వచ్చి వెళ్ళాడట శాంతా! అప్పటినుంచీ దీని ఆలోచనలిలాపోతున్నాయి".
    శాంత నాకేసి చూసింది. "ఇక ఇందులోకి దిగావా?". "నా బాధకి నేనేదో అనుకున్నాను. చస్తానని దీనితో చెప్పుకోలేదు" అన్నాను కోపంగా.
    "నెమ్మదిగా అన్నీ ఆలోచించి మనసు మార్చుకుంటావనుకున్నాను. ఆఖరికీ ధోరణిలోకి దిగానన్న మాట" శాంత నిశితంగా చూసింది.
    "ఏ ధోరణిలోకి దిగినా నష్టమేమీ లేదు శాంతా! నేనుండి వుద్దరించాల్సిన ఘనకార్యాలేమీ లేవు". నన్ను నేనే అసహ్యించుకున్నాను.
    "చాల్లే! వూరుకో. నీకేది తోస్తే అదే సమంజసం అనుకుంటావు. వెనకాముందూ మంచీ చెడ్డా అంటూ వుంటాయని నీ దృష్టి కే అవదు".
    నేను మవునంగా కూర్చున్నాను. శాంత మళ్ళీ అంది-"మనసుకి కష్టమని అనిపించినప్పుడు విరక్తి పెంచుకోవటం-చావులవరకూ ఆలోచించి అంతపనీ చేయటం ఏమీ ఘనకార్యంకాదు. కాని దాని వెనుక ఎంత తతంగముంటుందో ఏమాత్రం ఆలోచించినా అంత సాహసం చెయ్యలేవు కృష్ణవేణీ!"
    "అవును ఏపనీ చెయ్యబోయినా వాటి వెనక చాలా చాలా తతంగాలుంటాయి. మన బ్రతుక్కే స్వతంత్రమనేది ఎప్పుడూ లేదు".
    శాంత కబుర్లు వింటూంటే నాకు చాలా చిరాకనిపించింది.    
    నువ్వు వెటకారంగా అంటున్నావు గానీ నువ్వనేదిమాత్రం అక్షరాలా నిజం. స్వతంత్రం అనేది ఏ పరిస్థితులోనూ ఎవరికీ లేదు కృష్ణవేణీ! లోక విరుద్ధంగా ఏం చెయ్య బోయినా చాలా తతంగాలు చూడాల్సి వస్తుంది. చావు అనేధైనా నీ యిష్ట ప్రకారమే వుంటుందని అనుకోకు. పుట్టి కొన్నేళ్ళు ఈ లోకంలో పెరిగినందుకైనా లోకం నుంచి తప్పుకోవాలంటే కొన్ని విషయాలు ఆలోచించాల్సి వుంటుంది" ....." మొన్న సాయంత్రము తార అనే అమ్మాయి కిరసనాయిలు పోసుకు అంటించుకు చచ్చిపోయింది. వాళ్ళ ఇల్లు ఈ పేటలోనే చాలా దగ్గర. పాపం చాలా బీద వాళ్ళు ఆ అమ్మాయే పెద్దది." శాంత చెప్తూంటే ఆసక్తిగా వినసాగాను- "ఈనాటి పెళ్ళిళ్ళ సమస్యలు అందరికీ తెలిసినవే. ముసలి మనిషికిచ్చి పెళ్ళి నిర్ణయించారట. అందుకే ఆ అమ్మాయి ఇంత ఘోరం చేసి వెళ్ళిపోయింది. పోయిందేదో పోయిందనుకుందాం. కాని వెనక ఎంత గొడవ కేసులూ-పోలీసులూ! ఆ తల్లి దండ్రుల్ని ఎందరెన్ని విధాల అన్నారో ఎలా దుయ్యబట్టేరో ఎవరికి తెలుసు? కూతురు పోయిన బాధకన్నా లోకనింద వాళ్ళకి భరించరానిది".        
    "తార మంచి పనిచేసింది. కాకపోతే ఆపరిస్థితుల్లో ఏం చెయ్యాలంటావ్?"
    "ఏ పరిస్థితుల్లోనైనా బ్రతికి బాగుపడాలని పిస్తుంది కృష్ణవేణి నాకు. నిజం చెప్పాలంటే తారలాంటి దానికి మరో దారిలేదు. కాని నేను నీ విషయం చెప్తున్నాను. నువ్వే అంత పనిచేస్తే నీకోసం కుమిలి కృశించి పోయె వాళ్ళున్నారు. నిన్ను ఇరవై సంవత్సరాలు అపురూపంగా పువ్వుల్లోపెట్టి పెంచారు. నీకెంత చిన్నకష్టం వచ్చినా నీకన్న ఎక్కువగా బాధపడతారు. అటువంటి తల్లిదండ్రులినా నువ్వు నిర్లక్ష్యం చేసేది?-
    - ఈపాప చూడు? పుట్టి నిండా ఒక రోజు కాలేదు. కాని ఎందుకో నాకు పాపంటే ప్రాణం కన్న ఎక్కువ అనిపిస్తూంది. "నాకు పాప పుడుతుంది" అని అనుకున్న క్షణం మొదలు రూపం తెలీని పాప గురించి ఎన్నో వూహలు-ఎంతో మమకారం. ఈపాప అల్లారుముద్దుగా పెరిగి ఇరవైయ్యేళ్ళ కూతురై చచ్చిపోతే నేను భరించగలనా కృష్ణవేణి? అప్పుడు పాపకీ ఎన్నో సమస్యలుంటే వుండొచ్చు. కాని నన్ను అన్యాయంచేసి పోతే నేనెలా సహిస్తాను చెప్పు- ప్రతీ తల్లీ బిడ్డల్ని గురించి పుట్టింది మొదలు ఎన్నో ఆశిస్తుంది. పెద్దవాళ్ళే ప్రయోజకులై కన్నులపండుగ చేస్తారని నమ్ముతుంది. నేనూ నాపాపని గురించి అదే అనుకుంటున్నాను. కాని పాప నేననుకున్నదాన్ని అబద్ధంచేస్తే..."
    "అవేం మాటలు శాంతా?" అన్నాను.
    "ఏం? ఎందుకు కాకూడదు? నువ్వూ ఒకప్పుడు పాపంతటి దానివే. ఈనాడు నీసమస్యలు నీవి. నీ ఇష్టం నీది-అలాగే నన్ను గురించి మాత్రం లక్ష్యపెట్టాల్సి న అవసరం పాపకేముంది?'
    పాప పెద్దదైతే ఏ సమస్యల్లో చిక్కుకుంటుందో వూహించలేకపోయాను గానీ .. పాప అలా చేస్తుందనుకొంటే చాల తప్పు అనిపించింది-పాపని చూస్తుంటే ఒకప్పుడు నేనూ అలాగే పాపలా అమ్మకడుపులోకి ఒదిగి పడుకుని వున్నాను కాబోలు అనిపించింది. అమ్మకూ కూడా శాంతలానే ఎన్నో వూహించివుంటుంది. ఎంతో మురిసిపోయి వుంటుంది. కాని నేను శాశ్వతంగా దూరమైపోతే....? పాపం అమ్మ! అనిపించింది. అమ్మ కళ్ళలో మెదిలింది.
    "మాధవ్ తో వెళ్ళకుండా ఎందుకని తిరస్కరించావు? కారణాలు నీకే తెలుసు. ఇప్పుడూ అవే కారణాలు నీకు అడ్డువస్తాయి. పెళ్ళి పదిరోజులుండగా నువ్విటువంటి పనిచేస్తే అది ఎన్నిరకాల అపోహలకు దారితీస్తుందో వూహించావు? కలిగిన కుటుంబంలో గారంగా పెరుగుతూన్న నీకు బలవంతపు చావు చావవలసిన అవసరం ఏమొచ్చింది? అదే ప్రశ్న ఇంటా బయటా అందర్నీ వేధిస్తుంది. నీలో ఏదో కళంకం లేక పోతే ..... మీ కుటుంబంలో ఏవో గొడవలు రేగకపోతే ఎందుకీ దారుణం జరుగుతుంది? అదే అనుమానం నిజమై స్థిరపడుతుంది. నీ తల్లిదండ్రులు నింద పడకూడదనీ-నీకుటుంబం రచ్చకెక్కకూడదనీ మాత్రం నువ్వనుకొంటే నీ ఇష్టమై నట్టల్లా చెయ్యలేవు కృష్ణవేణీ! శాంత మొహంలోకి చూస్తూవుండగానే నాకళ్ళు నిండుకున్నాయి, చెంపలు చెరువుల య్యాయి-"నన్నెందుకిలా చేతకానిదాన్ని - చేస్తావ్ శాంతా!" అంటూ ఏడిచాను.
    "అసలు మనుషులంటూ వుంటే ఎప్పటి కైనా మంచి జరుగుతుంది. ఈ బలవంతపు చావుకంటే మాధవ్ దగ్గిరి కెళ్ళిపోవటమే మంచిదికదూ శాంతా?" రేణు శాంతకేసి చూసింది. శాంత అయిష్టంగా అంది. పరువు ప్రతిష్టలనేవి ఎలా పోయినా ఒకటే. చస్తే ఋణం తీరిపోయిందని ఏడిచి కొన్నాళ్ళకైనా మరిచిపోతా రేమో లేచిపోయిందనే కళంకం వంశం పొడుగునా నిలిచి వుంటుంది." నాకక్కడ ఒక్క క్షణం కూడా కూర్చోవాలనిపించలేదు. లేచి నిలబడ్డాను. శాంత నాచెయ్యి పట్టుకొంది.-"పిచ్చి పిచ్చి పనులేమీ చెయ్యనని నాపాప మీద ప్రమాణం చేసివెళ్ళు కృష్ణవేణీ!" అంది. నేను బిత్తరపోయాను-"ఒద్దు శాంతా! నామనసెలా మారుతుందో నాకే తెలీదు." అన్నానను.
    "నీవంటి స్నేహితురాలు మాకు దూరం కాకూడదు కృష్ణవేణీ! నీకేమైనా నీవాళ్ళకన్న ఎక్కువగా మేమిద్ధరం బాధపడతామని మర్చిపోకు. నువ్వులేని లోటు పది జన్మలకైనా తీరదు." శాంత కళ్ళలో నీళ్ళు తిరిగితే ఒత్తుకుంది.
    "పెద్దలు-లోకనియమలూ - సాంఘికాచారాలూ-కట్టుబాట్లూ-వీటన్నిటి దగ్గిరా ప్రేమకి చోటే లేదు. నీవంటివాళ్ళంతా గుండెలు బండలు చేసుకొని సహించి వూరుకో వాల్సిందే. మాధవ్ భవిష్యత్తు గురించి నువ్వేమీ అనుమానించకు కృష్ణవేణీ! ఎవరికీ అన్యాయం చెయ్యని మాధవ్ ని భగవంతుడు అన్యాయం చెయ్యడు. తప్పక సుఖపడతాడు. మనసువరికట్టుకోటానికి ప్రయత్నించు. మాధవ్ స్థానంలో శ్యామసుందర్ ని నిలుపుకో. త్వరలో అంతా సహించగలుగుతావు. ఆవేశపడి అర్ధంలేకుండా ఆలోచించకు, నువ్వేమీ చెయ్య కూడదు. పసిపాపమీద ఒట్టువేస్తున్నాను."

                                 *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS