Previous Page Next Page 
సంపెంగలూ - సన్నజాజులూ పేజి 17

 

                                     7
    నాకు తెలిసినంతవరకు ప్రపంచంలోని అనర్ధాలకు ముఖ్య కారణం మనుష్యుల్ని రెండే రకాలుగా చూడడం. ఒకటి దేవతల్లా పూజించడం, రెండవది పురుగుల్లా చీదరించుకోడం, ఉప్పూ , పులుసూ తింటూ తప్పూ ఒప్పూ చేసే మానవులు పై రెండింటిలో ఏ కోవకీ చెందరు. ఏడు తాడి చెట్లలోంచి ఒకేసారి అట్నించి యిటు వచ్చేలా బాణం వెయ్యగలిగిన విచిత్ర శక్తి గల రాముణ్ణి నేను మెచ్చుకోలేను. భార్య కనపడక వెర్రివాడై వనమంతా వెతుకుతున్న రాముడే నాకు అత్యంత సన్నిహితుడు , ఆరాధ్య దైవమున్ను!
    అయన ఒక్కొక్కప్పుడు నాకు బొత్తిగా పచ్చని భావాలు ప్రకటించడం -- సందర్భం లేకుండా చికాకు పడడం- తీరి కూర్చుని నొప్పించే మాట లనడం - వీటన్నింటి కి వెనుక ఎప్పుడూ నన్ను సన్నిహితంగా చేసుకుందామనే ఆరాటం. ఇవన్నీచూస్తుంటే నా మనస్సు పరవశించి పోతోంది. 'ఇంతా' అని చెప్పలేనంతగా అభిమానం కలుగుతుంటుంది. అది లోపల అణుచుకోలేక ఒక్కొక్కప్పుడు మధురిమను దగ్గరకు తీసుకుని ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేసేదాన్ని. చిన్నపిల్ల దానికేం బోధపడుతుంది?
    ఆవాళ ఆయనన్న అన్ని మాటలలోనూ నాకు జ్ఞప్తి లో ఉండిపోయి నన్ను పిలకితురాల్ని చేసిన వాక్యం ఒకటే "మనుషుల్ని శాసించే అమానుషత్వాన్ని నాకెప్పుడూ లేదు!' మనుషత్వానికి మృగత్వానికి సరిహద్దు రేఖ ఎక్కడ? మా ఎదురింటి సరళ సంసారం పరీక్షిస్తే తెలుస్తుందేమో. చిన్న సంఘటనతో నన్ను ఆకర్షించి ఆ అమ్మాయి చెల్లెళ్ళు లేని నా కొరతను తీర్చింది. అంతేకాదు, అవసరమైనప్పుడు నీతులు చెప్పగలిగినంత ప్రాజ్న రాలై పోయింది! ఇప్పుడు తలుచుకుంటే జరిగిందంతా ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది.
    మా ఎదురింటి సరళ గా రింట్లో గోడ గడియారం గాని, అలారం గానీ టైం పీసు గాని లేవు. ఉన్న రిస్టు వాచీ కాస్త వాళ్ళాయన పెట్టుకుని ఆఫీసుకు వెళ్ళి పోతుంటాడు. సిలోన్ లో తెలుగు రికార్డులు అయిపోగానే నేనూ మధురిమా వాళ్ళ నాన్న గారి కోసం వీధిలోకి వచ్చేసరికి ఆమె కూడా రావడం అలవాటు. మా వదిన చెప్పినట్టు ఆకటి వేళకూ, చీకటి వేళకూ చిన్న పిల్లాడిలా భర్త తన్ను వెతుక్కురావాలని ప్రతి ఆడదానికీ ఉంటుంది. సాయంకాలం అయేసరికి ఎన్ని పనులున్నా తీరిక చేసుకొని, కనీసం మొహమైనా కడుక్కుని, ఉన్నంతలో శుభ్రమైన చీర కట్టి, భర్త కోసం ఎదురు చూడని ఆధునిక గృహిణి ఉండదు. కాస్త ఆలస్యమైతే ' నన్ను విడిచి ఈయన ఎక్కడికి వెళ్ళి ఉంటారు?' అని వెయ్యి విధాల కృంగి పోకపోతే అది స్త్రీ హృదయమే కాదు!
    'ఏమండీ, అయిదు అయిపొయింది కదూ?'
    తెల్లగా, సన్నగా, పొడుగ్గా , చక్కగా ఉంటుంది సరళ. దానికి తగినట్టు సాధారణంగా తెల్ల చీరలే కట్టి తల్లో తెల్ల పూలే పెడుతుంటుంది. వాళ్ళు ఎదురింట్లోదిగిన నాలుగైదు రోజుల్లోనే నాకామే ఎంతో కావలసిన వ్యక్తీ అనిపించింది. ఎప్పుడేనా రికార్డులు వినడానికి మా యింటికి వచ్చినా అయిదు నిమిషాలు స్థిరంగా కూచోవాలని ఆమెకు ఉండదు. ఆ అరగంటలో ఓ పది, పదిహేను సార్లయినా కిటికీ, దగ్గరికి పరుగెడుతుంది. అతగాడు వచ్చాడే మోనని. అందుకని పాపం ఆ అమ్మాయిని యిబ్బంది పెట్టడం యిష్టం లేక రికార్డులు కాస్త గట్టిగానే పెడుతుంటాను.
    "ఏమండీ వీళ్ళ ఆఫీసు నాలుగున్నర కి మూసేస్తారు. సైకిలు మీద రావడానికి మహా పడితే పది హీను నిముషాలు పడుతుంది. ఇప్పుడు అయిదుం పావు అయింది. ఇంకా ఈయనగారికి ఇల్లు జ్ఞాపకం రాలేదు. ఈయన ఎక్కడి వెళ్ళి  ఉంటారు?'
    ఆ కళ్ళల్లో తగు ఎరుపూ, చిరు నెరవూ చూస్తుంటే నాకు అప్పుడప్పుడు ఫక్కున నవ్వొచ్చేది. 'దేనికి నవ్వుతారు?' అని ఆమె ఆడిగేది. ఏమీ లేదని తప్పించుకునే దాన్ని. ఇంతకీ ఆ అమాయకురాలు అంతగా ఎదురు చూచిన ప్రబుద్దుడు రాగానే యిచ్చే బహుమతి ఎలా ఉండేదని?
    'బోగంపాపలా శృంగారం చేసుకుని యిలా నడి వీధిలో తగలడోద్దని నీకెన్ని సార్లు చెప్పెను? ఇలా కాదు నీ పని లోపలకు పద.' సైకీలు నడిపించుకుని అతను లోపలికి వెళ్ళిపోయేవాడు. తప్పు చెసిందానిలా మొహం పెట్టి , తమ మాటలు ఎవరూ వినడం లేదు గదా అని అటూ యిటూ చూస్తూ -- పమిట చెంగు మెలిపెడుతూ లోపలికి వెళ్ళిపోయేది.
    భళ్ళున తలుపు వేసిన చప్పుడుతో పాటు చెళ్ళున చెంపకాయ కొట్టిన చప్పుడు స్పష్టంగా వినిపించేది. తెలుపూ, గులాబీ కలిపిన ఆ బుగ్గకి యివ్వవలసిన బహుమతి అది కాదనీ, ప్రేమా భయమూ కలసిన ఆ ముగ్ధ కి చెప్పవలసిన సంగతి అది కాదనీ బహుశా ఆ పశుప్రాయుడికి తెలిసి ఉండదు. 'అమ్మా అక్కా' అని ఆదరించే తల్లిదండ్రుల్నీ వదిలిపెట్టి ఆమె తన గుమ్మం తొక్కడం కేవలం తిండి కోసమే కాదని ఆ దూర్తుడికి తట్టి ఉండదు.
    మర్నాడు సాయంకాలం ఆమె గట్టిగా రెండు మూడు  పిలుపులు పిలుస్తే వీధిలోకి వెళ్ళెను. ఆమె వాళ్ళ గది కిటికీ లోంచి పిలుస్తోంది. తలుపు తాళం గాని, గొళ్ళెం గాని వేసి వెళ్ళాడేమో దుర్మార్గుడు అని పైకి చూశాను. అలా ఏం లేదు. ఆవిడ లోపల గడియ వేసుకుంది. చక్కని ఆ కళ్ళతో కిటికీ వూచల్లోంచి చూడగలిగినంత వరకు చూస్తోంది. అక్కన్నుంచే నన్ను అడుగుతున్నాయి ప్రకాశించే ఆ నేత్రద్వయమూ , వాని వెనక ఉన్న పవిత్రమైన ఆ హృదయమూ.
    'ఏమండీ - అరయిపోతోంది -- వీరు గాని వస్తున్నారేమో ఓసారి చూడరూ? నామీద కోపం వచ్చిందేమో.... ఒకవేళ యివాళ కి గాని యింటికి రారేమో. ....తెలివి తక్కివదాన్ని. ఆయనకేం కావాలో సరిగ్గా బోధపడి చావదాయే. వీధి మలుపు తిరిగేరేమో కాస్త చూద్దురూ.... ఇంకా రాలేదా? ఒకవేళ రానే రారేమో!
    `మొదట్లో జాలి, సానుభూతి కలిగినా క్రమంగా ఆవిడ చేతగాని తనానికి నాకు అసహ్యం వేసేది. ఒకనాడు మధ్యాహ్నం కూచోపెట్టి హితబోధ చెయ్యడానికి ప్రయత్నించాను. పైకి అమాయకంగా కనిపిస్తున్నా ఆమె కున్న లోకజ్ఞానం చూస్తె నాకే ఆశ్చర్యం వేసింది. మరి భర్త కెందుకఅంత లోకువ యిస్తుందో నాకు అర్ధం కాదు.
    'నువ్వు యిలా లోకువ యిచ్చిన కొద్ది అతగాడికి బుద్ది వచ్చే మార్గమేముంది సరళా? మళ్ళీ ప్లీడరు గారి అమ్మాయివని చెబుతున్నావు.
    ఒకర్ని ఒకరు కొట్టడానికి, అది భర్త భార్య నైనా సరే రూల్సు లేవనీ, లా ఒప్పుకోదనీ నీకు తెలుసా?'
    సరళ నవ్వింది. ఈమధ్య ఆమె నవ్వడం చూడలేదు. ఎంత చక్కగా ఉంది! ఇలాంటి సుందరతర దృశ్యాలు చూసినప్పుడే మనసు పులకిస్తుంది. మరి పది కాలాల పాటు బతకాలనిపిస్తుంది.
    'తెలియకేం? నాన్నగారి డ్రాప్ట్ లన్నీ నేనే ఫెయిర్ చేసి పెట్టేదాన్ని. ఇంకా స్త్రీలకు గల ప్రత్యెక హక్కుల గురించి చాలా తెలుసు. భార్యాభర్తల పేచీ కేసుల గురించి నాన్నగారు చాలా చెప్పేవారు. అసలు నన్ను ' లా' చదివిద్దామని ఆయనకి చాలా ఉండేది గాని అమ్మ ఒప్పుకోలేదు. అన్నీ చదివిన మీదట నాకు అర్ధమయిన ధర్మశాస్త్రం ఒకటే. అది భర్త అడుగు జాడల్లో నడుచుకోడమే!
    నాకేం జవాబు చెప్పడానికి తోచలేదు. నిజానికి యిలాంటి వేవీ నా కాట్టే తెలీవు. తెలియవలసిన అవసరం ఎప్పుడూ రాలేదు కూడా. అయినా నేను వూరుకోలేదు.

 

               
    "పోనీ , ఆయనచేత మీవారికి చెప్పించి చూడనా?'
    అయిష్టంగానే ఆమె తల వూపింది-- 'మీ పుణ్యం ఉంటుంది. అంతపని మాత్రం చెయ్యకండి' అని అందులో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు ఆమె నా దగ్గిర ఇంకా ఎక్కువసేపు కూచోడానికి కూడా యిష్ట పడలేదు. ' దాసీది వచ్చే వేళయింది, వస్తాను.' అని మరి యిటు వైపు చూడకుండా గబగబ లేచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే అత్యాశ్చర్యంతో చూస్తూ ఉండిపోయిన నేను వంటింట్లో కుక్క జొరబడడం కూడా గుర్తించలేదు!
    పోనీ సరదాలు లేనివాడా అంటే ఆ అమ్మాయిని అప్పుడప్పుడు అటూ యిటూ తీసికెళ్ళేవాడు. పది హీను రోజుల కయినా ఒక సినిమాకు వెళ్ళేవారు. నేనీ విషయం వారితో ప్రస్తావిస్తే అన్నారు.
    'లోపల ఏం సంతోషిస్తుందో ఆ భగవంతుడి కెరుగ గాని.... ఎక్కడికి వెంటబెట్టుకొని వెళ్ళినా పాపం ఆ అమ్మాయి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వెడుతుంది. మొన్న ఓసారి మా మేనేజరు తో నేను సినిమాకు వెళ్ళినప్పుడు ఈవిడా ఈమె భర్తా ముందు వరుసలో కూచున్నారు. మొదట్నుంచీ చివరి దాకా ఆ పిల్లని సాధిస్తూనే ఉన్నాడు. ఒక అయిదు నిమిషాల పాటైనా సరిగా సినిమా చూడనిచ్చింది లేదు. ఎవరి వేపో చూస్తున్నదనీ, పక్కసీటు చేతి మీద మొగాడి చెయ్యి కావాలని తగిలించిందనీ, పమిట సరిగా కప్పుకోలేదని ఒకటేమిటి , సినిమా ధోరణి సినిమాది . అతని ధోరణి అతనిది - ఆ అమ్మాయి పాపం ఒక్క మాటకు జవాబు చెప్పింది లేదు. ఆమె భయమల్లా ఒక్కటే, వాళ్ళ మాటలు విని తక్కిన నలుగురూ ఏమనుకుంటున్నారో అని.'
    ఆ అమ్మాయి పరిస్థితి ఎలాగేనా బాగుచేద్దామని నా మనసు తహతహ లాడింది. కార్యరూపం లోకి తేలేని సానుభూతి మనసుని మరింత మలిన భూయిష్టం చేస్తుంది. 'సరళ మొగుడు ఆమెను చావ గోడతాట్ట.' అని ఆ వీధి వీధంతా బుగ్గలు నొక్కుకోడం ఎరుగుదును. ఒక్కడైనా 'ఇదేమిటయ్య , నీకేమైనా బుద్దుందా లేదా?' అని అడగడానికి ముందుకొచ్చినవాడు లేడు.
    ఎలాగైతేనేం ఆయనకి నచ్చచెప్పి ఒకసారి వాళ్ళింటికి పంపించాను. ఏమవుతుందోనని భయం గానే ఉంది. గది కిటికీ లోంచి చూస్తూ కూచున్నాను. ఒక పట్టాన అయన రాలేదు.
    'ఇంతసేపు కూచున్నారేం' ఆ చేత్తో మిమ్మల్నీ ఒకటి వెయ్యలేదు కదా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS