Previous Page Next Page 
స్వాతి జల్లు పేజి 25

 

    
    సంఘంలో పెద్ద స్థానం! కార్లు, పార్టీలు, చేతి నిండా డబ్బు డబ్బు! డబ్బు!
    అప్పుడు తన ప్రక్కన స్నేహలత ఉంటుంది. ఆమెను ఎవరైనా అందగత్తె అనవచ్చునేమో , కాని తన కామె వంక చూడాలంటేనే అసహ్యం. తార కళ్ళలోని మెరుపెక్కడ? ఈమె కళ్ళలోని నీలి నీడ లెక్కడ? ఏవేవో కాలుష్యపు ఛాయా లామె చిరునవ్వులో స్పష్టంగా కనిపిస్తాయి. ఆమెతో పది నిమిషాలు మాట్లాడితేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఆమెతో జీవితాంతము గడపాలా?
    కానీ, మంచి ఖరీదైన బట్టలు! ఉద్యోగం చెయ్యక్కర్లేదు. హాయిగా కార్లలో తిరగొచ్చు. ఏదీ లేదనుకోనక్కర్లేదు. తన కంటే తెలివైన వాళ్ళందరి కంటే , తన కంటే మంచి వాళ్ళందరి కంటే తను గొప్పవాడై పోతాడు! రవి దృష్టి హెంగర్ కు తగిలించి ఉన్న సూట్ నూ, అందులో ఉన్న డబ్బునూ వదిలి రాలేకపోయింది.
    మరునాడు తిన్నగా కాలేజీ నుండి స్నేహలత దగ్గరికే వెళ్ళాడు. ఆ మరునాడూ , ఆ తరువాతి రోజూ అలాగే జరిగింది.
    రవి తానిచ్చిన డబ్బు విషయంలో ఏం మాట్లాడతాడో నని తహతహ తో తీరని ఆశాభంగమయింది. ఆ తరువాత రెండు రోజులు వరుసగా కనబడక పోవటంతో, ఆమె మనసు పరిపరి విధాల పోయింది. డాక్టర్ శ్రీధర్ గారింటికి రెండు మూడు సార్లు టెలిఫోన్ చేసింది. రెండు మూడు సార్లూ ఇంట్లో లేడనే సమాధానం వచ్చింది. నిరాశతో టెలిఫోన్ పెట్టేసి వెనక్కు తిరిగిన తార అక్కడ నిలబడ్డ సుందర్రావును చూసి తెల్లబోయింది.
    "రవి కోసమా తారా! డాక్టర్ గారింటికి టెలిఫోన్ చేసి ఏం లాభం? స్నేహలత ఇంటికి చెయ్యి. నంబరు చెప్పమంటావా?"
    మాములుగా నవ్వటానికి ప్రయత్నిస్తూ అన్నాడు సుందర్రావు.
    తార మొఖంలో నెత్తురు చుక్క లేదు.
    "వెళ్ళి చూడు! తెలుస్తుంది."
    "ఎక్కడుంటుంది?"
    "మన కారు డ్రైవర్ కు తెలుసు! వాడు తీసి కెళ్తాడు కారులో వెళ్ళు!"
    తార ఎలా ఉన్న దలా వెళ్ళి కారులో కూర్చుంది. స్నేహలత ఇంటి గుమ్మం ముందు కారాగగానే తార చరచర వెళ్ళి తలుపు తట్టింది. వెంటనే తలుపు తెరచుకోంది. రవి సోఫాలో కూచున్నవాడు అదిరిపడి లేచాడు. ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కొనవలసి వస్తుందని వూహించినా , ఇంత త్వరలో వస్తుందను కోలేదు. స్నేహలత కులుకుతూ "ఓహో! సుందర్రావుగారి చెల్లెలు తారగారు కదూ! రండి! రండి!' అంది.
    తార ఆమె వంక నిరసనగా చూసి రవి వంక తిరిగింది. ఆమె కళ్ళు రెండూ జ్యోతుల్లా ఉన్నాయి.
    "రవీ! ఇప్పటికీ నేను నిన్ను క్షమిస్తున్నాను. ముందు బయటికి రా!"
    తర్జనితో ద్వారాన్ని నిర్దేశిస్తూ అంది తార. రవి సర్వాంగాలూ వణికాయి. ఆప్రయత్నంగా అతని అడుగు ద్వారం వైపు పడింది. అంతలో స్నేహలత కిలకిల నవ్వింది. రవి చటుక్కున తన అడుగు వెనక్కు తీసుకున్నాడు.
    "నన్ను క్షమిస్తున్నావా? ఎందుకూ? నేనేం తప్పు చేసానని?"
    "భగవాన్! ఇలా అడగ్గలిగిన స్థితికి దిగజారి పోయావా? రవీ! నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను పతనం కానీయను. వచ్చెయ్యి. ఈ నరకం లోంచి బయటకు రా!"
    "ఏమిటది? నేనేం పసిపాప ననుకొన్నావా? ఎవరెలా ఆడిస్తే అలా డూ, డూ బసవన్న లా ఆడటానికి నాకు వ్యక్తిత్వం లేదా?'
