Previous Page Next Page 
ఆదివిష్ణు కథలు పేజి 3


    ఆ కళ్ళకి డబ్బాశ ఎక్కువ. ఆ కళ్ళలో కసిని చదవడానికి నీ రెండుకళ్ళూ చాలవు. ఉపేంద్రా! చాలామంది దగ్గర డబ్బు లేదు. నీ దగ్గర ఉంది. అదే నాయనా! నువ్వు చేసిన పాపం! డబ్బుండడం పాపంరా! మహా పాపం! అందుచేత నీకు విరోధులెక్కువ. అందుకే నిన్ను ఇల్లు దాటి బయటకు వెళ్ళొద్దన్నాను.
    నీ ప్రాణానికి వీధుల్లో సేఫ్టీ తక్కువ. నా సంగతి వేరు. అలవాటైపోయాను. కొన్నాళ్ళు ఉండు. నాకు కూడా బెంగ తీరుతుంది. తర్వాత వచ్చిన చోటుకే వెళ్ళిపో..."
    ఆ మాటలు విన్న చెన్నయ్య వెంటనే మేడదిగి వచ్చేశాడు. ఆ రోజునుంచి చెన్నయ్యకు పట్టుదల ఎక్కువైపోయింది. ఈ తంతు ఏమిటో చూసేయాలనుకున్నాడు. పసివాడికి పాఠాలు నేర్పి, పాడు చేస్తున్న ఆ తండ్రిమీద కసి మరింత ఎక్కువైంది.
    ఈ పసివాడు తండ్రి మాయమాటలు నమ్మి, ఆయన అడుగుజాడల్లో నడచి మరో ధనదాహపు పిశాచమై పోతాడేమోనన్న భయం కలిగింది. మళ్ళా రాత్రిళ్ళు వేడి ఆలోచనలు ఎక్కువయ్యాయి.
    ఒకనాడు -రంగనాథరావు వ్యాపారరీత్యా బొంబాయి వెళ్ళిన నాలుగురోజుల తర్వాత కుమార్రాజు ఉద్యానవనంలో తిరుగుతున్నాడు. దూరంగా చెన్నయ్య ఉపేంద్రను తనివితీరా చూస్తూ నిలబడివున్నాడు. చెన్నయ్య కళ్ళకి ఇప్పుడు ఉపేంద్ర ఆవుదూడలాగా లేడు, లేడి పిల్లలాగా ఉన్నాడు. తళతళా మెరిసిపోతున్నాడు. ఉపేంద్ర అమాయకంగా వచ్చీరాని నడకతో తప్పటడుగులు వేస్తున్న పసిపిల్లవాడిలా ఉన్నాడు.
    ఉపేంద్ర నడుస్తూ నడుస్తూ తిన్నగా చెన్నయ్య దగ్గరకొచ్చి ఆగేడు... చెన్నయ్య వైపు కళ్ళింతవి చేసుకొని అన్నాడు - "నువ్వు"
    "డ్రైవర్ని! చెన్నయ్య నా పేరు"
    "అవును గుర్తుకొచ్చేవు. చెన్నా? నాకో సాయం చేసిపెట్టగలవా?" అన్నాడు ఉపేంద్ర.
    ఆ పిలుపుకు పరవశించేడు చెన్నయ్య గుండె గొంతులో వచ్చి చేరినట్టయింది. అందువల్ల చెన్నయ్య ఒక జాతి మనిషికి జీవితంలో మొదటిసారిగా ప్రేమతో బదులిచ్చిన సన్నివేశం అదే -
    "చెప్పండి బాబూ?"
    "నాన్నగారు నన్ను బయటకి వెళ్ళద్దన్నారు చెన్నా! నాకేమో ఊరంతా చూడాలని ముచ్చటగా ఉంది. నన్ను ఊళ్ళోకి తీసుకెళ్ళవూ?" అన్నాడు.
    చెన్నయ్య మురిసిపోయేడు. చిరంజీవి దార్లో పడుతున్నందుకు అతను ఆనందించేవాడు. ప్రతి గొప్పింటి బిడ్డా ఇదేవిధంగా తల్లిదండ్రుల్ని ధిక్కరించాలి. వాళ్ళ బూర్జువా భావాల్ని సమూలంగా నాశనం చేసేటందుకు నడుం కట్టాలి. విప్లవం ఇంట్లోనే ప్రారంభం కావాలి. యువతరం (గొప్పింటి) కళ్ళు విప్పి సామాన్యుడ్ని చూడాలి. అతని సహాయ సహకారాలతోనే మరో ప్రపంచ నిర్మాణానికి పూనుకోవాలి.
    "నాన్నగారి గురించి భయపడకు చెన్నా! వారింతలో రారు. వారు వస్తే నన్ను ఎక్కడికీ వెళ్ళనివ్వరు చెన్నా! ఈ ఇంట్లో నన్ను ఖైదు చేస్తారు. నాకు ఊరంతా తిరిగి రావాలనివుంది చెన్నా. తీసుకెళ్ళవూ?"
    చెన్నయ్య ముగ్దుడై అన్నాడు.
    "అల్లాగే బాబూ! ఇప్పుడే వెళదాం రండి!"
    చెన్నయ్య కారు సిద్దం చేశాడు.
    ఉపేంద్ర కారెక్కాడు. కారు కదిలింది.
    నగరం నడిబొడ్డుమీద కారు నడుస్తోంది. విశాలమైన రోడ్డది. గొప్పా, పేద, కలిసీ తిరిగే చోటది. కారు నెమ్మదిగా వెడుతోంది. వెనకసీట్లో ఒదిగి కూర్చున్న ఉపేంద్ర ముందుకి ఒరిగి చెన్నయ్యతో అన్నాడు - 'చెన్నా! చూడటు! అది సినిమా థియేటరు గదూ?"
    "అవును బాబూ!"
    "అక్కడంతమంది జనం నిలబడివున్నారు కదా? ఆ సినిమా అంత గొప్పగా ఉంటుందా?"
    "అవును బాబూ, పేదల బ్రతుకులని గొప్ప పిక్చర్. ఏభై రోజులు పూర్తయ్యేయి. జనం మాత్రం తగ్గలేదు. ఇది పేదల సినిమా, పేదల గురించి రాసిన సినిమా. సినిమా నిండా పేదల గొడవే. వాళ్ళ కష్టాలు, కన్నీళ్ళూను. బాగా పోతోంది. ఎంచేతంటారో తెలుసా? పేదల గురించి ఏ సినిమా తీసినా బాగానే ఉంటుంది. దేశంలో పేదలెక్కువ.
    వాళ్ళకి మంచి మార్కెట్టుంది. ఈ సినిమా తీసిన పెద్దమనిషి - మీ నాన్నగారిలా డబ్బున్న మనిషి, ఇల్లాంటి సినిమాలు మూడు తీసి బోల్డు గడించాడు.
    విచిత్రమేమంటే బాబూ, ఆ బాబుకి పేదలంటే గిట్టదు. కాని వ్యాపారం మాత్రం పేదలమీదే చేస్తున్నాడు. దేశంలో అన్నిరకాలుగా నాశనమయ్యేది ఈ పేద ప్రజలే. 'ఇదిగో మీకు మంచి రోజులు వచ్చేస్తున్నాయి' అని ఉపన్యాసాలు - కథలూ, సినిమాల ద్వారా వాళ్ళని బుజ్జగించి వాళ్ళని మాయ చేస్తున్నారండీ ఈ గొప్ప జాతి. ఈ పేదనాయాలు వాళ్ళ మాటలు నమ్మేసి ఇంకా నాశనమైపోతున్నారు. తిరగబడే ఓపికను ఈ మాయ మాటల్తో చల్లారపెట్టేసుకుంటున్నాడు"
    అతడి మాటలకు అడ్డుపడి ఉపేంద్ర అన్నాడు -
    "చెన్నా! చెప్పకు, నా మనసు బాగులేదు. నా దేశంలో ఇటువంటి దారుణం నేను సహించలేను. చెన్నా! కారు పోనియ్." ఉపేంద్రలో చలనం కలుగుతున్నందులకు చెన్నయ్య ఎంతో ఆనందించేడు. తన శ్రమ వృధాకానందుకు సంతోషించాడు. కారు వేగం పెంచాడు. హాస్పిటలు మీదినుంచి పోతోంది కారు.
    అక్కడ మళ్ళా కారు వేగం తగ్గించాడు. హాస్పిటల్ దగ్గర జనం చీమలబారుల్లా నిలబడి ఉన్నారు. వాళ్ళ చేతుల్లో సీసాలు ఉన్నాయి. పసిపాపలూ, వయోవృద్దులూ, కళ్ళల్లో ఊపిరి పెట్టుకున్నవాళ్ళు వగైరా వగైరా గుంపుల్ని ఉపేంద్ర చూసేడు. చెన్నయ్య అంటున్నాడు...
    "గుండె దిటవు చేసుకోండి బాబూ! ఇది మాలాటి వాళ్ళకి మామూలే. ఇక్కడ చేరిన జనాభాకి మూడు రెట్లుంటారు. ఇక్కడికి రానివాళ్ళు, రాలేనివాళ్ళు, వాళ్ళ సంగతి దేవుడికి వదిలేయండి. ఇక్కడికి వచ్చినవాళ్ళ సంగతి మనవి చేస్తాను. ఇది గవర్నమెంట్ హాస్పటలండి. ఇక్కడ రంగునీళ్ళు పుష్కలంగా దొరుకుతాయి.
    డాక్టర్లందరికీ  ఇళ్ళదగ్గర ప్రత్యేక శ్రద్ధతో ప్రాక్టీసులుంటాయి. డబ్బులొస్తే ఇళ్ళ దగ్గిర ప్రత్యేక శ్రద్ధతో రోగుల్ని చూస్తారు. డబ్బులివ్వలేకపోతే - ఈ క్యూలోనించుని రంగునీళ్ళు పుచ్చుకోవాల్సిందే. దీనికే వార్డ్ బోయ్ ల్నుంచీ, డాక్టర్ల వరకూ విసుక్కుంటారు. చీదరించుకుంటారు. తిడతారు. అన్నీ పడాల్సిందే. ఈ రంగునీళ్ళ కోసం ఏ మూలనుంచో ఇక్కడికి నడిచి వస్తారు.
    ఆ రంగునీళ్ళు పుచ్చుకుని మళ్ళా ఆ మూలకి నడచివెడతారు. బాబూ, వీళ్ళల్లో సగంమంది, రాకపోకల నడకల్లోనే- నడివీధుల్లో ప్రాణాలు విడిచేస్తారు. ఇదిలా జరగడానిక్కారణమేమిటి బాబూ- డబ్బు! డబ్బండీ! డబ్బు! మనిషిగా పుడితే లాభం లేదండి. క్షేమంగా బతకాలంటే డబ్బుకూడా కావాలండి. అ డబ్బు మొత్తం కొందరి చేతుల్లోనే నలుగుతోంది. వాళ్ళ ఇనప్పెట్టెల్లో మూలుగుతోంది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS