"నన్ను క్షమించు మాధవ్! నీకు తీరని అన్యాయం చేశాను. ఏమీ అనుకోకు మాధవ్!" అస్పష్టంగా గొణుక్కున్నాను.
"అబ్బ! నువ్విలా ఏడవకూడదు వేణూ! నేను సహించలేను. నీకేమీ భయంలేదు. నాదగ్గిరెందుకు జంకుతావు? నాకు నువ్వేమీ అన్యాయం చేయలేదు. ఇటు చూడు. ఛ! చిన్నపిల్లలా ఏమిటి ఏడుపు?" మాధవ్ కన్నీళ్లు తుడిచిదగ్గిర చేర్చుకున్నాడు.
"ఎంత అమాయకుడివి మాధవ్! ఇంకెలా చెప్పను?" అనుకున్నాను. మాధవ్ కళ్ళలోకి చూడలేక తలతిప్పుకుని క్రింద కూర్చున్నాను. అప్పటికప్పుడు పాలపొంగులా పొంగుకొచ్చిన దుఃఖం కొంతవరకు అణగారిపోయింది.
మాధవ్ కూడా క్షణం మవునంగా వూరుకుని అడిగాడు-"నువ్వురాసిన సంగతి నిజమేనా?" ఆమాటలో ఏదో తీవ్రత ధ్వనించింది. మవునంగా వూరుకున్నాను.
"మీవాళ్ళెవరైనా ఒత్తిడి చేశారా?"
"లేదు" ముక్తసరిగా అన్నాను.
"మాధవ్ ఆశ్చర్యంగా అడిగాడు-"ఎందుకిలా మనసు మార్చుకున్నావ్ కృష్ణవేణీ! నీ ధోరణి నాకు అయోమయంగా వుంది. ఇన్నాళ్ళూ చెప్పిన కబుర్లేమైపోయాయి? ఇప్పుడు పెళ్ళిచేసుకుంటున్నావా? కృష్ణవేణీ ....." మాధవ్ ఆగిపోయాడు.
నాకళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. నిశ్శబ్దంగా ఒత్తుకున్నాను. మాధవ్ నా మొహం తనకేసి తిప్పుకొని ఆతృతగా కళ్ళలోకి చూశాడు. -"నాకు చెప్పు కృష్ణవేణి! ఎందుకిలా మారిపోయావు?"
"నన్ను క్షమించు మాధవ్! ముందు సంగతులన్నీ ఆలోచిస్తే ఇదే ఉత్తమం అనిపించింది నాకు". దృఢంగానే అనగలిగాను. మాధవ్ నిశితంగా చూశాడు- "ముందు సంగతులా? ఏమిటా ఆలోచించింది?"
"మనం కలిసివుండాలంటే ఏ పరిస్థితులూ అనుకూలంగా లేవు."
"నువ్విలా గుంభనంగా మాట్లాడకు. ఆ ఆలోచించిందేమిటో విశదంగా చెప్పు కృష్ణవేణీ!"
"నేను రహస్యంగా లేచివస్తే నా తల్లిదండ్రుల విషయం ఆలోచించు మాధవ్! వాళ్ళనంత అవమాన పరిచి ....."
"ఈ విషయం నీకు మొదటినుంచీ తెలీదా?"
"తెలిసే నిర్లక్ష్యం చేశాను."
"మరి ఇప్పుడింత లక్ష్యం చేయాల్సిన అవసరమేమిటి? ఒకసారి నీకు భయంగా లేదా?" అని నేనడిగిన దానికి ఏమన్నావో గుర్తుందా? "భయం దేనికి? ఎవరిష్టం వారిది" అనలేదూ? ఇంత లోనే ఏమిటీ కబుర్లు? ఎందుకిలా నన్ను ...."
"అందుకే ఇంత బాధపడుతున్నాను మాధవ్! ఆనాడే ఇంత ఆలోచించివుంటే ...."
