Previous Page Next Page 
సంపెంగలూ - సన్నజాజులూ పేజి 22

 

                                   9

    అయన స్నేహితుడి  చెల్లెలు మధుర చాలా అందమైనదీ, చురుకైనదీ. చిన్నాప్పుడు 'మధురా నగరిలో' అన్న డ్యాన్సు చాలా బాగా చేసేదిట. అందుకని ఆ అమ్మాయి కా పేరు శాశ్వతమై పోయిందిట. రాగానే మా పాపని ముద్దెట్టుకుని 'ఈ పాప పేరు మధురిమా? ఐతే! ఇన్నాళ్ళ కు నాకు ఒక పోటీ దొరికినందుకు ఎంతో సంతోషంగానైనా ఉంది.' వచ్చిన ఒకటి రెండు గంటల్లోనే మేము ఎన్నో సంవత్సరాల నుండి ఎరిగున్న వాళ్ళలా అయిపోయాం. ఏ మాట అనాలో ఏ మాట అనకూడదో కూడా తెలియని వెర్రి పిల్లలా కనిపించింది మధుర. ఏడాదై ఏదో హైస్కూల్లో వర్కు చేస్తోందిట. ఎంతసేపయినా విసుగన్నది లేకుండా అలా మాటాడేస్తూనే ఉంటుంది. అలా మాట్లాడుతున్నప్పుడు బుర్ర తిప్పుతూ ఉంటుంది. దానితో చక్కని ఆమె కూడా ఉన్న ఆ పెద్ద జడా అటూ ఇటూ వూగుతుంటే చూడ్డానికి బలే తమాషాగా ఉంటుంది. అన్నిటినీ మించి ఆమె కళ్ళతోటే మాటాడుతుందా అనిపిస్తుంది. 'ఇలాంటి హడావిడి మనిషి కూడా ఉండడం, అదెంత కాలం?' అనుకున్నాను. ఆ సాయంకాలమే కామేశ్వరి కూడా రావడంతో మర్నాడు మెయిల్ ప్రయాణం స్థిరపరచుకున్నాం.
    మమ్మల్ని సాగనంపటానికి స్టేషను కి ఆయనా నారయాణా , గోపాలం , కామేశ్వరి , మధురిమా యిందరూ వచ్చేరు.
    'హీరాలా మా నాన్నగారికి తెలిసిన ఒకాయనకీ రాశారు. అయన తప్పకుండా స్టేషను కి వస్తారు. మనకేం ఫరవాలేదు' అంది మధుర.
    'ఏం మధూ అత్తను అల్లరి పెట్టావ్ కదూ?' అన్నాను నేను.
    "మరేం ఫరవాలేదు నీ అమ్మాయి నీచార్జి పుచ్చుకుంటుందిలే నీకన్న ఒక ఆకు ఎక్కువ చదివే రకమే' అంది కామేశ్వరి నాకేదో దెబ్బకొట్టాలని.
    'అలాగే ఉండాలి. మధురిమ కాలం నాటికి ఫారెన్ వెళ్ళి చదువుకు రావడం కూడా సర్వ సాధారణ మై పోతుంది. అందరం మెట్రిక్ తోటే అపు చెయ్యగలమా మరి?' అంది మధుర. కామేశ్వరి మెట్రిక్ దాకానే చదువు కోందని ఆమెకు తెలీదు. 'ఇదిగో యిందుకే నేను రానన్నది. మీ ఆవిడ ఎలాంటి సూటి పోటి మాటలనిపిస్తుందో చూసేవుట్రా తమ్ముడూ? చదువుకొని వాళ్ళంటే ఆవిడకు పురుగులతో సమానం' అంది. ఆయనేం మాటాడక పొతే యిటు తిరిగి 'చదువుకుని మీరు ఉద్దరించిందేమిటి? లెద్దూ?' అంది. నేను వారిస్తున్నా వినకుండా మధుర జవాబు చెప్పింది.
    'చదువుకున్నందువల్ల ఏం లాభం ఉన్నా లేక పోయినా సవ్యంగా మాట్లాడ్డమేనా వస్తుంది.' కామేశ్వరి మొహం మరింత చిన్నబోయింది. ఆమె ఆలోచించుకుని జవాబు చెప్పేలోగా రైలు కదిలింది. ఏమిటో ఆ జరిగిన తతంగమంతా ఆశుభంగా తోచింది నాకు. ఆయనతో ఎన్నో చెబుదామనుకున్నాను. టైమే లేకపోయింది. వీళ్ళందరి లో వీలే లేకపోయింది.
    రైలు స్టేషను దాటేక ఆమెతో అన్నాను.
    'అలా తొందరపడి ఒకరి మనస్సు నొప్పిస్తే మనకు కలిసి వచ్చేదేమిటి మధురా?'
    'నేనన్న మాటలో తప్పేముంది? అయినా ఆవిడ మాత్రం అలా మాట్లాడ్డం ఏం బాగుంది? మనం తమతో పోటీ కోస్తున్నామని మొగాళ్ళు దుఃఖ పడితే అర్ధముంది. మనలో మనమే ఒర్చలేక పొతే యెలా?' ఆమె భావావేశం తో గట్టిగా మాటాడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది.
    'ఇలాంటిదానివి ఉద్యోగం ఎలా చేస్తున్నావమ్మా?' అన్నాను.
    "ఏం మన మంచి మనకుంటే ఎవళ్ళెం చేస్తారు? ఇంతకీ ఎవళ్ళేమన్నా మనం లేక్కచేసే దేమిటి గనక?' ఆమె విశ్వాసాన్ని మెచ్చుకోవలసిందే గాని యింతటి విశ్రుంఖలత్వం ఆడవాళ్ళకు అవసరమా అనిపించింది.
    నిజానికి స్టేషను కి రమ్మని రాయడం సరైన మర్యాద కాదు. వీలైతే దారిలో దిగి ఒక పూట ఉండి వెళ్ళడం మంచిదేమో గాని వచ్చేటప్పుడల్లా స్టేషను కి రమ్మంటే వాళ్ళకి వేళలు కుదరక యిబ్బంది పడవచ్చు. వచ్చిన వాళ్ళు ఉత్తి చేతులతో ఎలాగా రారు. అది పుచ్చుకోడం మనకి కష్టం కలిగించవచ్చు. అయినా యిష్టమైన వాళ్ళని అటూ యిటూ కొంచెం కష్టమైనా చూడాలని ఉంటుంది. అన్నయ్య ని రమ్మని రాశాను, వదిన్ని చూసి ఆరు నెలలైంది. ఆఖరికి అమెనైనా పంపమని రాశాను. వదిన ఒక్కర్తే వచ్చింది. నా కిష్టమని మినపరోట్టి కూడా తెచ్చింది. 'ఉత్తి చేతుల్తో రావు గదా?'
    'మరొకర్తీ మరొకర్తీ అయితే ఏం చేద్దునో! సాక్షాత్తూ అడపడుచువి. ఏమయినా తేడా వస్తే మా అన్న నన్ను బతకనిస్తారా?'
    'వాడేడీ?'
    'ఇవాళ వాళ్ళ ఆఫీసు ఇన్ స్పెక్షను అవుతోంది.
    'పోనీ మా అల్లుడు గాడో?'
    'అలక పాన్పు మీద ఉన్నాడు. మూడు చక్రాల సైకిలు కొనిస్తానని నువ్ దగా చేశావ్ గా!
    అదే స్వరం. అవే కబుర్లు. మనిషి మాత్రం కొంచెం చిక్కినట్లు కనిపించింది.
    'చిన్నారి కోసం బెంగెట్టుకున్నావా వదినా? చిక్కిపోయి బాగా సన్నపడినట్టున్నావ్.'
    "నీ కళ్ళకు నేనెప్పుడూ అలాగే కనిపిస్తాను. నీ అభిమానం అలాంటిది. నా లావు తగ్గడం ఈ జన్మలో జరిగేపని కాదు. సరి - దానికేం -- మా కోడలు బాగా చదువు కుంటోందా? ఏం, బియ్యే చదువనా, ఎమ్మే చదువనా' 'మా అమ్మాయికి పరీక్షలు గనక యిక్కడ ఉంచేస్తున్నాను ' అని రాస్తావ్?'
    'అబ్బ. ఈ పరీక్షల చదువుతో బుర్ర వేడెక్కి పోతోంది వదినా .... ఎప్పుడైపోతాయా అనిపిస్తోంది. వస్తూ యిక్కడే దిగిపోతాను. నువ్వు వెళ్ళమన్న దాకా పోను."
    'అలాగే, నువ్వు తినే తవ్వెడు బియ్యం అన్నానికి మేం తట్టుకోవద్దూ?' రైలు కదిలింది.
    'మొత్తమ్మీద గడుసుదానివి. ఎందుకలా ఉన్నావంటే చెప్పలేదు కదూ?'
    'నీకంటే గడుసు ఘటాన్నంటావా?'
    రైలు కదులుతుంటే మధుర వచ్చి ఎక్కింది. చేతిలో మల్లెపూలు, ద్రాక్ష పళ్ళు, స్వీట్స్. నేను కిటికీ లోంచి చూశాను. నలుగురు ఆడవాళ్ళూ, యిద్దరు మగాళ్ళు 'టాటా' చెబుతున్నారు.
    'క్షమించండి. మిమ్మల్ని వాళ్ళకి పరిచయమే చెయ్యలేదు. నిజం చెప్పాలంటే మీమాటే మరచి పోయాను. వాళ్ళందరూ బియ్యే లో నా క్లాసు మేట్సు' అంది నా తల్లో పూలచెండు పెడుతూ.

 

                   
    'నేను మాత్రం ? మా వదిన వచ్చిన ధోరణి లో నువ్వేక్కడున్నావో కూడా చూడలేదు. ఇదిగో యీ మినపరోట్టి కొంచెం రుచి చూడు.'
    'ఆ పొట్లం లోది మినప రోట్టా? చెప్పేరే కారు? నాకు చాలా యిష్టం ఎదేడీ?' గబగబా పొట్లాం విప్పి మూడొంతలు తనే తినేసింది. అంత చనువుగా తినేస్తుంటే నాకు చాలా ముచ్చటేసింది.
    'కాడ్ బెరీస్ చాకలేట్స అంటే నా కిష్టమని మా 'మనో' తెచ్చింది. మీరొకటి రుచి చూడండి.
    నేనండుకుని నోట్లో వేసుకున్నాను. తరువాత సంచీలోంచి చెక్కెర కేళీ అరిటిపళ్ళు తీసింది. నాకూ యిచ్చి తనూ తింది. ఇన్ని మంచినీళ్ళు తాగి 'అమ్మయ్య' అంది గుండె రాసుకుంటూ.
    'అదేమిటి మధురా?' అన్నాను.
    'రాత్రి ప్రయాణం. కడుపు నిండా తినేశాను. మందైనా తెచ్చుకోలేదు. నిజంగా నాకు బుద్ది లేదు. నాన్నగారన్నది నిజమే' అంది. ఆమెకు కొద్దిగా అస్తమా ఉందిట. ఆ రాత్రి నిద్ర పట్టడం కష్టమట. మొత్తానికి నాకు మంచి సాయమే దొరికినట్టుంది! ఇంకసేప్పటికి ఆ అమ్మాయి దగ్గడం ప్రారంభించింది. అలా దగ్గుతుంటే కాశీలో ఇంకా చలి ఉంటుందని అయన సంచీలో పడేసిన 'కాఫ్ సిరప్' జ్ఞాపకానికి వచ్చింది. అది రెండు స్పూన్లు యిచ్చాను. అది తాగి నెమ్మదిగా నా తోడ మీద బుర్ర పెట్టి పడుకుంది. కాస్సేపటికి ఆ అమ్మాయి దగ్గు సద్దుకుంది. ఇంకో పది నిముషాల్లో నిద్రపోయింది కూడా.
    'అబ్బా రాత్రి ఎంత బాగా నిద్ర పట్టిందండీ' అంది బారెడు పోద్దేక్కేక లేచి. నా రెండు చేతులూ పట్టుకుంది.
    'మీరే లేకపోతె ఆ రాత్రి నే నేమైపోదును! ఎంత మంచివారండీ మీరు! మీ రుణం ఎలా తీర్చుకోను.'
    'అంత సులువుగా తీరదు నా రుణం. ఈ డాక్టరు ఫీజు చాలా ఎక్కువ.'
    'ఏమిటేమిటి?' అంది నవ్వుతూ.
    'మీ అన్నయ్య నిన్ను నాకు అప్పజేప్పేరు . మళ్ళీ తిరిగి వారికి అప్పజెప్పే దాకా నేను చెప్పినట్టు వినడమే!'
    'ఏమో అనుకున్నాను, బలేవారండీ మీరూ!'
    'ఇంకా ముందు ముందు మరీ ఘాటయిన డోసులిస్తాను జాగ్రత్తగా ఉండు.'
    'అలా అయితే గొలుసు లాగి యిక్కడ్నుంచే పారిపోతాను బాబూ! చదువూ వద్దు, చట్టు బండలూ వద్దు -' ఈ అత్తగారితనం నేను వోర్చలేనండోయ్.
    'నిజమే, నువ్వు చదువుకోడానికి వచ్చిన దానిలా నాకెక్కడా కనిపించడం లేదు.'
    ఇలాంటి కబుర్లతో ఏమాత్రం ప్రయాణం చేసినట్టే అనిపించలేదు మాకు. కాశీ స్టేషను లో సామాను దింపించి లెక్క చూసుకుంటున్నాం . మధుర అంటోంది ఎవరితోనో.
    "ఏవండీ వచ్చారా, మీరు, వస్తారో రారో అనుకున్నాను!'
    నేను తలెత్తి చూశాను. తెల్లగా, పొడుగ్గా ఉన్న ఒకతను 'నమస్కారమండీ' అన్నాడు. నేను ప్రతి నమస్కారం చేశాను. ఈయన కేశవరావు గారని, యిక్కడ యూనివర్శిటీ లో రిసెర్చి చేస్తున్నారు. నాకు ఇంటర్మీడియట్ లో క్లాసు మేటు ఈవిడ మంజుల గారని....' నన్ను పరిచయం చేసింది.
    'ఈవిడ లేకపోతె నే నెంత యిబ్బంది పడుదునో. నాకు హిందీ రాదు. చెప్పకేం, ఇంగ్లీషూ అంత సరిగ్గా రాదూ.'
    'మళ్ళీ కలుస్తాగా' అని అతడు వెళ్ళిపోయాడు. దారిలో టాంగా నడుస్తుంటే మధుర 'అయ్యో , రైల్లో నా ఫ్లాస్కు మరచి పోయానండీ' అంది హటాత్తుగా.
    'ఇంట్లో మందు మరచిపోయావు. రైల్లో ఫ్లాస్కు మరచిపోయావు. వెళ్ళేలోగా అంతకన్న ముఖ్యమైనదేమీ యిక్కడే పారేసుకోవుగా!" అన్నాను నవ్వుతూ.
    వాకబు చెయ్యగా క్రిందటేడు మేము దిగిన తాతగారింట్లో తగినంత ముందుగా రాయకపోవడం చేత ఖాళీలు లేవని తెలిసింది. అదిగాక అయన కూడా లేకుండా నాకు అటువైపు వెళ్ళడానికి మనస్కరించలేదు. కేదార్ ఘాట్ లో మరొక యింట్లో ఆ పది రోజులకీ ఇరవై అయిదు యిచ్చేటట్లు మాట్లాడుకుని దిగెం. వాళ్ళు తెలుగు వాళ్ళే. ఇంటాయనకి యూనివర్సీటీలో పని. భోజనాలు కూడా అక్కడే చేసేవాళ్ళం. మాతోపాటు పరీక్షలకని చదువుకోడానికి వచ్చినవారు మరో ముగ్గురు మొగవాళ్ళు మాకు ఎదురు గదిలో ఉండేవారు. సాయంకాలం అయేసరికి అందరం పై డాబా మీదకు వెళ్ళిపోయేవాళ్ళం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS