Previous Page Next Page 
సంపెంగలూ - సన్నజాజులూ పేజి 14

 

                                    6
    మళ్ళీ మాములుగా రోజులు గడుస్తున్నాయి. మధురిమను రెండో క్లాసులో చేర్పించాం. మొట్టమొదట కొంచెం అల్లరి పెట్టినా తరువాత కాస్త శ్రద్దగానే అది బడికి వెడుతోంది.
    హటాత్తుగా ఒకనాడు రుక్మిణమ్మ గారి నుంచి ఉత్తరం వచ్చింది. ఆ ఎడాది ఆమె ప్యాసయిందట. నేను ప్యాసయినందుకు అభినందనలు తెలుపుతూ రాసింది. నేను మళ్ళీ ఫైనలుకు అప్లై చేసి ఉంటానని -- అయినా ఎందుకైనా మంచిదని నాకని ఒక ఫారమూ, ఆయనకని మరికటి తెప్పించిందట, ఆ రెండూ అందులో పెట్టి పంపించింది. ఇక పదిరోజులే ఉంది , అప్లై - చెయ్యండని రాసింది. పరీక్ష విషయం నేనెలా మరిచిపోగలను గాని అప్లై చేయవలసిన కాల పరిమితి మాత్రం నేను నోట్ చేసుకోలేదు. ఆవాళ ఆవిడ ఉత్తర అప్లికేషను ఫారాలూ ఆయనకిచ్చేను.
    మొదట 'ఇలాంటి స్నేహాలు మనకి అనవసరం" అని ఆవిడ ఉత్తరాన్ని చింపేశారు, 'ఇక మీదట నాకు చదువు అనవసరం' అని ఒక ఫారం చింపేశారు. 'ఇంతకు మించి నువ్వు చదవడం అనవసరం' అని రెండో ఫారం చింపేశారు! నేనెంత వారించినా వినలేదు.
    అయన అక్కణ్నుంచి వెళ్ళిపోయాక చాలాసేపు అలోచించి ఉత్తర మొకటి రాశాను. ఎలా ఉందొ ఓ మారు చదివి చూసుకున్నాను.
    ప్రియమైన అన్నయ్యకు --
    మంజుల మనః పూర్వకంగా నమస్కారములు.  నువ్వు వదిన , పిల్లలు కులాసాగా ఉన్నారని తలుస్తాను.
    ఒక చెడ్డ విషయం ఇంకోళ్ళతో చెప్పుకోడం వల్ల మరింత చేడుతుందే గాని బాగు పడదని నువ్వే చెప్పినట్లు గుర్తు. ఆ కారణం చేతే ఇన్నాళ్ళూ ఓర్చాను. అదిగాక నీతులూ, సిద్దాంతాలు, హద్దులూ , అడ్డుబాట్లూ ఆప్యాయత ఉన్నవాళ్ళ మధ్య అగవేమో! అందుకనే ఇది నీకు రాయకుండా ఉండలేక పోయాను. మీరిద్దరూ నన్ను క్షమించి ఇది బాగా చదివి దీన్ని పరిష్కరించడ మెలాగో ఆలోచించండి.
    మన ముగ్గురి వ్యక్తిత్వాలతో సమానంగా సరదాగా విశాల హృదయంతో ఉండే మీ బావగారు ఈ మధ్య మారిపోయారా అనిపిస్తోంది. నేను ఎం.ఏ. పరీక్షకు కట్టిన ముహూర్తం మంచిది కాదేమో అనిపిస్తోంది. ఈయనకు ఇష్టం లేనప్పుడు నేను పరీక్షకు చదవడం తెలివి తక్కువ పనేమో అనిపిస్తోంది. కమ్మని సంసారంలో కలతలూ, కల్లోలాలూ తీసుకు వచ్చిన ఈ చదువు నన్నెక్కడికి తీసు కేడుతుందనిపిస్తోంది. ఇదంతా అవిద్యేమో అనిపిస్తోంది.
