రోజుకు రోజు ఒంటి బతుకు ఆలోచనలకూ దారి తీసింది. ఆ ఆలోచనల నించి తప్పించు కోవాలని యిప్పుడు సినీమాలకు చూసిన వినోద స్థలాలే మళ్లీ చూస్తూ గడిపే వాడు. ఐనా ఆలోచనలే హెచ్చి పోతున్నాయ్. పొరుగునే వున్న తోటీ ఆఫీసరు అదోరకం మనిషి, అంతా డబ్బు తోనే వుంది. తన దగ్గర యీ ఒక్క గదికి పుచ్చుకున్న అద్దె ఆ మొత్తం యింటికి యించు మించు సరిపోతుంది. ఇక ఆవిడకు పాతివ్రత్యం మీద భక్తే కాదు. లోకంలో ఆమె ఒక్కర్తే పతివ్రత అనుకుంటుంది. దంపతుల కిద్దరికి దైవభక్తి యింతా అంత కాదు. వేకువున నాలుగు గంటలకే తాళాలతో భజన వినిపిస్తుంది. సూర్యంకు తెలివి వచ్చి మరి నిద్దర పట్టదు. ఆమె తనతో మాటాడితే యెక్కడ మింగేస్తాడనో సరిగా ఎదుర పడదు సరికదా సూర్యం మాటాడాటానికి ప్రయత్నిస్తే కిట్టనట్టు ముఖ వైఖరి చెప్తుంది. ఈమె భాభీలా యిద్దరి పిల్లల తల్లే. ఈ తల్లులకు వాళ్ళు తల్లులమనే గర్వం యందుకుండడని సూర్యం విసుక్కున్నాడు. అలాంటి గర్వం లతకు ఉండబట్టే తననొక బిడ్డడిలా సంరక్షణ చేసింది. ఆమె యింట్లో వుండే టప్పుడు మనసు హాయిగా వుండేది. తన యింట్లో అమ్మ సంరక్షణ లో వున్నట్లుండెవాడు. అందుచేత అతని ఆరోగ్యం బాగుపడింది. తన సొంత యింట్లో వుండే చనువు కన్నా హెచ్చు వుండేది. స్వతంత్ర వాయువులను పీల్చేటట్లు హాయిగా గర్వంగా మెసలాడు.

ఇప్పుడు అవన్నీ కరవు కాగానే మనసు మళ్లీ వికల మౌతోంది. మళ్లీ తనకు విసుగు బాటు కలుగుతోంది. తన ఖర్చులు కూడా అధికమై పోయాయి. ఇప్పుడు తండ్రికి యిదివరకంత హెచ్చు పంపలేక పోతున్నాడు. తను పంపకపోతే పట్నంలో తన తమ్ముల చదువులు యెలా సాగుతాయ్? చెల్లెళ్ళ పెళ్ళికి డబ్బు యెలా కూడ బెడ్తారు? తిరగటం అంటే ఖర్చు. అందులో బొంబాయు లో కాలు పైకి తీస్తే ఖర్చు. కోరికలు పుట్టాయ్. కొనసాగటం అంటే డబ్బు! అందుకే తిరగటం తగ్గించి యింట్లోనే వుంటున్నాడు. ఇంట్లో వుంటే యేమీ తోచదు. ఎంతకని పుటకాలు చదువు తాడు.
ఆ మధ్య సినిమా లో గీత దూరంగా కనబడింది. ఇంకోసారి ఫ్లోరా ఫౌంటైన్ దగ్గర బస్సు కోసం క్యూలో నిల్చోగా చూసాడు. ఒకసారి విక్టోరియా గార్దేన్సు లో ఆమె వయసు అమ్మాయిల సమూహంతో తిరుగుతుండగా చూసాడు. ఇంకోనాడు ప్రిన్స్ ఆఫ్ వేల్సు మ్యూజియం లో పరీక్షగా ఒక శిల్పాన్ని చూస్తుంటే కాస్త దూరంలో తనూ నిల్చొని చూసాడు. ఆమెతో మాటాడాలన్నా మాటాడ లేక పోయాడు. దగ్గరగా చేరాలనుకున్నా చేరలేక పోయాడు. ఒంటరితనం సహించరానిదై పోయింది. జీవితంలో ఏదో లోటు తెలుసుకోలేని వెలితి -- నిత్యం తనను వేధించుక తింటోంది.
ఆ మధ్య ఒకసారి కడుపులో నొప్పి మంచి రాత్రి మీద వచ్చింది. ఎలానో ఓర్చుకోగలిగాడు. రెండు రకాల మందులు మరుసటి రోజు కొని వుంచు కున్నాడు. ఆరు నెలల్లో హోటలు భోజనం అంటే డోకు రాసాగింది. అన్నం సహించటం లేదు . శరీరం సరియైన పోషణ లేక మనిషి చిక్కి పోసాగాడు. తనకోసం ప్రత్యేకంగా మంచి నువ్వుల నూనె తో భాబీలా యెవరు వండి పెడ్తారు? వెళ్ళిన దగ్గర నించి భాభీ ఓక వుత్తరమైనా రాయలేదు గానీ మెహతా రాసిన మూడు ఉత్తరాల్లో నూ మీ భాభీ నీ ఆరోగ్యం గురించి రాయమందని రాసాడు. ఆమెకు తన ఆరోగ్యం సంగతి బాగా తెలుసు. ఐనా తెగించి చెల్లెలను చేసుకోమని చెప్పగలిగింది.
సూర్యం బొంబాయి వచ్చి రెండేళ్ళు గడిచాయ్. రోజులు భారంగా దిగులుగా తిరిగి పోతున్నాయ్. తనకు సంతోషం యిచ్చింది ఆఫీసులో పనే! అది మాత్రం నమ్మకం , బాధ్యతగా చేసుకుంటున్నాడు. తనపై ఆఫీసరు ఒక వరవడి దిద్దించాడు. ఆ వొరవడి తో పోతూ తన ధర్మాన్ని సాగర్వంతో నిర్వర్తిస్తున్నాడు. పదుగురూ అతని న్యాయాన్నీ, శీలాన్నీ శ్లాఘిస్తున్నారు. తన పాత బట్టను యేనాడో వదిలేసాడు. ఈ క్రొత్త దుస్తులను తగిన వాడని నిరూపించు కున్నాడు. పై అధికారుల నించి దిగువను వున్నవారి లో తనంటే ఒక విధమైన గౌరవాన్ని అభిమానాన్ని సంపాదించు కోగలిగాడు.
ఈ పొగడ్త ను తెచ్చింది తన నిజాయితీ. తన యిష్టా యిష్టాలను యెదుటి వాళ్ల నెత్తిన రుద్దేకుండా యెదుటి వాళ్ళు చెప్పింది వినే ఓపిక, అందులో నిజానిజాలు ఆలోచించే ఓర్పు తనకు అలవడింది. తనపై యెదుటి వాళ్ళిచ్చే మర్యాద కోరి తెచ్చుకోలేదు, దానంతట అదే వాళ్ళ హృదయాల నించి రాసాగింది. అతని ఆరోగ్యం రానురాను పాడవుతున్నా తను సంపాదించుకున్న కీర్తీ తనను యింకా అక్కడ వుండాలన్న ఆశను వుంచింది. మూడేళ్ళు దగ్గర పడ్తున్నాయనగానే సర్నారు ఒకసారి పనిమీద వచ్చి సూర్యం ను చూసాడు. తనే కోరి అడిగి అన్ని విషయాలు తెలుసుకున్నాడు.
'మళ్లీ నీకు ఆ వూరే బదిలీ చేస్తాను. నీ తల్లిదండ్రులు దగ్గరగా వుంటారు కాబట్టి నివ్వు వేగంగా కోలుకోగల అవకాశం వుంటుందన్నాడు.
అలానే బదిలీ మీద యెక్కడైతే గుమస్తా గా వుండేవాడో అక్కడకే ఆఫీసరుగా వచ్చాడు. ఇదివరకు యే గుమస్తాలతో ఒకడయి మెసలాడో వాళ్లకు అజ్ఞాలివ్వాలి. ఏ సూపరెంటెండెంటు దగ్గర ఆజ్ఞలు అందుకున్నాడో వాడిని తను అజ్ఞాపించాలి. ఐనా యీ వాతావరణానికి తన మంచితో ప్రేమతో అలవాటు పడిపోతానని అనుకున్నాడు. తిరిగి వచ్చాక తన ఆఫీసు దగ్గరలోనే క్వార్టర్స్ యిచ్చారు. కొద్దిగా ఒంట్లో చికాకుగా వుంటే డాక్టరు యింటికి వచ్చి చూస్తున్నాడు. ఇదివరకటి జీవితానికి యిప్పటి జీవితానికి యెంత తేడా? ఈ డాక్టరు యింటి కొచ్చే అవకాశం యిదివరకు వుంటే తన బావను పోగొట్టు కొనేవాడు కాదేమో? పూలను పుష్పిస్తున్న చెట్టులా వున్న గౌరీ ఒక్కసారి మెరుడు కాకపోయే దేమో? హోదా, డబ్బు చెయ్యలేని దేముంది? ఈ హోదా, డబ్బు, తనకు చెయ్యనిది కూడా వుందని పించింది. తన అజీర్ణ వ్యాధి బాగా ముదిరినట్లుంది. మందులు తిని, విసిగి పోయాడు. ఏ ఆసుపత్రికి తను యెప్పుడూ వెళ్ళాలని భీష్మించు కున్నాడో అదే ఆసుపత్రి లోనే తను యిప్పుడు చేరవలసి వచ్చింది.
* * * *
ఆ రాత్రి ఆసుపత్రిలో నిద్రపోకుండా పిరికివల్ల మనసు మళ్ళించడానికి యీ గడిచిన జీవితం అంతా నెమరు వేసుకున్నాడు. ఒక సినిమాలో ఒక భాగం చూసినట్లుంది. ముందుకు ఏం జరుగుతుందో నన్న ఆతృత తోనే నిద్దర ముంచు కొచ్చింది. నిద్దర నించి లేచేసరికి బాగా తెల్లారింది. అప్పటికే శ్రీనివాస్ సిగరెట్ వెలిగిస్తూ కూర్చున్నాడు.
సూర్యం లేవగానే మెల్లగా దగ్గరగా వస్తూ "ఏమండీ -- ఏంటో తియ్యని కలలు గంటూ నిద్దర పోయుంటారు. లేకపోతె యింత ఆలస్యంగా యెందుకు లేస్తారు?'
'పాడు కలలు రాకూడదా?'
'మీకూ నాకూ రావు. వచ్చినా అవి మంచి కలలుగా మనసు మార్చేస్తుంది . శెట్టి గారికి మంచి కలలే పాడు కలలు అనిపిస్తాయ్. ఏమండీ శెట్టి గారూ అంతేనా?'
శ్రీనివాస్ మాటలకు శెట్టి గారు ఒకసారి తల ఆడించారు. ప్రక్కనే వున్న ఖాళీ మంచం సూర్యం ను మళ్లీ ఆలోచనలో దింపింది. ఆ మంచం గోవిందరావు పోయిన రోజున యిలానే కనిపించింది. ఇంతలో నిన్నటి నర్స్ మళ్లీ ప్రత్యక్షమైంది.
"రొంప యెలా వుందండీ?'
'కాస్త పోడుం యివ్వండి.
