10
తన దగ్గిర నుండి శ్రీధర్ బిల్ తీసికోలేదనే ఉద్దేశంతో ఉన్న ప్రకాశరావు అతనిని తరచుగా భోజనాని కాహ్వానించేవాడు. అతడు వచ్చినప్పుడల్లా అరుంధతే స్వయంగా వడ్డించేది. శ్రీధర్ కు తాను స్వయంగా వడ్డించడం వల్ల తనకు కలుగుతున్న సంతృప్తి ని గురించి తనను తననేక సార్లు ప్రశ్నించుకొంది అరుంధతి. చివరకు ఇందులో దోషమేమీ లేదనీ, ఇది కేవలం స్నేహమేననీ, తనను తాను సమాధాన పరచుకోవటానికి ప్రయత్నించింది. కొన్ని కొన్ని నిజాలు మనలో మనం కూడా అనుకోలేం!
ఒకనాడు ప్రకాశరావు , అరుంధతీ భోజనాలు చేస్తున్నారు. వెంకటలక్ష్మీ ప్రక్కన నిలబడి వడ్డిస్తోంది. అరుంధతి కీ సాంబారు కావలసి వచ్చింది. సాంబారు గిన్నె అరుంధతి కి దూరంగా ఉంది. అందుచేత వెంకటలక్ష్మీ అందిస్తుందేమోనని చూసింది. కానీ, వెంకటలక్ష్మీ అసలు అరుంధతిని గమనించటమే లేదు. ఆమె దృష్టంతా , ప్రకాశరావు కంచం మీదే క్రెందీకృతమై ఉంది. అతడడగకుండానే ఏం కావాలో కనిపెట్టి చూస్తుంది. కంచంలో చెయ్యి పెట్టుకుని పరధ్యానంగా కూర్చున్న అరుంధతి ని చూసి ప్రకాశరావు "అలా కూర్చున్నావేం? ఏం కావాలి?" అన్నాడు.
"నాకు సాంబారు కావాలి."
"వెంకటలక్ష్మీ ని అడగరాదూ?"
"వెంకటలక్ష్మీ పాపం మీకే వడ్డిస్తుందా , నాకే వడ్డిస్తుందా?"
వద్దు, వద్దు అనుకొంటూనే అనేసింది అరుంధతి --
వెంకట లక్ష్మీ అదిరిపడింది. ప్రకాశరావు వెంకటలక్ష్మీ వంక చురుక్కున చూసాడు.... తనే స్వయంగా సాంబారు గరిటతో తీసి, అరుంధతి కి వడ్డించాడు.
'ఆరూ! వెంకటలక్ష్మీ నీకు సరిగ్గా చేయటం లేదా? పోనీ మానిపించేద్దాం!"
అప్పటికే పశ్చాత్తాపపడుతున్న అరుంధతి హడలి పోయింది.
"ఫరవాలేదు' కంగారుగా అంది.
"అదేం కుదరదు. నీ తర్వాతనే అంతా! నిన్ను నిర్లక్ష్యం చేసేవాళ్ళూ ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెంకటలక్ష్మీ! రేపటి నుండి నువ్వు వంట చెయ్యక్కర్లేదు . ఇక్కడ ఉండక్కర్లేదు."
వెంకటలక్ష్మీ ముఖం తెల్లగా పాలిపోయింది. పెదిమలు వణికాయి. కానీ మాటలు బయటకు రాలేదు. అరుంధతి ఈ పరిణామానికి చాలా నోచ్చుకోంది.
మధ్యాహ్నం దొడ్లోకి వచ్చిన అరుంధతి కి వంటింట్లోంచి కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న చప్పుడు విని పించేసరికి , వంటింట్లోకి కెళ్ళింది. అన్ని వేళల్లోనూ నిర్వికారంగా ఉండే వెంకట లక్ష్మీ గోడకు జారగిలబడి , వెక్కి వెక్కి ఏడుస్తుంది. అరుంధతి ని చూడగానే అరుంధతి కాళ్ళ మీద పడి, "ఈ ఒక్క తప్పూ క్షమించండమ్మా! నన్ను వెళ్ళగొట్టకండి" అంది.
అరుంధతి తనను తానసహ్యించుకొంది. వెంకట లక్ష్మీ కి ప్రకాశరావు కు స్వయంగా వడ్డించటంలో ఆనందం ఉంది. నిజమే! అయితే, అందులో తప్పేమిటీ? అది తప్పే అయితే, తాను శ్రీధర్ కు వడ్డించటంలో సంతృప్తిని పొందటం మాత్రం దోషం కాదా? ఈ దీనురాలి నింత క్షోభ పెట్టె అధికారం తన కేవరిచ్చారు?
అరుంధతి వెంకట లక్ష్మీని అర్ధం చేసికొంది. ఈ ఇంట్లోంచి పోమ్మనటం కంటే , ప్రాణాలను విడవమంటే వెంకటలక్ష్మీ ఎక్కువ సంతోషిస్తుంది. వెంకటలక్ష్మీ ఎటువంటిదో , ఆమె మనసెంత ఉన్నతమైనదో తనకు బాగా తెలుసు. తెలిసి కూడా ఆమె నవమానించిందెందుకూ? తనలో ఇంత క్షుద్రత్వం ఏ మూల దాక్కుందీ?
తన చేతులతో వెంకటలక్ష్మీ ని లేవనెత్తి గుండెల కదుముకుంది. వెంకటలక్ష్మీ ఆశ్చర్యపోయి, కౌగిలి విదిపించుకోబోయింది. అరుంధతి వదలలేదు.
"నన్ను క్షమించు వెంకటలక్ష్మీ! నన్ను నేనే క్షమించుకోలేక పోతున్నాను--"
"దానిదే ముందమ్మా! ఒకనాడు మీరే నన్ను వడ్డించవద్దన్నారు. అందుకని మీ విషయం పట్టించుకోవటం మానేసాను."
అరుంధతికి గుర్తొచ్చింది. పెళ్ళయిన క్రొత్తలో వెంకటలక్ష్మీ దగ్గిర నిల్చొని అది కావాలా, ఇది కావాలా అని అడుగుతుంటే విసుగేసి "నువ్వు నాకు వడ్డించవద్దు. నాకు కావలసింది నేను వడ్డించుకొంటాను" అంది.
అరుంధతి పశ్చాత్తాపంతో కృంగి పోయింది. "నన్ను క్షమించు వెంకటలక్ష్మీ! నీ మనసెంత అమృతమాయామో తెలిసే నిన్ను నొప్పించాను. నా మనసులో ఏ మూలో ఒక చిన్న పిశాచం ఉంది. దాన్ని జయించలేక పోయాను."
'అంతంత మాటలనకండమ్మా! నన్ను మీ పాదాల దగ్గిరుండనిస్తే నా కదే పదివేలు! దొరగారికి మీరు చెప్తే....."
"దాన్ని గురించి నువ్వు బాధ పడకు వెంకటలక్ష్మీ ! నేనుండగా నిన్నీ ఇంట్లోంచి ఎవ్వరూ కదపలేరు,"
వెంకటలక్ష్మీ వెంటనే కళ్ళు తుడుచుకుంది.
"ఆమాత్రం చాలమ్మా! ఇంక నే నెందుకు బాధపడను."
వెంకటలక్ష్మీ ముఖంలోకి జాలిగా చూసి, అరుంధతి లోపలకు వచ్చేసింది.
* * * *
సుందరరావుకూ , ప్రకాశరావు కూ కూడా తెలిసిన ఎవరింట్లోనో పెళ్ళి జరుగుతుంది. మనోరంజని, సుందర్రావు లు ఆ పెళ్ళి కెళ్ళడానికి తయారై వచ్చారు. ప్రకాశరావు ముందే తయారయ్యాడు. తన కెంత ఇష్టం లేకపోయినా, అరుంధతి కి కూడా బయలుదేరక తప్పలేదు. తయారై వచ్చిన అరుంధతిని చూస్తూ, మనోరంజని "నీ గాజులు వేసికోలేదేం?' అంది అరుంధతి కంగారు పడిపోయింది.
"ఎక్కడో పెట్టెలో ఉన్నాయి. ఇప్పుడు వెతకలేను బాబూ? పోదాం పదండి!' అంది.
"బాగుంది! పెళ్ళికి వెళ్తున్నప్పుడు కాకపోతే నువ్వు గాజులు వేసికొనే దింకెప్పుడూ?" మనోరంజని అడ్డు తగుల్తూ అంది.
ఈ మనోరంజని కక్కర్లేనిది లేదు. ఈవిడ కేంతసేపూ ఎదుటివాళ్ళ నగల మీదా, చీరాల మీదా దృష్టి.
"ఫరవాలేదు! ఇప్పుడు వెతకలేను! తరువాత చూసుకోవచ్చు!" విసుగ్గా అంది.
ప్రకాశరావు కలిగించుకొన్నాడు.
"ఎంతసేపూ ఆరూ! గాజులు లేకుండా పదిమంది లోకి వస్తానంటావేమిటి? అసలు చేతివి తీసి పెట్టెలో ఎందుకు పెట్టావ్? ఏ పెట్టెలో పెట్టావ్! నేను తీసికోస్తాను.'
అరుంధతి హతశురాలయింది.
"ఏమో, ఏ పెట్టెలో పెట్టానో గుర్తులేదు."
ప్రకాశరావు కొంచెం విసుక్కున్నాడు.
"బంగారు వస్తువుల విషయంలో ఇంత నిర్లక్ష్యమేమిటి? ఉండు వెతుకుతాను."
ప్రకాశరావు పెట్టెలు వెతకటం మొదలు పెట్టాడు. అరుంధతి బొమ్మలా నించుంది. వెతికి వెతికి ప్రకాశరావు విసుగు పుట్టింది.
"ఏ పెట్టేలోనూ లేవు. ఎక్కడ పెట్టావు?'
"నాకు గుర్తు లేదు."
మనోరంజని కలిగించుకోంది.
"గుర్తు లేకపోతె మాత్రం ఇంట్లోనే ఉండాలి కదా! ఇల్లంతా వెతుకుతే సరి!"
అందరూ ఇల్లంతా వెతకటం మొదలుపెట్టారు. ఎక్కడ దొరుకుతాయవి/ ఇంతలో సుందర్రావు తనకు తట్టిన బ్రహ్మాండమైన ఆలోచనను బయట పెట్టాడు.
"ఎవరైనా దొంగిలించారేమో?"
అందరికీ ఈ ఆలోచన నవ్వింది.
"ఎవరు దొంగిలించి ఉంటారు?"
"ఇంట్లో అతి చనువుగా తిరిగేది ఎవరు?"
"వెంకటలక్ష్మీ?"
"ఆమెలో దొంగబుద్ది ఉందా?"
"ఏమో! డబ్బు పాపిష్టిది. బంగారం కంట పడితే, ఎవరికైనా లేనిబుద్దులు పుడతాయి."
"ఏం చేద్దాం?"
"సోదా చేస్తే సరి! అవిడుండేది ఇక్కడేగా!"
అరుంధతి కాళ్ళూ, చేతులు వణుకుతున్నాయి. ఏం జరుగుతుంది? వీళ్ళంతా ఏం చెయ్యబోతున్నారు? తానెం చెయ్యాలి?"
"వెంకటలక్ష్మీ!" ప్రకాశరావు గర్జించాడు.
భయంగా నిలబడింది వెంకట లక్ష్మీ.
"అరుంధతి చేతిగాజులు చూసావా?"
వెంకటలక్ష్మీ వెలవెల పోయింది.
పాపం! ఆ నిర్భాగ్యురాలు అరుంధతి చేతికి గాజులు లేవన్న సంగతి అప్పుడే గుర్తించింది.
"నాకు తెలియదండి!"
"ఈ ఇంట్లో ఎక్కడా లేవు. స్వతంత్ర్యంగా తిరిగేది నువ్వే! ఏమయిపోతాయి?"
వెంకటలక్ష్మీ బిత్తరపోయి చూసింది.
"నీగది తాళాలు తియ్యి! ఒకసారి చూద్దాం?" ఆజ్ఞాపించాడు ప్రకాశరావు.
వెంకటలక్ష్మీ వణికిపోయి రెండు చేతులూ జోడించింది.
"నేనే పాపమూ ఎరగనండి! నా గదిలో ఏమీ లేదు."
"ఏముందో, ఏం లేదో మేం చూసుకుంటాం! నువ్వు తలుపు తియ్యరాదూ?" గద్దించాడు సుందర్రావు.
వెంకటలక్ష్మీ అరుంధతి వంక తిరిగింది.
"అమ్మా! మీ గాజులకు నే నాశపడతానా? నా గదిలో ఏం లేదమ్మా!"
వెంకటలక్ష్మీ కంఠస్వరం ఎంతటి కటినుల నైనా ద్రవింపజేసేటంత దీనంగా ఉంది.

అరుంధతికి తన గుండెల నెవరో పిండుతున్న ట్లనిపించింది.
"ఆమె నెందుకు పీడిస్తారూ? ఆవిడ దొంగది కాదు!" గట్టిగా అంది.
ఈ మాటలతో ప్రకాశరావు మరింత రెచ్చిపోయాడు.
'అయితే భయమెందుకూ? ఎప్పుడూ ఆ గది తాళమేసి ఉంచుతుంది. ఏం దాస్తుందో ఎవరికి తెలుసు? నువ్వేమో ఏమీ పట్టించుకోవు!
"పోనీ, ఒక్కసారి చూడనియ్యరాదా వెంకటలక్ష్మీ? నీకు భయమెందుకు?" బ్రతిమాలుతున్నట్టుగా అంది అరుంధతి. వెంకటలక్ష్మీ అరుంధతి పాదాలు గట్టిగా పట్టుకొంది.
"నన్ను రక్షించండమ్మా! నా గదిలో ఈ లోకంలో నాకున్న ఒకే ఒక వస్తువు ను దాచుకున్నాను. అది ఎవరికీ చూపించలేను. నామీద నమ్మకం లేదా?"
అరుంధతి చలించిపోయింది. ప్రతివారికి ఏవో వ్యక్తిగత రహస్యాలుంటాయి. ఈమె తమ ఇంట వంట మనిషయినంత మాత్రాన ఈమె వ్యక్తిగత విషయాల్లో కలుగజేసికొనే అధికారం తమ కేవరిచ్చారు?
"మీకు అనుమానంగా ఉంటె పోలీస్ రిపోర్టివ్వండి. అంతేకాని మీరు స్వతంత్యంగా ఆమె గదిలోకి వెళ్ళడానికి వీల్లేదు."
తాళం పగలగొట్టబోతున్న సుందర్రావుకు అడ్డు తగుల్తూ అంది అరుంధతి.
ప్రకాశరావు ఆమెను పక్కకు లాగేసాడు.
సుందర్రావు తాళం పగల కొట్టేసాడు. మనోరంజని తలుపులు తెరిచింది.
ఎదురుగా కనుపించిన దృశ్యం అందరినీ, అరుంధతి గాజులనూ, మిగిలిన అన్ని విషయాలనూ మరిచి పోయేలాగచేసింది. అది వెంకటలక్ష్మీ , ప్రకాశరావు లు ప్రక్క ప్రక్కన నిలబడి తీయించుకొన్న ఫోటో!