    సరిగ్గా చదవడానికి కూచునేటప్పుడు సినిమాకు వెడదాం రమ్మని కూచునేవారు. శ్రద్దగా పాఠం ప్రారంభించేసరికి షికారుకు పద అనేవారు. పుస్తకం తీసి పారేసి లైటు అర్పెసేవారు. ఇంతకన్న ఏం రాయను? నా చదువుకి ఎన్ని విధాల ఆటంకపెట్టాలో అన్ని పెట్టేరు. అయినా ఎలాగో చదివాను పరీక్షకు కట్టెను. నేను చదవడమే కాక ఆయన్ని చదివించాను. ఇద్దరం సరదాగా వెళ్ళి పరీక్షలు రాసి వచ్చాం, అంతే.
    ఇక్కడితో నా చదువు అయిపోయిందని అనుకోడానికి నా మనస్సెంత మాత్రమూ అంగీకరించడం లేదు. మామూలు 'వెర్రి బాగుల యిల్లాలు' చేసే కబుర్లూ, కాలక్షేపాలు , వంటా పైపనీ మహా అయితే సినిమాలూ, షికార్లు, పిలుపులూ, పేరంటాలు ఇవే అన్నీ అనుకొని నేను తృప్తి పడలేనని మీకు తెలుసు. ఆంగ్ల పౌరసత్వం అన్ని మూలల్నుంచీ నన్ను ఆకర్షిస్తోంది. అద్యంతాలూ రుచి చూస్తె గాని నిన్ను వదిలేది లేదని చెబుతోంది. ఇందులోకి దిగకపోతే అది వేరే విషయం. ఇదిలా సగంలో వదిలెయ్యడం నావల్ల కాదు. ఏమయినా సరే.
    రైల్లో మాకు పరిచయమైనా రుక్మిణమ్మగారి గురించి మీకు చెప్పెననుకుంటాను. ఆవిడ దగ్గిర్నించి ఉత్తరం వచ్చింది. పరీక్షలకు కట్టడానికి ఇంకా పదిరోజులే టైముందని జ్ఞాపకం చేస్తూ అన్ని విధాలా ప్రోత్సహిస్తూ ఆమె రెండు అప్లికేషను ఫారమ్సు కూడా పంపింది. దగ్గిరకి తీసుకెళ్ళి చూపిస్తే మీ బావగారు ఆ ఉత్తరంతో పాటు ఆ ఫారమ్సు కూడా చింపేశారు. యిప్పటివరకు వెలగబెట్టింది చాలు, ఇక అనవసరమంటూ . అయన అలా చేస్తారని నేను ఎం.ఏ పూర్తి చెయ్యడం అయన కెంత మాత్రం ఇష్టం లేనట్లు స్పష్టమౌతోంది.
    ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి? చదువుతూన్న చదువుని నట్టేట్లో వదిలిపెట్టి అయన ప్రతి మాటకూ తాళం వేసి ఆత్మార్పణ చేసుకొని నిర్జీవమైన బ్రతుకు నేను బ్రతకలేను. వారి మాట కాదని కనీసం ఆరు నెలలైనా కుస్తీ పట్టీ ఎదురు గాలిలో పడవ నడిపి ఎలాగో గట్టెక్కి సుఖ శాంతుల్ని నాశనం చేసుకోవడమూ నా వల్ల కాదు. నన్నిలా ఆలోచించేలా తయారు చేసిన నువ్వే యీ ప్రశ్నకు ఉత్తరం చెప్పుకోవాలి.

                                                                                             నీ చెల్లెలు,
                                                                                               మంజుల.
    ఉత్తరం కవరులో పెట్టి ఎడ్రసు రాస్తుంటే సరికొత్త భావనఒకటి నన్నొక వూపు ఊపింది. ఎప్పుడూ నేను ఉత్తరం రాసి ఆయనకిస్తే కవరులో మడిచి పెట్టి కవరంటించి పైన ఎడ్రసు రాయడం వారికి అలవాటు. నాకు తెలిసినంత వరకూ మా కుటుంబాలలో యిల్లాగే జరుగుతుండడం మామూలు. ఎంత ధర్డ్ ఫారం చదివినా భార్య అయినా ఎడ్రసు సరిగా రాయలేని దుస్థితిలో ఉండదు. మరి భర్త చేతి కెందు కివ్వాలి? దానికి మా పనిమనిషి రంగమ్మ ప్రవర్తనే జవాబు చెబుతుంది.
    పెద్ద పండుక్కి దాని చేతిలో రెండ్రూపాయలు నోటిచ్చాను ఓమారు. 'మళ్ళీ మీ మొగుడి చేతిలో పెట్టకు, పులుసులో పడేస్తాడు. వెడుతూనే గాజుల దుకాణం లో గాజులు వేయించుకో , పసుప్పచ్చని గాజులంటే పడి చస్తావు' అన్నాను.
    'అమ్మో , ఎంతమాట సెలవిచ్చినారు తల్లీ, ఆడితో సెప్పకుండానే!' అంది అది కుంకుడు గింజల్లాంటి కనుగ్రుడ్లను నల్లదాక్ష పళ్ళంత చేసి.
    'అదేమే, నేను నీకు యిచ్చాను, యిది నీ డబ్బు నీ యిష్టం. మధ్య వాడితో చెప్పేదేమిటి?'
    'అమ్మొగోరూ పదేను సమచ్చరాల మట్టి కాపురం సేస్తాన్నం. అడెం తెస్తాడో , నేనేం తెస్తానో ఓ పిడతలో వోడేసి ఓవళ్ళం కావాల్సిందాళ్ళు తీసుకుని వోడీసుకుంటాం. అడిదని గాని, నాదని గాని ఒక్కనాడనుకోనేదు. ఇయ్యాల మాత్రం ఆ బేధ బుద్ది ఎందుకు తల్లీ?' అరమరిక ల్లేని, పగ మేరికలేని , అరక తరకలూ అవకతవకలూ లేని ఆ ముచ్చటైన కాపురమమ్మా రంగమ్మ చెప్పిన ఆ చక్కని సమాధానము నేను జన్మలో మరిచిపోలేనివి. ' దీని మీద కాస్త ఎడ్రసు రాసి పోస్టులో పడెయ్యండి' అని భార్య భర్తకు ఇవ్వడంలో అంత చక్కని భావమూ ఇమిడిఉందని నా ఉద్దేశం. 'ఇది మీరు చూసినా నాకేం బాధ లేదు. మీకు తెలియని రహస్యాలు నాకేం ఉన్నాయి గనక?' అని అందులో సారాంశం. అది చూడకుండానే భర్త అంటించి అడ్రసు రాస్తాడు, ఎందుకని? 'వేరే నే చేసేదేమిటి? నన్ను కాదని నువ్వేప్పుడెం చేశావ్ గనక?' అని అందులో తాత్పర్యం. పరస్పర సానుభూతి, విశ్వాసమూ ఉన్న సంసారంలో అనురాగ పరిమళ వ్యాపించక ఏం చేస్తుంది? కాని ఎటువంటి ప్రేమ ప్రవాహానికైనా అజన్కారపు ఆనకట్ట కట్టనంతవరకే. ఆ తరువాత ఏమున్నా స్వాభావిక సౌందర్యం మాత్రం ఉండదు అంతే.

 

                    
    ఆ వీధి చివర పోస్టు బాక్స్ ఉంటె నేనే వెళ్ళి పడేసి వచ్చాను. ఉత్తరం రాయగానే మనసు తాత్కాలికంగా ఎంతో తేలిక అయినట్లనిపించినా ఆ భావం అట్టే సేపు నిలబడలేదు. అసలే వాళ్ళు నానా చికాకుల్లోనూ ఉన్నారు. పైగా కష్టంలో ఉన్నారు. ఇదో పెద్ద సాధించలేని సమస్యలా వాళ్ళ ముందుంచి వాళ్ళను మరింత ఇబ్బంది పెట్టి నందుకు నోచ్చుకున్నాను. ఇంతకీ యిలాంటి వాటిని ఎవరి మటుకు వారే పరిష్కరించుకోవాలి. ప్రక్కవారికి చెప్పిన కొద్ది సమస్య జటిలమాయై పోతుంది.
    ప్రక్కింటి శశిరేఖ అంటుంది : మొదట్నుంచి మొగాడు యిలాగే ఆడదాన్ని పైకి రాకుండా అణచి పెట్టేశాడు. సినిమా హల్లో, పదోవంతు జాగా, బస్సులో ఓ రెండు బెంచీలూ ,రైల్లో ఒకటి, రెండు పెట్టెలూ ప్రత్యేకించి మోసపుచ్చడం , తప్ప మనసా పురుషుడూ, స్త్రీ సమానత్వాన్ని అంగీకరించింది ఎప్పుడు గనక! ఏమయితే అయింది.నువ్వు నీ చదువు ఆపకు మంజూ?ఇప్పుడు కాకపొతే యింకేప్పుడు చదువుతావు? నువ్వు ప్యాసయావని అతగాడు అసూయ పడడం అతి సహజం. ఇవన్నీ లెక్క పట్టుకు కూచుంటే యింక మనం పికోచ్చే దెప్పుడు!'
    దానికి సరిగ్గా వ్యతిరేకంగా ఉంటుంది శకుంతల చెప్పేది. ' నువ్వు చదవడం యిష్టం లేదని మీవారంతా స్పష్టంగా చెబుతున్నప్పుడు ఇంకా కొనసాగించడం దేనికి మంజూ, నాకు బోధపడక అడుగుతానూ! చదివి సాధించేది ఏముంది? మీ యిద్దరూ యిలా అస్తమానూ తగవులు పడుతుంటే మీ అమ్మాయి మనస్తత్వం ఎంత దెబ్బతింటుందో ఆలోచించారా? భర్త పెడదారులు తొక్కినా కన్న బిడ్డలా కోసం త్యాగం చేసి ఎంతటి కష్టాన్నైనా కడుపులో పెట్టుకోవడం మనవాళ్ళ సాంప్రదాయం. భగవంతుడు చల్లగా చూసి మీరిద్దరూ కలిసి మెలసి ఆచంద్రార్కం ఉండాలనే ఎవరైనా కోరురారు గాని. నేను అన్నానని కాదు గాని,అప్పోద్దున్న ఏమైనా తేడాలు పాడాలు తీవ్రంగా వస్తే పాప భవిష్యత్తు ఏమౌతుందో కొంచెమైనా ఆలోచించావా?
    మధురిమను దగ్గిరగా తీసుకున్నాను. ప్రేమతో ముంగురులు సవరించాను. భయాందోళనల దాన్ని ముద్దు పెట్టుకున్నాను. అది ఆ నిద్దర్లోనే ఒక చెయ్యీ ఒక కాలూ నామీద వేసింది. అలా ఆలోచన లలో ఎప్పుడో నిద్ర పట్టేసింది. తెల్లవారు ఝామున ఎవరో తలుపు  కొడితే తీశాను. అన్నయ్య! ఆశ్చర్యపోయాను. అనుకోకుండా వచ్చిన వాణ్ణి చూసి.
    వాడి స్నేహితుడి చెల్లెలి పెళ్ళిట, అక్కడికి రెండు మైళ్ళ దూరంలో ఏదో పల్లెటూర్లో. దానికి హాజరు వేయించుకుని వస్తూ దార్లో నన్నోసారి చూసిపోదామని వచ్చాట్ట.
    రాగానే పడుకున్న మనిషి తొమ్మిది గంటలకు లేచాడు. అప్పటికప్పుడే అయన లాంబ్రెట్టా ఎక్కి వెళ్ళిపోయారు.
    వాడు కాఫీ తాగుతూ అడిగేడు.
    'ఏమే ఎలా వుంది చదువు? ఇప్పట్నుంచీ చదువుతే గాని చిట్టచివరకు చాలా బాధపడిపోతావు. ఏం మాటాడవేం?'
    గతుక్కుమన్నాను. అంత వివరంగా రాసినదాన్ని మనిషి ఎదుట పడితే ఒక్క ముక్క చెప్పలేక పోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS