Previous Page Next Page 
సంపెంగలూ - సన్నజాజులూ పేజి 13

 

    'అయినా అదేమిటత్తయ్యా నీకు మరీ అంత గుడ్డీ? ఎదురుగుండా బల్ల మీద నాన్నా నన్నెత్తుకు తీయించుకున్న ఫోటో నీకు కనబడలేదూ?
    అని మధురిమ అనేసింది. నేను తప్పని చెబుతున్నా వినిపించుకోకుండా.
    'బాగుంది , ఎవరికి తెలీదూ? మీరంతా ఏమనుకుంటారోనని!'
    అంటూ కామేశ్వరి మధురిమని ఎత్తుకుని ముద్దెట్టుకుంది. ఆవిడకి పిల్లలంటే ముద్దు కాబోలు మరి వదల్లేదు ఆ మాత్రం అల్లరితో ఆ సంఘటన. అంతమయినందుకు నాకు సంతోషమే అనిపించింది. ముసలమ్మ మాత్రం ఆ చివరంటా చూడక మానలేదు. కాని ముణుకు బాగా మోపిందని రకరకాల పట్లు వేసింది. మాత్రలు తెప్పించుకుని మింగింది. కొంప మునిగినట్లు గోలా వూరేగిరి పోయినట్టు అల్లరీను.
    'అదేమిటే అరెళ్ళ నీకు మళ్ళీ కానుపే రాలేదూ? ఎండుచేతా? అనడిగింది లక్షమ్మ. నేనేం మాట్లాడను? నవ్వేసి వూరుకున్నాను.
    'ఏమే మాటాడవేం , ఇన్నాళ్ళెందుకాలశ్యమైంది అంట?'
    నేనెప్పటికీ జావాబు చెప్పలేదు.
    'నిన్ను కాదన్నట్టు ఊరుకుంటే నేను ఒదిలి పెడతాననుకున్నావు కాబోలు. చెప్పవే మంజూ ఏం ఎంచేతట?'
    అని సాగదీసింది మళ్ళీ. నాకు ఒళ్ళు మండిపోయింది. నేనేదో మందులు మింగుతున్నానని చెబితే అవి ఎంత అపచరమో, అనారోగ్యకరమో చెబుదామని తహతహలాడుతున్నట్టుంది ఆవిడ. నాకు మా చెడ్డ తిక్క పుట్టుకొచ్చింది. ఆడకూడని విషయాలు చెలరేగ నీయకూడని వ్యక్తీ గత రహశ్యాలూ కొన్ని ఉంటాయి. వాటి ప్రసక్తి తేవకపోవడమే సభ్యత.
    'ఇలాంటి వాటికి జవాబే ముంటుంది పెద్ద? మీ కామేశ్వరికి పిల్లలెందుకు పుట్టలేదంటే మీరేం జవాబు చెప్తారు?'
    ఆ ప్రసక్తి తెచ్చేసరికి ఆవిడకి ఎక్కడ లేని కోపమూ వచ్చినట్టుంది.
    'ఆ మాటకి ఈమాట జవాబా? అది గొడ్డు మోతని ఎత్తి పోడుస్తావా? ఇదేనా మర్యాద?
    కళ్ళ నీళ్ళు తిరుగు తుండగా కామేశ్వరి?
    'నేను ముందే చెప్పలేడుటే పిన్నీ, అన్నయ్య లేందే మనకిక్కడ మర్యాద దక్కదని! అన్ని విధాలా అందరికీ తగిన బుద్ది చెప్పింది వదిన. పద సామాన్లు సద్దేద్దాం.'
    వాళ్ళనేం వారించలేదు. కారణం లేకుండా కయ్యానికి కాలు దువ్వె వాళ్ళతో వదనా, సమర్ధనా కూడా దేనికి? నిజానికి వీళ్ళు ఉండి అల్లరి పెట్టడం తప్ప ఉద్దరించిందేమిటి?
    పెట్టె బెడ్డింగూ విప్పి ఇల్లంతా సరిచేశారు. కొళాయి విప్పినా ఫాను వేసినా మనం వెళ్ళి కట్టుకోవలసిందే గాని వాళ్ళు మాటాడరు. లక్షమ్మ సరేసరి కాస్త కాలు మడత బడిందో లేదో డాక్టర్ని పిలిచే దిక్కేనా లేదని గొణిగి చంపేస్తోంది. వాళ్ళు వెళ్ళిపోనో లేదో నాకు తెలీదు గాని సరిగా ఆ వేళకే మధురిమ కేకా వినబడ్డాయి.
    "ఏంరా నువ్వు రేపు సాయంకాలానికి గాని రావని నీ పెళ్ళాం చెప్పింది?'
    అంది లక్షమ్మమ్మ గారు గుమ్మంలోంచే. అయన ఒక క్షణం ఆగి, తెప్పరిల్లి , మాట మార్చి కామేశ్వరితో అన్నారు.
    'ఎన్నాళ్ళకు దయగలిగిందే అక్కా ఈ బీదవాళ్ళ మీదా?"
    'రానూ వచ్చాం. తగిన సత్కారాలు పొందుతూ ఉన్నాం. అంది కామేశ్వరి నా వైపు అదోలా చూస్తూ. అయన నావైపు కొరకొర చూశారు. నాకేం భయం? నేను తిరిగి చురచుర చూశాను!
    అయన ఇంచుమించు నాతొ మాట్లాడ్డమే లేదు. వాళ్ళ ముందు ఆ విషయం తేవడం నాకు అసలిష్టం లేదు. పోనీ మధురిమను పట్టుకుని గదిలో కూచూందామా అంటే అది వాళ్ళతో కలగలసి పోయిందాయే. అందుకని ఆవాళ భోజనాలూ వాటికి సంబంధించిన పనులూ అయిపోయాక 'అలా శకుంతల గారింటికి వెళ్ళి ఓ గంటలో వస్తాను, మీరు వాళ్ళతో మాటాడుతూ ఉండండి అని ఆయనతో చెప్పి పక్క వీధిలో ఉన్న చిన్ననాటి స్నేహితురాలింటికి వెళ్ళెను. అది ఆ కబురూ ఈ కబురూ చెప్పేసరికి మరో గంట ఎక్కువైంది.
    నేను తిరిగి వచ్చేసరికి వాళ్ళెవరూ ఇంకా ఉన్న జాడ కనపడలేదు. అయన యధాప్రకారంగా అటు తిరిగి పేపరు తిరగేస్తున్నారు.
    'ఏమండీ , వదినా వాళ్ళు ఏరీ?'
    'ఆలనా పాలనా లేకుండా పడి ఉండడానికి వాళ్ళెం మన దానదాసీజనం కాదుగా?'
    నేను జవాబు చెప్పేలోగా అయన అందుకున్నారు.
    'వాళ్ళు వస్తారని తెలిసి వూరు విడిచి వెళ్ళి పోయావు. వచ్చాక ఇల్లు విడిచి వెళ్ళిపోయావు. ఇష్టం లేకపోతె రావద్దని రాసెయ్యవలసింది. నీ చేత్తో నువ్వు రమ్మని రాస్తే గాని రానంత అభిమానం దనులు వాళ్ళు. పెళ్ళి అయిన తరువాత ఇన్నాళ్ళకు నా వాళ్ళు అన్నవాళ్ళు వస్తే ఇలా అవమానపరుస్తావా? ఇదేనా నీ చదువు నీకు నేర్పిన పాఠం.
    అయన అన్న అన్ని మాటలూ భరించాను. ఆఖరి ఆ ఎత్తి పొడుపు తో మాత్రం నాలోని ఉద్వేగం కట్టలు తెంచుకుంది. కళ్ళల్లో మంటలూ, చెవుల్లో వేడి గాలులూ వచ్చేయి. విరుచుకుపడే ఎత్తుకు కెరటం రాకూడదనే గాని వచ్చిన తరువాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు! అయితే అయన ఇంకా రెచ్చిపోయారు.
    'మేం ఉత్తరం రాశాం అందలేదా? అంటే మాటాడవుట, టేబిల్ మీది ఎదురుగా ఉన్న ఉత్తరం నువ్వు చూడలేదంటే ఎవరు నమ్ముతాడు? నేను ఎల్లుండి దాకా రానని వాళ్ళతో చెప్పేవుట. నువ్వడిగావా నే చెప్పేనా అలా చెప్పడానికి? వాళ్ళెం గతిలేక మన వంచన చేరలేదే! అదలా ఉంచు, ఏ పిల్ల ఎవరంటే చెప్పావుట, ఆ ముసిల్ది మక్కలిరిగేలా పడితే నవ్వుతావుట, పైగా మా కామేశ్వరక్క గొడ్డుదని అడ్డమైన మాటలూ అంటావుట- ఈ లక్షణాలన్నీ ఎప్పుడు నీకు అలవడ్డట్టు? నీ మొగుడు కూడా ఒక మనిషేవని, వాడి తాలుకూ వాళ్ళని కూడా నువ్వు పురుగుల్లా కాక మనుషుల్లా చూడవలసి ఉంటుందనీ కనీస జ్ఞానమైనా నీకు లేదా?ఏళ్ళ తరబడి నువ్వూ మీ అన్నా ఒకే సంసారం లా చలామణీ అవుతున్నా ఏ మాత్రం నేను ఆడ్డు పెట్టలేదనే కనీస కృతజ్ఞతైనా నీకు లేదా ?'
    ఆ మాటలకి నా హృదయం బోరని ఏడ్చింది. గుండె పరపరా కోస్తుంటే గుడ్ల నీరు కక్కుతూ వూరుకోడానికి నేనేం నోరు లేని జంతువుని కాదు గదా!
    'ఈ మాటలన్నీ దురభిప్రాయంతో అన్నవి కావని ఏ నాటి కయినా మీరు గుర్తించగలరు మీరన్న మాటలు ఎప్పటికైనా వెనక్కి తీసుకోగలరు. కాని అవి హృదయానికి చేసిన గాయాలు చేరిపెయ్యలేరు!'
    అయన తలెత్తి నా వైపు చూశారు.
    'నేను ఏ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళేవో అక్కడ ఏం జరిగిందో అది మాత్రం....'
    ఇంక నేను ఆపుకోలేక వెక్కివెక్కి ఏడ్చేశాను.
    అయన గబగబ వచ్చి నన్ను పట్టుకోన్నారు.
    "ఏం ఏమయింది? ఎందుకలా ఏడుస్తున్నావ్? చిన్నారి పోవడం గురించి ఆయనకు చెప్పెను.
    'అయ్యయ్యో ఎంత పని జరిగింది! ఏం జబ్బు చేసింది? నాకు ముందే ఎందుకు చెప్పేవ్ కావ్ మంజూ!'
    ఎన్నో చేబుదామనుకున్నాను. కాని ఏం చెప్పలేకపోయాను. ఎదురు చూడని ఆ స్వాంతనలో కరిగి నీరై పోయాను.
    స్త్రీని లతతో పోల్చిన బుద్దిమంతులు చిరస్మరణీయులు . కోపం వచ్చిన పాము తలపై కెత్తి నట్టు అప్పుడప్పుడు ఏ ఆధారమూ లేకుండా లత ఒక పావుగజం మేర సాగుతుంది. కాని అలా ఎంత సేపు ఉంటుంది? చిరుగాలి వీస్తే గజగజలాడి పోతుంది. ఎదురుగుండా ఓ ముళ్ళ కంప కనపడినా చాలు ఆప్యాయంగా చుట్ట బెట్టుకుంటుంది. దాని కర్మమో కాల ధర్మమో ! అదంతే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS