బ్యాంకులో వాళ్ళ ఖాతాలో తిరుగుతోంది. ఆ డబ్బు బయటపడాలండీ. ఏ కొందరిదగ్గరో తిష్ట వేసుక్కుచోకూడదు. మూల మూలలున్న డబ్బును బయటకు లాగాలి. ఇవ్వనివాడిని కాల్చి చంపాలి. బయటపడ్డ డబ్బుని అందరికీ పంచాలి. అందరూ బాగుపడాలంటే అదొక్కటే మార్గం. ఏం బాబూ, వింటున్నారా?"
"వింటున్నా చెన్నా! డబ్బు మనిషివైనందుకు ఆనందపడ్డంలేదు. సిగ్గుపడుతున్నాను. ఇంకా ముందుకు పోనివ్వు. ఇన్నేళ్ళూ నేను దూరంగా ఉన్న నిజాలకు నన్ను దగ్గిర కానివ్వు. ఇల్లాంటి అవకాశం నాకిక దొరకదు. పద చెన్నా!" అన్నాడు ఉపేంద్ర ఆవేశంగా.
చెన్నయ్యకు ఉపేంద్ర పట్ల అభిమానం కలిగింది. అది వెంటనే ప్రేమగా మారింది. వెనువెంటనే అది వాత్సల్యంగా స్థిరపడింది. అతన్లో ఉత్సాహం కూడా పొంగిపొర్లింది. నగరం చివరికి పోనిచ్చాడు కారుని. మురికివాడలో చేరుకుంటున్నది కారు.
ఉపేంద్ర భయంతో, అసహ్యంతో, జాలితో, జుగుప్సతో సీట్లో స్థిమితంగా కూర్చోలేకపోతున్నాడు.
నేలమీద ఇల్లాటి మురికివాడలుంటాయని ఉపేంద్రకు మునుపు తెలీదు. పందులూ, దోమల్తోపాటు కొందరు మనుషులు కూడా ఆ వాడలో బతుకుతున్నారు. నాలుగు తాటాకులు కప్పి ఇళ్ళంటున్నారు. ఆరుబయట గోనెలు పరిచి, వాటిపైన కాలక్షేపం చేస్తూ అవి గూడా నివాసయోగ్యాలంటున్నారు. ఎవళ్ళకీ ఒంటినిండా బట్టల్లేవు. ఎవళ్ళూ పరిశుభ్రంగా లేరు. ఎవళ్ళకీ కడుపు నిండా తిండిలేదు. ఆకలి, దరిద్రం! ఆకలీ, దరిద్రమూ అక్కడ విలయతాండవం చేస్తున్నాయి.
చెన్నయ్య ఉద్రేకంతో చెబుతున్నాడు-
"ఇల్లాంటి వాడలు నగరానికి నాలుగువేపులా ఉండి నగరం మధ్యలో కూడా చాలా ఉన్నాయి బాబూ! దరిద్రులు వాళ్ళు. దరిద్రంలో పుట్టేరు, దరిద్రంలో మంచితనమంతా వాళ్ళ మధ్యనే బతుకుతుందండీ.
తిండిలేదు, చదువులేదు, ఆరోగ్యం లేదు. మనిషిగా బతికేందుకవసరమైన ఏ వసతులూ లేవు. మనిషిని పెంచే డబ్బు అసలే లేదు. అయినా బతికేస్తున్నారు. ఓర్పుతో బతుకుతున్నారు. ఓర్పుక్కూడా ఒక పరిమితి ఉంది బాబూ! వాళ్ళు కళ్ళు విప్పి, పళ్ళు పటపటలాడిస్తే - బడా బాబుల పని ఉల్టాసీదా అయిపోతుంది. ఆ రోజు కూడా దగ్గిరపడుతోంది బాబూ-
అప్పుడు ఈ మురికివాడలో చెలరేగిన విప్లవాన్ని ఆ దేవుడు సైతం ఆపలేడండీ- అదుగదిగో అటు చూడండి. అదేవిటో చెప్పండి" అనడిగేడు చెన్నయ్య ముడుసుక్కూచున్న ఒక ఆకారాన్ని చూపించి.
"జంతువు చెన్నా? విచిత్రమైన జంతువు. దానిపేరు నాకు తెలీదు" అన్నాడు ఉపేంద్ర.
చెన్నయ్య విషాదంగా నవ్వి అన్నాడు -
"జంతువు కాదు బాబూ! మనిషే! మూట కట్టుకుపోయి ఆకారం పోగొట్టుకున్నాడు. ఇవాళో రేపో అన్నట్టున్నాడు. అతని వయసిరవై. తమకంటే చిన్నవాడు. ఆశ్చర్యపడకండి. మనిషి చేసిన డబ్బుకెంత పవరుందో అంచనా వేసుకోండి. అంతే!"
"ఇంత వికృతాన్ని ఇంక చూడలేను చెన్నా! ఈ సృష్టిలో ఈ దారుణాలకి కారణమేమిటో చెప్పేవు. అది చాలు... కారు వెనక్కి తిప్పు చెన్నా! ఇక ఇంటికి పోదాం" అన్నాడు ఉపేంద్ర.
వాళ్ళు ఇంటికి వస్తుండగా ఒక విడ్డూరాన్ని చూసేరు. శవాన్ని మోసుకుపోతున్నారు నలుగురు. వాళ్ళ వెనుక కొందరు జనం నడుస్తున్నారు. ఒకడు పైసలు గాల్లోకి ఎగరవేశాడు. నడుస్తున్న జనం ఆగి నేలమీదికి వంగి పైసలు ఏరుకుంటున్నారు. చివరికి శవాన్ని మోసే నలుగురూ, శవాన్ని దించి పైసల కోసం ఎగబడుతున్నారు. ఉపేంద్ర కళ్ళు మూసుకున్నాడు.
చెన్నయ్య వివరిస్తున్నాడు.
"ఇది బాబూ డబ్బు విలువ! పైస చాలు బాబూ, తోకాడిస్తూ చేరిపోయే గజ్జికుక్కలవుతారు.
ఈ అశాంతి ఎక్కువ కాలం నిద్రపోదు. ఎప్పుడో ఒళ్ళు విరుచుకుని లేచి నిలబడుతుంది. గాండ్రిస్తుంది. గొప్ప జాతిమీద లంఘిస్తుంది. పీకల్ని కొరుకుతుంది. నెత్తురు తాగుతుంది. ఆ రోజొచ్చేస్తుంది బాబూ!
గొప్పజాతికి ఆ ఆపద తొలగిపోవాలంటే ఈలోగా వాళ్ళు జాగ్రత్తపడాలి. వాళ్ళలో మానసికంగా మార్పు రావాలి. దాచిన డబ్బూ-దోచిన డబ్బూ - డబ్బూ డబ్బూ అందరికీ పంచివ్వాలి. దేశ సౌభాగ్యానికి, సుఖశాంతులకీ ఈ దాచుకోవడాలు, దోచుకోవడాలు ఇక చెల్లవని వాళ్ళు తెలుసుకోవాలి....."
ఉపేంద్ర, చెన్నయ్య ఆవేశానికి అడ్డంపడి అన్నాడు. "చెన్నా! ఇంక నాకేం చెప్పకు. నే వినలేనింకా. నాకిప్పుడు విశ్రాంతి కావాలి చెన్నా! నేను తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. పద చెన్నా.... పద!"
చెన్నయ్య తృప్తిగా గాలి పీల్చుకున్నాడు. కారుని మేడవైపు వేగంగా తోలడం ప్రారంభించేడు.
* * *
బుద్ధభగవానుడు కూడా ఈ దేశంలోనే పుట్టాడు. పాలరాతిమేడ, హంసతూలికా తల్పాలు, ఉద్యానవన విహారాలు వగైరా హంగుల్లో ఆ మహాత్ముడు కొన్నేళ్ళు గడిపి, ఒక రథసారధి సాయంతో నగర ప్రవేశం చేశాడు నగరంలో వృద్ధుల్ని చూశాడు. కుష్టురోగుల్ని చూశాడు. శవాలను చూశాడు. రోగాలూ, రొష్టులూ, అకాల మరణాలూ, ఎన్నో దుఃఖాలూ చూశాడు.
ఆ మహాత్ముని మనస్సు చలించింది. తాను ఇన్నాళ్ళూ గడిపిన మధుర జీవితం ఒక పీడకలలా తోచింది.
"నువ్వూ, నేనూ - నా తల్లిదండ్రులే, నా ప్రియమైన భార్యా, నా అనుంగుపుత్రుడూ అందరూ జననమరణాలకు తల వంచవలసిందేనా?" అని వాపోతూ రథసారథిని అడిగాడు. సారథి చాలా ఓపికతో ఆయన అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఇచ్చేడు.
సిద్దార్ధుడు బుద్ధభగవానునిగా పరిణమించడానికి ఆ రథసారధి చాలావరకూ తోడ్పడ్డాడు. ఈ విధంగానే ఈ కథ కూడా నడుస్తుందనుకున్నాను. అలా నడవలేదు. పైగా అడ్డం తిరిగింది. ఆ వివరాలు రాస్తాను.
-రచయిత
* * *
ఉపేంద్ర కారు దిగి చెన్నయ్యను తనతోపాటు తన గదిలోకి రమ్మన్నాడు. చెన్నయ్య ఉపేంద్రను అనుసరించేడు. ఆగదిలో.... ఉపేంద్ర గుప్పెట నిండా వందరూపాయల కాగితాలు తీసుకొని చెన్నయ్యకిస్తూ..