"అవును ఇప్పుడే నీకు కొత్త తెలివితేటలు పుట్టుకొచ్చాయి. ఇంకా ఎందుకిలా మభ్యపెట్టాలనుకుంటావ్ కృష్ణవేణీ? ఆ శ్యామసుందర్ ఎదుట ఈ బీద మాధవ్ రావ్ ఎంతటివాడు?"
"మాధవ్!" "ఎంత మాట మాధవ్! నన్నపార్దం చేసుకొంటున్నావు మాధవ్! నీఅంత స్థులు నేను దృష్టిలో వుంచుకొంటే, ఈ స్నేహం ఇంతవరకూ వచ్చేదికాదు."
"మరి నువ్వెందుకిలా మనసు మార్చుకొన్నా వనుకోను? ఇంట్లో ఎవరూ ఒత్తిడి చెయ్యలేదంటావు. నీకై నువ్విష్టపడ్డానంటావు. ఇన్నాళ్ళూ ఆలోచించని విషయాలేవో ఆలోచించానంటావు. ఏమిటది?" నేను నిర్భయంగా మాధవ్ మొహంలోకి చూస్తూ మాట్లాడాను.
"నా భవిష్యత్తు ఆలోచించి ఇలా మొండిగా మనసు నణచుకొంటున్నాను మాధవ్! అరుణ కాపరానికొస్తే నాగతేం కావాలి?"
"అరుణా? కాపరానికొస్తుందీ?" మాధవ్ విస్తుపోయాడు-" అది మనసులో వుంచుకునేనా-ఇలా మార్చు కొన్నావు కృష్ణవేణీ! నిజంగా అరుణ వస్తుందనే అనుకొంటున్నావా?"
"రూఢిగా అనుకోక పోయినా అనుమానించడానికి ఆస్కారములేక పోలేదు. రాదని ఎలా అనుకోగలం?"
"నీకు తెలీదు కృష్ణవేణీ! అరుణ అంత సున్నిత మైన మనిషి కాదు, మనసు మార్చుకొని కాపరానికి కొస్తుందనేది కలలో కూడా జరగదు."
"పోనీ పంతానికి రావచ్చుకదా?"
"ఎవరిమీద పంతం పడుతుంది? వస్తే వచ్చిన దారినే వెళ్తుంది."
"బ్రతిమాలినా-ప్రాధేయపడినా................"
"ఏది ఏమైనా నువ్వుండగా అరుణకీ, నాకూ సంబంధం వుండదు. ఎందుకిలా అనుమానిస్తావ్ కృష్ణవేణీ?"
"కాని అరుణ కేసు పెడితే?"
"కేసు పెడుతుంది. ఆ విషయం నేను ఆలోచించక పోలేదు. కాని మనం రిజిష్టరు మేరేజి చేసుకోవటం లేదు." అంటే కేసుకి ఆధారం దొరక కూడదు. నన్ను భార్యగా చెప్పుకోరు. అంతేకదా?"
మాధవ్ క్షణం మవునంగా నా మొహంలో చూచాడు - "నా యింటిలో ఇల్లాలిగా......నామనసులో భార్యగా నీకెప్పుడూ స్థానం వుంటుంది కృష్ణవేణీ! కాని ఆ సంగతి లోకానికి వెల్లడించుకొనే భాగ్యం నాకు లేదు. అలా చెప్పుకోగలిగితే నేనూ ఎంతో గర్వపడేవాడిని..... కాని కృష్ణవేణీ! నా మొహంలోకి చూసి చెప్పు. నామీద నీకు విశ్వాసం లేదా? నన్ను నువ్వు నమ్మటం లేదా? చెప్పు కృష్ణ వేణీ!"
"నేను నమ్ముతాను మాధవ్! కాని కలకాలం లోకం దృష్టిలో చులకనగా ఎలా గడుస్తుంది మాధవ్?
"అవును. లోకం కొన్నాళ్ళు చెప్పుకొంటుంది. కొన్నాళ్ళు హేళన చేస్తుంది. ఏది చేసినా కొన్నాళ్ళే! ఆకొన్నాళ్ళే మనం ఓర్చుకోవాలి. ఎవరేమన్నా-అనుకున్నా మనని కానట్టు తిరగాలి. తర్వాత అదే పాతబడుతుంది. ఎక్కడి విషయాలక్కడ సర్దుకుంటాయి. మన సంసారం మనకి మిగులుతుంది..... న్యాయా న్యాయాలు చూడకుండా ఆడిపోసుకునే లోకాన్ని లెక్కచేసి మన బ్రతుకులు నాశనం చేసుకుంటామా కృష్ణవేణీ? తెలిసీ తెలియని విషయాలు లక్ష అనుకొంటుంది లోకం, అనుకోనీ దానికే భయపడేంత పిరికివాళ్ళమా? లోకం నాకన్నా ఎక్కువా కృష్ణవేణీ నీకు?"
"కాదు మాధవ్! కాదు. ఈ ప్రపంచంలో నీకన్నా ఎవరూ ఎక్కువకాదు నాకు. కాని ..... నువ్వూ ఆడదానివైతే నా ఆవేదన తెలిసేదా వూరూ, పేరూ లేకుండా అనామకురాలిగా, అణగారిపోవాలంటే నేను సహించలేను మాధవ్! ఫలానా వ్యక్తి భార్యగా నలుగురూ లెక్కచేయాలనీ .....ఫలానా ఇంటి ఇల్లాలిగా గౌరవించాలనీ, నా మనసు కోరుతుంది. జీవితమంతా అది తీరనికోరికగా వుండిపోతే నాకు తృప్తి ఏది మాధవ్?"
చాలాసేపు మాధవ్ ఎటో చూస్తూ వుండిపోయాడు. "నువ్వింత కఠినంగా మనసు మార్చుకుంటావని, లీలగానైనా వూహించలేకపోయాను. ఆదిలో నేను ప్రాధేయ[పడితే అంగీకరించావు. నమ్మాను. ఎంతో కవ్వించావు. ప్రోత్సహించావు. ఎన్నో ఆశలు రేకెత్తించావు. మోడువారిన జీవితం తిరిగి చిగురిస్తుందనే అనుకున్నాను. నేను దురదృష్ట వంతుణ్ణి కానని మురిసిపోయాను. కాని చివరికింత మోసం చేస్తావని వూహించి వుంటే నీస్నేహం ....."
"మాధవ్! నన్ను క్షమించు మాధవ్! గత మంతా నాకు విప్పి చెప్పనవసరం లేదు. అంతా నాకు తెలుసు. నేను చేసిన అన్యాయం నన్ను విడిచి పెట్టదు. ప్రతిఫలం అనుభవించకుండా తప్పుకోవాలని నేనూ అనుకోవటం లేదు, కాని నేను కోరేది ఒకటి. నన్ను అర్ధం చేసుకో. ఇన్నాళ్ళూ నా ప్రవర్తన నటన కాదు, నన్ను అర్ధంచేసుకొని క్షమించు. నువ్వు క్షమిస్తావు మాధవ్! క్షమిస్తాస్తావు." అంటూ ఏడిచాను.
ఆలోచిస్తూ వుండిపోయిన మాధవ్ ఏదో దృఢంగా నిశ్చయించుకున్నట్లు నా మొహంలోకి సూటిగా చూశాడు-"నే నొకటి నిర్ణయించుకున్నాను కృష్ణవేణీ! నువ్వు చదువు ఆపెయ్యకు. నేను అరుణ ఆటంకం లేకుండా విడాకులకి దావా వేస్తాను. తర్వాతే బహిరంగంగా పదిమంది ఎదుటా పెళ్ళి చేసుకుందాం. అలశ్యమే అవుతుంది. ఆ పనీ.....నిన్నుమాత్రం ఒదులుకోలేను."
నేను జవాబు చెప్పలేదు. ధైర్యం చాలటం లేదు. మాధవ్ నా మొహం ఎత్తి తన ధోరణిలో చెప్పుకుపోతున్నాడు.-" నువ్వు నాకు కాదా వేణూ! నిన్ను ఒదులుకోలేను. నీ చల్లని స్నేహం మర్చిపోలేను."
