Next Page 
మనిషి - మిథ్య పేజి 1


                              మనిషి - మిథ్య
                                                              ---ఆదివిష్ణు

                 

    రైలు దిగుతూనే ఫ్లాటుఫారమంతా గాలించి చూశాడు శంకరం. సూటుకేసు నేలమీదుంచి జేబు రుమాలుతో ముఖం తుడుచుకున్నాడు. మళ్ళా ఓ మాటు ప్లాటు ఫారం చివరివరకు చూపు నిలిపాడు. తకక్కావలసినవాడు ఇంకా రానేలేదు.
    తనొస్తున్న విషయం తెలిసి వాడు సరాసరి సామర్లకోట స్టేషన్ కే వస్తాడని అనుకున్నాడు. సామర్లకోటలో డూప్లికేట్ కదిలెంతవరకూ అతని గురించి ఎదురు చూశాడు. అప్పటిగ్గూడా రాక పోడంతో ఎకాఎకిని కాకినాడ స్టేషన్ లోనే రిసీవు చేసుకుంటాడేమోనని తలిచాడు. అలాంటిది ఇక్కడ గూడా ఎగనామం పెట్టినట్టుంటే, అతనికి కాస్త దిగులనిపించింది.
    ఇంతకుమునుపు శంకరం కాకినాడ రాలేదు. కాకినాడ గురించి అతనికి బొత్తిగా తెలీదు. ఇప్పుడు రంగారావ్ ఇల్లుకోసం వెదకాలి కాబోలు.
    జేబులో ఉన్న రంగారావ్ అడ్రస్ తీశాడు. చదువుకున్నాడు. అయితే-అంతమాత్రాన అతనిల్లు కనుక్కోడం సులభమైన పనా?
    శంకరానికి చిరాకు కలిగింది. ఏడవాలని గూడా అనిపించింది. తనకి దగ్గర్లో ఉన్న బల్లమీద కూర్చుండిపోయాడు.
    ఇలాటి సమయాల్లోనే 'సిగరెట్టు' మంచి పని చేస్తుంది. అది చక్కటి మందు. సిగరెట్టు ముట్టించి పొగ వదిలాడు.
    కాకినాడ టవున్ స్టేషన్లో ఆగిన రైలు, పోర్టు స్టేసన్ కి కదిలింది. ఫ్లాటు ఫారం మీద నున్న జనం ఒక్కరొక్కరే బయటికి వెళ్ళి పోతున్నారు. కాసేపటికి ఫ్లాటు ఫారమంతా ఖాళీ అయింది. తనొక్కడే బిక్కు బిక్కుమంటూ దిగులుగా కూర్చుండిపోయాడు.
    అసలు రంగారావ్ ఉద్దేశ్య మేమిటి? ఈ కొత్త వూళ్ళో 'నీ ఇబ్బందేదో నువ్వు పడవోయ్ భగవాన్లూ, అనడం ఏమైనా ధర్మమా? రమ్మని ఆహ్వానమ్పంపి, తీరా వచ్చిన తర్వాత తన ఖర్మకి తన నొదిలేయడం భావ్యమా?
    రంగారావ్ తనెదుటలేడుగానీ, ఉంటే మీద పడి కొట్టేయాలన్నంత కోపం వచ్చింది శంకరానికి.
    మరో అయిదు నిముషాలు ఎదురు చూశాడు. అప్పటి గ్గూడా రంగారావ్ రాలేదు. చివాలున లేచాడు. టిక్కట్టు కలెక్టరుకి టిక్కట్టిచ్చి స్టేషన్ బయట పడ్డాడు.
    'హల్లో' ఒకానొక పొలి కేకతో పాటు, తన ముందు ఒక యువకుడూ, ఒక యువతీ వచ్చి నిలబడ్డారు-అప్పుడే స్వర్గం నుంచి తనని కాపాడడానికిగానూ భూమ్మీదికి దిగిన దేవతా మూర్తుల్లా.
    వాళ్ళిద్దర్నీ చూచిన తర్వాత శంకరం ఆనందించాడు. ఆ క్షణంలో ఏం మాటాడాలో గూడా తోచిందికాదు.
    "సారీరా బ్రదర్" అన్నాడు రంగారావ్,

                                 
    "ఏడిశావ్ లే పెద్ద" ఏమనాలో తెలీకా, రంగారావ్ పక్కన నుంచున య్వతి, ఏమంటే ఏమనుకుంటుందోనన్న భయంచేత ఈ ఒక్క ముక్కతో తన కసినంతా తీర్చుకున్నాడు శంకరం.
    "ఏం చేస్తాను బ్రదర్! ట్రైనొచ్చే టైమయిందీ. త్వరగా తెములు మరి అని ప్రాధేయ పడినా వినిపించుకుందా మా రాణిగారు. సింగార మంతా పూర్తయ్యేసరికి ఈవేళయింది. ఇంకా నయం ఏ అపూర్వశక్తి దయతలచి ఇంత పని చేయించిందోగాని లేకపోతే, ఒక్క చీర సింగారించుకోవటానికే ఒక పూట తీసుకునేది. ఆడాళ్ళంతే! మనం వాళ్ళని దెప్పరాదు మరి"
    శంకరం ఏమీ మాతడలేదు.
    "నిన్ను చూట్టంతో, తప్పనిసరిగా పాటించవలసిన కొన్ని నిబంధనలని మరిచిపోయాను. మొదటిది-కొత్తవారిని పరిచయం చేయుట. ఈవిడ నా అర్ధాంగి శ్రీమతి సుజాత. సింపుల్ గా సుజి. వీడు శంకర్రావ్ అనబడే శంకరం" అని పరిచయం చేశాడు రంగారావ్.
    సుజాత అందంగా నమస్కారం చేసింది. శంకరం ప్రతి నమస్కారం చేశాడు.
    "రైళ్ళు ఇంత టంఛన్ గా వస్తాయని తెలుస్తే గంట ముందే వచ్చి ఇక్కడ మీ కోసం ఎదురు చూసే వాళ్ళం"- సుజాత అన్నది.
    "కరెక్ట్"- అన్నాడు రంగారావ్.
    "నా అదృష్టంకొద్దీ ఇప్పటికైనా వచ్చారు. అది చాలు. లేకపోతే ఈ తెలీని వూల్లో పిచ్చి కుక్కలా రోడ్లంట తిరిగే అవస్థ తప్పని సరై ఉండేది. రక్షించారు"
    "కరెక్ట్" మళ్ళీ అన్నాడు రంగారావ్.
    "నాట్ కరెక్ట్" మాట నంది పుచ్చుకున్నది సుజాత.
    వాళ్ళిద్దరి వరసా గుడ్లప్పగించి చూస్తూ నిలబడ్డాడు శంకరం.
    "గాంధీనగరం రిక్షా చేయించుకుని, గాంధీ బొమ్మ దగ్గర దిగి, చుట్టూ చూస్తే చాలు ఆ పక్కనే ఉన్న మా ఇంటి ప్రహరీగోడమీద మావారి నేమ్ ప్లేట్ కొట్టొచ్చినట్టు కనుపిస్తుంది. కాబట్టి మా ఇల్లు అంతు తెలుసుకోడానికి ఒక క్షణం చాలు. ఏమంటారు?" అన్నది సుజాత.
    "కరెక్ట్" అన్నాడు శంకరం.
    ముగ్గురూ నవ్వేశారు.
    "చూశావా సుజీ! శంకరం చాలా కలుపుగోలు మనిషి"
    "తెలుస్తూనే ఉంది. పోతే-తర్వాత కార్యక్రమం ఆలోచించండి మరి" అన్నది సుజాత.
    "దాన్నే ఇంగ్లీషులో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆప్ ది ఆయిట మంటారు" అన్నాడు రంగారావ్.
    "మీకూ మీ ఇంగ్లీషుకీ ఒక నమస్కారంగాని, ముందు ఇంటికి రిక్షాలు మాటాడిరండి" అన్నది సుజాత.
    రిక్షాలు మాటాడుకున్నారు.
    ఇంటి కొచ్చేసరికి ఎనిమిదయ్యింది. సుజాత చెప్పినట్టు ఈ ఇంటిని కనుక్కోవడం అనుకున్నంత ప్రళయమేమీ కాదు. ఎవర్నీ వాకబు చెయ్యకుండానే తిన్నగా వచ్చేయవచ్చు. డాబా-ముందు కాస్త భాగం ముచ్చటైన కాంపౌండు.
    "మా ఆవిడకి క్రోటన్సంటే చాలా ఇష్టం. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని కాంపౌండు నిండా క్రోటన్సు నాటించింది. చూడరాదూ-దీనివల్ల మా ఇంటికి ఎంత ఆకర్షణ వచ్చిందో" రంగారావ్ అన్నాడు.
    అవునన్నట్టు తలూపాడు శంకరం.
    "పాపం.......రాత్రంతా ప్రయాణం చేశావ్. రైల్లో ఏం నిద్ర పట్టిందో ఏమో? సుజీ........వెంటనే మా వాడి స్నానానికి అన్నీ అమర్చిపెట్టేయాలి మరి. క్విక్."
    "అలాగే" ఇంటి తాళం తీసి లేడిలా పరుగెత్తింది సుజాత.
    ఆ దంపతుల్ని చూస్తుంటే అమితానందంగా ఉన్నది. శంకరానికి. రంగారావ్ తో పాటు ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఆ ఇల్లు ఒక పెద్ద సంసారానికి సరిపోయేలా ఉంది. ఇంట్లో అవసరమైన ప్రతి వస్తువూ అద్దంలా అమర్చిపెట్టారు.
    "నిన్ను తలుచుకున్నప్పుడల్లా ఒకే ఆశ్చర్యంగా ఉంటుంది శంకరం. ఏమని అడుగుతావేమో..... కాలేజీ దాటిన తర్వాత నువ్వు బ్రహ్మాండంగా మారిపోయావు."
    నవ్వి వూరుకున్నాడు శంకరం. మిత్రులిద్దరూ సోఫాల్లో కూర్చున్నారు.
    "బుద్ధవతారంలా, ముందు బెంచీల్లో కూర్చుని శ్రద్దగా పాఠాలు వినేవాడివి. ఒకడి జోలికి పోయే వాడివికావు" ఇందాకటి పరామర్శ ఇంకా సాగిస్తూనే ఉన్నాడు రంగారావ్.
    "అయితే ఇంతకీ ఏమంటావ్?" అన్నాడు శంకరం.
    "ఇప్పుడు కధలు రాస్తూ మంచి కథకుడవనే పేరు సంపాయించావ్. ఊరూరా నీ పేరు అట్టుడికినట్టు-"
    "ప్లీజ్" అన్నాడు శంకరం.
    "సాక్ష్యం కావలిస్తే మా ఆఫీస్లో నీ వివరాలు అడగనివారు మచ్చ్కి ఒక్కడు లేడు. 'ఆయనెలా ఉంటారూ, ఎంత వయస్సూ, ఎప్పుడైనా వస్తే ఒకసారి చూపించరూ' అని నన్ను లక్ష ప్రశ్నలు వేస్తారు. ఆఫ్ కోర్స్-దీని ద్వారామనం గూడా పదిమంది నోళ్ళల్లో పడుతున్న మాట వాస్తవ మనుకో."
    ఇది వినగానే శంకరానికి సిగ్గులాటిది కలిగి, చాలా ఇబ్బంది పెడుతున్నది. రంగారావ్ మొహం చూడటానికే భయంగా ఉందేమిటి?
    "అంతెందుకు? నీ కధలంటే సుజీకి విపరీత మైన ఇష్టం. నా విషయం అడుగుతే-చెప్పద్డూ మనకీ కథలూ గిథలూ నచ్చవ్. అలాంటిది నీ కథా పడినప్పుడల్లా పాపం-ప్రాదేయపడి నా చేత చదివిస్తుంది సుజీ. మరొక సంగతిరా శంకరం, ఈ రోజుల్లో మగవాళ్ళకంటే ఆడవాళ్ళే పత్రికలు ఎక్కువగా చదువుతున్నారు"
    "ఆకలిగా ఉంది. తినడానికేధైనా ఉంటే చూద్దూ" అన్నాడు శంకరం, టాపిక్ మార్చేయాలన్న సత్యకల్పంకొద్దీ.
    "ఛప్........వెధవాకలే నువ్వూను. అబ్బాయ్! ఆకలి విషయంలో నువ్వు మునుపటి శంకరానివే సుమా! ముందు స్నానం చెయ్యాలి. ఆ తర్వాత ఆకలి బాబోయి అనాలి. ఒక్క క్షణం........ఇప్పుడే వెళ్ళాడు.
    శంకరం గాలి  పీల్చుకున్నాడు.
    తన మాదిరి చాలా మంది గ్రాడ్యుయేట్లు న్నారు, యువకులూ ఉన్నారు, తనలో ఉన్న చాలా గుణాలు చాలా మందిలోనూ ఉన్నాయి. అయితే-ఏ ఎకధాలు రాయడమనే క్వాలిఫికేషన్ తనలాటి చాలా మందికి లేదు.
    ఈ ప్రత్యేకతపట్ల ఇంత గౌరవం ఇంత ఆదరణా! శంకరం కొద్దిగా సంతోషించాడు.
    "స్నానానికి నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి. నీదే ఆలస్యం" అన్నాడు రంగారావ్ టవలూ సబ్బూ తీసుకుని దొడ్లోకి వెడుతూ.
    స్నానం ముగించి వచ్చిన తర్వాత వేడి వేడి ఉప్మా తన ముందు పెట్టింది సుజాత.
    "జీడిపప్పు జోరుగా వేసి చసిన ఉప్మా అంటే మీకు చాలా ఇష్టమని మా వారు చెప్పారు. పచ్చి మిరపకాయలు-"
    "జాస్తీగా తగిలించాలని గూడా చెప్పి ఉంటాదనుకోండి. ఇప్పటిదా మా స్నేహం-ఎనిమిదేళ్ళ నుంచీ అంటి పెట్టుకుని తిరిగాం."
    "ఆకలిగా ఉందని చెప్పి మాటల్లోకి దిగా నేమి టోయ్. ముందు ఆ పని కానివ్వు. చల్లారిపోతుందవతల" అన్నాడు రంగారావ్.
    మిత్రులిద్దరూ టిఫిన్ పూర్తి చేశారు. కాఫీ తెచ్చేందుకు వంట గదిలోకి వెళ్ళింది సుజాత.
    "టిఫిన్ బ్రహ్మాండంగా ఉంది"
    "మా ఆవిడ తరఫున, నీ అభినందనని సగర్వంగా స్వీకరిస్తున్నా" నువ్వు చాలా అదృష్టవంతురాలివిరా రంగా" ఆవిడ చేతిలో అమృతముంది"
    "అవునట. అలా అని ఆవిడ అంటుంది. పైగా నన్ను గూడా అనమని బలవంతం చేస్తుంది"
    "పాపం. అలాగాండీ" అంటూ సుజాత వొచ్చింది.
    సుజాతని చూడగానే మాట మార్చాడు రంగారావ్.
    "ఏ మాట కా మాటే-నువ్వన్నట్టు సుజీ చేతిలో అమృతముంది. అందుకే, నేనింత ఆరోగ్యంగా పుష్టిగా ఉన్నాను."
    "వట్టి గాలిపటపు మాటలు" ఇద్ధరికీ కాఫీ ఇస్తూ మొహం చిట్లించుకుంటో అన్నది సుజాత.
    "ఒక విషయం చెప్తా వినబ్బాయ్! ఆడవాళ్ళని సాక్షాత్తు వాళ్ళముందు చస్తే మెచ్చుకోరాడు. మెచ్చుకున్నామో, మన ఖర్మ కాలిందన్న మాటే. ఆ......"    
    "అందుకని ఎప్పటి కయ్యెది అన్నట్లు మాటలు మార్చి బుద్దిమంతులనిపించుకోవడం మగవాడికి మంచిదంటారు" అన్నది రోషంగా.
    "అది కళ. ఒక ఆర్టు అంటాను. నిజానికి మాట మార్చడం చాత కాకపోతే, అయ్య బాబో-నిలువునా ముంచెయ్యరూ మీ ఆడవాళ్ళు. నువ్వు చెప్పరా అబ్బీ! నిజమా కాదా!" అన్నాడు రంగారావ్.
    "నీ అంత పరిశీలనా శక్తి నా కింకా అలవాటు పడలేదు" అన్నాడు శంకరం.
    "మరిన్ని కధ లెలా రాశావోయ్?"
    "అవన్నీ కధలోయ్!"
    "మహబాగా అంటించారు" అన్నది సుజాత.


Next Page 

WRITERS
PUBLICATIONS