'ఏమిటలా చూస్తున్నావ్?'
'ఏం లేదురా ఇంకా ఏం మొదలెట్టలేదు.'
'ఏడిసినట్టుంది. ఇంకా ఆలశ్యం చేస్తేపరీక్ష చట్టేక్కినట్టే. ఉండు నీకు ఒకటి ఇద్దామనుకున్నాను.' వాడు సంచీ లోంచి సామ్ సన్స్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీషు లిటరేచర్ తీసి యిచ్చాడు.
'దీనికోసం నిరుడే ప్రయత్నించాను. దొరకలేదు. మొన్ననే లైబ్రరీ కి కొత్త కాఫీలు వచ్చాయి. ఎలాగయితే నేం సంపాదించాను. అనవసరంగా టైం వేస్టు చెయ్యక యిహ నేను వెళ్ళగానే మొదలెట్టు!"
'అదేమిటి , ఇవాళే వెళ్ళిపోతావుట్రా?'
"లేకపోతె ఏకంగా ఉండిపోడానికి గాని వచ్చాననుకున్నావా? నేను లేచేసరికి నీ కూతురు బడికి పారిపోయిందాయే. మీ ఆయనేమో ఆఫీసుకి పోయాడాయే. వాళ్ళు రానిచ్చి, ఓసారి కళ్ళతో చూసి, నీచేతి వంట ఒకసారి రుచి చూసి చీకటి పడకుండా రైలేక్కేస్తాను.'
"ఏం రాత్రికి యిల్లు చేరుకుంటే గాని ఆ మహారాణి రానియ్యదా ఏం?' అన్నయ్య నవ్వేడు.
'రోజురోజుకి అలా బొత్తిగా నీరాసడిపోతున్నావెంరా?"
"ఏం లేదే."
"ఏమో మునుపట్లా లేవు. చిన్నారి కోసం బెంగా?'
"బెంగ పెట్టుకుని ఏం చేయాలి గనక!'
అన్నయ్య నిరశాగా అన్నాడు. ఈ టాపిక్ ఎందుకు తెచ్చేనా అని నాకే అనిపించింది. వాడిచ్చిన పుస్తకాన్ని చూస్తుంటే అందులోంచి రెండు కాగితాలేవో యివతల పడ్డాయి. క్రిందికి వంగి నేనే వాటిని తియ్యబోతుంటే అన్నయ్య తీసి నాకిచ్చాడు.
'అన్నట్టు మరిచేపోయాను సుమీ!'
'ఏమిటీ?'
'బాగుంది . ఈ కాగితాలు యిడ్డామనేగా ముఖ్యముగా నీ దగ్గరికి వచ్చాను? నీ ఆ శ్రద్ధ నాకు బాగా అనుభవమే కదూ! బెనారస్ హిందూ యూనివర్సిటీ లోపనిచేసే మా ఫ్రెండు కి అప్పుడే నెల్లాళ్ళరాశాను. మొన్ననే రెండు అప్లికేషను ఫారమ్స్ పంపించాడు. నీ కొకటి, మీ అయన కొకటి.'
నా విషయంలో అన్నయ్య ప్రత్యెక శ్రద్దకి నా కళ్ళు చెమర్చాయి. అందులో గత దినం రుక్మిణమ్మ గారి ఉత్తరమూ, ఆ తరువాతి సంఘటనా , అన్నయ్యకు నేను రాసి పడేసిన కవరూ గుర్తు కొచ్చి నా మనసు కొట్టుకు పోయింది. ఆ ఉత్తరం వాడికి చేరకపోతే ఎంత బాగుండును!
'ఒరే అన్నా, చిన్న పొరపాటు జరిగిందిరా' అన్నాను నెమ్మదిగా.
"ఏమిటే అది?'
'మరేం లేదూ, నిన్న నీ పేర కవరోకటి రాసి పోస్టు చేశాను. అందులో తెలివి తక్కువగా ఏమేమో రాశాను. పెద్ద విశేషాలెం లేవు. ఇప్పుడు మనం అనుకున్నావే అనుకో. నువ్వెలాగూ వచ్చేశావు. కనుక ఆ ఉత్తరం నీకు అందడం అనవసరం. పోస్టువాడు వచ్చి సరిగ్గా పదింటికి ఆ ఉత్తరాలు తీస్తాడు. ఈవీది చివరనే లైటు స్తంభం ప్రక్కనే ఉంది పోస్టు డబ్బా. నువ్వెళ్ళి అ కవరు తెచ్చేయ్.'
అన్నయ్య చేతి వాచీ చూసుకున్నాడు. టక్కున లేచి బయలుదేరాడు. ఒక పావు గంటలో ఆ కవరుతో సహా ప్రత్యక్షమయ్యాడు.
'పోస్టుమాన యిచ్చాడా?' అన్నాను.
"ఆ ఏముంది ముఖ్యమైన విషయం ఒకటి మరిచిపోయామని వాడి చేతిలో ఓ రూపాయి నొక్కితే సరీ.'
ఆ కవరు దారిలో అన్నయ్య విప్పి చదవక పోవడం నా అదృష్టం.
'ఇలాతే ఆ కవరు' అన్నాను చెయ్యిజాచి.
"అంత సులువుగా ఇస్తానను కున్నావా, దానితో పనుంది." అన్నాడు. నా గుండెలు దడదడ కొట్టుకున్నాయి. అన్నయ్య కూచుని కవరు కవరు పళంగా చిన్న చిన్న ముక్కలుగా చింపి చిత్తు కాగితాల బుట్టలో పారేశాడు. ఆ బుట్టలోనే ఆయన చింపి పారేసిన అప్లికేషన్ ఫారమ్స్ కూడా ఉన్నాయి. అన్ని కాగితం ముక్కలూ ఒకలాంటివే అనుకుని పొట్టలో దాచుకుంటుంది , వాటిలో ఉన్న అపారమైన తేడా వేర్రిబుట్ట దానికేం తెలుసు!
అన్నయ్య అసాధారణమైన సభ్యత నన్ను మరొక సారి ముగ్దురాల్ని చేసింది. అందులో ఏముందోనని అణుమాత్రం ఆతృతయినా ప్రకటించలేదు. దాని ప్రసక్తి మళ్ళీ తేనేలేదు!
ఇంట్లో సొమ్మేమైనా ఉందా?' తెల్లబోయా అర్ధంకాక.
"ఏమాత్రం?'
"ఓ అరవై ఉంటె యియ్యి' లోపలి కెళ్ళి పెట్టి తలుపు తీశాను. చీర ,మడత లో నాలుగు పది రూపాయల నోట్లు మాత్రమే ఉన్నాయి. తెచ్చి యిచ్చాను.
'దేనికీ?'
'తే;లేలివితక్కువ ఉత్తరాలు రాసి శ్రమ యిచ్చి నందుకు జరిమానా' మరింత తెల్లబోయాను.
'అలా తెల్లబోతావెం , వెర్రి మొద్దూ! పరీక్షకు ఫీజు కట్టక్కర్లేదూ, ఇంకా ఆలస్యం చేస్తే ఎప్పుడందుతుందనుకున్నావ్? మీ ఆయనది కూడా కట్టేద్దామనుకున్నాను, కాని సొమ్ము లేదన్నావుగా! రేపు మరిచిపోకుండా కట్టించు. ముందెళ్ళి నీది కట్టి వచ్చేస్తాను -- ఎంత, ముప్పై రెండు కదూ?' నా మాట కూడా పూర్తవకుండా అన్నయ్య త్వర త్వరగా నడిచి వెళ్ళిపోయాడు. నేను వద్దని చెప్పడానికి సమయమూ, సందర్భమూ రెండూ కూడా కనబడలేదు.
వదినకి యిష్టమని కొయ్య చేగోడీలు సలుపుతుంటే వాడు వచ్చాడు. మరో అరగంట కి అయన వచ్చారు. వారు మాములుగానే పలకరించి విచారించారు. పిల్ల పోయిందని పరామర్శించారు. తను రాలేకపోయానని విచారం ప్రకటించారు. ఇంకా ఒకటి రెండు రోజు లుండమని బలవంతం చేశారు కూడా. భోజనాలాయ్యాక వాడు నా చేత అప్లికేషన్ ఫారం పూర్తి చేయించాడు.
'బావా! నీ అప్లికేషను ఫారం కూడా పూర్తీ చెయ్యి. ఇవాళ సప్తమి మంచిది. నీది కూడా పూర్తీ చేసి యిస్తే డబ్బు కట్టి రిజిష్టరు చేసి నేనలా స్టేషను కు వెళ్ళిపోతాను. నా కెలాంటి సెంటిమెంట్స్ మీద అట్టే నమ్మకం లేదు గాని నా చేత్తో నేనే పంపాలని ఉంది.' నేనక్కడ లేను గాని పక్క గదిలో ఉన్నాను. అయన జవాబు కోసం ఒళ్ళంతా చెవులు చేసుకు వింటున్నాను.
'మీ చెల్లెలి మాట నాకు తెలీదు. నన్ను మాత్రం చంపకు, నీకు పుణ్య ముంటుంది.'
'అదేమిటి ఒక్కసారికే మొహం మొత్తిపోయిందా ఏం? నువ్వు రాకపోతే అదోక్కర్తే ఎలా వెడుతుంది?'
'ఏమో, నాకేం తెలీదన్నానుగా నా జోలికి మాత్రం రాకు. ఇంక ఆ పుస్తకాలతో నేను మాత్రం కుస్తీ పట్టలేను.'
అన్నయ్య ఇంక సంభాషణ పొడిగించలేదు. ఆ మాటలలో నిశ్చయమూ, కఠినత్వమూ చూచి.
'సరే నే వెడుతున్నాను. దానిది మాత్రం యివాళ పంపెస్తున్నాను. ఇంకా పది రోజులు టైముంది. అప్లికేషన్ ఫారం కూడా టేబిలు మీద విడిచి వెడుతున్నాను. మళ్ళీ ఆలోచించు. అవకాశాలు జార విడుచుకుంటే మళ్ళీ కలిసి రావు.'
అయన వూ ఆ అని కూడా అనలేదు. నేనిచ్చిన పొట్లం సంచిలో పెట్టుకుని అన్నయ్య గబగబా నడిచి వెళ్ళిపోయాడు. వాడలా గుమ్మం దిగేడో లేదో అయన భళ్ళున తలుపు వేసేసి నా దగ్గిరకి చరచరా నడిచి వచ్చారు.
'నేను చెప్పడం, నువ్వు వినడం అనేది ఇవాళ లేదన్న మాట?" ఇదివరకు ఒకసారి చూశాను , నేను జవాబు చెప్పకుండా వూరుకుంటే చాతకానిదాన్ని ఆయన మాటని ఆమోదించినదాన్నీ, దోషురాల్ని అవుతున్నాను. అదీగాక ఆయనన్న మాట లన్నిటినీ సహించి వూరుకుంటే నా మనస్సు పడే బాధకి అంతులేకుండా పోతోంది. అందుచేత ఇక వూరుకోదల్చుకోలేదు. ఏమైనా సరే.
'ఒకరు చెప్పడం ఇంకొకరు వినడం అనే విషయం మంచిదే గాని, చెప్పే విషయం మంచిదా కాదా అని ఆలోచించక పొతే చెప్పిన విషయం అట్టే రోజులు నిలబడదు.'
'దేనికి నీ జవాబు?'
'మీరు ఏ ఉద్దేశ్యంతో అడిగారో దానికే.'
'మాటమాటకీ జవాబు చెప్పడం కూడా మీ అన్నయ్య శిక్షణేనా?'
'కాదు, మీ సహవాస భాగ్యం.'
అయన తగిపోయారు. అదోలా చూస్తూ కుర్చీలో కూలబడ్డాడు. సిగరెట్ వెలిగించారు. నేనా అవకాశాన్ని వృధా చేయ్యదల్చుకోలేదు.
'తొందరపడ్డానెమో క్షమించండి. నేను తప్పుపని చేస్తే ఎత్తి చూపవలసిన పెద్దరికమూ, తీర్చి దిద్దవలసిన బాధ్యతా మీకెప్పుడూ ఉన్నాయి. క్రింది వారు పైకి రావడం చూడలేక ఆఫీసర్లు అసిస్టెంట్ ని ఏడిపించడం ఎక్కడైనా ఉంది. నన్ను ప్రోత్సహించినవారూ, విశాల దృక్పధంతో ఉత్సాహపరచిన వారూ మీరే నా చదువుకి అడ్డుపడితే నేనేమై పోతాను చెప్పండి.'
