తండ్రి మరణాన్ని కళ్ళారా చూసిన పార్వతి తట్టుకోలేక పోయింది. పిల్లలిద్దర్నీ కౌగలించుకుని బావురుమని ఏడ్చింది. ఆ క్షణం లో పార్వతిని ఒదార్చటానికి అప్తులంతా కూడుకున్నారు. క్షణాల మీద జరగవలసిన పనులన్నీ జరిపించారు. ఈశ్వర సోమయాజీ , కామేశ్వరమ్మ పార్వతికి ఎంతో ధైర్యం నూరి పోశారు. అన్నపూర్ణమ్మ, చలపతి రావూ కూడా ఓదార్చి వెళ్ళారు. ఎందరేన్ని విధాల నచ్చ జెప్పినా పార్వతి హృదయం చల్లబడలేదు. తలుచుకుంటున్న కొద్దీ తండ్రి చావు గుండెల్ని రంపపు కోత కొస్తుంది. కొండలా తండ్రి అండగా ఉంటె కాలం సునాయాసంగా దొర్లించగలుగుతుంది. ఇక ఎదుగుతున్న పిల్లల్ని పెట్టుకుని ఉద్యోగం చేసుకుంటూ ఇలా ఎంత కాలం గడుపుతుంది? ఎప్పటికి బాధ్యతలు నిర్వహిస్తుంది?
(2).jpg)
"పారూ!"
త్రుళ్ళి పడి చూసింది పార్వతి. తడబడ్డాడు రఘుపతి. "ఇలా అనుకోకుండా మాస్టారు పోవటం...."
దుఃఖం ముంచుకు రాబోయింది. బలవంతంగా ఆపుకు తలదించుకుంది.
"అయన మనో వేదనతోనే పోయినట్టున్నారు, పార్వతీ! నీకెంతో కష్టం వచ్చింది. దీనికి....నేనే కారణమేమో ననుకొంటున్నాను." తనను తనే నిందించుకుంటున్న ధోరణి లో అన్నాడు.
చటుక్కున తలెత్తి చూసింది పార్వతి. రఘుపతి మొహమంతా చెమటలు పట్టి ఉన్నాయి. సూటిగా చూడలేక చూపులు తిప్పుకున్నాడు. "మాస్టారు బెంగ పెట్టుకుని ఇంత తొందరగా చచ్చిపోయారంటే.....నేనూ కారణమే." మళ్ళా అదే మాట.
పార్వతి దృడంగా అంది: 'ఆయనకి ఆయుష్షు నిండి అయన పోయారు. దాని కెవరూ కారణం కాదు. అనవసరంగా నువ్వు బాధపడకు , రఘు బాబూ!"
"కాదు, పార్వతీ! నన్ను క్షమిస్తే సంతోషిస్తాను. మా వల్లనే మీ కుటుంబం...."
"ఇంకెప్పుడూ అలా మాట్లాడకు, రఘు బాబూ! మా రాతలేలా ఉంటె అలా జరుగుతాయి. దాని నువ్వు కర్తవు కాదు. లేనిపోని నిందలు నీమీద వేసే పాపం మాకక్కర్లేదు. ఇంత దయ తలిచి పలకరించడానికి వచ్చావు . అదే పది వేలు."
మరేమీ మాట్లాడలేకపోయాడు రఘుపతి. కాస్సేపు నిలబడి వెళ్తాననైనా చెప్పకుండా నెమ్మదిగా వెళ్ళిపోయాడు. పార్వతి రెండు చేతులూ మొహానికి కప్పుకుని ఏడుస్తూ కూర్చుంది.
దొడ్లో పని చూస్తుకుంటున్న శాంతమ్మ లోపలికి వచ్చి పార్వతిని చూస్తూ, "అమ్మాయ్, పార్వతీ! ఎన్నాళ్ళి లా ఏడుస్తూ కూర్చుంటావు? చిన్నతనంలో తల్లి పోయినప్పుడైనా నువ్వింత బెంగ పడలేదు. పుట్టిన వాళ్ళుగిట్టటం కొత్తేమీ గాదు కదా? ఇవ్వాళ వాళ్ళూ, రేపు మనమూను. లే. లేచి కాస్త మొహం కడుక్కో. నువ్వే ఇలా దిగాలు పడితే ఇక చిన్నవాళ్ళ మాటేమిటి? ఏం జరిగినా దేవుడి మీద భారం పడేసి ధైర్యంగా ఉండాలి గానీ...." అంటూ మందలిస్తున్న కొద్దీ పార్వతి బాధ ఎక్కువైంది. "అత్తా!" అంటూ శాంతమ్మ ఒళ్ళో ఒరిగి బావురుమంది.
శాంతమ్మ పార్వతికి వేలు విడిచిన మేనత్త. ఆవిడవంటి సహృదయులు ఉండబట్టే ఇంకా బంధుత్వాలు విలువ నిలిచి ఉంది. చీటికి మాటికీ వచ్చి పలకరించి పోయే తీరిక లేకపోయినా, కష్టానికీ, సుఖానికీ ఆవిడేన్నడూ తప్పుకోలేదు. పల్లె పట్టున సుఖ శాంతులతో బ్రతుకుతున్న ఆవిడికి పట్నం లో అగచాట్లు పడే బీద అన్నగారి కుటుంబం మీద సానుభూతి ఎంతైనా ఉంది. ఉప్పులో, ఉప్పూ, పప్పులో పప్పూ మూటలు కట్టి పట్నం పంపించిన రోజులు కూడా ఉన్నాయి.
"ఛ! అలా బాధపడకమ్మా! కాస్త గుండె నిబ్బరం చేసుకో. లేచి కొంచెం మొహం కడుక్కో." అనునయంగా బోధించసాగింది మేనకోడలికి.
"అత్తా, నేను నిన్నొకటి అడుగుతాను." సూటిగా అనేసింది పార్వతి.
"ఒక్కటి గాడు. లక్ష అడుగుడువు గాని. ముందు లేచిరా! లేచి కొంచెం కాఫీ తాగు."
"ఊహూ! ముందు నేను అడిగింది చెప్పు." శాంతమ్మ అమాయకంగా నవ్వింది. "ఏమిటే అది, పిచ్చిదానా!"
"నాన్నే నీకు చెప్పాలనుకున్నాడు. ఆఖరి చూపు కూడా అందలేదు. అయన మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాట కాదనలేవు. అడగ మంటావా?"
"నా దగ్గర నీకింత తటపటాయింపెమిటే?"
"రుక్కుని మీ రామానికి చేసుకుంటావా?" మాట అనేసి ఆత్రుతగా చూసింది పార్వతి.
శాంతమ్మ నోటి నిండా నవ్వుతూ, "ఓసీ, నీ సందేహం కూలా? ఆఖరికి ఇదేనా? ఏవిటో అనుకున్నాను. ఈ ముక్క నువ్వు అడగాలిటే? నాకామాత్రం ఇంగితం లేదూ? మీ అమ్మా, నేనూ ఎన్నెన్ని హస్యలాడుకునే వాళ్ళం! ఎన్నెన్ని కబుర్లు చెప్పుకునే వాళ్ళం! మీ నాన్న మాత్రం నన్నెంత గారంగా చూసేవాడు! స్వంత చెల్లెలి కన్నా ఎక్కువగా సారెలూ, చీరెలూ పంపిస్తుండేవాడు. అదంతా మరిచి పోతానుటే? ఒక్క రెండేళ్ళు చిన్నదాని వైతే నువ్వే నా కోడలి వయ్యేదానివి. పోనీలే. రుక్మిణి మాత్రం పరాయిదా? నీ చెల్లెలే కదూ? దాన్ని నా కడుపులో వేసుకుంటాను. సరేనా?' అంది.
పార్వతి మంత్రం ముగ్ధలా కూర్చుండి పోయింది. ఇదంతా కలగాదు కదా? అత్తయ్య నిజంగానే మాట్లాడుతుందా? అడగ్గానే ఇంత తొందరగా ఒప్పెసుకుందా?
"ఏవిటే వెర్రిదానిలా చూస్తావ్?"
"అత్తా!' సంతోషంతో కళ్ళు ఒత్తుకుంది పార్వతి.
"అమ్మా , నాన్నా పోయారని నువ్వు మమ్మల్ని చులకన చేస్తా వనుకున్నాను. నిజంగా నువ్వింత మంచిదానివని....."
"చాల్లే! నీ ధోరణి నువ్వునూ."
"కాదత్తా! నీ సరదాలు తీరెంత కట్నాలూ కానుకలూ ఇవ్వలేను గానీ, అమ్మ పెరనున్న ఆ ఎకరం పొలం రుక్కుకే వ్రాయిస్తాను. మంచి చెడ్డల కేమీ లోటు రాకుండా నా శాయశక్తులా చూసుకుంటాను."
"ఏమిటే పార్వతీ , ఆ బెరలన్నీ ఇప్పుడు? నేను ప్రారంభించానా? తండ్రి చచ్చి నువ్వేడుస్తుంటే.... ఈ మాటలు వింటే ఎవరేనా ఏమనుకుంటారు? చాలు గాని లేచిరా! పెద్దపిల్లవేగాని నీకు బొత్తిగా జ్ఞానం లేనట్టుంది." శాంతమ్మ కసురుతున్న కొద్దీ పార్వతి హృదయం తేలికైంది. వాన కురుసి కురుసీ పారిపోయిన మేఘం లాగ చటుక్కున లేచి దొడ్డి వేపుకు నడిచింది. మొహం కడుక్కుని జడ అల్లుకుంది. వంటింటి గడప మీద కూర్చుని కాఫీ గ్లాసు అందుకొంటూ "అత్తా! కోపం తెచ్చుకోకు గానీ ఒక్కముక్క అడుగుతాను" అంది.
"ఇంకా ఏమిటి దిగడిందే!"
"రామానికి రుక్కుని చేసుకోవటం ఇష్టమే నంటావా?"
"వాడిష్టమేమిటే మధ్య, పెళ్ళి నేను చేస్తుంటే?"
"అలా కాదులే. అత్తా! ఈ కాలంలో పెళ్ళి చేసుకునే వాళ్ళే బాగా ఇష్టపడాలి. లేకపోతె మళ్ళా గొడవలు."
"అదా నీ భయం? అయితే మా వాణ్ణి చేసుకోటం నీ చెల్లెలికి ఇష్టమేనేమో అడిగావూ?"
నవ్వేసింది పార్వతి. "బావుంది . అదింకా చిన్న పిల్లెను. రామాన్ని చూడనైనా లేదు. దానికేం తెలుస్తుంది?"
"ఆ ముక్కే నేనూ అనేది. నీ చెల్లెలు నీ మాట వింటుంది గానీ నా కొడుకు నా మాట వినడూ? పోనీ, అది నేడో రేపో ఈడేరితే ఆ పెళ్ళి చూపుల తతంగం కూడా ముగించేద్దాం. వచ్చే వైశాఖం లో మూడు ముళ్ళూ వేయించేద్దాం. బావుందా?"
పార్వతి శరీరం పులకరించింది. అత్తయ్య బొత్తిగా మంచిది. ఇంత మంచి అత్తయ్య సంరక్షణ లో రుక్కుకు ఏం లోటు ఉంటుంది? రామం కూడా తల్లి లాంటి వాడే కావచ్చు. గుణగుణాలే మంతగా తనకు తెలీకపోయినా చెడ్డ లక్షణాలుండే అవకాశం లేదు. చూడ్డానికా అందమైన వాడు. ఆరోగ్య మైన వాడు. స్కూలు ఫైనల్ చదివి కాబోలు మానేశాడు. తండ్రి పోవటం తో పొలం పుట్రా చూసుకోక తప్పలేదు. ఎన్ని చదువులు చదివినా కడుపు నింపుకోటానికే గదా? దానికేం లోటు లేదు. చదివినా చదవక పోయినా హృదయం ఉన్నవాళ్ళు మనుష్యుల్లాగే బ్రతుకుతారు. రుక్కు అదృష్టవంతురాలే! దాని బాధ్యత ఇక తనకు లేదు.
బళ్ళో నుంచి వస్తూనే "ఆకలేస్తోందే అక్కా!" అంటూ రాగం తీసింది రుక్కు.
"ఒసే పెళ్ళి కూతురా! కాళ్ళు కడుక్కు మరీ రా! కాఫీ ఇస్తాను" అంది శాంతమ్మ ఎసట్లో బియ్యం వేస్తూ.
పార్వతి నవ్వింది. అక్క అలా నవ్వటం ఆశ్చర్యంగా తోచి పెరట్లో కి పరుగెత్తింది రుక్మిణి.
* * * *
