Previous Page Next Page 
సంపెంగలూ - సన్నజాజులూ పేజి 21

 

    వెంటనే జవాబు రాయి. - అన్నయ్య.'
    మనిషికి మనిషి దూరం కావచ్చు. మనస్సులకి  దూరం తోటి కాలం తోటి పనేమిటి? నాకు హృదయ స్పందన, మనోసంచలనం ఎప్పుడు కలిగాయో అప్పుడు మా వదినా అన్నయ్యా నా ప్రక్కన ఉండనే ఉన్నారు. మనోహర దృశ్యాలను చూసి కన్నులు చేమర్చినప్పుడూ శ్రావ్య సంగీతం విని మనస్సు లయలు వేసినప్పుడూ మనకు కావలసిన వారు మన ప్రక్కన లేరే అనే భావమే మనం వారిని తల్చుకునేలా చేస్తుంది. మనసారా నవ్వినా బావురుమని ఏడ్చినా వారు మనతో పాలు పంచుకోవాలి. నా మనసుతో ఉండే అన్నయ్యకు నేను రాసుకునే దేమిటి వెర్రి, అయినా రాశాను. తెలిసిన వారిని మోసపుచ్చడం అదో వేడుక!
    'నీ సలహాలకు ఎప్పుడూ కృతజ్ఞురాలీని. కాని ఆయన్ని అర్ధం చేసుకోవడంలో మనం కొద్దిగా పొరబడ్డామా అనిపిస్తోంది. నా చదువుకి అయన ఏ విధంగానూ అడ్డురారు. పైగా ప్రోత్సహిస్తున్నారు కూడా. ఎటొచ్చీ అయన కొంచెం బద్దకం మనిషి. ఎంత బతిమాలినా అయన మాత్రం పరీక్షకు కూచోడం లేదు. 'మీ ఆవిడ ప్యాసయింది , నువ్వేమో ఫెయిలయినావు' అని వాళ్ళ స్నేహితులు నలుగురూ ఏడిపిస్తే కొంచెం ఉడుక్కున్నట్టు కనిపిస్తుంది. అంతే. ఆ దుమధుమ  అప్పుడే పోయింది. ఆయనాట్టే సేపు కోపంగా ఉండలేరు కూడా. నువ్వు చేసిన ఎన్నిక మరోలా ఎందుకుంటుంది? ఇది చూసి నేను చేసిన ఎన్నిక ఏమంటుందిట?'
    ఉత్తరం పూర్తి చేసి చదువుకొని చూస్తె మనస్సెంతో తేలిక అనిపించింది. దృక్పధంలో ఉన్న ప్రతి వస్తువు ఎంతో అందమైన దానిలా కనిపించింది. నాకు తెలీకుండానే నా కంఠంలోంచి సన్నని సంగీతం పుట్టుకొచ్చింది. అయన దగ్గిరకు రావడం కూడా నేనరగను. ఏమిటి నీలో నువ్వే అలా పరవశించి పోతున్నావ్? మాతో కొంచెం చెప్పకూడదా? వారిని చూస్తుంటే మొదటిసారిగా 'నేను' అనేది వేరే లేదనే భావం కలిగింది. ఇంక అయన దగ్గిర దాపరికం దేనికి? అన్నయ్య ఉత్తరమూ నా జవాబు కూడా అయన చేతిలో పెట్టెను. అతి శ్రద్దగా రెండు చదివారు. అయన కళ్ళల్లో అనేక భావాలు మారడం స్పష్టంగా చూశాను. 'నిజంగా మీ అభిమానాలు మెచ్చుకోతగినవే ఎల్లకాలం యిలా నిలవాలి గాని!' అని వెళ్ళిపోయారు.

                                                 *    *    *    *
    ఎం.ఏ. ప్రీవియస్ లో వచ్చిన మార్కులలిస్టు మరొకసారి చూసుకున్నాను. మొత్తం నూట డెబ్బై తొమ్మిది వచ్చాయి. ఒక్క మార్కు కలుపుకుంటే సరిగా నలభై అయిదు శాతం అన్నమాట. అది బి.హెచ్. యు రూల్సు ప్రకారం సెకండు క్లాసు. లిటరేచర్ లో ఆమాత్రం మార్కులు రావడం కూడా కష్టమే అంటారు. ఏమో ఈ పరీక్షా విధానాన్ని బట్టి, మార్కుల్ని వేసే పద్ధతుల్ని బట్టి మన జ్ఞాన పరిమితిని బాషలో మనకు గల ప్రవేశాన్ని నిర్ణయించుకోవడం అంత తెలివైన పనిలా నామట్టుకు నాకు కనిపించలేదు. మనకు ఉన్న పాండితీ ప్రకర్ష కాక పరీక్ష వ్యవధిలో, మనకు గల తెలివి తేటలన్నీ నేర్పుగా కాగితం మీద ప్రదర్శించగలిగామా లేదా, దాని విలువే ఎక్కువ. అటుపైన కలిసి వస్తే అదృష్టం , వెనుకబడితే వేదాంతమూ మనల్ని రక్షించడాని కప్పుడూ సిద్దంగానే ఉన్నాయి.
    మొదటి సంవత్సరం పరీక్ష లో నన్నేక్కువగా అలరించింది షేక్సిపియర్ పేపరు. ఇదివరకు నేను విశ్వకవి నాటకాలు చదవక పోలేదు గాని ఇంత క్షుణ్ణంగా , వివరంగా విమర్శలతో సహా చదవలేదు. అందులో హేమేట్ చదువుతుంటే నిజంగా నా మతి పోయింది.
    మేము మొదటేడు బెనారస్ నుంచి వచ్చినప్పుడే స్టూడెంట్స్ బుక్ డిపో లో రెండవ ఏటికి కావలసిన పాఠ్యపుస్తకాలూ గైడ్స్ ఏరి కొనుక్కుని తెచ్చుకున్నాను. ఏరి అని ఎందుకు చెబుతున్నానంటే అక్కడ పుస్తకాల షాపువాళ్ళ క్రయ విక్రయాలు వాళ్ళకీ స్టూడెంట్స్ కీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
    తక్కువ ధరలకి పాత పుస్తకాలు కొంటారు, అమ్ముతారు. ఆఖరికి కొన్ని గంటల సేపు మనకి కావలసిన పుస్తకం పరిశీలించి చూసి యిచ్చేయ్యడానికి కూడా ఉన్న ఏర్పాట్లు చూసి నేను ఆశ్చర్యపోయాను. మనవైపు పెద్ద పెద్ద ఖరీదు గల రిఫరెన్స్ బుక్కు సాధారణంగా తెప్పించరు. తెప్పించినా వెయ్యి పేజీల పుస్తకంలో పది పేజీల సారాంశం కోసం పాతిక రూపాయలు తక్కువ కాకుండా కొనుక్కోవడం అనవసరం అధిక వ్యయం. పోనీ ఏ కాలేజీ లైబ్రరీ నుంచయినా తెప్పించుకుందామా అంటే అవి నెలల తరబడి ఏ ప్రొఫెసర్ల యిళ్ళలోనూ, వారి బంధువుల యిళ్ళలోనూ ఉంటాయి గాని అవసరం తీరిపోయాకెనా రిటర్న్ చేసే సభ్యతా సౌమ్యతా వారి కుండవు. ఈ బాధలు పడలేక కొందరు పరీక్షర్ధులు ఒకటి రెండు నెలలు ముందుగానే కాశీ వెళ్ళిపోయి అక్కడ చదువుకుని ఏడాది చదివిన లాభం పొందుతున్నారు.
    రెండవ ఏడు మొదటేడు కంటే కొంచెం కట్టుదిట్టంగా రెగ్యులర్ గానూ చదివాననుకుంటాను. మోడరన్ పోయట్సు లో నోబెల్ ఫైజు గ్రహీత టి.ఎస్. ఇలియట్ ని అందరూ వదిలేస్తారు గాని అరకోరకరాని కొయ్య మీదే నాకేక్కడి లేని కుతూహలమూ కలిగింది. ముఖ్యంగా సారవిహీనమైన నవనాగరిక ప్రపంచాన్ని చూసి అతడు వ్యక్తీకరింసిన వ్యధ నన్ను కదిలించింది.
    ఈసారి బెనారస్ కి అయన రాలేనన్నారు.
    నేను గట్టిగా కాదూ కూడదంటే మా మేనేజరు ఏమీ అనడు గాని అస్తమానూ అతన్ని యిబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. కిందటి సారే వారం రోజులని పదిహేను రోజులు ఉండిపోయావని వాళ్ళ దగ్గిరా వీళ్ళ దగ్గిరా విసుక్కున్నాడట! నేనేం మాట్లాడలేదు.
    'అయినా నువ్వోక్కర్తివీ అయితే ఎక్కువ కాన్సెన్ ట్రేటు చేసి చదవడానికి వీలవుతుందేమో ! ఏమంటావ్?'
    'సరే మీ ఇష్టం....'
    నేను కూడా ఆయన్నేక్కువ బలవంత పెట్ట లేదు. ఎటొచ్చీ ఒక్కర్తెనీ అంతదూరం వెళ్ళలేక రుక్మిణమ్మ గారికి రాద్దామనుకుంటుంటే ఆవిడ దగ్గిర్నించే ఉత్తరం వచ్చింది. ఆవిడకీ మధ్య చాలా సుస్తీ చేసిందిట. పరీక్షకు వచ్చే ఏడాది వెళ్ళాలను కుంటోందిట. ఇంతట్లో అయన ఫ్రండు ఒకాయన దగ్గిర్నించి ఉత్తరం వచ్చింది. వాళ్ళ చెల్లెలు అ ఏడాది హిస్టరీ ఎం.ఏ కి వెడుతోందిట. మీతో తీసికెళ్ళమని. ఇలా ఎప్పటి కప్పుడు ఏదోవిధంగా దైవ సహాయం లభించడం నాలో అస్తికతను మరింత పెంచింది. ఇక మిగిలింది మా మధురిమ వ్యవహారం. ఈసారి దానికేవో క్లాసు పరీక్ష రావడం చేత మునపట్లా వదిన దగ్గిర దిగబెట్టడానికి వీల్లేకపోయింది. అయన కామేశ్వరిని పిలిపిస్తానన్నారు. 'ఆవిడ అల్లరి మనిషని తెలిసి కూడా ఎందుకు చెప్పండి?' అన్నాను నేను. 'పోనిద్ద్దూ ఏదో సాయంగా ఉంటుందీ, అదిగాక అది ఇందుకని పని గట్టుకుని మెడ్రాసు నుంచెం రానక్కర్లేదు. విజయనగరంలో ఉందిట. ఈ పదిరోజులూ ఇక్కడుంటుంది. ఏదో ఆడసాయం.' 'సరే మీ ఇష్టం.' అన్నాను. సరళ ఈ విషయంలో కొంత సాయం చేసును గాని ఆ అమ్మాయి అప్పుడు వూళ్ళో లేదు. వాళ్ళ నాన్నగారికి జబ్బుగా ఉంటె ఆ వూరు వెళ్ళిందిట.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS