"క్షమించక్కయ్యా! నీకు కష్టంగా ఉంటుందని తెలిసి కూడా ఇదే కోరుకున్నాను. నీలా నేనూ ఓ డాక్టర్ని కాలేకపోయినా కొంతవరకైనా నీ ఔన్నత్యం అందుకుందామని " అంటూ అమాయకంగా చూస్తున్న చెల్లెలి చేయి నొక్కుతూ "ఇలాంటి పిచ్చి పిచ్చి కబుర్లు మాట్లాడకు. నిన్ను నువ్వే ఎందుకలా చులకన చేసుకుంటావు? నీకూ డాక్టర్ కావాలనే కోరికా పట్టుదలా ఉంటె కాదనే దేవరు? మనిషికి అన్నిటి కన్న ఆత్మ విశ్వాసం ముఖ్యం." అంది.
"లేదక్కయ్యా! నాకు డాక్టర్ కావాలని లేదు. కాని ఏదో పెద్ద చదువులు చదవాలని ఉంది."
'అవును, సుజా! నీ మనస్సూ శరీరం కూడా సున్నితమైనవి. డాక్టర్ చదువులో నువ్వు రాణించలేవు. ఆ పరిశ్రమకి తట్టుకోనూ లేవు. ఆర్ట్సు చదువుకో. నీ అభిరుచికి సరిపోతుంది."
ఎప్పుడు వచ్చింది జానకి ఆడబిడ్డల కబుర్లు వింటూనించుంది.
"ఏం, వదినా, అంత మౌనం భోజనం చేస్తున్నావు?" అంటూ నవ్వింది పద్మజ.
"బావుంది. వింటూ నించున్నాను. అంతకన్నా నాకేం తెలుస్తుంది?"
"ఎందుకు తెలీదూ? నోరు ఉందిగా? మాట్లాడటం తెలీదూ?"
"భగవంతుడు నోరు ఇచ్చాక తెలిసినా తెలీక పోయినా మాట్లాడాలి."
"నోరు ఇచ్చిన భగవంతుడే బుర్ర కూడా ఇచ్చాడు వదినా! కాస్త అలోచించి మరీ మాట్లాడాలి."
పద్మజ హస్యాలకూ, జానకి ఉడుక్కోటానికీ సరిపోతుంది.
"ఏమిటే పద్మా, వదిన్నేదో అంటున్నావు?" అంటూ వచ్చింది కామేశ్వరమ్మ.
"నీ కోడల్ని నేనేం కొరుక్కుతినటం లేదమ్మా! కావాలంటే నువ్వే అడుగు. ఏం, వదినా? నిన్ను నేనెక్కడైనా కోరికానా? లేదు కదూ?"
జానకి ముసిముసిగా నవ్వేసింది.
"దాని కబుర్ల కేం గానీ నువ్వేం అనుకోకమ్మా జానకీ."
"అత్తకీ, కోడలికీ సరిపోయింది." అంటూ నవ్వింది పద్మజ. పార్వతి రాకతో వాతావరణం కొంచెం మారింది.
"అబ్బో! బొత్తిగా నల్లపూసవై పోయావు" అంటూ ఎదురు వెళ్ళింది పద్మజ.
"నేను చింత పిక్కలాగే ఉన్నా నీకంటికి నల్ల పూసలా కనిపిస్తున్నాను. చూశావా చిత్రం! ఈ ప్రమాదం రాకూడదనే బయల్దేరి వచ్చేశాను. నీ ఆస్పత్రి ఎప్పుడు తెరుస్తావేమిటి? పేషంటు గా మొదట నేనే చేరిపోతాను."
"నేను మరిచి పోయిన్నాడు కదా పేషెంటు గా చేరతానన్నావు? నీకా అవసరం ఎప్పుడూ రానివ్వను లే."'
"ఏమిటో నమ్మకం?"
"నీకు లేకపోతె నీ ఖర్మ! నాకుంది."
"అబ్బబ్బ! ఏమి వాదాలర్రా? ముందిలా వచ్చి కూర్చో, ఆమ్మాయ్, పార్వతీ!"
పార్వతి కామేశ్వరమ్మ దగ్గరికి వచ్చి కూర్చుంది.
"మీ చెల్లాయి దగ్గర్నుంచేమైనా ఉత్తరాలు వస్తున్నాయా? మొన్న వొచ్చి అప్పుడే వెళ్ళి పోయింది గదూ? మొగుణ్ణి వదలదులా ఉంది."
పద్మజ పార్వతి దగ్గరికి వచ్చి కూర్చుంటూ అంది: "నేను పుట్టాక మా అమ్మ తాతగారింటికి కెళ్ళినట్టు గుర్తు లేదు."
'అఘోరించావ్ లే, మహా అన్నీ నీకే తెలిసినట్లు" అంటూ నవ్వింది కామేశ్వరమ్మ.
ఈశ్వర సోమయాజి కూడా హాల్లోకి రావటం తో జానకి లోపలికి తప్పుకుంది. "నీ ఆఫీసు పనీ అదీ తేలిగ్గా ఉంటోందా , అమ్మా?" అంటూ పలకరించాడు పార్వతిని.
"అంతా బాగానే ఉంది గాని ఈసారి బదిలీ తప్పేలా లేదు , బాబాయ్! అదే ఆలోచిస్తున్నాను."
"దాని కంత ఆలోచనేముంది? ఆమాత్రం తప్పించలేక పోతామా?"
"అదీ నాకిష్టం లేదు, బాబాయ్! ఉద్యోగం అన్న తర్వాత వాళ్ళ పద్దతుల ప్రకారమే నడవటమే ధర్మమనుకుంటాను. అదీగాక సూర్యం సరదా పడుతున్నాడు మరో కాలేజీ కి పోవాలని. ఈ కాలేజీ బొత్తిగా రాజకీయాలతో నిండి పోతోందంటున్నాడు. మేమిద్దరం ఏ ఊళ్ళో ఉంటె మాత్రం ఏం కష్టం? బదిలీ ఒప్పుకుని వెళ్దామనే ఉంది."
"నిజమే , పారూ! కాస్త లోకజ్ఞానం పెరగాలంటే నాలుగు ఊళ్లూ చూడాలి. రుక్మిణీ వాళ్ళ ఊరు వెళ్తూ దారిలో దిగి ఇక్కడికి వస్తూనే ఉండచ్చు. ఏ మంత దూరం వెళ్ళిపోతున్నావు గనకా భయపడ్డానికి?" పద్మజ కూడా పార్వతి బదిలినీ ప్రోత్సహించింది.
"కొత్త ఊరు, కొత్త మనుషులూ ఆడపిల్లెం బాధ పడుతుందర్రా?' అంటూ కామేశ్వరమ్మ అభ్యంతరాలు చెప్పబోయింది.
"పోనీ, నాలుగైదు నెలలు చూద్దాం. అంతగా సరిపడలేకపోతె తిరిగి ఇక్కడికే వస్తుంది ఏమమ్మా, పార్వతీ!" సోమయాజి సలహా ను అంగీకరిస్తూ, "అలాగే , బాబాయ్! నాకు ఇష్టంగానే ఉంది' అంది పార్వతి.
అనుకున్నట్టుగానే పార్వతీ కి బదిలీ వచ్చింది. వెళ్ళబోయే,ముందు రఘుపతి కనిపిస్తాడేమోనని రోడ్డు మీదికి చాలాసార్లు చూసింది. రెండు మూడు రోజుల నుంచీ ఎదురు చూస్తున్నా రఘుపతి జాడేమీ తెలీలేదు.
"రఘూ ఊళ్ళో లేడేమిట్రా?' అంది తమ్ముడితో యధాలాపంగా.
"లేడక్కా! అత్తారింటికి కెళ్ళినట్లున్నాడు అన్నాడు సూర్యం.
"బావుంది' అనుకొంది పార్వతి.
పార్వతి వెళ్ళిన మరో నెల్లాళ్ళ కు మద్రాస్ జనరల్ హాస్పిటల్ హౌస్ సర్జన్ గా ఆర్డర్స్ అందుకోగానే బయల్దేరింది పద్మజ కూడా.
'డాక్టరు చదువు చదివిందని సంతోషపడ్డామే గానీ జీవితమంతా అది ఉద్యోగాలు చేసుకొంటూ తిరుగుతుంటే ఏమిటో ఆ సుఖం?" అనుకుని నిట్టూర్చింది కామేశ్వరమ్మ. కూతుర్ని మెయిల్ ఎక్కిస్తూ దిగులుగా చూశాడు ఈశ్వర సోమయాజి. "నిన్ను చదువుకు పంపిస్తున్నప్పుడెంతో గర్వంగా ఉండేదమ్మా! ఇప్పుడేమిటో మనం చాలా దూరమై పోయినట్టు....."
"అదేమిటి నాన్నా! నువ్వు బాధపడుతున్నావా?"
"లేదమ్మా! బాధ పడటం కూడా ధర్మం కాదు. నువ్వొక డాక్టర్ వి! అహో రాత్రం కష్టించి నేర్చుకున్న విద్య ని సద్వినియోగం చేయాల్సిన బాధ్యత నీ ,మీద ఉంది. నీ జీవిత లక్ష్యమే అది. ఇక నాకు బాధ దేనికి? వెళ్ళిరా అమ్మా! నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొంటూ ఉండు. వారానికో ఉత్తరమైనా వ్రాస్తూ ఉండాలి సుమా! లేకపోతె...."
"లేదు, నాన్నా! తప్పకుండా వ్రాస్తాను. నువ్వు కూడా బద్దకించ కుండా జవాబులు వ్రాయాలి మరి."
"వెళ్ళొస్తా" అంటూ ఇంజను అరిచింది. కర్కశంగా కన్నతండ్రి కళ్ళ ముందు నుంచి కూతుర్ని తీసుకు పోయింది.
.jpg)
పద్మజ వెళ్ళిపోయిన రాత్రి నుంచే కామేశ్వరమ్మ భర్తను సాధించడం మొదలు పెట్టింది -- "పెద్దదానికి పెళ్ళి చేస్తేనే గాని నాకు తృప్తి లేదండీ! అది ఎన్ని విద్యలు నేర్వనివ్వండి! ఎంత లేసి ఉద్యోగాలు చెయ్యనివ్వండి! అడ పుట్టుక పుట్టాక ఓ ఇల్లాలు కాకుండా ఉండి పోతుందా ?" అంటూ.
"పిచ్చిదానా! పద్మకి వరుణ్ణి వెదకటం మాటలనుకుంటున్నావేమిటే? ఎంత విద్యాధికుడై ఉండాలి! ఎంత అందగాడై ఉండాలి! అమ్మాయికి నచ్చటం అలా ఉంచి...."
"ముందు మీకే నచ్చేలాగా లేదు."
"ఉన్నమాటన్నావ్. పద్మ తల్లికి అన్నివిధాలా తగిన వరుడు లభిస్తే గాని పెళ్ళి మాటే తలపెట్టను."
"ఇదేం వితండవాదనండీ! అందాలూ చదువులూ గుణాలూ ఆస్తులూ అన్నీ ఒక్కడికే ఉంటాయా? ఎలాగో మనం సరిపెట్టుకోవాలి గానీ...."
"సరిపెట్టుకునే ఖర్మ మిటే? మన తల్లికేం తక్కువనీ?"
"కాకపోవచ్చు. అంత మాత్రాన అందరికీ వంకలు పెడితే....'
'అంత బుద్ది తక్కువ పని ఎన్నడూ చెయ్యను. కాని నాకు నచ్చకుండా ఎలా నిర్ణయించేది?"
ఓ సంవత్సరం పరాన్వేషణ లోనే గడిచింది కాలం. "ఇక బిడ్డలా పెళ్ళిళ్ళూ నా కళ్ళతో చూసే భాగ్యం లేదు.' అంటూ కన్నీళ్ళు ఒత్తుకునే వరకూ వచ్చింది కామేశ్వరమ్మ. మరో ఏడెనిమిది నెలలు భార్య కన్నీటికి కరగకుండానే గడిపేశాడు సోమయాజి.
"పెద్దదానికి ఈ ఏడాదైనా పెళ్ళి చేస్తారా? చెయ్యరా? ఏ ముక్కా తేల్చి చెప్తే గాని పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను." అని శపథం చేసి హటాత్తుగా ఉపవాసాలు ప్రారంభించింది కామేశ్వరమ్మ.
ఈశ్వరసోమయాజి నవ్వుకుంటూ భార్యను బుజ్జగించాడు. "ఇన్నాళ్ళూ నేనేదో పట్టించుకోకుండానే ఊరుకున్నాననుకున్నావు కదూ? ఎంత వెర్రి బాగుల దానివే! రేపో మాపో ఈ కబురు కాస్తా నీ చెవిని వేద్దా మనుకుంటే నువ్విలా హటాయించుకు కూర్చున్నావు."
అంత కోపంలోనూ రుసరుసలాడుతూ అడిగింది కామేశ్వరమ్మ" "ఏమిటా కబురు? అక్కర కొచ్చేదేనా?"
"విను, మరి. రామవదాన్లు గారి పెద్ద కొడుకు ఎమ్. ఎ. ఎల్. ఎల్. బి. చదివాడు. పెద్ద లాయరు. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. అతగాడు పట్టే కేసుకి తిరుగులేదు. రాగారాగా ఓ జడ్జీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మధ్యవర్తుల ద్వారా అంతా తెలుసుకున్నాను. సంబంధం మాట కూడా అడిగించాను."
'అంత కంగారేమిటి? వంశం, వంగడం అన్నీ తేల్చుకున్నారూ?"
"అక్షరాలాను. శ్రోత్రియ బ్రాహ్మణ వంశం. మన శాఖ. సరిగ్గా మీ అన్నదమ్ముల గోత్రం.సంప్రదాయమైన కుటుంబం. తల్లీ, తండ్రీ అప్ప చెల్లెళ్ళు, అన్నదమ్ములూ-- అంతా పుట్టెడు బలగం."