    తార పిండి బొమ్మయింది.
    ఒకనాటి తన మాటల నీనాడు తన కీవిధంగా అప్పగిస్తున్నాడు.
    ఒళ్ళు తెలియని కోపంతో తారకు మతిపోయింది.
    "విశ్వాసఘాతకుడా! కృతఘ్నుడా? నన్నే అవమానిస్తున్నావా?"
    "ఎవరు ఎవరిని అవమానిస్తున్నారు? నేనెవరికి విశ్వాసం చూపించాలి? ఎవరికి కృతజ్ఞుడనై ఉండాలి? నాకు సహాయ పడ్తున్నది డాక్టర్ శ్రీధర్! ఇంకెవరి ఋణంలోనూ నేను లేను. నా ఇంటికి వచ్చి, నన్నే అవమానిస్తున్నావా?"
    "నీ ఇల్లా?"
    "ఈవిడ ఇల్లు నా ఇల్లు క్రిందే లెక్క!"
    తార గిర్రున తిరిగి వెళ్ళిపోయింది. వెనుక నుండి స్నేహలత నవ్వు తారకు స్పష్టంగా వినిపించింది.
    తార వెళ్ళగానే , రవికి పట్టిన చెమటను చూసి, ఆశ్చర్యపోతూ స్నేహలత "ఇంత చలిలో చెమట లేమిటి?" అంది.
    రవి త్వరగా ముఖం తుడుచుకున్నాడు. "ఏం లేదు లతా! నువ్వు గాభరా పడకు!"
    తను గాభరా పడుతూ అన్నాడు రవి. స్నేహలత పకపక నవ్వింది.
    "నీ నవ్వు ఎంత బాగుంటుందీ? చచ్చినట్లు ముగ్ధుడయ్యాడు రవి."
    "నిజంగానా? నువ్వింకా బాగుంటావు. కానీ, రవీ! నిన్ను విడిచి ఎలా ఉండగలను? " రవి వెలవెల పోయాడు."
    "నన్ను విడిచి ఉండడం ఎందుకూ?"
    "రేపు వూరి కెడుతూన్నాను. మళ్ళీ ఎన్నాళ్ళకు వస్తానో?"
    "ఏ వూరు?"
    "ఏమో , రామచంద్రరావుగారు ఏ వూరు తీసి కేడితే ఆ వూరు."
    "రామచంద్రరావుగారెవరు/ అయన నిన్ను వూరికి తీసి కెళ్ళడమేమిటీ?"
    "ఆయనెవరో చెప్పినా నీకు తెలియదు. నేను ఎల్లుండి నుంచీ ఆయనతో ఉండాలి గనుక, ఆయనతో వెడుతున్నాను."
    "ఏమిటీ మాట్లాడుతున్నావు నువ్వు?"
    'అంత తెల్లబోతా వేమిటీ? నా వృత్తి నేను చేసికోవటం లో అంత ఆశ్చర్యమేముందీ?"
    రవికి తల గిర్రున తిరిగింది.
    "నీ వృత్తా?"
    "తెలుగు నీ కర్ధం కావటం లేదా?"
    "నువ్వు నా కర్ధం కావటం లేదు. ఈ ఇంట్లో నువ్వు ఇన్నాళ్ళూ...."
    "ఇందులో అంత అర్ధం కాని దేముందీ? ఈ ఇల్లు సుందర్రావుగారి ఆప్తమిత్రుడైన శేఖర్ డి. అయన విదేశాలకు వేడ్తూ దీని తాళాలు అయనకప్పగించారు. ఇన్నాళ్ళూ సుందర్రావు గారు నన్ను చేరదీసారు. గనుక, నన్నిందులో ఉంచారు. ఇన్నాళ్ళూ మనం ఖర్చు పెడుతున్న డబ్బు సుందర్రావుగారిదే!"
    "సుందర్రావుగారిదా?"
    "మరి, ఇంకెవరి తాతగారి సోమ్మనుకొన్నావ్?"
    స్నేహలత పకపక నవ్వింది. పిశాచపు వికటాట్టహాసం లా తోచింది రవి కది.
    స్నేహలత రవి మెడ చుట్టూ చేతులు పెనవేసి ముఖాన్ని ముఖాని కానించి, "నన్ను మరిచి పోవు కదూ!" అంది.
    రవి ఆమె నొక్క తోపు తోసాడు. ఆమె తల వెళ్ళి సోఫాకు కొట్టుకొని దెబ్బ తగిలింది. స్నేహలత వెంటనే మండిపడుతూ లేచి, చాచి , రవి నొక్క లెంపకాయ కొట్టింది. రవికి కళ్ళు బైర్లు కమ్మాయి.     
    రవి చెంపను చేత్తో పట్టుకుని, తూలె అడుగులతో బయటకు నడుస్తుంటే , స్నేహలత విరగబడి నవ్వింది.
    "ఇడియట్! నామీద చెయ్యి చేసి కొంటావా? ఎంత పొగరు? మ్రింగ మెతుకు లేదు గాని.... గెటవుట్!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS