Previous Page Next Page 
స్త్రీ పేజి 24

 

    సోమయాజి చిన్నగా నవ్వుతూనే అన్నాడు. "నువ్వు తప్పే అంటే ఒప్పుకుంటాను, తల్లీ! కాని, కన్న తండ్రిగా ఆ బాధ్యత నాకు ఉందనే అనుకున్నానమ్మా! ఇప్పటి కైనా నువ్వేమీ అనుమానించ నక్కర్లేదు. అబ్బాయి అన్ని విధాల యోగ్యుడు. మన సంప్రదాయానికి సరిపోయిన కుటుంబం. పువ్వు లాంటి నా తల్లిని పరాయి వాళ్ళకు అప్పగించే ముందు ఇంత ముఖ్యమైన సంగతులు చూసుకోనా, అమ్మా?"
    పద్మజ నిశ్చలంగా చూసింది. "నాన్నా! నా ఇష్టాలకి ఏనాడూ నువ్వు అడ్డు చెప్పలేదు. అలాగే నీ మాట కూడా ఎన్నడూ నేను రిరస్కరించలేదు. కాని, కాని....."
    "చెప్పమ్మా! ఏమిటి? నా దగ్గర భయపడుతున్నావా? నీ ఉద్దేశ్యం ఖచ్చితంగా చెప్పమ్మా!"
    "నేనీ పెళ్ళి చేసుకోలేను, నాన్నా!"
    పద్మజ వైఖరిని బట్టి అదే ఊహించిన సోమయాజి ఏమంత విస్తుపోలేదు. ఒక్క నిమిషం మౌనంగా ఉండి కూతురి మొహంలోనికి చూస్తూ అన్నాడు: "అబ్బాయిని నువ్వు చూడనైనా లేదు."
    "అవసరం లేదు, నాన్నా! ఈ సంబంధమే కాదు. మరే సంబంధమూ నేను చేసుకోలేను."
    'అంటే.... నీకు పెళ్ళి చేసుకోవటమే ఇష్టం లేదా, అమ్మా!"
    పద్మజ క్షణం సేపు మౌనం వహించింది. "కాదు, నాన్నా! పెళ్ళంటే నాకు అయిష్టం ఎప్పుడూ లేదు."
    "మరి....మరి...."
    ఆత్రుత పడుతున్న తండ్రి మొహం లోకి నిస్సంకోచంగా చూసింది పద్మజ. "చెప్పేస్తాను, నాన్నా. నీ దగ్గర నాకు భయం వద్దన్నావుగా? నా మనస్సు లో మాట చెప్పేస్తాను. నీతో సంప్రదించి నా పెళ్ళి తొందరలోనే నిర్ణయించుకుందా మనుకుంటూన్నాను."
    "నాతొ సంప్రదించి....నీ పెళ్ళి ....అంటే.....వరుణ్ణి నువ్వే నిర్ణయించుకున్నావా, అమ్మా?" సోమయాజి కన్నుల్లో తొట్రు పాటు తొణికిసలాడింది.
    'అవున్నాన్నా! అతడు నాతొ పాటు చదివాడు. నాతోనే డాక్టరు గా పని చేస్తున్నాడు. అతన్ని నిర్ణయించుకోవటానికి నా కోరికలే కారణం నాన్నా!"
    తండ్రి మోహంలో అనుకున్నంత ఆరాట మేమీ కనిపించలేదు. "సరేనమ్మా! సరే! నీకు నచ్చితే నాకు అభ్యంతరం ఎందు కుంటుంది? అతడేవరో చెప్పమ్మా! అతడి తల్లిదండ్రులూ , శాఖా, గోత్రం...."
    పద్మజ మాట్లాడలేదు.
    "ఆ వివరాలేమీ నీ కంతగా తెలీవంటావా?"
    "తెలుసు నాన్నా! అన్నీ తెలుసు." పద్మజ అతి సహజంగా అంది. "అతని పేరు జార్జి విలియమ్స్....!"
    "అంటే ....అంటే....." వెర్రి పట్టినట్టు  చూశాడు సోమయాజి.
    'ఆంగ్లో ఇండియన్, నాన్నా! మన మతమే కాదు."
    "పద్మా!' ఆవేశంగా కేక పెట్టాడు సోమయాజి. తీక్షణంగా చూశాడు కూతురి కేసి. ఎంత తమాయించుకోవాలన్నా ఆ తండ్రి వశం కాలేదు. "నీకేమైనా మతి పోయిందా , పద్మా? సాటి కులం కాదు. గోత్రం కాదు. జాతి కాదు నీతి కాదు. మతాన్నే, ధర్మాన్నే మార్చేసుకుంటావా? రీతి రివాజు లేని తెల్లవాణ్ణి కట్టుకుంటావా? హిందూమతం గొడ్డు పోయిందనుకున్నావా?
    "బ్రాహ్మణ వంశం అంతరించిందనుకున్నావా? ఏమిటమ్మా ఈ ఘోరం? ఇంతటి పాపానికి నీ అంతరాత్మ ఎలా అంగీకరించిందమ్మా?" ఆవేదనతో తల్లడిల్లి పోయాడు సోమయాజి. పద్మజ నిశ్చలంగా నిలబడింది.
    "నాన్నా! నన్ను క్షమిస్తావన్న ధైర్యం తోనే మాట్లాడగలుగుతున్నాను. సర్వం తెలిసిన నీకు నేను చెప్పవలసిందేముంటుంది? మనిషికీ మనిషికీ తేడా ఏమిటి? మానవత్వానికి మత ప్రసక్తి ఉంటుందా , నాన్నా?"
    సోమయాజి ఉగ్రుడై చూశాడు. " ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. పశువుని కూడా ప్రాణ పదంగా పూజించుకునే మతం మనది. గోమాతని చంపి కడుపులు నింపుకునే మతం వాళ్ళది. మతానికీ, మానవత్వానికి సంబంధమే లేదంటున్నావా?"
    "కొంతవరకూ ఉన్నా అది మనిషి తప్పు కాదేమో, నాన్నా! మత నియమాలు కూడా దేశ కాల పరిస్థితులను బట్టి నిర్ణయించబడతాయి. మనం పశువుని పూజించినా వాళ్ళు భుజించినా అది జాతి మనుగడ కోసమే. చివరికి అన్ని మతాల ధ్యేయమూ ఒక్కటే."
    "ఎప్పుడూ కాదు. పవిత్ర బ్రాహ్మణ మతానికి ప్రపంచ చరిత్రలోనే ఒక ఉత్కృష్టత ఉంది."
    వింతగా చూసింది పద్మజ. తండ్రితో నోటి నుంచి అటువంటి మాటలు ఎన్నడూ విన్న గుర్తు లేదు. బ్రహ్మణ్యాన్ని తిరస్కరించకపోయినా అలా గొప్ప చేసి మాట్లాడలేదు. ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ నెమ్మదిగా అంది:
    "క్షమించు నాన్నా! నీతో వాదించే శక్తి నాకు లేదు. నువ్వు కోపం తెచ్చుకోకుండా ఉంటె నా ఉద్దేశ్యాలు చెప్తాను. నువ్వు ఎత్తి చెప్పిన మతాలు ఏనాడో అంతరించి పోయాయి. భగవద్వంశంగా అరాధించబడిన బ్రాహ్మణ వంశం ఈ నాడు నామమాత్రమై పోయింది. బ్రహ్మణ్యపు పవిత్రత చాలావరకు అంతరించి పోయింది. శ్రోత్రియ కుటుంబాలలో పుట్టి పెరిగిన బ్రహ్మణు లే మధ్యమాంసాలు అనాచారాలకూ దాసులై పోయారన్న సంగతి అందరికీ తెలిసిన నిజం. ఈనాడు బ్రాహ్మణకులంలో మాత్రమే ఏదో పవిత్రత మిగిలి వుండి పోయిందనుకుంటే అది మన ఆత్మవంచనే, నాన్నా!"
    "అందుకని నాశనమైపొయే పవిత్రతని పునరుద్దరించటానికి పూనుకోకపోగా ఇంకా నాశనం కావటానికి నీ శాయశక్తులా దోహదం చేస్తానంటావా?"
    అసహనంగా నిట్టూర్చాడు సోమయాజి. "అది కూడా నీ ఇష్టమేనమ్మా! కాని ఈ యింటి ఆడబిడ్డ హోదా ని ఆశించి మాత్రం రాకు."
    "సంతోషం , నాన్నా! సంతోషం! ఇదే ఆఖరి చూపు కావచ్చు. జన్మజన్మలకూ నీ కడుపునే ఆడపిల్లనై పుట్టాలని కోరుకుంటున్నాను. కన్న బిడ్డగా తల్లితండ్రుల పట్ల నా బాధ్యతలు నేను నేరవేర్చుకోవటం లేదు. ఆ పాప ఫలితాన్ని కూడా సంతోషంగానే భరిస్తాను. నిన్ను సంతోష పెట్టలేని కూతురు ఉండేదన్న సంగతి మాత్రం మరిచి పోకు, నాన్నా!"
    "అమ్మా!" సోమయాజి కూతుర్ని గాడంగా గుండెలకు హత్తుకున్నాడు. తండ్రి కన్నీరు కూతురు శిరస్సు మీద అక్షింతలుగా రాలిపడింది.
    పద్మజ చకచకా మెట్లు దిగి కిందికి వచ్చింది.
    ఇంట్లో భోజన వ్యవహారాలన్నీ సర్వ సామాన్యం గానే జరిగాయి. భోజనాల దగ్గరే సోమయాజి భార్యతో చెప్పాడు; "పద్మకి ఇంట్లో సెలవు పెట్టటానికి వీలు కాదట. వీలు చూసుకుని ఉత్తరం వ్రాస్తానంటోంది. సాయంత్రం మెయిల్ కి వెళ్తోంది."
    కామేశ్వరమ్మ ఆశ్చర్యపడింది. "అదేమిటి? రేపో మాపో పెళ్ళి వారోస్తోంటే...."
    "ఓ నెల్లాళ్ళు ఆగమంటే వాళ్ళే అగుతరులే. కాముడూ! ఏం చేస్తాం? ఉద్యోగం అన్నాక మన ఇష్టాల ప్రకారం ఏమీ జరగదు. ఏది సంభవించినా తట్టుకోవాలి."
    "ఇదేం వేదాంతమండీ! వెధవ ఉద్యోగం లేకపోతె మానె! నిక్షేపం లా అది పెళ్ళాడి కాపరం చేసుకుంటే చాలదూ?"
    "కంగారు పడకు. ఎప్పుడేది జరగాలో అప్పుడే జరుగుతుంది. ఏమీ మన చేతుల్లో లేదు."
    కామేశ్వరమ్మ కళ్ళ నీళ్ళు ఒత్తుకొంటూ అంది: "మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఇంతే. ఎప్పటి కప్పుడు నన్నిలా ఏడిపిస్తున్నారు."
    సోమయాజి మరేమీ మాట్లాడకుండా లేచాడు.
    పద్మజ జట్కా ఎక్కేముందు ఒక నిమిషం నిలబడి తల్లి కేసి చూసింది. తల పైకెత్తి మేడ కేసి చూసింది.
    "తొందరగా వస్తావు కదుటే?"
    "వస్తానమ్మా! నీకు బాగా కోపం వస్తే రానిస్తావో లేదో!"
    "చాల్లే! వెర్రి వాగుడూ నువ్వునూ. వెళ్ళిరా! రైలు దాటి పోయెను."
    జట్కా దూరంగా, దూరంగా సాగిపోయింది.
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS