కంపౌండరు వెళ్ళాక సూర్యం కు కాలు ముందుకు పడలేదు. పెద్ద బాధను చిన్న బాధగా చెప్పడం వీళ్ళకు అలవాటే. తనకు గుండె జబ్బు వచ్చినందుకు విసుక్కున్నాడు. ఇదెందుకు దేముడా తెచ్చి పెట్టావని దేవుని నిందించాడు. జీవితంలో ఏ కోరికలూ తీరకుండానే యీ రోగం ఎందు కొచ్చింది? అన్ని ఆశలు ఒక కట్టకట్టి మంటలో పదవేసినట్లుగా ఆరాట పడ సాగాడు. మనసులో నించి విశాల సృష్టించిన మధురాను భూతులు అంత వేగంగా తుడుచుకు పోతాయని తను యెన్నడూ వూహించ లేదు. ఏకోరికలు ఏ ఆశలు ఆ పూల మొక్కను నీటితో వెలుగుతో పెంచామో అవి పోగానే ఆ మొక్క ఎండి పోయింది. తను అన్ని అడ్డంకు లూ ధైర్యంతో దాటగలిగినా, విశాలను తన దాన్ని చేసుకుని ఆమె పచ్చని జీవితం ఎడారి చెయ్యటం తనకు యిష్టం లేదు. తను మనసారా ప్రేమించిన విశాలకు తను తెలిసి మరీ అన్యాయం చేయలేదు. అందుకే మనసు అదుపులో పెట్టుకుని ఆమె చూస్తున్నా అటువేపు చూడకుండా వుండాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ బాధ నెత్తి మీద యెల్లప్పుడూ బండరాయి లా బరువుగా వుండేది. మనసు యీసురోమని, ముసురు పట్టిన నాటి రేయిలా మారింది. జీవితం మీద విరక్తి కలగసాగింది. విశాల తనది కాదన్న నిర్ధారణకు రావటం కష్టంగా వుంది. అవునన్న సాహసం తనకు లేక పోయింది. ఆశలను రేకెత్తిన జ్యోతిష్యం మీద నమ్మకం తగ్గిపోయింది. అది శాస్త్రం కాదు. గుండె జబ్బు వుందని పరీక్ష చేసి మరీ తెలుసుకున్నది. ఆకాశం లో తిరిగే గ్రహాలు మనుషుల పై ఏం ప్రభావాలను చూపిస్తాయ్? అది అంతా బూటకం -- గుండె జబ్బే నిజం. ఇలా గుమస్తాగా పనిచేసి నన్నాళ్ళూ చేసి ఏదో ఒకరోజున అనుకోకుండా ఆతీ గతీ లేకుండా కళ్ళు మూసాననుకున్నాడు . విశాలకు కనబడకుండా వుండటానికి ప్రయత్నిస్తుంటే ఆమె మరింత కంగారు పడుతూ అతని యెదట పడటానికి కుతూహలంగా వస్తోంది. సూర్యం యీ వింత మార్పుకు ఆమె తట్టుకోలేక పోతోంది. ఎలా అతనితో మాట్లాడుదామన్నా వీలు చిక్కడం లేదు.
"ఏం అలా వున్నారు మళ్లీ?' అన్నట్లు అనుకోకుండా ప్రత్యక్షమైన కళ్ళు కన్నీటితో ప్రశ్నించాయ్. సూర్యం జవాబు అందివ్వకుండా తల త్రిప్పేశాడు. దానితో ఆమె హృదయం దిగజారింది. రెండు రోజుల వరకు యింటి నించి బయటకు రాలేదు. ఈ మధ్య మామ్మకు మాటి మాటికి జ్వరం వస్తోంది. చివరకు ఒక రోజున అమ్మ చెప్పింది.
మామ్మగారు వాళ్ళ వూరు వెళ్లిపోతారట!
ఈ వార్త సూర్యం వినలేక పోయాడు. తనకు దెబ్బ దెబ్బ తగులుతోంది. విశాల ను మనసు నించి తుడిచి పెట్టాలని యెంత అనుకుంటున్నాడో అంతగా ఆమెను ప్రతిష్టించు కుంటున్నాడు. ఆమె తన శరీరంలో పుట్టు పుచ్చలా నిల్చిపోయింది. ఆ మచ్చను చెరప లేడు.
నిస్పృహ తో రెండు రోజులు శలవు పెట్టేశాడు. ఎల్లుండే విశాల తనకు కరవవుతుంది. ఈ రెండు రోజులే ఆమెను కళ్ళారా చూడాలి. మళ్లీ జీవితంలో కనిపిస్తుందో లేదో! ఒకప్పుడు కనిపించినా ఆమె పిల్లల హడావుడి లో వుండి తనను పోల్చుకోలేదు. పోల్చుకున్నా తన భర్త యేమనుకుంటారో నని పలుకరించదు. పలుకరించినా యీ అభిమానం వుండదు. అప్పటికి ఆమె గడచిన చరిత్ర మరచిపోతుంది. ఆమె వర్తమానంతో పెనుగులాడి భవిష్యత్తు ను గురించి ఆరాట పడుతుంది. తను బహుశా అలాంటి కలయికకు బ్రతికి వుంటే ఒంటరిగా జీవశ్చవం లా వుంటాడు. విధితో జగడమాడి విధి లేక బ్రతికిన మనిషిగా వుంటాడు.
మామ్మ ఒకసారి కనిపించినప్పుడు దగ్గర కూర్చో బెట్టుకుని చెప్పింది. 'ఇంకెంత కాలం బ్రతకను బాబూ. ఇక్కడ మరి వుండటం మంచిది కాదు. విశాల మేనమామ వున్నాడు. వాడు పేచీ కోరే గానీ వాడు తప్పించి ఇంకెవ్వరూ దిక్కులేరు. ఆ వున్న కాస్త పొలం అమ్మి విశాలను ఒక యింటి దాన్ని చేసి హాయిగా కళ్ళు మూస్తాను. మళ్లీ నిన్ను చూస్తానో లేదో సరిగ్గా ఒకసారీ చూడనీ నాయనా' అంటూ దగ్గరగా వచ్చి తలంతా ఒకసారి తాకి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది.
"నీ మంచి చేత మీ వంశానికే పేరు తెచ్చావు. గడించరాని బిడ్డవు. చచ్చి నీ కడుపునే పుడ్తాను.'
సూర్యం కళ్ళల్లో నీరు పెరుకున్నాయ్. ఈమె యిన్నాళ్ళూ యీ కోరికను యెంత దాచి పెట్టింది. ఈమె పిచ్చి వాడైన ఒక కొడుకును కన్న యిల్లాలు. హంస లాంటి మనుమరాలను పొందింది. తను పెళ్ళాం పిల్లలూ లేకుండా జీవితాంతం, ఏకాంతంగా నడవబోయే సాందుడినని తెలీదీమెకు! పొతే అంత కోర్కె యెందుకు?'
మీ మనుమరాలుండగా నా కడుపున యెందుకు పుడ్తారు?
మామ్మ కాస్సేపు సాలోచనగా చూస్తూ "మీది మాదీ ఒకే జాతి అయ్యుంటే నాకు సంశయం వుండేది కాదు. నీలాంటి మొగుడు విశాలకు ఒక పువ్వు హెచ్చు పూజిస్తే గానీ దొరకడు. దాని రాత యెలా వుందో? మీ యిద్దరూ ఒకటి కాలేరు కదా. మీ యిద్దరి మధ్య నీకడుపునే పుట్టడానికే నిర్ణయం చేసుకున్నాను.'
సూర్యం ఒకసారి , ఆ ప్రయత్నం గా విశాల వేపు చూసాడు. ఆమె వంట యింట్లో యేడుస్తూన్నట్లుంది. అక్కడ వుండలేక 'వస్తాను మామ్మగారూ' అన్నాడు. ఆమె 'అమ్మా విశాలా యిలా రామ్మా" అంది. కాస్సేపటికి గానీ విశాల రాలేదు. తల దించుకుని నిల్చుంది.
'బాబు నించి చదువు అబ్బింది నీకు. బాబు వయసులో చిన్న కానీ బుద్దిలో బృహస్పతి లాంటి వాడు. బాబు పాదాలకు మొక్కమ్మా. వేగం పెళ్లి కావాలని దీవిస్తాడు.'
విశాల సంశయించకుండా వంగి అతని పాదాలకు మొక్కడమే కాదు పట్టుకుని గట్టిగా నొక్కి వేసింది. అలా వంగి పట్టుకునేటప్పుడే చల్లగా అతని పాదాల పై రెండు కన్నీటి బొట్లు రాలాయ్. ఆమె తరవాత ముఖం చూపించకుండా వంట యింట్లో కి వెళ్ళిపోయింది.
సూర్యం అక్కడ ఉండలేక పోయాడు. గబగబ బయటకు వెళ్లి రోడ్డు మీద పడ్డాడు. పిచ్చిగా జుత్తు పీక్కుంటూ యిటూ అటూ తిరిగాడు. ఎక్కడికో వెళ్లి పోవాలనీ యందులోనైనా పడిపోవాలనీ ,మనసు మధన పడింది. ఏడ్చు కున్నాడు. ఒంటిగా కూర్చొని దేవుడ్ని దూశించాడు. విశాలా నా విశాలా అంటూ చేతులతో ముఖం దాచుకుని వెక్కి వెక్కి యేడ్చాడు.
ఆరాత్రంతా సరిగ్గా నిద్రలేదు. రోజంతా యింట్లోనే కూర్చున్నాడు. ఆవేళ మధ్యాహ్నం తల్లికి ఆమె మొక్కుకున్న మొక్కు జ్ఞప్తికి తెచ్చాడు. సాయంత్రం సొరుగు మామ్మను తోడ్చుకుని వెంకటేశ్వర స్వామి ఆలయం వెళ్ళింది. అంగటి తలుపులు చారవేసి రెండో గదిలో కూర్చుని విశాల వస్తుందని యెదురు చూసాడు. కాస్సేపయ్యాక పెరటకు వెళ్లాడు. అప్పుడే విశాల పెరటకు వచ్చింది. సూర్యం గోడకు చారబడి నిల్చుని యెదురు గా నున్న విశాల వేపు చూసాడు. ఆమె రాజపుత్ర రాజ్ఞి ఠీవి తో మెరసి పోతోంది. మోదుగ పూవు రంగు జాకెట్టు లో అశోకాలు విరగబూసి దాగున్నా నాటి సారభం అతనికి మత్తెక్కించింది. అతని కళ్ళు పూల కోసం అమ్మని రోద చేసి మూగుతున్న తుమ్మెద లయ్యాయి. నీలిరంగు చీర కట్టుకున్న ఆమె ముఖం నీలి ఆ కసం లోని చంద్ర బింబం లా మెరుస్తోంది. వంకీలుగా కదిలి ముఖం పై ఎగురుతున్న జుత్తు చందమామ లోని మచ్చల్లా వున్నాయ్. ఉండీ వుడిగీ తెల్ల మేఘాలు అ ముఖాన్ని కప్పుతున్నట్లు విచార రేఖలు ఆమె ముఖాన్ని కప్పుతున్నాయ్. ఆమె అందం అంతా పుణికి పుచ్చుకున్న పుత్తడి బొమ్మలా మౌనంగా నిల్చుంది. మొహంతో అతనిని మంత్రించి ముగ్ధుని చేసే శరీర సౌష్టవం . ఆమె సమ్మోహనం గా నున్న వసంతం. ఉన్న అందమంతా యీ నిముషం లోనే వుప్పొంగించిన దేవకాంతలా వుంది. ఆమె అవయవాలూ అవీ చూసి సూర్యం మనసు పట్టు తప్పింది. హృదయంలో సంతోషం ప్రవాహం గా ముంచుకు వచ్చింది.
"విశాలా...." అన్నాడు.
ఆమె చూపు మెరసిన మేరు పై చీకటి గా నున్న అతని మనః ఫలకాన్ని వెలిగించింది. అతని కళ్ళ వేడుక గుండెలోని శోకం భరించ కుండా బయటకు ప్రవహించగానే మాయమై పోయింది. తను తొందర పడి విశాల నేమీ చేసినా కలకాలం బాధపడ్తానన్న భావన చిన్న మర్రి విత్తనం లా మనసులో రాలి అది మొక్కయై , కొమ్మలూ, వూడలూ పెరిగి మహా వృక్షమైంది. అతని దైన్యం చూసిన విశాల మరికాస్త దగ్గరగా జరిగీ "నన్ను మీ వాగ్దానం తీసుకోకుండా వెళ్లి పోమంటారా?"
సూర్యం జవాబు చెప్పలేదు. మనస్సంతా హోరెత్తి పోయింది. పుష్పించిన పూల వాసన లతో మన్మధుడు విసరిన పూల బాణం లా తన వేపు వచ్చి ఆమె తన మెడలో పూల హారం లా పడిపోయింది. సూర్యం గుండె మీద మీద తలవాల్చి అతనిని గట్టిగా కౌగాలించుకుంటూ "నేనే మాటాడాలి-- నేనే బయట పడాలి. మీ కేందుకింత పిరికి?' కన్నీటితో నిష్టూరాలాడింది.
'నేను వుత్త పిరికి వాడ్ని-- విశాలా! ఉత్తి పిరికివాడ్ని....నన్ను క్షమించు....విశాలా క్షమించు" రాలే కన్నీటిని తుడుచుకునే లేదు. ఆమె ఒకసారి తలెత్తి.
"అన్ని విధాల నేను అదృష్టం లేని దానను. మిమ్మల్ని పొంద గలిగితే దురదృష్టాన్నంతా మరిచి పోతానానుకున్నాను. మీకు న్యాయం అనుకున్నది చెయ్యండి."
'నన్ను మర్చిపో విశాలా" సూర్యం ముఖం త్రిప్పేసాడు. ఈ మాటలు అంటూనే అతని గుండె జబ్బు హెచ్చి పోయినట్లు బాధ పడ్డాడు. ఇంకా తనెలా బ్రతికి వున్నానని ఆశ్చర్య పోయాడు. ఆమె అతన్ని అంటకుండా నిల్చుంది. ఒకసారి అతని కన్నీరు ఆమె చీర కొంగుతో తుడిచి
"నేను బ్రతికి నంత కాలం మీ కన్నీరు తుడవగలవనను కున్నాను. పోనీ ఈ ఒక్కసారి మీ కన్నీరు తుడిచిన దృశ్యాన్ని కలకాలం తలచుకునే హక్కును నాకివ్వండి."
