Previous Page Next Page 
నాలుగు మంచాలు పేజి 21


    'ఇలా వచ్చి యెప్పుడు అడుగుతారని యెదురు చూసాను. మీరు బి.ఎ కదూ. ప్యాసయ్యారు. మీ ఇంగ్లీషు పాండిత్యం వీటిలో యెందుకు చూపిస్తారు? మీరు రాసిన వుత్తరం చదివి అర్ధం చేసుకోవలసిన వాడు ఉత్తి తెలివి హీనుడని యెప్పుడూ మనసులో వుంచుకోండి. ఎంత తక్కువ పంక్తులతో, యెంత తేలిక భాష లో అంత యెక్కువ భావాన్ని యిరికించడానికి ప్రయత్నించండి. అవసరం లేని ఒక్క మాట, ఒక్క భావం యిరికించండి.'
    ఈ ఆదేశం మొదట నచ్చక పోయినా రానురాను అందలి బాగు తెలిసింది. ఆఫీసరు అంతటితో వూరుకోలేదు. తన శరీరం లో అంగాలలా మిగతా ఆఫీసర్ల ను చూపేవాడు. అతని శ్రద్ధ చూసి సూర్యం రాను రాను అతని నమ్మకస్తులలో ఒకనిగా గుర్తించబడేటట్లు దగ్గరగా జరిగాడు. ఒకసారి అయిదు రిమెండర్లు రాసినా ఒక ఆఫీసు నించి జవాబు లేదు. అది ఒకడికి రావలసిన డబ్బు సంబంధమైన కేసు. ఆఫీసరు పిలిచి  'ఐదో రిమైండర్ యెందుకు పంపించారు!' అని అడిగాడు.
    'ఇంకా డబ్బు రాలేదు.'
    'ఇది గుమస్తా తత్వం. మీరు ఆఫీసరు. మీ బుద్దిని వినియోగించాలి. ఆలోచించటం మీ విధి. గుడ్డిగా సంతకాలు పెట్టడం కాదు.'
    సూర్యం మనసు బాధించింది. ఐనా మౌనంగా యింకేం చెయ్యమంటారన్నట్లు నిల్చున్నాడు. అతను ధాటిగా "మీరే గాని ఆలోచిస్తే మిగతా రిమైండర్ల గతే దీనికి పట్తుందని తట్తుంది. యెదుటి వాళ్లు యే విషయమైనా తన స్వంత విషయంగా చూసుకుంటే గాని మీరు ఆఫీసరు అనిపించు కోలేరు. మీ స్వంత డబ్బే రావలసి వుంటే యిలా రిమైండర్లు యిచ్చుకుంటూ కూర్చుంటారా? రెండో రిమైండరు కు జవాబు ఎప్పుడు రాలేదో టెలిగ్రాం పంపించండి. దానికి జవాబు లేకపోతె ట్రంకు ఫోను లో మాట్లాడండి. ' అక్కడికి లొంగక పొతే వాడి పై వాడికి వ్రాయండి.'
    ఇందులో సత్యాన్ని సూర్యం కాదన లేకపోయాడు. ఒకసారి సూర్యం ఏదో తప్పు చేసాడు. అది తప్పని ఆఫీసరు యెదురుగా పెట్టేసాడు. దానికి అతను చాలా సంతోషించి అన్నాడు.
    'తప్పు చేసారంటే అర్ధం ఏమిటి తెలుసా? మీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నమాట! ఎన్నో పనులు చేసేటప్పుడు యెన్నో తీర్పులు యిచ్చేటప్పుడు ఏదో ఒకటి తప్పు కావచ్చు. ఆ తప్పు కప్పటానికి యింకో తప్పు చెయ్యకండి. ఒక పాపం కడగటానికి యింకో పాపం చెయ్యవద్దు. అ తప్పు ఒప్పుకొని, ఆ పాపానికి పాశ్చత్తాపపడండి. సరే యీ తప్పు నించి మీరు తెలుసుకున్నదేమిటి? పై పైగా తెల్చేకండి. చేద పడ్తే పైన తుడి చేస్తే మళ్లీ చేద పట్తుంది. అసలు కారణం యేమిటో ఆలోచించండి. ఆ రాణీ పురుగు యెక్కడుందో వెతికి పట్టుకో. మళ్లీ అక్కడ చెద పట్టదు. అఫీసరంటే ఒక నాయకునితో సంబంధం.' అంటూ నాయకత్వం గూర్చి జాన్ బూచెన్, పల్లాస్ ఎధీన్ , బెట్రండ్ రస్సెల్, బ్లేక్ చెప్పినవి చెప్పుకొచ్చాడు. అవి రాసి మరీ యిచ్చాడు. అందులో జాన్ బుచేస్ చెప్పనదానిలో యీ క్రింది పంక్తులు సూర్యం మళ్లీ మళ్ళీ చదువు కున్నాడు.
    'నాయకునికి యెనలేని ధైర్యం వుంటుంది. ఆశ పోయినప్పుడు సహించగల శక్తి సాహసంతో బాధ్యతను తన పై వేసుకునే తెగువ వుంటుంది.'
    ఇలా తనను అన్ని విధాలా అలోచించి పని చేసే ఆఫీసరు గా తర్ఫీదు చేసిన తన పెద్దకు, తన యింట్లో పెట్టుకుని ఆదరించిన మెహతా కు బదిలీ ఒక్కసారే రాగానే సూర్యం తను దురదృష్టవంతుడ్ని అనుకున్నాడు. భాభీ వెళ్లి పోతుందంటే భరించ రానిదైంది. ఆమె తనను స్వంత సోదరుని లా చూసి ఆదరించి తన ఆరోగ్యమే కాకుండా తన జీవితం పై ఆశా తత్వాన్ని అలవరిచింది. వారం రోజులకు వెళ్లి పోతారనగా రోజూ గీత వస్తుండేది.  రోజు కోలా తయారయేది. ఈ మధ్య ఆమె చీరతో తప్పించి యింకోలా అగపడలేదు. ఒకనాడు రాత్రి అక్క యింట్లో వుండి పోయింది. ఆ వేళ రాత్రి యెనిమిది గంటలకే వర్షం పడ్తోంది. సూర్యం బయటకు వచ్చి వర్షాన్ని చూస్తున్నాడు. గాలి లేక పోవటం వలన వర్షపు ఝల్లు వరండా మీదకు రాలేదు. వరండా లో దీపం వెలుగుతోంది. వెనుక నించి యెవరో.
    'బావున్నారా?' అని తెలుగులో అడిగింది.
    విశాల వెనుక వున్నట్లు ఆతృతగా తిరిగి చూసాడు -- గీత!
    'తెలుగెలా నేర్చావ్?'
    'ఎందుకా?'
    'ఎందుక్కాదు ? యెలా నేర్చావ్.'
    'మా వీధిలో నా క్లాస్ మేట్ తెలుగు అమ్మాయి వుంది. ఆమె దగ్గర తెలుగు రాయటం, మాట్లటడం నేర్చుకున్నాను.'
    సూర్యం మళ్లీ ముఖం వర్షం వేపు తిప్పేసాడు. గీత తెలుగెందుకు నేర్చు కుంటోందో తన వూహకు రాగానే ఒళ్ళంతా పులకరించింది. కానీ మరు క్షణం లో వర్షపు జల్లు మీద పడి తడచి నట్లు అయిపోయాడు. ఆమె మెల్లగా వీపు మీద చెయ్యి వేసింది. ఆ చేతిని తప్పించుకునే సాహసం తనకు లేకపోయింది, ఒకసారి వెనుకకు తల త్రిప్పాడు. గీత కళ్ళలో నీరు. తుదవాలను కున్నాడు గానీ తుడవ లేకపోయాడు. వర్షం కురుస్తూనే వుంది. హృదయాలు కంపిస్తూనే వున్నాయ్. 'గీతా, ' అని ఒక్కసారి గట్టిగా కౌగలించు కుందామనుకున్నాడు. చేతులూ కాళ్ళూ ఒక్కసారి వణికి పోయాయ్. తను మారిపోయాడు. తన చెల్లెళ్ళు , తమ్ముళ్ళూ, తల్లీ-- అందరికీ దూరంగా విశాల ,అ అగపడ్డారు.
    పెద్ద నిట్టూర్పుతో మెల్లగా ముందుకు కదులుతూ ---
    'వర్షం యెంత బావుందో?' అంటూ మాటలు మార్చాడు. 'పుస్తకం చదివావా? నీకు నచ్చిందా/' ఇలా వేసిన ప్రశ్నలన్నీటికీ తలూపుతూనే సమాధానం యిచ్చింది. ఇంతలో భాభీ కూడా ప్రత్యక్ష మైంది.
    'మీ చెల్లెలకు యిదివరకు డిటెక్టివ్ కధలంటే ప్రాణం. ఇప్పుడు సీరియస్ కదల పై మోజు పుడ్తున్నట్లుంది.'
    'సిరీయస్ గా వుండక పొతే పెళ్లెలా అవుతుంది? ఈ మధ్య సీరియస్ గానే ఆలోచిస్తోందిలే!'
    'పో అక్కా-- ' అంటూ గీత అక్కడ నించి వెళ్ళిపోయింది.
    కుర్చీ బయటకు లాగి 'కూర్చో భాభీ ' అన్నాడు. 'నే నిక్కడే కూర్చుంటే యెలా? మీ అన్నయ్య వూరు కుంటారా?'
    'ఏం చేస్తున్నాడన్నయ్య?'
    'ఏదో చదువు కుంటున్నారు -- యెన్నాళ్ళకు.'
    'బాభీ-- మీరు డిల్లీ వెళ్ళిపోతూన్నరనగానేనాకు మీతో బదిలీ వస్తే యెంత బావున్ను.'
    'ఎంత కాలం మరిదీ యిలా వదిన చేతి  వంట తింటావ్?'
    'తిండి మాట అలా వుంచు వదినా! ఎక్కడైనా పట్టెడు మెతుకులు దొరుకుతాయ్ . కానీ ఆ మెతుకులు యెదుట పెట్టె టప్పుడున్న ఆప్యాయతబట్టే మనిషి ఆరోగ్యం వుంటుంది.'
    'నాకంటే ఆప్యాయత వస్తుంది -- పెళ్లి చేసుకుని పెళ్ళాం చేతి పాకం తిన్నావంటే.'
    "నాకెందుకు వదినా పెళ్లి ?'
    'ఏం నీకేం లేదు? అందం లేదా? ఉద్యోగం లేదా? నివ్వంటే యే రంబ వలచి రాదు?'
    'నాకు యేమీ లేదు వదినా.'
    'అయ్యో! అంటూ పకపక నవ్వుతుంటే --
    'అది కాదు వదినా!..నాకు...నాకు పెళ్లి మీద లేదు.'
    'ఏం విరాట కొలువులో అర్జునుడివా/'
    'కాదు వదినా!'
    'అయ్యుంటుంది? ఏ ఊర్వశీ శాపం పెట్టింది బాబూ?'
    లత వూర్వశి అనగానే సూర్యం కు విశాల చప్పున జ్ఞప్తి కి వచ్చింది. అవును విశాల శాపం పెట్టకుండా వుండలేదు అన్న తలపు మనసులో ప్రజ్వరిల్లింది.
    'నేనో మాట అంటాను కోపం రాదా?'    
    'చెప్పు వదినా.'
    'ఏ వయసులో యేది వుంటే శోభస్కారమో నీకు తెలుసు. నీకు తెలీదు గాని మరదీ -- నేను యిప్పుడు వళ్లు చేసేసాను గానీ మీ అన్నయ్య ను తొలిసారిగా చూసేటప్పుడు ఎలా వుండేదానను తెలుసా? బంతిలా త్రుల్లె దాన్నీ. మళ్ళీ ఆ బంతి కావాలంటే కాగలనా?'
    'నీ మనసు బంతి లాంటిదే వదినా?'
    'అంత చంచలం కాదోయ్ మరదీ?'
    'చంచలం కాదు వదినా. నీ వుత్సాహం అలాంటిది.'
    'నా వుత్సాహం మాటకేం గానీ నివ్వు వుత్సాహంగా వుండాలని నా కోర్కె! ఏడాది పైగా నిన్ను చూస్తున్నాను. నీ ఒక్కడినీ వదిలేస్తే మళ్లీ ఆలోచిస్తూ కూర్చుంటావ్. నీ ముక్కు పట్టుకుని లాగే చాకచక్యం గల యిల్లాలుండాలి.'
    'ఆప్పుడే తొందరేంటి వదినా?'
    'తొందర కాదు మరదీ. నేనొక మాట అంటాను కోపగించు కోవు కదా?'
    'చెప్పు.'
    'ఈ యేడాది పైగా నీ క్రింద చెయ్యటం తో -- ఆడదాన్ని కదా - ఏదో తెలియని మమకారం నన్ను వదలటం లేదు. ఇంత మంచి మనిషి మా యింట్లో మనిషి కాడంటే కష్టంగా వుంది. నిన్ను పై వాడవని అనుకోడానికి మనసు ఒప్పుకోవటం లేదు. నా మాట విను. మా చెల్లెలు గీతను పెళ్లి చేసుకోకూడదు? పెంకితనం ఆ మూడు ముళ్ళు పడగానే వుండి పోదు.'
    సూర్యం యింత చెప్తున్నా ముఖం భాభీ వేపు త్రిప్పలేదు. ఆమె మళ్లీ అంది.
    'బొంబాయి పిల్లను పెళ్లి చేసుకోనని గాని పంతం పట్టావా? బొంబాయి పిల్లా భారతదేశం పిల్లే. ఆమె సీతా, సావిత్రుల గురించి చదివి వాళ్ళను ఆదర్శంగా చేసుకున్నదే. అమెలోనూ, ప్రేమ, అభిమానం , ఆదరణ, దుఃఖం, క్షమా, ఓర్పూ వున్నాయ్ సూర్యం! నా చెల్లెలని కాదు గీత నీకు అన్ని విధాల తగి వుంది.'
    అప్పటికీ మనస్సు మధన పడుతున్న సూర్యం తల త్రిప్పక పోగానే --
    'తెలుగు వాళ్లకు, మహారాష్ట్రులకు సంబంధం యెలానని సంశయిస్తున్నావా? నేను మరాఠీ దాన్ని, పంజాబీ వార్నీ పెళ్లాడలేదూ? మా బ్రతుకు హాయిగా. సుఖంగా లేదా? చదువు కున్నవాడివి. జాతులు, తేగలూ భాషలు పట్టుకుంటే యీ దేశం గతేం అవుతుంది? మౌర్య సామ్రాజ్యం ఆ రోజుల్లో అన్ని సంవత్సరాలు నిల్చిందంటే ఉత్తరాది వాళ్ళు, దక్షిణాన, దక్షణాది వాళ్ళు ఉత్తరాన , రక్త సంబంధాలు యేర్పరచుకోబట్టే కదా! నేటి భారతదేశం కలకాలం వర్ధిల్లాలంటే యిలాంటి కలయిక కాంక్షించటమే కాదు మనలాంటి చదువుకున్న వాళ్ళం ఆచరించాలి-- మా ముత్తాత ముత్తాత ఆంధ్రుడు కాడని యెలా చెప్పగలవు? అలానే మీ ముత్తాత ముత్తాత మరాఠీ కాడని బలగుద్ది చెప్పగలవా? నా చెల్లెలని కాదు. మళ్ళీ గీత లాంటి పిల్లను నువ్వు జీవితంలో కలుసుకో లేవు.'
    'నిజం వదినా...నిజం....మరి కలుసుకోలేను.'
    'అయితే యిప్పుడు తప్పు చెయ్యక. తరవాత బాధపడ్తావ్.'
    సూర్యం కళ్ళు తుడుచు కున్నాడు.
    'అప్పుడే ఒక తప్పు చేసి బాధపడ్తున్నాను వదినా!'
    'ఎవర్ని ప్రేమించావ్?'
    'అదంతా చెప్పలేను. మరవాలన్న మారవ లేని కల అది. నీకు తెలీదు వదినా మా కుటుంబం సంగతి. మీలా పై అంతస్తు కాదు మాది. మా అంతస్తు చాలా దిగువది. ఆ అంతస్తు లో అన్నీ బంధాలే -- ఆ కంపు సంఘంలో నించి బయట పడలేను. క్షమించు వదినా-- నివ్వు మనస్పూర్తిగా ఒక అమృత బాండాన్ని అందించదలచావు. అందుకొని ఆ అమృతం ఆస్వాదించలేని అదృష్ట హీనుడ్ని వదినా. నన్ను క్షమించు వదినా -- నేను ఉత్తి పిరికివాడ్ని.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS