Previous Page Next Page 
స్త్రీ పేజి 25

 

    రైలు వేగం లాగ పద్మజ దుఃఖం పొంగి వచ్చింది. తన కోరిక ఇంత క్లిష్ట సమస్య అవుతుందని అనుకోనేలేదు. తండ్రి తనను అర్ధం చేసుకుంటాడనీ , తప్పక క్షమించి ఆదరిస్తాడనీ.... ఊహూ! దీర్ఘంగా నిట్టూర్చింది పద్మజ.

 

                                 
    తనను గాడంగా అదుముకుని కన్నీళ్ళు కార్చిన తండ్రి, వెర్రి పట్టినట్టు తన మొహంలోకి ఆందోళనగా చూసిన తండ్రి, తన కోరిక వింటూనే బాధతో తల్లడిల్లిపోయిన తండ్రి , తన సుఖ శాంతులు కోరి పగిలే హృదయంతో సాగనంపిన తండ్రి-- అంత పుణ్యమూర్తి కోసం తనేం చేసింది? ఏం చెయ్యగలిగింది? అసలు చెయ్యటాని కేం ప్రయత్నించింది? ప్రయత్నిస్తే సాధ్యం కాదా? జార్జి ని వదులుకోలేదా? అదిరి పడింది పద్మజ.
    తనను అపురూపంగా పెంచుకున్న తండ్రి కోసం, తండ్రి ముఖం మీద హటాత్తుగా మాయమైపోయిన చిరునవ్వు కోసం తండ్రి కన్నుల్లో హరించుకు పోయిన కళాకాంతుల కోసం శాశ్వతంగా జార్జిని వదులుకోలేదా?
    ఆ నీలి రంగు కళ్ళూ, తేనే రంగు జుత్తూ పసుపు రంగు దేహం, వింతగా చిందులాడే చిరునవ్వూ-- ఆ జార్జి ఎవరో కాదు, తన ప్రాణంలో ప్రాణం! హృదయం లో హృదయం! అంత తేలికగా దూరం చేసుకోగలదా?
    ఒక్కసారి జార్జి ఒడిలో ఒరిగిపోయి, జార్జి చేతుల్లో మొహం దాచుకుని తనివి తీరా ఏడవాలనిపించింది. ఆ బలిష్టమైన హస్తాలలో తప్ప తనకు మరెక్కడా ఓదార్పు లభించదు; శాంతి దొరకదు.
    వెనక్కు పారిపోతున్న చెట్లను చూస్తూ కిటికీ దగ్గరే కూర్చుంది పద్మజ. పరిగెడుతుంది మనస్సు గతం లోకి. జార్జి స్నేహం లోకి గతం లోకి.....
    
                             *    *    *    *
    ఆరోజు -- అసిస్టెంట్ మిస్టర్ జనార్ధన్, సర్జికల్ ఓ.పి.కి వచ్చిన కేసుల్లో సత్యవతి కేసును డయాగనైజ్ చేసే నిమిత్తం పద్మజకు అప్పగించాడు. సీనియర్ అబ్బాయి జార్జి విలియమ్స్ కు పద్మజ ను అటాచ్ చేశాడు.
    పద్మజ హాస్పిటల్ కు వచ్చేసరికే కొంచెం ఆలస్యమైంది. గత రాత్రి శరత్ నవలేదో చదువుకుంటూ చాలాసేపు కూర్చుండి పోవటం తో ఉదయం తొమ్మిది వరకూ నిద్రపోతూనే ఉంది. రూమ్ మేట్ బలవంతంగా లేవదీసి కూర్చో పెడితే నిద్రమత్తు లోనే బాత్ రూమ్ కు పరిగెత్తింది. స్నానం, కాఫీ వగైరాలు ముగించి హడావుడి గా వచ్చి తన కేస్ నోట్ చేసుకుని రూమ్ లోకి వెళ్ళింది.
    రోగిని ఏవో ప్రశ్నలడుగుతున్న జార్జి , పద్మజ కేసి కాస్సేపు చూసి తిరిగి తన కార్యక్రమం నిర్వర్తించబోయాడు. "ఎన్నాళ్ళ నుంచీ ఇలా ఉంటున్న దన్నారు?' అడిగిన ప్రశ్నే తిరిగి అడిగాడు మరోసారి. ఆ రోగి -- సత్యవతి -- బెదురుగా అతని కేసి చూసింది. ఆ పిల్ల బొత్తిగా అమాయకంగా కన్పిస్తుంది. ఏమంత చదువు కున్నది కాకపోవచ్చు. నున్నగా దువ్వి గట్టిగా అల్లుకున్న జడ చివర ఎర్రటి ఊలు ముక్క కట్టుకుంది. చీర కుచ్చెళ్ళన్నీ చిందరవందరగా దోపుకుని భుజం కూడా దిగినంత పొట్టిగా పైట వేసుకొంది. కాళ్ళకు పాంజేబులు, ముక్కు బెసరీ పల్లె తత్వాన్ని ప్రకటింపజేస్తున్నాయి. మొహం బాగా దిగాలు పడ్డట్టు కన్పిస్తుంది. జార్జి సత్యవతి జబ్బు లక్షణాలేవో గంబీరంగా అడుగుతుంటే నోట్స్ టేబిల్ మీద పెట్టి వింటూ కూర్చుంది పద్మజ.
    "మూడు నాలుగు నెలల నుంచీ అలాగే ఉంటున్న దన్నమాట. జ్వరం ఏమైనా వస్తున్నదా?"
    "ఆ. ఒళ్ళు ఎచ్చగా ఉంటానే ఉంది."
    "భోజనం ....శుభ్రంగా జీర్ణమవుతున్నదా?"
    "ఊహూ! సరిగా అరగటం లేదు. ఒక్కోసారి కక్కులు కూడా....."
    "ఓ! వాంతులు కూడా ఉంటున్నాయన్న మాట?" మాట్లాడలేదా పిల్ల.
    "ఏమీ భయపడకుండా అడిగినవన్నీ చెప్పాలమ్మా! కడుపు లో నొప్పి గానీ, బాధ గానీ ఉండునా?"
    జార్జి ఎంత తడబడకుండా తెలుగు మాట్లాడినా ఒక రకమైన యాస లేకపోలేదు. నవ్వే కళ్ళతో చూస్తూ కూర్చునే ఉంది పద్మజ.
    "కాసింత నెప్పి అప్పుడప్పుడూ....." తను చెప్పేది నిజమో, కాదో తనకే సరిగ్గా తెలియనట్టు అనుమానంగా అంది సత్యవతి.
    "ఒక్కసారి లేచి అలా బెంచీ మీద పడుకోవాలి. నేను కడుపు చూస్తాను."
    దూరంగా కూర్చున్న పద్మజ కేసి నిస్సహాయంగా చూసి బెదురుతూ బల్ల ఎక్కి పక్కకు తిరిగి పడుకుందా పిల్ల.
    "కడుపు మీద కొంచెం బట్ట వదులు చేసుకుంటే...."
    అలాగే చీర కట్టు వదులు చేసుకుంది సత్యవతి. జార్జి పద్మజ కేసి చూస్తూనే  సత్యవతి దగ్గరికి నడిచాడు. చేతి వేళ్ళతో మృదువుగా పొట్ట అక్కడక్కడా నొక్కుతూ కళ్ళెత్తి పైకి చూస్తూ ఆలోచించాడు. మరి కాస్సేపు అమాయకంగా కన్పిస్తున్న సత్యవతి మొహం లోకి చూశాడు దీర్ఘంగా. గబగబా కాగితం మీద ఏదో నోట్ చేసుకున్నాడు.
    సత్యవతి లేచి కూర్చుంది.
    జార్జి పద్మజ దగ్గరగా రెండడుగులు నడిచి, "మిస్ పద్మజా! నేను ఫినిష్ చేశాను. మీరు టేకప్ చేస్తారా?" అన్నాడు.
    "ఎస్. థాంక్స్" అంటూ లేచింది పద్మజ.
    జార్జి మౌనంగా వరండా లోకి నడిచాడు.
    సత్యవతి తల దించుకుని బల్ల మీదే కూర్చుని ఉంది. పేరు తనకు తెలిసినా ఆ పిల్లతో సంభాషణకు ఉపక్రమించటానికి అడిగింది పద్మజ దగ్గరికి వెళ్తూ: "నీ పేరేమిటమ్మా?" తలెత్తి పద్మజ కేసి చూస్తూ వినయంగా అంది సత్యవతి:
    "సత్తేవతంటారండీ!"
    "బావుంది. నువ్వేమైనా చదువుకున్నావా?" సిగ్గుపడింది సత్యవతి. "మూడో తరాగతి చదివానండి."
    "అసలు నీ ఒంట్లో జబ్బేమిటి? ఆరోగ్యం సరిగా లేదనుకుంటున్నావా?" సత్యవతి మొహం లోకి నిశితంగా చూసింది. ఆ పిల్ల కళ్ళలో విపరీతమైన భయమూ, ఆందోళనా తారటాడుతున్నాయి. అంతవరకూ కూడదీసుకున్న ధైర్యం కాస్తా సన్నగిల్లినట్లై పోయింది. మధ్య మధ్య కళ్ళలో నీటి పొర కూడా కాన వస్తుంది. పద్మజ కేసి సూటిగా చూడకుండానే చెప్పింది. "ఒంట్లో బాగా ఉండటం లేదు. తలనొప్పి, ఇకారం, చంపేస్తున్నాయి. నిస్సత్తువగా ఉండి అస్తమానూ నిద్ర ముంచుకోస్తంది"అంటూ ఏకరువు పెట్టింది.
    "జ్వరం కూడా వస్తోందన్నావు కదూ?"
    "ఊ"
    "తిన్నది అరక్కుండా వాంతులవుతున్నాయి కదూ?"
    "ఊ!"
    "ఊ, కాదు, సరిగ్గా చెప్పాలి. అసలు తిండి తినబుద్ది వేస్తోందా?"
    "తింటానే వున్నాగా కాసింత?"
    పద్మజ మృదువుగా చూస్తూ అంది: "నే నడిగినదానికి నువ్వు నిజమైన జవాబులు చెప్పాలి తెలుసా?"
    అలాగే అన్నట్టు తల తాటించిందా పిల్ల.
    "చూడు. నువ్వు ప్రతి నెలా బహిష్టవుతున్నావా?"
    అదిరిపడింది సత్యవతి. అదోరకంగా పద్మజ కేసి చూస్తూ కోపంగానే అంది: "ఆ ముక్క కూడా అడగాల్నా?"
    "మరి అడక్కపోతే జబ్బెలా తెలుస్తుంది?"
    "కడుపు నొప్పి పోటానికి కాసింత మందేదో ఇవ్వరాదూ?"
    "అలా ఇవ్వకూడదు. జబ్బేమిటో ఖచ్చితంగా మాకు తెలియాలి."
    "ఇందాక ఆ బాబు అడగనే లేదుగా ఈ ముక్క?"
    "అయితే నీ జబ్బు దాచి పెట్టుకోవాలనే ఇంత దూరం వచ్చావా? మేము మరో మందు యిస్తే నీ జబ్బుకి పనికి వస్తుందా? ఈ ముక్క అడగటం ఆ బాబు మరిచి పోయి వుంటారులే . పోనీ, నాతొ చెప్పు. బహిష్టు అవ్వటం లేదు కదూ?"
    "నాకు ముట్టేప్పుడూ సరిగ్గా రానేరావు. రెండు నెల్లకో మూడు నెల్లకో అవుతావుంటాను."
    "అలాగే ఇదీ అంటావా? పోనీ, ఇదివరకేప్పుడూ ఇలా వాంతులూ నీరసం ఉండేవి కావుగా? కడుపు లో నొప్పి వచ్చేది కాదుగా?"
    మాట్లాడకుండానే సత్యవతి కళ్ళలో నీళ్ళు తిరగటం పద్మజ కని పెట్టకపోలేదు. చటుక్కున ఒత్తేసుకుందా పిల్ల.
    "ఒక్కసారి పడుకో. కడుపు చూస్తాను."
    పొత్తి కడుపు బాగా నొక్కి చూస్తూ శరీరం మీద అస్పష్టంగా కన్పిస్తున్న తెల్లటి గీతల్ని గుర్తించింది పద్మజ.
    "కడుపు మీద దురదగా ఉంటుందా?"
    "ఊహూ!"
    "అప్పుడప్పుడూ గోకుతూ ఉంటావు కదూ?"
    "ఊహూ!" సత్యవతి అబద్ద మాడుతుందన్న అనుమానం మరీ బలపడింది పద్మజ లో.
    బెదురుతూ లేచి కూర్చుంది సత్యవతి.
    జార్జి ఫైండింగ్సూ, పద్మజ ఫైండింగ్సూ బొత్తిగా వేరయ్యాయి. ఆ యిద్దరి డయాగ్నాసిస్ కూ ఎక్కడా సంబంధం లేకుండా పోయింది. సత్యవతికి ఫైబ్రాయిడ్ ట్యూమర్ గా డయాగనైజ్ చేశాడు జార్జి.
    ఆ పిల్ల గర్భం ధరించినట్టు అనుమానిస్తుంది పద్మజ. అసిస్టెంట్ జనార్ధన్ పద్మజ అనుమానాన్ని కొంతవరకూ సమర్చించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS