Previous Page Next Page 
నాలుగు మంచాలు పేజి 15


    "హా!" అన్నట్లు అతను తల వూపాడు.విశాల వెళ్ళిపోయినా గోడకు బల్లిలా సూర్యం అంటుకు పోయాడు. కాస్సేపయ్యాక గోడ మీద నించి బల్లి జారినట్లు క్రింద పడ్డాడు.

                              *    *    *    *
    విశాల వెళ్ళిపోతూ చెరగని ముద్రను మనసులో నాటి వెళ్ళిపోయింది. ఆ కడపటి కలయిక రోజంతా మనసులో తిరిగి మనిషి ఆవేదనతో అట్టుడికి పోయేవాడు. ఆమె వలపును తృణీకరించే ధైర్యం తనకెలా వచ్చిందని విస్తుపోయాడు. గౌరికీ జరిగిన అన్యాయం మళ్లీ మళ్లీ తలచుకోకుండా చేసింది విశాల. విశాల నేత్రాలలోని జాలీ, వలపూ కుమ్మరించే చూపులు మళ్లీ చూడాలంటే వీలుపడదు. తను సంతోషానికి నోచుకోలేనట్లు, జీవితమంతా ఆరాటమే యైనట్లు బాధపడ్డాడు. అప్పుడప్పుడు తన కష్టాల మయమైన జీవితాన్ని తలచుకుని వికారంగా తనలో తానె నవ్వుకునేవాడు. తన్ను తను ఏవగించుకొనటం వలన ఆ నవ్వు ప్రజ్వరిల్లి హృదయాన్ని వక్కలు చెయ్యగలిగే బాణాల్లా గ్రుచ్చుకునేది. ధర్మంగా నడిచినంత మాత్రాన దరిద్రం వదలదు, కష్టాలు దూరం కావు. ధర్మం తృప్తి కోసం ఆచరించాలి కాని సుఖం కోసం కాదు. తృప్తితో సుఖం తెచ్చుకునే వాళ్ళు కోటికి ఒక్కరుంటారు. సూర్యం దిగజారిన ఆలోచనలతో దీనుడై పోయాడు. అతడి ధైన్యం చూసి మృదువుగా పలుకరించే పలుకుల్లో గాడమైన అర్ధాలను చొప్పించగలిగే జవ్వని, ఆ అర్ధాలతో పాటు అమృతం ఒలుకుతూ పలికే చిలక , ప్రణయం కులుకుతూ చూపులను ప్రసరించే ప్రేయసీ - ఆ విశాల తనకు యోజనాల దూరంలో తనలానే సతమతమవుతూ వుంటుందన్న తలపు సూర్యాన్ని కించ పరచేది.
    ఎండలు మండిపోతే , రోజుల తరబడి ముసురు పెట్టె యెంత చికాకుగా వుంటుందో జీవితం నిత్యం వదలని నిరాశతో, దీనత్వం తో అంత చిరాకును సూర్యం కు కలిగించింది. పొరుగున యింకో కుటుంబం దిగింది. వాళ్లు నన్ను ముట్టుకు నా మాల కాకి అన్న రకం. దిగి ఆరు నెలలైనా రెండు కుటుంబాలకు పొత్తు కుదర్లేదు. మామ్మ, విశాల వాళ్ళ యింట్లో ఒకరైనట్లు మసలే వారు. మిత్రులు, యిరుగు పొరుగు వాళ్ళు, చుట్టాలు సన్నిహితంగా లేకపోతె ఏదో వెలితిగా వుంటుంది. ఇదివరకు పొరుగు వాళ్ళతో నున్న సౌహార్దమైన సంబంధాలు సరిపోల్చు కోవటం తోనే సరిపోయేది.

                                      7
    చివరకు యే వార్తయైతే ఊహించడానికి వెరచాడో అదే వచ్చి పడింది. శుభలేఖ చూసి పైన విశాలాక్షి పేరు చూడగానే వరుని పేరే చదవలేదు. ఆ శుభ లేఖను ఆఫీసు లోనే చెత్త బుట్టలో వేసేసాడు. మిగతా రోజంతా కాలుకాలిన పిల్లలా తన సీటు వదిలి యే పనీ చెయ్యకుండా తిరిగాడు. విశాల యింకొకరి సొత్తు కాబోతోందంటే తను నమ్మలేక పోతున్నాడు. తను జీవితంలో యే సుందరి కోసం దట్టమైన అడవులను దాటగలిగాడో ఆ సుందరి తను రాగానే యింకొకరి స్వాధీనకావడం చూస్తె మనస్సెంత పట్టు తప్పు తుందో తనూ అలానే అయ్యాడు.
    ఇంటికి వచ్చిన కొడుకును చూసిన తల్లి వెంటనే 'యెందుకు నాయనా అలా వున్నావ్' అంది. తల్లి ప్రాణం. ఆమె కొడుకు ముఖ భంగిమలు చూసి పోల్చేసింది.
    'ఏం లేదమ్మా' అన్నాడు.
    'ఏంటో నాయనా నీ సంగతి నాకేం బోధపడలేదు.' అని అక్కడ నించి వంట యింట్లోకి వెళ్ళిపోయింది . కాఫీ కప్పు తెచ్చి అందిచ్చింది. అందుకుని ప్రక్కనే పెట్టాడు.
    'తాగేటట్టే వుంది'
    'కొద్దిగా చల్లారనీ అమ్మా' అన్నాడు.
    తల్లి దగ్గర నెల పై కూర్చుంది.
    "ఏం వుత్తరాలు వచ్చాయా?'
    "లేదు....హా వచ్చింది.'
    'ఎక్కడ నించి?'
    'విశాల కు పెళ్ళని శుభలేఖ వచ్చింది.'
    'ఎప్పుడు?'
    'ఏమో?'
    'ఇదేమిటి నాయనా-- ఏదీ శుభలేఖ.'
    'ఆఫీసులో మరచి పోయాను.'
    'ఒక్క కుటుంబం లా మెసలాం. ఒకసారి నివ్వు పెళ్ళికి వెళ్ళ కూడదూ?'
    'నే నేక్కడకూ వెళ్ళను.'
    'అలా అంటే యెలా నాయనా?'
    'నాకు శలవు లేదమ్మా. ఉన్న శంకం తా రోగాలకే అయిపోతుంటే.'
    'ఏ రోగాలైనా వస్తాయి. నీ సంగతి నాకేం నచ్చలేదు నాయనా! ఇదివరకిలా లేవు. ఈ సురోమని వుంటే రోగాలే కాదు దరిద్రం కూడా దగ్గరకు వస్తుంది. శ్రమ, కీడు, జబ్బు శరీరానికి దుఃఖం యిస్తాయని పెద్ద లంటారు. వాటివల్లే మనసుకు దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం వచ్చేటప్పుడు కాసింత ఆశతో నవ్వకపోతే నీ చదువంతా బూడిద లో పోసిన పన్నీరే నాయనా! పొరుగు మామ్మ అంటుండేది -- ఒక కన్ను యేడిస్తే యింకో కన్ను నవ్వాలి అని.'
    'కన్నీరు రెండు కళ్ళనించి ఒక్కసారే కారుతాయమ్మా.'
    'అవును . అందులో ఒకటి దుఃఖం వలన, యింకొకటి సంతోషం వలన కారుతుంది.'
    సూర్యం అమ్మ వేపు ఒకసారి చూసాడు. ఆమెకు తన ప్రవర్తన నచ్చలేదని ఆమె ముఖం లో భంగిమ లే చెప్తున్నాయ్. ఈ వేళ యెటు వెళ్ళలేదు.  రాత్రి నిద్దర కూడా సరిగ్గా పట్టలేదు. తను మంచం మీద పడుకున్నాడు. తల్లి రెండో గదిలో చాప మీద పడుకుంది. ఆమె నిద్దర పోతోంది. తల్లి గురించి తలచుకున్నాడు. ఆమె వాళ్ళ ఇంట్లో ఇల్లాలుగా కాలు పెట్టినప్పటికి పదిహేనేళ్ళయినా నిండలేదు. అత్త లేని ఇల్లు. ఒంటిగా భర్తకు, మామకూ సేవ చేయాలి. తోడూ -- నీడా యింకెవరూ లేరు. జరుగుబాటు లేని కొంప తాలూకు భారం అమె నెత్తి మీద పడింది. తినకుండా పడుకున్న రాత్రిళ్ళు ఉండేవి. మనిషి కనీసం కోర్కె కడుపుకు సంబంధించినది. ఆ కోర్కె తీర్చుకోలేని పరిస్థితి. ఆకలి కడుపు అగ్గి మంటలను రేపి హృదయాన్ని , మనస్సు ను కాల్చి వేస్తుంది. ఆ మంటల వలన ఆమె బేజారెత్తి ఒకర్ని కించ పరచలేదు, ఒకరిది అపహరించ లేదు. ఒకరిని కష్ట పెట్టలేదు. నోటిలో మంచి మాట, ముఖంలో చిన్న నవ్వు , ప్రవర్తన లో మర్యాద -- ఇవే పువ్వులు చేసుకుని దేవుని పూజించి నట్లు కలిగిన వాళ్ళతో ప్రవర్తించింది. తన బాధ , తన దుఃఖం ఆమె పడ్డ దానిలో యెన్నో వంతు. ఎదిగిన కూతుర్ని పోగొట్టు కుంది. పచ్చగా సంసారం చెయ్యవలసిన యింకో కూతురి మాంగల్యం తన కళ్ళ ఎదురుగా తెగిపోయింది. కూతురిని ఓదార్చడానికి వెళ్ళిపోకుండా కులదీపకూడని యీ కొడుకు మంచి చెడ్డలు చూడటానికి యింట్లో పిల్లలని, భర్తనూ , సంసారాన్ని వదలి తన దగ్గర వుంది.

 

                                
    అలాంటి తల్లికి తను నిత్యం నిర్జీవంగా వుండి యెంత దుఃఖాన్ని కలిగిస్తున్నాడు. ఇన్ని కష్టాలు, ఒడుదుగుకులూ భరించగలిగిన ఆ తల్లి కడుపున పుట్టి నందుకైనా తనకు కొంత ఆమె గుణాలు అబ్బవలసింది. ఆమెకు లేని చదువు యిచ్చి నంతైనా తన చదువు యీయక పొతే తన చదువు విలువ లేదు. తను యిలా వుండటానికి కారణమేమిటి? తను గుండె జబ్బుకు లోనయ్యననే కదా? అందుకే విశాలకు దూరం కావలసి వచ్చిందని కదూ? ఒకప్పుడు గుండె జబ్బు లేకపోయినా ఉమ్మడి కుటుంబానికి తన బాధ్యతలను మరచిపోయి యేమీ చెయ్యలేక పోయేవాడు. అతని మనస్సులో అది పీఠం తల్లి. ఆ తల్లిని వదలి తను వుండలేడు. ఆ తల్లి తనను యెంత కష్టపడి కన్నదో, ఆశలతో పెంచినదో ఆ ఆశలను వమ్ము చేసి తను సుఖ పడలేడు.
    తనే తెగించి విశాలను పెళ్లి చేసుకుంటే తన చెల్లెళ్ళకు పెళ్ళేలా అవుతుంది? తన తమ్ముళ్ళ కు పిల్లెల్నేవరిస్తారు? విశాల కన్న రూపం, యౌవ్వనం ఆమె జీవితం లోని మధురాన్ని తను కాంక్షిస్తున్నాడు . ఇవేవి శాశ్వతం కాదు. తను ఆమెను కట్టుకుని పొందిన సుఖం, పొందిన ప్రియమైన బిడ్డలు, ఆర్జించిన ధనం యివి కూడా శాశ్వతం కాదు. శాశ్వత మైనది బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి పొందిన తృప్తి. తను అందమైన విశాలను కట్టుకుని, తనకు అంతకు ముందు సంక్రమించిన బాధ్యతను వదులు కోవటం అన్యాయ మౌతుంది. ధర్మం కోసం నెపం వెతకటం అన్యాయమని తను ఎక్కడో చదివాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS