Previous Page Next Page 
స్త్రీ పేజి 21

 

    'బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ అడుకొండర్రా! చిన్నతనాల్లోనే పెళ్ళిళ్ళవుతాయి" అంటుండేది పద్మజా వాళ్ళమ్మ. పద్మజ అటువంటి అట అంటే చిరాకు పడేది. పార్వతి సరదా పడితే, "ఏం? నీకు పెళ్ళంటే ఇష్టమా? బొమ్మల పెళ్లి చేస్తే నీకూ తొందరగా పెళ్ళయిపోతుందనా?' అని కసిరేది.
    పార్వతి తెలిసీ తెలీని విధంగా సిగ్గుపడుతూ -- "పెళ్ళంటే ఎందుకు బావుండదు? చక్కగా  కొత్త బట్టలు కట్టుకుని పల్లకి ఎక్కి....." అంటూ సరదా పడితే పద్మజ బొమ్మలాటకు ఒప్పుకునేది. తను మగపిల్లవాడి తల్లిగా పెత్తనం చెలాయించేది. పార్వతి పెళ్ళి కూతురు తల్లిగా కస్టాలు నటిస్తూ కన్నీళ్లు కూడా పెట్టుకునేది. తలుచుకుంటే నవ్వొస్తుంది. రుక్మిణి ఎన్ని బొమ్మల పెళ్ళిళ్ళు చేసిందని ఇంత చిన్నతనంలో పెళ్ళి కూతురైంది! పదిహేనేళ్ళ వయస్సు కే చదువు ఆపుచేసి రుక్కుకు పెళ్ళి చేయటం పార్వతికి ఒక రకంగా బాధ కలిగించినా ఎన్నో విధాల అలోచించి దాన్ని సరిపెట్టుకుంది. శాంతమ్మత్త పెద్దరికం లో తామం లాంటి భర్త నీడన బ్రతకటం లోనే రుక్కు ఎక్కువ సుఖపడుతుంది. దాని భవిష్యత్తు కోక అమూల్యమైన రక్షణ ఉంటుంది. అత్తవారింటి కెళ్ళినా అది ఏవిధంగానూ బాధపడనక్కర్లేదు. వయస్సు గడుస్తున్న కొద్ది అదే అనుభవాలు సంపాదించుకుంటుంది. సూర్యం చదువు సమస్య ఉండగా రుక్కును కూడా చదివించటం అసాధ్యం. మరో రెండేళ్ళు పోయినా తప్పని ఆ పెళ్ళి ఇప్పుడే చెయ్యటం లో నష్టమేమీ లేదు. బిడ్డలకు పెళ్ళిళ్ళు చెయ్యాలని ఇందుకే కాబోలు తల్లిదండ్రులంతగా తాపత్రయ పడతారు!
    చిన్నారి రుక్మిణి రామం సోత్తయి పోయింది. సాధ్యమైనంత నిరాడంబరంగా దేవాలయంలో పెళ్ళి చేసింది పార్వతి. వధూవరులిద్దరూ వంగి తన పదాలకు నమస్కారాలు చేస్తుంటే చటుక్కున వెనక్కు నడిచి అప్రయత్నంగా కళ్ళు తుడుచుకుంది . హృదయం ఎంత తేలిక పడిందో అంత భారంగానూ తయారైంది.
    రుక్మిణి అత్తవారింటికి వెళ్ళిపోయింది. రైలేక్కే టప్పుడు ఏడిస్తే ఎలా ఒదార్చటమోనని కంగారు పడింది పార్వతి. రుక్కు అలా బెంగ పెట్టుకున్న లక్షణాలే కనిపించలేదు. సిగ్గు సిగ్గుగా నవ్వుతూనే కూర్చుంది మొగుడి పక్కన. 'చిన్నతనం. కష్టం సుఖం మాత్రం ఏం తెలుస్తాయి?' నిట్టుర్చుతూ ఇంటికి మళ్ళింది పార్వతి.
    "ఇల్లు ఎంతో బోసిగా ఉంది గానీ నా మనస్సు చాలా నిండుగా ఉంది, పద్మా! ఇక సూర్యం చదువు కూడా పూర్తీ చేయించగలిగితే నేను సాధించవలసిందేమీ ఉండదు. ఇవ్వాళే రుక్కు అత్తవారింటికెళ్ళిపోయింది. ఎంత ధైర్యంగా వెళ్ళిందనుకున్నావ్! నీ పరీక్షలు దగ్గర పడుతున్నట్టున్నాయి. నాకు జవాబు వ్రాయ నక్కర్లేదులే. శ్రద్దగా నీ చదువు సంగతి చూసుకో. సుజా పరీక్షలు బాగానే వ్రాశానని చెప్పింది." అంటూ కాలక్షేపంగా పద్మజ కో ఉత్తరం వ్రాస్తూ కూర్చుంది.
    ఒక్క నెలరోజులు మాత్రం అతి బలవంతంగా మీద చెల్లెలి ధ్యాస మళ్ళించుకోగలిగింది. జీతాలు అందాయి. ప్రైవేటు పిల్లలు కూడా డబ్బు తెచ్చి ఇచ్చేశారు. 'ఒక్కసారి రుక్కును చూసివస్తేనో?" అనిపించింది. సూర్యాన్ని పిలవాలని లేచి వెళ్ళేసరికి , "క్షమించు, గోపీ, నా పరిస్థితి నీకు తెలియనిది కాదు" అంటూ స్నేహితుణ్ణి సాగి నంపుతున్నాడు సూర్యం. "ఏమిటి, సూరీ?" అంటే, "ఏం లేదక్కా! పరీక్షలు కాగానే ఏక్స్ కర్షన్ కి వెళ్దామని అనుకున్నారు మా క్లాసు వాళ్ళంతా. నేను రాలేనని చెప్పాను" అన్నాడు.
    పార్వతి ఆప్యాయంగా చూసింది. "పోనీ, వెళ్ళరాదూ?"
    "ఎలా, అక్కా? ఎంత లేదన్నా నలభై రూపాయలేనా...."
    "ఫర్వాలేదులే , వెళ్ళు, జీతాలన్నీ అందాయి."
    "వద్దక్కా. డబ్బు అలా ఖర్చు చేసి అనవసరంగా తిరగక పోతేనేం?"
    "ఎక్స్ కర్షన్స్ వెళ్ళి రావటం ఎప్పుడూ అనవసరం కాదు, సూరీ! ఎన్ని వందల పుస్తకాలు చదివితే ఆ జ్ఞానం సంపాదించగలవు? నాలుగు ప్రదేశాలు తిరిగి నాలుగు స్థలాలు చూసి నాలుగు వాతావరణాలు అనుభవించి తెలిసికోగలిగే జ్ఞానమే  ఎక్కువ. ఒక శిల్పాన్ని గురించి ఎన్ని పేజీలు  చదివినా ఒక్క నిమిషందాన్ని స్వయంగా చూసినప్పటి అనుభూతి రాదు. వెళ్ళు, సూరీ! వచ్చే నెల నేను రుక్కుదగ్గరికి వెళ్తాను. యాభై రూపాయలున్నాయి. తీసుకెళ్ళు." తదేకంగా చూస్తున్న సూర్యం చూపుల్లో భావం అర్ధం చేసుకోటానికైనా ప్రయత్నించలేదు పార్వతి.

                             *    *    *    *
    ఏమ్.బి.బి.ఎస్ . రిజల్ట్స్ వచ్చాయి. పద్మజ పరీక్ష పాసైంది.
    పేపరు ముఖంగా ఆ అనుమానం కాస్తా తీరిపోతే పద్మజ కూడా తేలిగ్గా నిట్టూర్చింది.
    కోర్టు లోనే శుభవార్త విన్న ఈశ్వర సోమయాజి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక అపూటకు వ్యవహారాలు ముగించుకుని ఇంటికి వచ్చేశాడు. "అమ్మా! పద్మా!" అంటూ సంతోషాతిరేకంతో కేకపెట్టాడు.
    పద్మజ వస్తూనే తండ్రి పాదాలు స్పృశించబోయింది. "ఇది నీ భిక్షే, నాన్నా!" అనగలిగింది -- ఎన్నడూ లేని విధంగా కళ్ళు చెమర్చగా.
    కూతురు చేతులు పట్టి లేవదీసి దగ్గరికి తీసుకున్నాడు సోమయాజి. "లేదమ్మా! ఇదంతా నీ పవిత్ర కాంక్ష! రాత్రింబవళ్ళు , నిర్విరామంగా కృషి చేసి ఈ ఫలితాన్ని సాధించావు. నీ మీద నాకీ నమ్మకం ఆదిలోనే కలిగింది. ఆశించింది పొందగలిగిన నాడు జీవితం ఓ బంగారు కలలా బాసిస్తుంది. వెయ్యేళ్ళు సుఖంగా వర్ధిల్లు తల్లీ!" అంటూ నిండు మనస్సుతో దీవించాడు.
    గడప లోనే కూర్చుని ఉన్న కామేశ్వరమ్మ ఆనందం దాచుకోలేక కళ్ళ నీళ్ళు ఒత్తుకుంది. "ఏమిటో ఇది సామాన్యమైనది కాదు . దీని జాతకం అది నుంచీ చిత్రంగానే జరుగుతోంది." అంది నిట్టురుస్తూ.
    అయేడే సుజా స్కూలు ఫైనల్ పాసైంది. తల్లితండ్రుల సంతోషానికి అవధులు లేకపోయాయి. "మీ కూతురే కాదు, నా కూతురూ పరీక్ష నెగ్గింది, విన్నారూ?' అంది కామేశ్వరమ్మ భర్తతో హస్యమడుతూ. సోమయాజి ముసిముసిగా నవ్వాడు. "పిచ్చిదానా! ఈ తేడాలు నీకే గాని నాకు లేవే! ఉన్న రెండు కళ్ళలోనూ ఓ కన్ను నీదీ, ఓ కన్ను నాదీనా? సుజా బంగారు తల్లీ! అక్కని చూసి బుద్దిగా చదువుకుంటోంది."
    "అదిగో , అదే మీ పక్షపాతం ! దాన్ని చూసే ఇది నేర్చుకుంటోందంటారేం?"
    "తప్పేముంది? పెద్ద వాళ్ళ అడుగు జాడల్లో చిన్నవాళ్ళు నడవచ్చుగా?"
    "ఇక అక్కడికి దీనికేమీ చేతకానట్టు." అంటూ కయ్యానికి సిద్దమైంది కామేశ్వరమ్మ.
    తల్లిదండ్రుల వాదం విని నవ్వుకొంటూ కూర్చున్న పద్మజ ను ఉద్దేశిస్తూ అంది సుజాత: "అక్కయ్యా , ఈ పరీక్ష పాసైతే నాకు బహుమతి ఇస్తానన్నావు కదూ?"
    "అవును. నేనేం మరిచి పోయా ననుకుంటూన్నావా?"
    "అయితే ఎప్పుడిస్తావేమిటి?"
    "అసలు నీకేం కావాలో చెప్పు. ఖరీదైన పెన్ను కావాలా? ముత్యాల దుద్దులు కావాలా? శరత్ సాహిత్యం కావాలా? ఏం కావాలి? నీ అభిరుచేమిటో కొంచెం చెప్పు మరి" అంటూ నవ్వింది పద్మజ.
    "అవేమీ కావు, నీ రిస్ట్ వాచ్ కావాలి."
    "నాదా? ఇదెందుకూ? అప్పుడే కొని ఏడు సంవత్సరాలైంది. నన్ను ఉద్యోగం లో చేరనీ! ఇంకెంత? ఓ నెల్లాళ్ళ లో వెళ్ళనే వెళ్తున్నాను. మొదటి జీతం అందుకుని నీకేం కావలసినా కొని పెడతాను. కొత్త వాచీయే కట్టుకుందువు గాని కాలేజీ కి వెళ్ళేసరికి , సరేనా?"
    "నాకేం కొత్తది వద్దక్కయ్యా! నీ వాచీయే నాకు కావాలి. నేను అడిగిందే నాకిస్తే బావుంటుంది."
    "సుజా! ఇదేం పిచ్చి నీకు? అంటూ పద్మజ తన చేతి వాచ్ విప్పి సుజా ఎడమ చేతికి కట్టింది. "సుజా, ఉడు నీకు కాబట్టే ఇవ్వగలుగుతున్నాను. దీనికి నా చరిత్రంతా తెలుసు. ఈ ఏడేళ్ళూ నా శరీరంలో ఓ భాగమై పోయింది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS