సూర్యం కళ్ళల్లో ఆవేశం తో నీరు కారసాగింది. ఓ క్షణం లత మాటాడలేదు. వర్షం యిది వరలా జోరుగా కురవటం లేదు. మెల్ల మెల్లగా అక్కడక్కడ చినుకులు రాలుతున్నాయ్. ఆకాశం యింకా మేఘాల మయమైంది. సెలయేరు వడి తగ్గింది.
తిరిగి చూసేసరికి వరండాలో దీపం ఆర్పేసి వుంది. చీకటి గాడాంధకారమైంది. సూర్యం కుర్చీ మీద కూలబడి రెండు చేతులతో ముఖం కప్పుకుని లోలోపల ఎడ్చుకోసాగాడు.
* * * *
వేకువఝామునే తెలివి వచ్చింది. కానీ అలా చీకట్లో నే మంచం మీద పడుకునే ఆలోచించు కోసాగాడు. ప్రక్క గదిలోనే గీత కూడ బహుశః తనలా ఆలోచిస్తూ కూర్చుని వుంటుంది. ఎత్తయిన పశ్చిమ కనుమలను దాటి దక్కను పీఠ భూమి . ఆ గుట్టల సమూహాల మధ్య నించి పారే జీవనదులు, తూర్పున సముద్రపు టంచులలో బంగారం పండించే భూమి. అక్కడక్కడా చెదరిన తూరుపు కనుమల మధ్యలో తన వూరేక్కడ వుంది? ఆ వూరికి వెళ్ళే త్రోవ , ఆ త్రోవలో చెట్లు చేమలు, తోటలు ఆ నది పైన మూడు ఫర్లాంగు ల వంతెన , యెండలో , వెన్నెల్లో తెల్లగా జిగ జిగలుగా మెరిసే ఆ వంతెన దాటి, గట్టు మీద నించి వెయ్యి గజాలు నడిస్తే యేటి ఒడ్డునే తన యిల్లు. ఎక్కడి వాడెక్కడకు వచ్చాడు? ఇక్కడ యీ అనుబంధాలు సంబంధాలేమిటి? తన గ్రామం తలుచు కోగానే ఒళ్లు పులకరించింది. తన తండ్రి, తల్లీ, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు -- వాళ్ళ అభిమానాలు , ఆ అభిమానం యిచ్చిన బాధ్యతలు, ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నానన్న తృప్తి -- ఇవన్నీ చొచ్చుకుని పోయి -- ఈ బాధ్యతలను వీడలేక విశాలనే తృనీకరించినప్పుడు గీతను కాదానటం అంత కష్టం కాదనుకున్నాడు.
తన దొడ్లో తను పెంచగా పెరిగి అందమైన పూలను తొడిగిన మొక్క విశాల, ఎదుటి వాళ్ళ దొడ్లో చూసిన చక్కని వూవు గీత. తనకు నచ్చినట్లు చదువు చెప్పి మొగ్గలు తొడిగే సమయంలోనే విశాల హృదయ స్పందనను వినాగలిగే అదృష్టం కలిగింది తనకు. విశాల మీద నున్న అభిమానం గీత మీద ఎందుకుంటుంది? ఆకారాలు వేరైనా యిద్దరిలో కొన్ని సామాన్య గుణాలున్నాయ్. అవే బహుశః గీత దగ్గరగా చేరగలిగేటట్లు చేసేవి.
ఇక, యీ చెలగాటం ఆపుచేసి తీరాలని భీష్మించుకున్నాడు. తను అణుచుకోలేని కోర్కెలను చూపుల ద్వారా వ్యక్తపరిస్తే అర్ధాలు చేసుకుని యెగిరి వచ్చే సీతాకోక చిలకలను ఆదరించే స్థితిలో లేడు. వాటిని పట్టుకునే ధైర్యం లేదు. వాటి బదులు తనే గొంగళి పురుగుగా మారిపోతున్నాడు. ఇలా తన గురించి యెన్నెన్నో అనుకున్నాడు. యెన్ని విదాలనో తలచు కున్నాడు.
బాగా తెల్లవారింది. లేచి పళ్ళు తోముకుని స్నానం చేసినా గది నించి బయటకు రాలేదు. ఎందుకో ముఖం బయటకు చూపించడానికి సిగ్గు వేస్తోంది. సూర్యోదయ మైనా చేత పుస్తకం పట్టుకుని గదిలోనే కూర్చున్నాడు. పేజీలు తిరగవేస్తూ చదువు తున్నా మొదడు లోనికి యేది ప్రయాణం చెయ్యలేదు. ఇంతలో లత వచ్చి --
'ఈవేళ యేమిటి యింత బుద్దిగా కూర్చున్నావ్? ఆకలి లేదా ?'
సూర్యం లేచిపోయాడు.
'ఈ వేళ మీ యిడ్లీ చేసాను. ఎలా గుందో చెప్పు.'
"యిడ్లీ అంద్రులది కాదు అరవలది.'
'అయితే మీడేది?'
'మాది ఘాటు పెసరట్టు.'
'అదెలా చెయ్యటమో చెప్పు. నేను నేర్చు కున్నట్లుంటుంది. నీకు తృప్తిగా వుంటుంది.'
డైనింగు టేబిల్ మీద కూర్చున్నాడే గానీ గీత వుందేమోనని నాలుగు దొంగ చూపులు విసరాడు. ఆమె వుదయమే వెళ్ళిపోయి నట్లుంది. లత ముఖంలో ఏవగింపు లేకపోవటం సూర్యం మనసు కాస్త కుదుట పడింది. ఆమె యెప్పటి లానే తనతో చనువుగా మెలగటం చూసి సంతోషించాడు. వాళ్ళు వెళ్ళిపోయే రోజు దగ్గరపడింది.మాటుంగా వెళ్లి దక్షణాది పట్టుచీర లేత నీలి రంగుది భాభీ కోసం తీసుకున్నాడు. పిల్లలకు దాదర్ లో రెడీమేడ్ దుస్తులు , అట వస్తువులు కొనుక్కుని వచ్చాడు.
'ఇవన్నీ యెందుకు? చాలా డబ్బు ఖర్చు పెట్టావే?' అంది. మెహతా కూడా నొచ్చుకున్నాడు.
'కొనే హక్కు లేదా వదినా?' అంటే ఆమె సమాధానం చిన్న నవ్వుతో యిచ్చింది. ఒక పూట పిల్లలతో సహా మేటినీ సినిమాకి వెళ్లారు. సినీమా అయ్యాక యింటికి పోదామంటే 'ఇంకేం యీ రాత్రికి వండుతావ్ వదినా? హోటలో తిని పోదాం' అన్నాడు. చౌపాతీ లో ఒక గుజరాతీ హోటల్లో భోజనానికి ఐదు రూపాయలు చొప్పున తనే యిచ్చాడు.
ఇలా కొంతైనా ఖర్చు పెట్టినందుకు తృప్తిగా వుంది. తనకు యింకో ఆఫీసరు ఒక గది యివ్వటానికి ఒప్పుకున్నాడు. అదీ మెహతాయే కలగజేసుకుని ఏర్పాటు చేసాడు. ఆవిడ యింట్లో భోజనం పెట్టడానికి ఒప్పుకోలేదట! ఆమె యింటి పనులే చేసుకోలేక పోతోందట. లోపాయి కారీగా సూర్యం విన్నదేమిటంటే 'డబ్బు పుచ్చుకొని తిండి పెట్టె సాంప్రదాయం కాదు మాది' అని గుసగుసలు వాళ్ళు ఆడుకున్నారట. ఈ మాటలు మెహతా చేవుల్లోనికి వెళ్లాయేమో నని సూర్యం భయపడ్డాడు. విధిలేక యీ క్రొత్త యింట్లో వుండటానికి ఒప్పుకున్నా యింకో యిల్లెక్కడో చూడాలన్న ఆతృత అప్పుడే కలిగింది. మెహతా యింట్లో డబ్బు యియ్య కుండా భోజనం చెయ్యమన్నా తను రెండు పూటల కంటే హెచ్చు తినలేడు! అయినా తను యిచ్చిన డబ్బు తో వాళ్ళెం గడించలేదే? పైగా వాళ్ళు తీసుకున్న డబ్బు కంటే హెచ్చే తన క్రింద ఖర్చు పెట్టి వుంటారు. మెహతా తన స్వంత అన్నయ్యే అయి వుంటే జీతం అంతా అతని చేతిలోనే పెట్టేవాడే!
నీళ్ళు వెళ్ళిపోయే ముందు యిలాంటి వాడు రావటం సూర్యం కు కష్టం అనిపించింది. ఇంకే వాదు రానందుకు ఒక విధంగా సంతోషించాడు. ఒక కోలనీ లో, ఒక సంఘం లో ఒక కుటుంబం లో నివసించటం నేర్చుకోవాలి. సభ్యతను పాటించ లేని మనుషులు సంఘం లో నివశించే హక్కును పోగొట్టు కుంటారు. ఒకరి నీతి యెదుటి వాళ్ళకు అవినీతి కావచ్చు. నీతి తమ సొత్తే అనుకుని యెదుటి వాళ్ళను గాయపరచటం అమానుషం. మనిషి ఎదుటి వాళ్ళ కష్టాలకు సానుభూతి చూపించటం లోనే తన నీతిని పరిరక్షించుకుంటాడు.
10
మోహతాలు వెళ్ళిపోయే రోజు వచ్చింది. స్టేషను కు వెళ్లాడు. లగేజ్ బుక్కింగ్ చేయించి బ్రేక్ వేవ్ లో వేయించే సరికి కొద్ది క్షణాలు మాత్రం మిగిలాయ్. తొందరగా కంపార్టు మెంటు దగ్గరకు వచ్చాడు. భాభీ లోన పిల్లలతో కూర్చుంది. ఆమె దగ్గర ఆమె చెల్లెళ్ళు, తల్లీ, తండ్రి అంతా కూర్చున్నారు. మోహతా ప్లాటు ఫారం మీద స్నేహితులతో మాట్లాడుతున్నాడు. సూర్యం రెండు బిస్కేట్ పాకెట్లు పిల్లలకు అందించ్చాడు. 'థాంక్యూ అంకుల్' అన్న పిల్లలను అతను బుగ్గ చూపించగానే ఒకరి తరవాత ఒకరు అతనికి ఒక బుగ్గ కే కాదు రెండు బుగ్గలకూ ముద్దు పెట్టేసారు.
భాభీ ఒకసారి తొంగి సిగ్నల్ వాలటం చూసింది. ముందు సూర్యం ముఖం దగ్గరగా వంగి,
'వస్తాను మరదీ. హోటలు భోజనం ఆరోగ్యం జాగ్రత్త. ఎప్పుడూ ఆలోచిస్తూ కూర్చోక.'
సూర్యం జవాబు చెప్పలేక పోయాడు.
'ఒకప్పుడు హోటల్లో తినలేక పొతే, ఎప్పుడైనా ఒంట్లో చికాకు గా వుంటే ....మా అమ్మతో చెప్పాను. వాళ్ళింటికి వెళ్లు. మరచి పోకేం.'
సూర్యం యీ అభిమానాన్ని మొయ్య లేక కళ్ళల్లో నీరు తెచ్చుకున్నాడు.
'కొన్ని నీకు నచ్చని పనులు చేసుంటా నెమో? ఇంకోలా అనుకోక.'
'నివ్వు అలా అనకు వదినా! నివ్వు దేవతవి!' రుమాలు తీసి కళ్ళు ఒత్తుకోగానే ఆమె కళ్ళూ నీటి మాయమై పోయాయ్. అప్పటికే తన స్వజనం కంపార్టు మెంటు దిగిపోయారు. వాళ్ల వేపు దృష్టి పోనివ్వకుండా వదిన తనతోటి మాట్లాడటం, తన చెల్లెలు విషయం ససేమిరా ఎత్తక పోవటం ఆమె సంస్కారాన్ని చాటి చెప్తున్నాయ్, ఇదే మనసులో నాటుకుని అలా ఖిన్నుడై నిల్చున్నాడు. రైలు కదిలింది.' మెహతా 'వస్తాను తమ్ముడూ' అంటూ రైలు యేక్కాడు. రైలు కదులుతుంటే భాభీ ఏడుస్తోంది. ఆ కన్నీరు చూడలేక పోయాడు. తనకు స్వంత వదిన లేదు. ఉంటె జన్మజన్మలకు ఇలాంటి వదినే కావాలను కున్నాడు. ఫ్లాట్ ఫారం ఖాళీ అయిపోయే వరకూ అలా దూరంగా కనిపిస్తున్న రైలు వేపు చూస్తూనే వున్నాడు. తరవాత పెద్ద నిట్టూర్పుతో తలదించుకుని గేటు వేపు నడవ సాగాడు. తన వెంటనే భాభీ తల్లి, తండ్రి వగైరా వస్తున్నారు. అతను పిల్చాడు. ఆగాడు. గీత వేపు చూడటానికి సూర్యం కు సిగ్గు వేసింది. ఆమె ముఖం ప్రక్కగా త్రిప్పినప్పుడు ఒకసారి చూసాడు. పాలి పోయి వుంది. ఆమెను ఒదార్చవలెనన్నంత ఆవేశం వచ్చింది. ఏమీ చెయ్యలేక పోయాడు. భాభీ తండ్రి నాలుగు కుశల ప్రశ్నలు వేసాడు. వాళ్ళ దగ్గర నించి శలవు తేసుకుని యింటికి వెళ్ళలేదు. చీకటి పడ్డ వరకు యెక్కడేక్కడకు తిరిగాడో తనకే గుర్తు లేదు. హోటల్లో భోజనం చేసి యింటికి చేరుకునేసరికి రాత్రి పది గంటలైంది.
