Previous Page Next Page 
నాలుగు మంచాలు పేజి 13


                                         6
    తల్లి దగ్గర వుండటం వలన కొద్దిగా ధైర్యం వచ్చింది గానీ యిల్లంతా మూగ బోయినట్లుంది. గౌరీ యిన్నాళ్ళూ యింట్లో వుండి ఒక క్రొత్త వెలుగు తెచ్చింది. మేనకోడలు వూసులాడుతూ మామయ్యా ను ఆడించేది. గోవిందరావు తనకు ఎన్నో సమస్యలు తెచ్చి పెట్టి తనను తానే విమర్శించు కునే అవకాశం యిచ్చేవాడు. ఒక్కసారి యీ ముగ్గురూ కరవు కాగానే సూర్యం తట్టుకోలేక పోయాడు. నీరసం మూలానే యీ అనర్ధం అంతా జరిగిందని తల్లి వేళకు తిండి, నిద్ర వుండేటట్లు చూసింది. కాళ్ళకు అమృతాంజనం రాసి కాపడం పెట్టేది. వేడెక్కిన పాదాలు కొంతసేపయ్యాక మళ్లీ చల్లగా వుండేవి. ఎవరో పెద్ద ఆసుపత్రి కి తీసుకు వెళ్ళండి అన్నారు. సూర్యం వద్దు వద్దని కేక వేసాడు. ఇంకో కాయన కుండ పెంకులు భస్మం చేసి గుడ్డలో వేసి వేడి చేసి పాదాలు కాపండి అన్నాడు. ఈ వుపశాంతులు కొంత పని చేసేవి. స్థలం మారిస్తే మంచిదని యిద్దరు సలహా యిచ్చారు. దానికి సూర్యం ఒప్పుకోలేదు. అవసరానికి యింతగా ఆదుకున్న వారి మంచి స్థావరం నించి తనకు ఎక్కడకూ వెళ్లాలని లేదు. వాళ్ళ గురించి అంత చెడ్డగా తలచుకున్నందుకు విచారించాడు. అతనికి చెడ్డ వాళ్ళలో నున్న మంచి మీద నమ్మకం బాగా కలిగింది. మనిషి యెంత చెడ్డ వాడైనా జాలి అనేది వుంటుంది. అది లేకపోతె తనకు తాను, తన బిడ్డలను ప్రేమించలేడు. ఆ జాలి యెదుటి వారు తమ బిడ్డల్లా అసహయులైన ప్పుడు పొంగుతుంది.
    తన కంపౌండరు స్నేహితుడు వచ్చి చూసాడు. 'ఇదేం జబ్బు కాదు. కాస్త గుండె ధైర్యం తెచ్చుకోండి. దీనికి యింజక్షన్లు యేవీ అక్కర్లేదు. బాగా తినండి. అరగడానికి యిదిగో యీ మందు వేసుకోండి. ఒకప్పుడు యెప్పుడైన గుండె పీకుతున్నట్టు గానీ నొప్పి గానీ వుంటే యీ మాత్ర ఒకటి వేసుకుని నాకు కబురు పెట్టండి.' ఇలా ధైర్యం చెప్పాడు. ఈ మాటల ధైర్యం తల్లి సేవ, తనను సగం బాగుచేసాయ్. 'ఆలోచించకుండా వుండేటట్లు చూడండమ్మా' అన్నాడు ఆ కంపౌండరు. ఏదో పుస్తకం మీద దృష్టి పెట్టె కొంత సేపయ్యాక నీరసంగా వుండేది. తల్లి కూడా "అట్టే చదవకు నాయనా' అంది. ఎల్లప్పుడూ దగ్గరే కూర్చుని ధైర్యమైన మాటలు అనేది.
    'ఇంకెంత కాలం యిలా వుంటావు నాయనా పెళ్లి చేసుకుంటే ఆ కోడలు నీకింత  పెడ్తుంది.'
    ఆ మాట యెత్తగానే సూర్యం ముఖం త్రిప్పేశాడు. ఈ మధ్య రెండు సార్లు విశాల పెరటి నించి తన వేపు తొంగి చూసింది. మూడోసారి ఆమె దగ్గర వుండి పోయిన పుస్తకం పెరటి లో ఒంటిగా వుండగా అందిచ్చింది.
    ఆ పుస్తకం తిరగావేస్తే అందులో ఒక కాగితం అగపడింది. 'మీరింత అధైర్య వంతులని అనుకోలేదు.' క్రింద సంతకం లేదు యేమీ లేదు. అడస్తూరి విశాలదే. ఆ కాగితం మళ్ళీ మళ్ళీ చూసేవాడు. ధైర్యం తెచ్చుకోడానికి ప్రయత్నించేవాడు. తిండితో కాస్త శక్తి వచ్చింది. కొద్దిగా యిటూ అటూ కదిలేవాడు. పిరికి కొద్ది కొద్దిగా దూరం కాసాగింది. ఒకరోజు రోడ్డు మీదకు వెళ్లి పాతిక అడుగులు వేసి తిరిగి వచ్చాడు. ఇలా పది రోజులలో బజారుకు వెళ్లే శక్తి వచ్చింది. తల్లి రాత్రి పగలూ కాచుకుని కూర్చునేది. ధైర్య మైన మాటలూ, వేదాంతం చెప్పేది. 'నివ్వు పుట్టే టప్పుడు పెద్దలూ పేరంటాలు కలలో కనపడి పెద్ద వాడవై ప్రభల నెత్తుతావని చెప్పారు. నీ మంచి రోజులు ముందున్నాయి నాయనా. దాని నొసటి రాత అలా గుంది. నివ్వు ఆపగలవా? పడవలసిన కష్టాలు నివ్వూ పడ్డావు. నివ్విలా బెంగ పడి వుంటే యింకా నీ తరవాత వాళ్ళ నెందరినో యెవరు పైకి యేత్తుతారు?' అలా తనకు ధైర్యం చెప్తూ దేవుళ్ళ కూ మొక్కుతూ గడిపేది.

 

                   
    ఒకరోజు క్రొత్తగా జ్యోతిష్యం నేర్చుకున్న పాత మిత్రుడొకడు వచ్చాడు. అతనికి జ్యోతిష్యం వచ్చని తల్లి తెలుసుకోగానే సూర్యం జాతకం చూపించింది. అతను కాస్సేపు లెక్క లన్నీ కట్టి 'ఇప్పుడు తన దశా చిద్రం కాబట్టి యీ కష్టాలు వచ్చాయి. ఇంకో నెల రోజుల్లో యివి పోతాయి. ముందుకు మంచి రోజులున్నాయ్. చంద్ర మహాదశ. చంద్రాం తర్వులోనే తప్పితే గురు అంతర్వులో ఆఫీసరు అయ్యే సూచన లున్నాయ్.
    "పోవోయ్ ! నేనెలా ఆఫీసరు నై పోతాను?'
    'జాతక బలం. పదిమందిని కంట్రోలు చేసే యోగం వుంటే.'
    'అలా కొట్టి పడేకు నాయనా. నీకు చదువు లేదా? చాత కాదా? ఆ అదృష్టం ఆనాటికి కలిసి వచ్చి పైకి ఎత్తుతుంది' అని అమ్మ అందుకుంది.
    స్నేహితుడు వెళ్ళిపోయాడు. సూర్యం లో ఆశ ఒక ప్రక్క అనుమానం యింకో ప్రక్క కదలింది. ఆశే మనసుకు చోటివ్వటం వలన కొద్దిగా వేగంగా కోలుకొంటున్నాడు.

                               *    *    *    *
    ఏదో పని పెట్టుకొని రోజుకోకసారైనా విశాల ముఖం సూర్యం కు కనిపించేటట్లు చేస్తోంది. ఆ మూగ బసలను ప్రసరించే కళ్ళల్లో ఆవేదన అతనికి స్పష్టంగా అగుపిస్తోంది. ఆమెను చూడగానే మనసులో వుల్లాసం ముంచుకొని పరుగులు తీస్తోంది. రోజంతా విశాల తన దగ్గర వుండి తన వేపు చూస్తూ వుంటే మనస్సెంత హాయిగా వుండేది? ఒకసారి తనను తాకి తన తల నిమురుతూ ఆమె నిట్టూర్పులు తను వినగలిగితే హృదయం వుప్పొంగిపోయేది.
    ఆమె అతని కష్టాలకు సానుభూతి చూపిస్తే ఆ కష్టాలన్నీ మరిచి పోయేవాడు. ఆమె యెడారిలో ఒయాసిస్సు లా, పూవులో పుప్పొడి లా తన జీవితాన్ని చరితార్ధం చేసేది. విశాల నల్ల చుక్కలున్న చీర కట్టుకుని మెల్ల మెల్లగా వచ్చి పెరట వరండాలో గోడకు అనుకుని తలవంచి నిల్చుంది. ఆమె ఉదయపు కిరణం లా, గోడ మీద చెక్కిన అజంతా కుడ్య చిత్రంలా మెరసి పోతోంది. అతని కళ్ళను పండువ చేసే ఆ ఆనందోత్సాహాలను తిలకించడానికే కాకుండా అందులో పాల్గొనటానికి రమ్మన్నట్లు ఆమె అందంతో నిండిన యవ్వనం ఆహ్వానిస్తోంది. కళ్ళలో మెరుపు కోటి కాంతులను వెదజల్లి పెదాలు పూల బాణాలు వదిలినట్లు కదలసాగినాయ్.
    'పరీక్ష ప్యాసయ్యానండీ.'
    'సంతోషం.'
    'నానమ్మా ఒకసారి రమ్మంటుంది.'
    సూర్యం లేచి వెళ్ళాడు. ఇద్దరు ఎదురెదురుగా నిల్చున్నారు. విశాల ఒకసారి తలెత్తి అతని వేపు పరీక్షగా దీక్షగా సారించి చూసింది. అలా చూస్తూనే ఆమె కళ్ళల్లో కన్నీరు తిరిగి పోయాయ్. చప్పున ఆమె వంగి ఒకసారి అతని పాదాల నంటి కదలి పోయింది.
    సూర్యం శరీరం స్వాధీనం తప్పింది. వంగిన ఆమె తల ఒకసారి నిమిరాడు. అంతే ఆమె వెళ్ళాక అలా అక్కడే నిల్చొని ఆకాశం వేపు చూసాడు. ఆనందంతో కళ్ళల్లో నీరు పెరుకున్నాయ్. మనసు వుల్లాసంతో ఉరకలు వేసింది. ఎన్నడూ మరువలేని అపూర్వ అనుభవంగా, సంవత్సరం పొడవునా పూచే పూల చెట్టులా విశాల మనసులో నాటుకుంది. ఆమె యింత పని మెల్లగా చేసి ఒక శాశ్వత దృశ్యాన్ని , అనుభూతి ని తన మనసులో ప్రతిష్టించింది. అది ఒక దేవతా విగ్రహమై తన మనసులో అల్లకల్లోలమై నప్పుడు ఆ దృశ్యాన్ని తలచుకుని, ఆ అనుభూతి ని పొంది దైర్యాన్ని ఆశనూ మనసులో చొప్పించ చెయ్యటానికి అనుకూలిస్తుంది.
    ఏదో రాగం తీసుకుందామన్నంత అనురాగం మనస్సంతా అల్లుకుంది. మామ్మ దగ్గరకు చేరేటప్పటికి ఆమె జ్వరంతో పడి వుంది. సూర్యం ను చూడగానే మూలుగుతూ లేచి కూర్చుంది.
    'పడుకోండి మామ్మగారూ. మందు తెచ్చేదా?'
    'నాకా? మందెందుకు బాబూ! నేనే వద్దును. లేస్తే తల తిరుగుతోంది. నివు కష్టపడి చదువు చెప్పావు. మన్పిస్తా నంటే నీ మాట వినే అలా చదివించేసాను. విశాల మెట్రిక్ పాసయ్యింది. ఇక ఈ చదువు చాలు నాయనా. ఏదో దాన్నో యింటి దాన్ని చేసేస్తే నా బాధ్యత తీరుతుంది.' అంతవరకు అక్కడ నిల్చున్న విశాల వంట యింటికి వెళ్ళిపోయింది. సూర్యం యీ మాటలకేమీ జవాబు చెప్పలేదు. అతని మనస్సింకా ఆ మనోహర దృశ్యం తోనే వుబ్బి వుంది. అలా వుబ్బిన మనసు తేనెను శరీరమంతా ప్రవహింప చేస్తోంది. మామ్మ దగ్గర కాస్సేపు వుండి తిరిగి వచ్చేశాడు. ఆ వారంరోజుల్లోనే ఆఫీసు కు వెళ్లి పోయాడు. నీరసం రాను రాను తగ్గి పోతోంది. అతను గడచిన గడ్డు సంఘటనలను ఒక విధంగా మరచి పోయేటట్లు చూడటానికి విశాల దోహదమిస్తోంది. ఏదో ఒక సాకుతో ఆమె తన కంట రోజుకు నాల్గు సార్లైనా పడి ఆమె వదనం లో దరహాసం, కళ్ళల్లో తను అర్ధం చేసుకునే భాసలు నింపి అతనిని వుల్లాస పరుస్తోంది. సంతోషంతో సగం బలాన్ని కోలుకున్నాడు. అమ్మతో విశాల గురించి ఒకటి రెండు సార్లు చెప్దామనుకున్నాడు. అతను చెప్పకుండానే అమ్మ విశాల గురించి గొప్పగా చెప్పింది. అంత పొడవూ, అలాంటి రూపు, అంత మంచి పిల్లే దొరికే దాకా నా బాబుకు పెళ్లి చెయ్యనంది.
    'అయితే  విశాలనే చేసేరాదూ?' అన్న పదాలు నాలిక చివర వరకూ వచ్చి ఆగిపోయాయ్. ఆ మాటలే అంటే గాలి వాన రేగుతుందని తనకు తెలుసు. తన ఎదరగానే తల్లి తలకొట్టుకుంటుంది. ఒక అనర్ధాన్ని యెలాగో ధైర్యంతో వోర్వగల్గిన తల్లి దీనికి తట్టుకోలేకపోతుంది. కుటుంబం అంతా ఏ కొడుకు పై అన్ని ఆశలూ పెట్టుకున్నారో వాడే కుటుంబానికి దూరమై , మచ్చ తెచ్చి పెడ్తే వాళ్ళ హృదయాలు పగిలి పోతాయ్. తనకు యీ కులం, కాళ్ళకు వేసిన బంధాలు తెలుసు. కుటుంబం పెట్టుకున్న ఆశలు అనుబంధాలు కూడా తెలుసుకుని సాహసించ లేక పోతున్నాడు.
    తను యెంత కాలమైనా విశాల కోసం పెళ్ళి చేసుకోకుండా వుండ గలడు. కానీ యెదిగిన పిల్లని మామ్మ యెంత కాలం తనకోసం దాచుకుని వుంటుంది? విశాల యిష్టాయిష్టాలు లేకుండా ఆమెకు పెళ్లి చేస్తారు. మామ్మ యీ మధ్యనే బాగా ముసలిదై పోయింది. తను చనిపోయేలోగా మనుమరాలు ఒక యింటిది కావాలన్న కోర్కె వుంటుంది. ఈ ఏడాది లో తేల్చుకోక పొతే విశాల తనకు దూరమై పోతుంది. అతను అనురాగంతో సృష్టించు కున్న మేడలన్నీ గాలిమేడలై పోతాయ్.
    ఒకరోజు ఆఫీసుకు వెళ్తుంటే కంపౌండరు మిత్రుడు ఎదురయ్యాడు . సూర్యం కు అతను మంచి డాక్టరు తో సమానుడన్న గౌరవం అతని పై నుంది. అతను చెప్పినట్లే తను యే యింజక్షన్లు అవసరం లేకుండా కోలుకున్నాడు.
    'కులాసాగా వుంది కదా.'
    'రోజుజు రోజూ చాలా బాగుంటోంది.'
    'మీకేం జబ్బు లేదు. నీరసమే . సరియైన ఆహారం మాత్రం పడుతుండాలి.'
    'మా అమ్మ చాలా జాగ్రత్త తీసుకుంటోంది.'
    'మీరు రెండు విషయాలు జాగ్రత్త పడాలి. ఒకటి ఆహారం. హోటల్లో లో లేనిపోనివి తినకండి. అప్పుడప్పుడు కడుపులో చిన్న నొప్పి వస్తోందిగా....'
    'అవును. జాగ్రత్త గానే ఉంటున్నాను.'
    'రెండోది....చాలా దూరం నడవకండి. కొండలెక్కడం చెయ్యకండి.'
    'ఎంచేత?'
    'నీరసం...'
    'ఈ నీరసం యింకెంత కాలమో వుండదు లెండి.'
    'నీరసం పోయినా...నేనుచెప్పింది చెయ్యకండి.'
    'ఫరవాలేదు -- ఎంచేత్తో చెప్పండి..'
    'కొద్దిగా గుండె పెరిగిందన్న అనుమానంగా వుంది.'
    'హా' అన్నాడు సూర్యం.
    'అది గుండె జబ్బు కాదులెండి. నేను చెప్పినట్లు చేస్తారు కదూ? వస్తాను.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS