Previous Page Next Page 
సంపెంగలూ - సన్నజాజులూ పేజి 16

 

    'నువ్వు సర్వ స్వతంత్రురాలివి. నీను నేను చెప్పేదేముంది?
    'ఎందుకింకా నన్నిలా చిత్రవధ చేస్తారు? ఇంకా నన్నర్ధం చేసుకోలేదా? పొద్దుట ఆ రుక్మిణమ్మగారి ఉత్తరమూ అందులో దరఖాస్తుఫారాలూ అలా చింపి పారేశారే, అప్పుడు నా మనసెంత బాధపడి ఉంటుందో కొంచెమైనా ఆలోచించారా?'
    'నేను చింపేస్తే ఏమైంది? నా తెలివితక్కువ తనమే బయటపడింది. మరుక్షణం లో అన్నయ్యను పిలిపించుకున్నావు. మూడో నిముషంలో ఫారం కూడా నింపించి పంపించావు. నీకేమిటి అడ్డు? ఎందుకిలా తయారయ్యావ్?'
    'ఆ ప్రశ్న మిమ్మల్నే అడుగుదామనుకుంటున్నాను. అంత తొందరపడి అపార్ధం చేసుకోడం ఎప్పుడు నేర్చుకున్నారు? రుక్మిణమ్మగారికి గాని మా అన్నయ్య కి గాని ఫారం పంపమని నేను రాయలేదు. ఆమాటే నాకు జ్ఞాపకం లేదు. ఇప్పుడు నేనలా చెప్పినా మీరు నమ్మకపోతే నేనేం చేసేది? అన్నీ అలా ఉంచండి. సూటిగా చెప్పండి. నేను ఎం.ఏ ఫైనలు కి వెళ్ళడం మీ కిష్టముందా లేదా?'
    'లేదు'
    ఇంతవరకూ వచ్చాక నేను వదిలి పెట్టదలచుకోలేదు.
    "ఎందుచేత?'
    అయన మాట్లాడలేదు.
    "మీరలా వూరుకుంటే నేను ఒప్పుకునేది లేదు. ఇష్టం లేకపోతె విడిపోయే బంధం కాదు మనది. ఇన్నాళ్ళకు మనం ఇలా ఎదురుపడి మనసులో ఉన్నది చెప్పెసుకోడం అనేక విధాల సంతోషించవలసిన విషయం. ఇంకా మనసులో పెట్టుకుని కృంగి పోవడం, నాన్చడం - అభిప్రాయబేధాలు కలిగిన తర్వాత అవి చినికి చినికి గాలి నావలు కావడం -- యిలాంటివి మనలాంటి వాళ్ళు చూస్తూ వూరుకోవలసిన విషయాలు కావు. మీ అభిప్రాయం స్పష్టంగా చెప్పండి. నన్ను మీరు చదువుకోవద్దని చెప్పడానికి కారణం ఏమిటి?' అయన ఇటు తిరిగేరు.
    'సరే చెబుతాను విను. మధ్యలో ఏమీ అడక్కు. ఈ విషయం ఎక్కడ ఎవరికి జరిగిందని అడక్కు అలా అయితేనే చెబుతాను.'
    'సరే చెప్పండి' ఆయన ప్రారంభించారు.
    అతగాడు సెకండరీ గ్రేడు ట్రెయినింగ్ ప్యాసై హైస్కూల్లో పనిచేసేవాడు. అతనున్న ఇంటివారి నాలుగో అమ్మాయి ఇంటర్మీడియట్ ప్యాసై వూరికే ఉంది. ఒక పిల్ల వదిలినా చాలునని యింటి యజమాని కూతుర్ని ఒప్పించి అద్దె కున్నవాణ్ణి ఒక శుభమూహుర్తాన ఇంటల్లుడ్ని చేసుకున్నాడు. అతడు యిచ్చిన కొద్దిపాటి కట్నంతో అన్నీ కొనుక్కుని వాళ్ళిద్దరూ వేరింటి కాపురం పెట్టేరు. కొన్నాళ్ళ పాటు కులసాగానే సాగిపోయింది . వింటున్నావా?'
    నేనికపోవడఏమిటి? తను శ్రద్దగా వింటున్నాను , చెప్పండి.
    'ఆవిడ బియ్యేకి కడతానని కూచుంది ఒకనాడు. అతడంత మాత్రం వీల్లేదన్నాడు మొదట. నయాన్నో, భయాన్నో ఒప్పించింది. ఇంగ్లీషూ తెలుగూ గ్రూపూ వేరే వేరే కట్టి ఎలా అయితే నేం రెండేళ్ళ లో బియ్యే అనిపించుకుంది. అతడు కూడా చాలా తెలివైనవాడే గాని.....'
    'అయ్యో పాపం కాదు మరీ?'
    'చెప్పనియ్యి మరి.... అతడికి చదవడానికి కెక్కడా టైం ఉండేది కాదు. పిల్లలు లేకపోడం మూలాన యింటి పనులు అయిపోయాక ఏమీ తోచేది కాదు ఆమెకు. అందుచేత శ్రద్దగా చదివేది.' పైగా తెలివైనది, చురుకైనది -- మొత్తం మీద గ్రాడ్యూయెటు అనిపించుకుంది.
    'వూరికే ఉండి ఏం చెయ్యాలి. బియ్యీడీ అయిపో' అంటున్నారండీ మా ఫ్రెండ్సంతా ఏం చెప్పనూ?' అందొక నాడు ఆమె భర్తతో.
    'బియ్యే అయిన భార్య నిన్ను మాములుగా గౌరవంగా చూస్తుందా? అంటున్నారప్పుడే మా ఫ్రెండ్సంతా , వాళ్ళకి నేనేం చెప్పను?" అన్నాడు.
    "మీ ఫ్రెండ్సు కి కొంచెం కూడా జ్ఞానం లేనట్టుంది.' అందామె.
    'మరి మీ ఫ్రెండ్స్ కో?'
    'సర్లెండి. ఒహరి వూసు మన కెందుకు? బియ్యిడి వూళ్ళో చడువేగా! ఒక్క ఏడాదిలో అయిపోతుంది ఏమంటారు? చదవనా, వద్దా.' అందామె."
    అని అయన నా మొహం చూశారు. నే నంతకన్న పరీక్షగా అయన మొహంలోకి చూశాను. అయన మళ్ళీ ప్రారంభించారు.
    'వద్దు ఎంత మాత్రం వద్దు.' అతడు జవాబు చెప్పేడు. 'సంసారం అనేది వ్యక్తిగత సమస్య అయినప్పటికీ సాంఘిక బాధ్యత కూడా. ఎక్కువ చదువుకున్న భార్య గల భర్తకు సంఘం లో ఉండే స్థానం ఎటువంటిదో భార్యలు కూడా కొంచెం ఊహించాలి. పరోక్షంగా చేసే ప్రచారాలకూ, ప్రత్యక్షంగా వినబడే విమర్శల కూ ఎంత ధీరుడైన భర్త అయినా విచలితుడు కాకుండా ఉండగలడా అన్న విషయం కట్టుకున్నవాళ్ళు ఆలోచించాలి. ఎంత ప్రేమించే భర్త అయినా ఎంత నవనాగరికుడైనా అతడూ మానవుడే అనీ, సాంఘిక కట్టుబాట్లకు అతడూ అతీతుడూ కానేరడనీ గ్రహించాలి.
    ఇంతవరకూ ఆలోచించగల యువతీ, ఈమాత్రపు సహృదయంమూ , సానుభూతి ఉన్న వ్యక్తీ భర్తను మించి విద్యావతి కాగోరదు. ఇంతకూ భర్త అనుమతిస్తే తప్ప ఎక్కువ చదువుకుని ఆమె చేసేదేముంది?- ఇంతకన్న నన్నేక్కువెం అడక్కు. నువ్వు చదువుకోవడమే కాదు, ఆ ప్రశ్న మళ్ళీ అడగడమే నా కిష్టం లేదు.
    అన్నాడు అతడు. ఇంతటి దీర్ఘోపన్యాసం యిచ్చిన తరువాత ఆ అమ్మాయి ఏం మాటాడలేదు. వారం రోజులు దాటకుండా బియ్యీడీ లో చేరింది. అతనికి చాలా కోపం వచ్చింది. చాలా బుద్దిమంతుడూ మర్యాదస్తుడూన్నూ. లోలోపల కృంగిపోయాడే గానీ పైకి తేలలేదు. ఆమెను ఏమీ అనలేదు. అలాగే మౌనంగా అన్నీ భరించాడు. మాములుగానే స్కూలు కెళ్ళి వస్తుండేవాడు. మొత్తానికి ఆ ఏడాది గడిచిపోయింది. ఆ అమ్మాయి బియ్యీడీ అయిపొయింది. పోనీ, అక్కడితో నైనా వూరుకుందా. మళ్ళీ ఓనాడు మొగుణ్ణి కదిపింది.
    'ఏమండీ ఇంతవరకూ నన్ను ప్రోత్సహించారు, పోనీ సహించారు. ఇక ఒక్కటే నేను కోరేది. అదైనా అపరాధమూ, అవమానకరమూ కాదు. ఈ వూళ్ళో గర్ల్సు హైస్కూల్లో ఒక వేకన్సీ ఉంది. పోనీ వేన్నీళ్ళకు చన్నీళ్ళు అద్జారంగా ఉంటుంది. మీరు ఒక్కరూ తెచ్చేదాంతో ఎలాగా యిబ్బంది పడుతున్నాం.' అతని సహనం పూర్తిగా దెబ్బతింది. నెమ్మదిగానూ, కఠినంగానూ అన్నాడు.
    'అవును.... నీలాంటి దానితో నేనింక ఇబ్బంది పడలేను. ఇద్దరూ కలిసి విడాకులకు దరఖాస్తు చేద్దాం. అటుపైన నీ యిష్టం.'
    అయన చెబుతున్నది ఆపుచేసి నన్ను ప్రశ్నించారు.
    'ఆవిడ చెప్పిన జవాబేమిటో నువ్వు చెప్పగలవా? తరవాత వాళ్ళ సంసారం ఏమైందంటావ్? సుఖాంతమా, దుఃఖంతమా?'
    'ఏదీ కాదు.'
    'అదేం?'
    "మీరు చెప్పింది కధ కాదు గనక. ఆమె ఎవరో అతడు ఎవరో నాకు స్పష్టంగా తెలుసు గనక. మీరు చెప్పిన విషయాలు కేవలం కల్పనలుగానే పట్టుబడి పోతున్నాయి గనక.'
    అయన ముఖంలో నెత్తురు చుక్క లేదు.
    'నిజంగా చెప్పండి. మీకంటే నే నెక్కువ చదువు కున్నానే భావం మీరు భరించలేరా? అలా భరించ లేకపోవడానికి మీరు ఇందాకా చెప్పినవే కారణాలుగా భావిస్తున్నారా?'
    'అవును' అన్నారాయన దృడంగా.
    'మీరింత తక్కువ వూహిస్తారని మీరు చెప్పినా నేను నమ్మలేను. మీ సంస్కృతిని ఇంత తక్కువగా నేను వెల కట్టలేను. భార్యాభర్తలు అన్ని విధాల ఎప్పుడూ సమానంగా ఉండరు. అందంలోనో, రంగులోనో, డబ్బు లోనో , విద్య లోనో ఒకరు తక్కువా, ఒకరు ఎక్కువా అనేది సర్వసాధారణం, ఆ ఎక్కువ తక్కువలు గుర్తించకుండా సహనంతో ఒకళ్ళ భావాలు ఒకరు అర్ధం చేసుకుని సానుభూతితో కాపురం చేయడమే స్వర్గ సదృశ సంసారానికి సరైన సమీప మార్గం. భార్యలో ఆధిక్యతను గుర్తించక అది తన వ్యక్తిగత లోపంగా భావించడం పురుషునిలోని పామరత్వానికి నిదర్శనం. జడత్వానికి నిజ రూపదర్శనం.
    'మీరిప్పుడు చెప్పిన కధ మరెప్పుడూ నాకు గుర్తు వచ్చేలా ప్రవర్తించవద్దు. ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని ప్రేమించలేను. మిమ్మల్ని ప్రేమించకుండా నేను జీవించలేను.' భరించరాని డుఖోద్రేకాలు ముంచుకు వచ్చి వెక్కివెక్కి ఏడ్చేశాను. అయన నన్ను ఓదారుస్తుంటే నా దుఃఖం మరింత ఎక్కువైంది.
    'మంజూ నన్నపార్ధం చేసుకుంటున్నావు. నువ్వు నాకు దూరమై పోతావనే నా బాధ. బౌతికంగా అంతరాలు పెరిగిన కొద్ది మానసికంగా దూరమై పోతాయోమోనని నా ఆందోళన.
    'పోనీ , నేను ఈ యేడు మానేస్తాను. మీరు కట్టండి. మళ్ళీ వచ్చే ఏడు మనిద్దరం చదువుదాం' అన్నాను ఆశగా కళ్ళ నీళ్ళు తుడుచుకుని.
    'అది మాత్రం నావల్ల కాదు. నువ్వే పూర్తీ చేసెయ్యి.'
    'మీరే అంటున్నారా ఆ మాట?'
    'అవును నేనే -- కాని ఒక్క మాట. నీలోని సౌందర్యాన్ని సౌకుమార్యాన్ని యిప్పటికే నీ చదువు పీల్చి వేసిందేమో అని నా అనుమానం. ఎలాగో పూర్తీ చెయ్యి కాదనను. నువ్వు ఏ పరిస్థితుల్లో నూ ఉద్యోగం చెయ్యడం మాత్రం నాకిష్టం లేదు. ఆమేరకు మాట ఇయ్యాక తప్పదు'.'
    'అలాగే'
    'ఒకటి మాత్రం నువ్వు గ్రహిస్తే నేను సంతోషిస్తాను. ఏది ఉన్నా, లేకపోయినా నువ్వు చదువుకుని నేను చదవ లేకపోయాననే అసూయ మాత్రం నాకెప్పుడూ లేదు. నాలో మాధుర్యమూ, మార్ధవమూ ఉన్నాయో లేవో చెప్పలేను గాని మనుషుల్ని శాసించే అమానుషత్వం మాత్రం నాకెప్పుడూ లేదు. నాకు తోచింది చెప్తానంతె. అయితే ఒకటి. చదువు ధ్యాసలో పడి ఈ దీనుడ్ని మాత్రం మరిచిపోకు.'
    'పదండి , పిచ్చెక్కినట్టుంది , ఇవాళ సినిమాకి వెడదాం.'
    'ఈపాటికి సినిమా బిగిన్ అయిపోతుందే!'
    'అయితే అవనీండి. ఊసులాడుకోడానికి ఉల్లాసకరమైన ప్రదేశమనీ, మెత్తని సీట్లూ, చక్కని చీకటి ఉంటాయనీ వెడతాం గానీ మనలాంటి వాళ్ళం సినిమా చూడ్డానికి వెళ్ళిందెప్పుడు గనక!
    ఇద్దరం ఒకరి కళ్ళల్లోకి మరొకరం చూసుకుంటూ తమాషాగా నవ్వుకున్నాము.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS