Previous Page Next Page 
స్త్రీ పేజి 23

 

    "బావుంది. బావుంది. ఇంకేం కావాలి? ముహూర్తాల పట్టించేయ్యలేకపోయారూ?ఆలస్యం దేనికి?"
    "ఎంతైనా ఈ కాలంలో పెళ్ళి చూపులూ అవీ జరగాలా? ఇటు మన పిల్లా, ఆ పిల్లవాడూ ఇద్దరూ బాగా చదువుకున్నవాళ్లేను. ఒకళ్ళ వోకళ్ళు చూసుకుని ఏమనుకుంటారో ఏమో? ఆలోచించాలిగా మరి?"
    "మీ ఆలోచనలతోనే తెల్లవారేలా ఉంది నా బ్రతుకు. దానికి ఉత్తరం వ్రాసి పడేసి వాళ్ళని పెళ్ళి చూపులకి రమ్మన రాదూ? ఆలస్యం అమృతం విషం అంటారు. ఇంకా ఎందుకా నసుగుడూ?"
    "మనం అంత కంగారు పడకూడదే! వియ్యాల వారికి చులకనై పోతాం. ఎలాగూ ఈ వేసంగుల్లో పెళ్ళి తప్పదు. నువ్విక బెంగ పెట్టుకోకు. ఉపవాసం చాలు గాని వెళ్ళి భోజనం చేసిరా!"
    కామేశ్వరమ్మకు సంతోషంతోనే కడుపు నిండిపోయింది. అల్లుడూ, కూతురూ ఇంట తిరుగుతారనుకుంటే తిండి నీళ్ళూ వద్దనిపించింది.
    ఓ నెల్లాళ్ళకు మగ పెళ్ళి వారి నుంచి ఖాయంగా కబురు అందింది-- పెళ్లి చూపులు చూడటానికి సిద్దంగా ఉన్నట్టూ. ఎప్పుడు రమ్మంటే అప్పుడు బయల్దేరి వచ్చేట్టూ.
    వెంటనే ఈశ్వర సోమయాజి కూతురు పేర ఉత్తరం వ్రాశాడు -- "నీతో అత్యవసరంగా మాట్లాడే పని ఉందమ్మా. ఓ వారం రోజులు సెలవు పెట్టి వస్తే బావుంటుంది." అంటూ.
    ఉత్తరం అందుకున్న మర్నాడే బయల్దేరి వచ్చింది పద్మజ.
    పద్మజను  చూస్తుంటేనే కామేశ్వరమ్మకు కడుపు నిండి పోతుంది. ఇంత అందాల రాశిని తనేనా కన్నది? అన్న అనుమానం రేగింది. పాతిక సంవత్సరాల పద్మజ లో యుగయుగాల తాలూకు స్త్రీత్వం తొణికిసలాడుతుంది. డాక్టర్ గా అనుభవం గడించుకుంటున్న ఆమె కన్నులు అపారమైన విజ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటాయి. పద్మజ నడిచినా, నవ్వినా ఒకే హుందా! అది రాజ్యాలు పాలించే మహారాణీది కావచ్చు. లోకాన్ని శాసించే అధికారిణిది కావచ్చు. వారి తాలుకూ నిరంకుశత్వం లేకుండానే ఆ ఠీవి పద్మజ పరంగా  కన్పిస్తుంటుంది.
    ఇంటికి వచ్చిన కొన్ని గంటలలోనే తన రాకకు కారణం తెలుసుకోగలిగింది పద్మజ, వదిన గారి హాస్యాలతో.
    "ఇంకెన్నాళ్ళు లే ఈ బడాయి? ఆ ముడి కాస్తా పడ్డాక అమ్మాయి దర్జా నేను చూడనూ?" అంటూ నవ్వుతూ వెనగ్గా వచ్చింది జానకి, పద్మజ అద్దం  ముందు నిలబడి జడ అల్లుకొంటుంటే .
    ఒక్క క్షణం వదిన గారి మొహంలోకి చూసింది. పెదవి ని మునిపళ్ళ మధ్య నొక్కుకుంటూ తల అద్దం కేసి తిప్పుకుంది పద్మజ. "డాక్టరమ్మ కి కూడా పెళ్ళి మాట చెప్పేసరికి సిగ్గు వేస్తోందే!" అంది జానకి రెట్టిస్తూ.
    కోడలి మాటలు వింటూ ముసిముసిగా నవ్వుకుంటూన్న కామేశ్వరమ్మ కలగాజేసుకుంటూ అంది:
    "డాక్టరైతే మాత్రం అది ఆడది కాదామిటి? ఎన్ని చదువులు చదివినా ఆడపిల్ల ఆడపిల్లే. సిగ్గూ, లజ్జా ఎక్కడికి పోతాయి?"
    పద్మజ ఎవరి మాటలూ పట్టించుకోనట్టే పొడుగ్గా తిలకం దిద్దుకుంటూ కూర్చుంది అద్దం లోకి చూస్తూ.
    "ఇక జవాబు చెప్పదత్తయ్యా! మీ అమ్మాయి ఇప్పుడే పెళ్ళి కూతురైపోయింది." జానకి నిట్టుర్పు విడిచింది.
    'అక్కయ్యా, నిన్నోకసారి నాన్న రమ్మంటున్నారు" మెట్లు దిగి వచ్చింది సుజా.
    చటుక్కున చెల్లెలి కేసి చూస్తూ, "పైనే ఉన్నారా? అన్నయ్య కూడా ఉన్నాడా?" అంది పద్మజ.
    "అన్నయ్య పొద్దుటే బయటికి వెళ్ళాడుగా? నాన్న ఒక్కరే ఉన్నారు."
    భుజాల మీదుగా వెళ్ళాడుతున్న వాలు జడను వెనక్కు విసురుకుని స్టూలు జరుపుకుని అద్దం ముందు నుంచి లేచి మెట్ల వేపుకి నడిచింది పద్మజ. చివరి మెట్టు వరకూ వెళ్ళి ఒక్క నిమిషం నిలబడి పోయింది. అప్రయత్నంగా కిటికీ లోంచి బయటికి చూస్తె సుదూరంగా పరిగెడుతున్న రైలు పట్టాలు కంట పడ్డాయి. చూపు మరల్చు కుని జోళ్ళు గది ముందు విడిచి ఎప్పటి చిరునవ్వుతో లోపలికి అడుగు పెట్టింది.
    కూతురి రాకకోసమే నిరీక్షిస్తున్న సోమయాజి కాలక్షేపానికి తిరగవేస్తున్న పేపరు టేబిల్ మీద పడేస్తూ "రా, అమ్మా! కూర్చో!" అంటూ ఫేము కుర్చీ తన దగ్గరికి జరుపుకున్నాడు. "అమ్మ ఏం చేస్తోంది కింద?"
    "వంట చేస్తొందనుకుంటాను, నాన్నా!" పద్మజ టేబిల్ కి నుకుని నిలబడింది.
    "వదిన చూసుకోగలదుగా? ఒక్కసారి అమ్మను....."
    నవ్వుతూనే అంది పద్మజ: "వదిన మడిలో లేదుగా.?"
    "ఊ బాగానే ఉంది....పోనీలే , అయితే...."
    తండ్రి ముఖ కవళికలు నిశితంగా పరిశీలిస్తూ అంది పద్మజ: "అయినా ఇప్పుడు అమ్మతో ఏం పని?"
    "అబ్బే! పెద్ద పనేమీ లేదు. అయితే నీకు.... అదే....అదే.....ఏదేనా కబురు చెప్పిందా అమ్మ?"
    "కబురా? నాకా? ఊహూ! లేదే!"
    "నేనే చెప్తానని ఊరుకుందేమోలె. అబ్బే! ఇంతకీ ఏమీ లేదమ్మా! నీ ఉద్దేశ్యాలు కూడా కనుక్కుని ఏ విషయం నిర్ణయించేసుకుందామని. మగ పెళ్ళి వాళ్ళు నిన్ను చూడటానికి కూడా వస్తామంటూన్నారు."
    పద్మజ మౌనంతో సోమయాజి నిస్సంకోచంగా విషయమంతా విప్పి చెప్పసాగాడు. "అబ్బాయి పేరు సీతారామశర్మ అనుకుంటాను. సరిగ్గా గుర్తు లేదులే. ఎమ్. ఎ. ఎల్. ఎల్. బి. చదివాడు. మంచి ప్రాక్టీసు ఉంది. నేను స్వయంగా చూశాను. అందంగా ఉంటాడు. అవయవ సౌష్టవం కలవాడూనూ. నీకు ఇష్టమైతే.....,మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాననుకో."
    పద్మజ మౌనంగానే నిలబడింది. అంతలో కూతురు మాట్లాడనే అవసరం లేదనీ, తను చెప్పవలసింది చాలా ఉందనీ, మౌనంగా వింటే చాలనీ అనుకున్న సోమయాజి మళ్ళా చెప్పసాగాడు: "మీ అమ్మ రెండు మూడేళ్ళ నుంచీ నా ప్రాణాలు తీసేస్తోంది, నీకు పెళ్ళి చెయ్యమని. అమ్మ ఎంత తొందర పడ్డా నేను నిదానంగానే ఆలోచించానమ్మా! ఈ కాలంలో పెళ్ళి కుదర్చటం అంటే అంత తేలికా? అందులోనూ నీకు? అందుకే ఇన్నాళ్ళు ఓపిగ్గా సంబంధాలు చూసి.... అబ్బాయిని చూసి నువ్వు కూడా ఇష్టపడిన తర్వాతనే అనుకో. అదీ సంగతి. మానవ జన్మ ఎత్తాక కల్యాణం తప్పదు కదమ్మా? స్త్రీకి పురుషుడూ, పురుషుడికి స్త్రీ అండదండలుగా ఉండి తీరాలిగా? నీకు తెలియనిదేముంది? వాళ్ళని రమ్మని ఇవాలే వైర్ ఇద్దామనుకుంటున్నాను. అలా చెయ్యమంటావా , అమ్మా?"
    కూతురి మొహంలోకి చూడబోయిన సోమయాజి కి కించిత్తు విస్మయం కలిగింది. పద్మజ ఎన్నడూ లేని విధంగా తలదించుకు నిలబడింది. ఏదో చెప్పాలనుకుని చెప్పలేని నిస్సహాయత ఆ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది.
    "అమ్మా! పద్మా!' అప్రయత్నంగా పిలిచాడు తండ్రి. పద్మ తలఎత్తి చూసింది. ఎప్పటి ధైర్యం లోనే ఏదో దైన్యం కూడా మిళితమైనట్టు కనిపించింది. ఒక్క క్షణం తండ్రి కళ్ళలోకి చూసింది.
    "నీకేమైనా చెప్పాలని ఉందా, అమ్మా?" కుర్చీలోంచి లేచాడు సోమయాజి. "నా దగ్గర సంశయిస్తున్నావా , తల్లీ? ఈ ఇంట్లో నీకు అయిష్టంగా ఏదైనా జరిగిందా? నీకేం కావలసినా అడిగావు. ఏం చెప్పాలన్నా చెప్పావు. ఎప్పుడైనా కాదన్నానా? చెప్పమ్మా! మనస్సులో బాధ పెట్టుకోవద్దు. అలా అయితే నేనేమీ చెయ్యలేను."
    "నాన్నా!"
    "చెప్పమ్మా, పద్మా! నీకు ఇష్టం లేకపోతె ఏ పనీ చెయ్యను. వివాహం అనేది సర్వ సామాన్యమైన విషయం కాదు. నీ విషయంలో నేను మూర్ఖంగా ఎన్నడూ ప్రవర్తించను. కాని, అమ్మా నామీద నీకు నమ్మకం ఉంటె కొంచెం ఆలోచించు. ఈ సంబంధం అన్ని యోగ్యతలూ చూసే నిర్ణయించాను."
    "క్షమించి , నాన్నా! నిన్ను ఎన్నడూ శంకించలేను."
    "అవునమ్మా! ఆ నమ్మకం నాకుంది. అందుకే ఈమాత్రం సాహసించి వరుణ్ణి వెదకటానికి ప్రయత్నించాను."
    పద్మజ రండ్రి మొహంలోకి చూస్తూ అంది: "వాళ్ళతో మన విషయం సంప్రాదించటానికి ముందే మాట మాత్రమైనా నాకు -- వ్రాయవలసినది నాన్నా!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS