Previous Page Next Page 
సంపెంగలూ - సన్నజాజులూ పేజి 23

 

    'మర్నాడు పొద్దుట తెల్లారే సరికల్లా కేశవరావు ప్రత్యక్షం.
    'మేం యిక్కడున్నామని మీకేలా తెలిసింది?' అని అడిగింది మధుర.
    'వెలుగురేఖని ఆధారంగా తీసుకుని వచ్చేశాను' అన్నాడతడు.
    మధుర కిలకిల నవ్వింది.
    'అంతగా వెలిగి పోతున్నానటండీ?"
    'అనుమానమా?' మళ్ళీ యిద్దరూ నవ్వేరు.
    'యూనివర్సిటీ చూద్దురు గాని , రాకూడదూ?'
    'ఓ, అంతకంటేనా , ఎవరేనా పిలుస్తారా అని చూస్తున్నాం. పదండి మంజూలా' అని మధుర నన్ను బలవంతం చేసింది.
    'ముందుటేడు నేనవన్నీ చూసినవేనమ్మా. అయినా పరీక్షలు ముందు పెట్టుకుని విలువైన కాలం యిలా పాడు చేసుకుంటారా?'
    ఆమె నా మాట వినే ధోరణి లో లేదు. మరింత ట్రిమ్ గా ముస్తాబై అతనితో బయలుదేరింది. ఆ వెళ్ళడం వెళ్ళడం మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకి గాని రాలేదు.
    'కేశవరావు చాలా మంచివాడు ఏమో అనుకున్నాను. ఎన్ని చూపించాడో, ఎన్ని సంగతులు చెప్పేడో అబ్బా చెప్పలేం." అంది మెడా జడా ఎడా పెడా తిప్పుతూ.
    'చెప్పకు. వినడానికి ఇక్కడెవరికీ టైమూ వోపికా రెండూ లేవు. తెలియని వూళ్ళోకి ఒక్కర్తివి వెళ్ళేవ్ గదా.'
    'అదేమిటండీ కేశవ కూడా వున్నాడుగా, అతడు నన్ను అయిదు నిముషాలు వదుల్తెగా, నాకేం బాధ?"
    'ఉంటె? భోజనాని కెనా రావాలనీ, అలా చెప్పి వెళ్ళకపోవడం పొరపాటనీ కూడా నీకు తోచలేదన్న మాట?'
    మధుర గుడ్ల నీరు గ్రక్కుకుంది. అంతట్లో నవ్వు, అంతట్లో ఏడుపు మొత్తానికి చిత్రమైన మనిషి.
    'ఆడదాని బ్రతుకంత అధ్వాన్నపు బ్రతుకు  లేదు. మీరూ ఇలా అంటారనుకోలేదు.'
    'అవన్నీ తరువాత ఆలోచిద్దాం గాని, వచ్చిందగ్గర్నుంచీ నువ్వు ఒక్క మారూ పుస్తకాన్ని ముట్టుకున్న పాపాన పోలేదు. మనం ఇక్కడి కెందు కొచ్చామో ఆ విషయం మాత్రం మరచిపోకు. ఇంకా నీకు చెప్పలేకపోను గాని నీ వల్ల నా టైం అనవసరంగా పాదవుతోంది. చదువు, చదువు' మధుర అయిష్టంగా పుస్తకం తీసింది.
    నావి ఫైనలు పరీక్షలు గనుక మధ్యాహ్నం రెండింటి నుండి అయిదింటివరకు జరిగేవి. ఆ అమ్మాయిది ప్రీవియస్ కనుక పొద్దుట ఏడు నుండి పది వరకు జరిగేవి. ఈవిధంగా బాగా తేడా ఉండడం వల్ల ఆమెను నేను రాత్రి పూట తప్ప కలుసుకోడానికి అట్టే వీలులేక పోయేది. ఇంచు మించు రాత్రి తెల్లవార్లూ మేమిద్దరమే కాక మిగిలిన ముగ్గురు ప్రీవియస్ కి వచ్చిన తెలుగు విద్యార్ధులు కలిసి చదివేవాళ్ళం. మాకు రాత్రి. వేళ 'చాయ్' అదీ కావలసి వచ్చినప్పుడు వారిలో మురళీ కృష్ణ మూర్తి అనే అయన తెచ్చి యిచ్చేవాడు.
    పరీక్షకు పరీక్షకూ మధ్య ఆ ఏడు ఒక్కొక్క రోజూ, రెండేసి రోజులూ శలవు లోచ్చాయి. ఏ శలవు నాడూ మధుర పగలల్లా ఇంటిపట్టున ఉండేది కాదు. హాస్టలు లో తెలిసిన తెలుగువాళ్ళు కనబడ్డారనీ, వాళ్ళతో ఎస్సేలు డిస్కస్ చేసుకోడానికి వెడుతున్నాననీ చెప్పేది. తరచు ఈవిణ్ణి తీసి కెళ్ళడానికి కేశవరావు వచ్చేవాడు. నా చదువు ధ్యాసలో పడి నేనీ రాకపోకల్ని అంత తీవ్రంగా పరిశీలించలేదనే చెప్పాలి. అదిగాక ఆమె చదివి ఉద్యోగం చెసుకుంటున్నదాయె. ఏమయినా వాళ్ళ చనువూ, స్నేహమూ నాకు కొంత ఆందోళనకరంగానే ఉండేది. ఒక శలవు నాడు ఉదయపు వేళ నేను గదిలో కూర్చుని 'సేక్రేడ్ ఉడ్' చదువుతున్నాను. మధుర అప్పటికే వెళ్ళిపోయింది.
    'ఏమండీ , మీతో వచ్చినావిడ మీ చెల్లెలా?' తలెత్తి చూశాను. మురళీకృష్ణమూర్తి. దూరముగా చాప మీద కూచున్నాడు.
    'మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానేమో వెళ్లివస్తాను' అని వెళ్లి పోబోయాడు. అప్పటికే చదువుతున్నది అర్ధం కాక నాకు తిక్కగా ఉంది. పుస్తకం ముడిచేశాను.
    'కూచోండి, అయిన వరకూ పేపర్లేలా రాశారు?'
    'ఫరవాలేదు. ప్యాసవుతాను. నే నిందాకా అడిగిందానికి జవాబు చెప్పేరే కాదు. ఆవిడ మీ చెల్లెలా?'
    'అవును' అన్నాను ఇంకేమనాలో తోచక.
    'అంటే? మీరు నాకెలా అక్కగారో అలాగా?' ఆశ్చర్యపోతూ అతని వైపు చూశాను. మొత్తానికి ఘటికుడే.
    'ఆమె నాకు చెల్లెలు కాదని మీకు అనుమానం ఎందుకొచ్చింది?'
    'నిజంగా చెల్లెలయితే విచ్చలవిడిగా ఆమె నలా వదిలెయ్యరుగా!"
    నాకు చాలా కోపమొచ్చింది. వీడి కెందుకు మధ్య?
    'ఇలా మాట్లాడ్డం మీ కనవసరం అనుకుంటాను. ఇక మీరు....'
    'వెడతాను' అంటూ ఆగి మళ్ళీ అన్నాడు.
`    "మిమ్మల్ని కూడా నేను తప్పుగా అంచనా వేసుకున్నానన్నమాట . క్షమించండి.'
    'ఆగండి. మీరు చెప్పదల్చుకున్న దేదో పూర్తిగా చెప్పి మరీ వెళ్ళండి.'
    'నేనే తొందర పడ్డానేమో ...కూచోండి' అతడు కూచున్నాడు.
    'మీతో యిలా మాట్లాడే అవకాశం కోసం రెండు మూడు రోజుల్నుంచి చూస్తున్నాను. అందుకనే వాళ్ళిద్దరూ విశ్వనాద్ గల్లీకి వెళ్ళడం చూసి యిలా వచ్చాను. ఆ అమ్మాయి మంచి కోసం మీలాగే సంబంధం లేకపోయినా గిలగిల కొట్టుకునే మరో ప్రాణి ఉందన్న మాట మరచిపోకండి.'
    'మధుర గురించి మీకెందు కంత ప్రత్యెక శ్రద్ధ?'
    'మీ ప్రశ్నకు అంత తేలికగా జవాబు చెప్పలేను. ముఖ్యంగా యిక్కడికి వచ్చిన ఒకటి, రెండు రోజుల్లోనే సభ్యతతో కూడిన మీ ప్రవర్తన నేను మీ తోడబుట్టిన వాడిననే తీయని భావన కలిగించింది. ఇంతవరకు వచ్చాక జరిగిందంతా చెప్పకుండా ఉండలేను.'
    కృష్ణమూర్తి మాటలు నాలో అనేక ఆలోచనలు రేకెత్తించాయి. అతడు చెప్పుకు పోతున్నాడు.

                              *    *    *    *
    'మా చెల్లెలు ప్రభ చాలా చక్కగా ఉండేదండీ. ఈ మధుర గారు ఇదోరకం అందం. అది యింకా బాగుండేది అనుకుంటాను. రకరకాల అలంకరణలు చేసుకున్న కొద్ది దాని సౌందర్యం ఇనుమడించేది. అమ్మ ఉంటే దాన్ని బాగు చేసేదేమో గాని నాన్న దాన్ని మొహం ఎదురుగుండానే పొగిడి ఆమె ఆలోచనలూ, ఆశలూ ఆకాశాన్ని అంటేలా చేశారు. 'ఏమేవ్ ప్రభా, నీకోసం ఐ.ఏ.ఎస్. దిగోస్తాడా , పి.హెచ్.డి ఎగిరోస్తాడా?' అనేవారు నాన్నగారు. 'ఫో నాన్నా నేను పెళ్ళి చేసుకోను' అనేది. ఇది ఏ అమ్మాయి అయినా అనే మాటే. కాని ఆ మాటే శాశ్వతమూ, నిజమూ అయిపోతుందని కలలో కూడా అనుకోలేదు!'
    'ఏం, ఏమయింది?'
    'అది వూహించలేనంత కష్టమైంది ఏమీ కాదు. దిక్కులేని కొందరు చెడు తిరుగుళ్ళు తిరిగి పాడై పోవడం ఎక్కడైనా ఉంది. దాని సంరక్షకులం ఇద్దరం ఉండి కూడా బొత్తిగా పనికిమాలిన వాళ్ళం అయిపోయాం. సరే, అట్టే టైం వేస్టు చెయ్యకుండా జరిగింది చెబుతా వినండి. నేను బియ్యే ఫైనలియర్ లో ఉన్నప్పుడు ప్రభ ఫస్టియర్ లో ఉండేది. చదువు తప్పించి మిగిలిన అన్ని కార్యక్రమాలు తనవే. ముఖ్యంగా ఫైవ్ ఆర్ట్స్ ఎసోసియేషన్ లేడీ రిప్రేజెంటివ్ గా ఎన్నిక అయినప్పుడు అదొక మహారాణి పదవిగా ఆమె విర్రవీగి పోయింది. ఆ ఏడు ఆంధ్రాభ్యుదయ వారాలలో తలపెట్టిన కన్యాశుల్కం నాటకంలో ఆమె మధురవాణి వేషం వెయ్యడానికి ఒప్పుకున్నదని తెలిసినప్పుడు నేను పడిన బాధ చెప్పనక్కరలేదు. అందులో మన కాలేజీలు ఎంత బాగా నడుస్తున్నాయో మీకు చెప్పనక్కర్లేదు. లెక్చరర్స్ ని చెప్పనివ్వరు, లేడీ స్టూడెంట్స్ ని బతకనివ్వరు. తలవంచుకుని నెగ్గుకు రావడమే ఇలాంటి చోట కష్టం. కాలేజీలలో చదువుకుంటున్న, వయస్సులో ఉన్న అబ్బాయిలూ అమ్మాయిలూ సరాసరి స్టేజీ ఎక్కి 'అడిగిన దాని చెప్పి...' అని 'లెయ్' మని గెంతడం సహజత్వానికి సహాప్రయోజనాల దూరంలో ఉండే సినిమాలకు, నవలలకూ మాత్రమే పరిమితం. వద్దని నేనెంత చెప్పి చూసినా వినక పొతే నాన్నతో చెప్పబోయాను. నాకంటే ముందే అది చెప్పుకుంది.
    'చూశావా నాన్నా వీడి ఏడుపూ? ఎంతసేపూ పుస్తకంలోనే పడి కొట్టుకు పోడం అందరికీ చేతగాదుగా! ఇంతకీ నాటకంలో వేషం వేస్తె వచ్చిన నష్టమేమిటీ అంటా? రంగస్థలం ఎక్కిన వారంతా రంగసానులేనా?'
    'ఒకళ్ళ సంగతి మనకెందుకు తల్లీ! మన సంప్రదాయం మనది. రేపొద్దున్న ఏమైనా తేడా పాడా లోస్తే యిక నీకు పెళ్ళవడమంటూ ఉంటుందా?' అని చెప్పలేకపోయారు నాన్న. ప్రేమ గుడ్డిది యిక అభిమానం అంధకారం కదా! కాని నాన్నగారికీ నాకూ ఆ విషయం అర్ధం చేసుకోవటంతో సహా ప్రాంతం ఉంది. తోటి సోదరీమణులకి సోదర విద్యార్ధులు ఎంత గౌరవం యిస్తారో నాకు తెలిసినంత వరకూ అయన కేలా తెలుస్తుంది? ఇంకో యిన్ని దుష్పాలితాలు జరిగినా 'సహావిద్య' కు వ్యతిరేకంగా తగిన ప్రయత్నాలు జరగవు. తల్లి దండ్రులకే చీమ కుట్టదు. కానియ్యండి, లక్షల కొద్ది బలి అయినప్పుడు తప్ప జనంలో జాగృతి కలగక పోవడం సర్వ సాధారణం.
    చెప్పేదేమిటంటే ఆఖరికి ఆనాటకం పోలీసుల సహాయంతో పూర్తీ చెయ్యవలసి వచ్చింది. దొంగ తుమ్ములు, కుక్క కూతలతో సహా తోటి విద్యార్ధులు, ప్రభ గురించి చేసే అతి నీచమైన విమర్శలు వినలేక నాటకం సగంలో యింటి కొచ్చేశాను. ఆ తరువాత వచ్చిన పొగడ్తలు తల తీసేశాయనుకుంటాను. 'నిజంగా మీరు చివరి దాకా వేస్తారా, వెయ్యగలరా అనిపించింది నానా అల్లరీ చేసిన వెర్రి వెధవలు వాళ్ళే సిగ్గు పడి పోయి ఉంటారు. మీ ధైర్యం మెచ్చుకో దగ్గదండీ విద్యుత్ర్పభాదేవి గారూ!'
    'మొదటి నాటకంలోనే మీరింత ప్రతిభ ప్రదర్శిస్తారని ఎవరూ కలలో అయినా అనుకోలేదు. పదేళ్ళ బట్టి యాక్టు చేస్తున్న సినిమా తారల్ని చూశాం గాని.... అబ్బే!'
    'అంతగొడవలో ప్రాంప్టింగ్ అందక మీరేం అడ్డదిడ్డం చేస్తారో అని హడలి చచ్చాం. మీ పోర్షన్ కాక నాటకం అంతా మీకు కంఠతా వచ్చునని మాకేం తెలుసూ?'
    'నాటకం మాటకేం గాని మీది చాలా ఫోటో జేనిక్ ఫేస్ అండి. మీరు పైకి రావడం యిక్కడ కాదు. వెండితెర మీదే మిమ్మల్ని చూడాలి.' ఇలా వందలూ వేలు ప్రశంసలు. ఈవిధంగానైనా దాన్ని పలకరించి తృప్తి చెందుదామని నేల లెక్కని వెర్రి కుంకలు ముందు కోస్తున్నారని నేనంటే అదేమంటుందో ఎవరైనా ఊహించవచ్చు. ఈ పొగడ్తల వల్ల అందరి కంటే ఎక్కువ నష్టపోయింది మా నాన్నగారు. అయన గవర్నమెంటు ఉద్యోగి కాబట్టి ఆ సభకు అధ్యక్షత వహించిన కలెక్టరు గారు ప్రభను పొగడక తప్పలేదని అయన గ్రహించినట్టు కనపడదు. ఆఏడు దానికి అన్నిటిలోనూ కనీసపు మార్కులు వచ్చినప్పుడు ఇదింక చదవడం వల్ల నష్టమే గాని లాభం లేదని నేను చెబుదామని నాన్నగారి దగ్గరకు వెళ్ళెను. నేను మాటాడకుండా నానోరు మూత పడేలా ఆయనే మొదలెట్టేరు. ' చూశావురా అబ్బాయి' మన ప్రభ మార్కులు! అవతల నాటకాల్లో మెప్పు సంపాదిస్తూ యివతల చదువులో కూడా ఈ మాత్రం గానైనా ఉందంటే మనకి గర్వకారణం . నిజంగా మన యింటికి ఎప్పటికయినా ఖ్యాతి తెచ్చేది , అదే.' అవును. మా యింటికీ, మా వంశానికి తీరని అపఖ్యాతి తెచ్చింది విధ్యుత్ర్పభే. వివేకం లేని స్వేచ్చా స్వాతంత్రాల వలన ఎంతవరకూ నష్టపోతామో అంతా నష్టపోయింది. ఫ్రండ్స్ తో ఎస్కర్షన్ కని మెడ్రాసు వెళ్ళిన మా చెల్లెలు మళ్ళీ రాలేదు!'
    "ఏమైందీ?' అన్నాను నేను ఆతృతగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS