అలా అబద్దం ఆడినందుకు ఆ రాత్రి అంతా బాధపడ్డాడు. 'అతనికి నిద్ర లేదు. ఒంటిగా అంత నీరసంగా నున్న మనిషిని విడిచి పెట్టి యెలా రాగలిగావని మనస్సు వేధిస్తోంది. ఒకోసారి వెళ్దామని లేచిపోయే వాడు. మళ్లీ యీ రాత్రి మీద -- అసలు తలుపే తియ్యరు. ఆసుపత్రి ఆవరణ లోనికే వెళ్ళనివ్వరన్న నిస్పృహ పరుపు మీద రాలనిచ్చేది. రేపు డబ్బు దొరకక పొతే ఎదురింటామే దగ్గర బేడ వడ్డీల కైనా డబ్బిమ్మని అడగాలను కున్నాడు. ఆమె వడ్డీకి తనకివ్వడానికి ఒప్పుకోదు. అందుకు దగ్గర డబ్బు లేదంటుంది. అప్పుడు వాళ్ళ యింట్లో దొంగతనం చేసినా మా గౌరీ మాంగల్యం కాపాడాలి. ఆమె మాంగల్య రక్షణ కోసం తన బ్రతుకేమైనా సరే ఫరవాలేదు. ఎన్నో అనుకున్నాడు. ఎన్నెన్నో మంచి చెడ్డలు వూహించుకున్నాడు. కొన్నే నిర్ధారించుకున్నాడు. ఆ నిర్ధారించుకున్న ఒక్క విషయం రేపు గోవిందరావు గురించి సరియైన చికిత్స చేయించాలి. అలా చేయించాలంటే తను ఆ పెద్ద డాక్టర్ని యింట్లో చూసి పాతిక రూపాయలు చెల్లించు కోవాలి. అతను అప్పుడు ప్రత్యెక శ్రద్ధ తీసుకుంటాడు. అతని శ్రద్ధ చూసి వార్డు లో నర్సులు శ్రద్ధ కనబరుస్తారు. ఇది అవినీతి అనుకున్నా నీతిగా వుండి దగ్గరి ప్రాణం పోగొట్టుకునే తెలివి తక్కువ వాడు కాడతను. ఈ నిర్ధారణ కు వచ్చాక మోగన్ను నిద్దర పట్టింది. నిద్దర్లో యేవేవో కలలు వచ్చాయ్. అన్ని కలలు జ్ఞాపకం లేవు గాని జ్ఞాపకం వున్న కలలన్నీ చెడ్డ కలలే. అవి తలచుకుంటుంటే ఆతృత హెచ్చి గుండె దడ పట్టుకుంది. ఇంతలో దబీమని శబ్దం వినిపించింది. తుళుక్కు పడి లేచాడు. కొబ్బరి చెట్టు నించి కొమ్మోకటి రాలింది.
అలా పరుపు మీద నిద్ర పోకుండా యెప్పుడు తెల్లారు తుందా అని యెదురు చూస్తూ కూర్చున్నాడు. వేకువ ఝామునే 'కాఫీ పెట్టమ్మా' అన్నాడు. ఎదురింటి నుంచి ధర్మసు ఫ్లాస్క్జు అడిగి తెలతెలవారుతుండగా కాఫీ పట్టుకొని ఆసుపత్రి కి పరుగెత్తాడు. అప్పుడే తెలవారుతోంది. గేటు జవాను బ్రతిమాలితే గానీ వదల్లేదు. వార్డు మెట్లు యేగబ్రాకాడు. గబగబ వార్డు గదిలో నించి వరండా వేపు నడిచాడు.
మంచం మీద పరుపు లేదు. ఉత్త యినుప వూచలు అగుపిస్తున్నాయ్. ఆతృతగా ప్రక్క వాడ్ని 'యీయనేడీ' అన్నాడు.
'రాతిరి పది గంటలకు పోయాడు.'
'ఎక్కడికి?' ఈ ప్రశ్న ఆ ప్రయత్నంగా అడిగాక కాళ్ళు గజగజ వణికాయ్. అలా వణుక్కుంటూ వార్డు లోనికి రాగానే ఒక కళ్ళద్దాలు పెట్టుకున్న పెద్ద మనిషి.
'నీకు బుద్ది లేదయ్యా, చదువుకున్న వాడిలా వున్నావ్. అంత సీరియస్ గా వున్న వాడి దగ్గర రాత్రి ఎవర్నీ వుంచకుండా పోతారా?"
'ఆయనెక్కడ?' సూర్యం ఏం మాట్లాడుతూన్నాడో యేమిటో తెలియటం లేదు.
'ఐస్ రూములో ' అన్నాడతను కోపంగా. ఇంతలో నర్సు దగ్గరకు వచ్చింది. మలయాళీ పిల్ల ఇంగ్లీషు లో .
'సారీ'
ఆమె విచారాన్నీ వెలిబుచ్చి గోవిందరావు బట్టలు యివ్వ బోయింది. ఆ బట్టలు అందుకోకుండా సూర్యం గబగబా మెట్లు దిగి పోయాడు. దిగువ మెట్టు దిగాక మరి బలం లేక పోయింది. తనే అక్కడ పడిపోతాననుకున్నాడు. ఇప్పుడెం చెయ్యటం? ఇంటి కెలా వెళ్ళటం? గౌరీ కేలా ఈ వార్త చెప్పటం? ఆమె తన జీవితకాలం తనను క్షమిస్తుందా? ఏం దారి? దారి తెలియకుండా నడుస్తూ పోతున్నాడు. ఆసుపత్రంతా స్మశానం లా అగుపించింది. అందులో తనూ ఒక భూతమై సంచరిస్తున్నట్లు అయిపోయాడు. తను మనిషి రూపం లో లేడు. తన గుండె భూతమై కొట్టు కుంటోంది. ఎండుటాకు గాలిలో కదిలినట్లు కదిలి పోయాడు. ఆసుపత్రి గేటు దాటాక కూలబడి పోయాడు. ఎలాగో 'యే రిక్షా' అని పిల్చాడు. రిక్షా యేక్కాక కూడా తల త్రిప్పేస్తోంది. ఇంటి కెలా వెళ్తానన్న బాధ ఒళ్ళంతా క్రమ్మి శక్తి లేకుండా చేసింది. తనేదో అయిపోతున్నాన్న ఆలోచన మనసులో కలగగానే పాదాలు తాకాడు. చల్లగా మంచులా వున్నాయ్. తన గుండె పని చెయ్యటానికి సుముఖం గాలేదని తట్టగానే తన గుండె అదిరి పోయి జబ్బు వచ్చిందేమో ననిపించింది. గౌరీ గోల విని తన గుండె ఆగిపోవచ్చన్న అనుమానం హెచ్చింది. గాబరా తో గుండె గడగడ లాడింది. కడుపు అల్లల్లాడింది. నరాలన్నీ పీకిపోతున్నాయ్. ఒక్కసారి రిక్షా అపమన్నాడు, ఫ్లాస్కు లో కాఫీ పోసుకున్నాడు, కాఫీ పడ్తే గానీ ఆయాసం తగ్గలేదు. కాఫీ త్రాగాక కళ్ళల్లో నీరు వుబక సాగింది. కన్నీరు తుడుచుకోలేదు. నిన్న యింత వేళకి అతనిని రిక్షా మీద యీ త్రోవనే తీసుకు వచ్చాడు. అతను తన భుజం పై తలవాల్చి జన్మజన్మాల నించి వచ్చే సంబంధాలను జ్ఞప్తి కి తెచ్చాడు. ఈరోజు యింత వేళకి అతని చావు కబురు మోసు క వెళ్తున్నాడు. మళ్లీ అలాంటి వ్యక్తీ నింకా జన్మ లో యెక్కడ యే విధంగా కలుస్తానో అన్న ఆలోచన మనసులో ఒక మెరుపులా కదిలింది. ఆ మెరుపు తరవాత మనసులో మళ్లీ గాడాంధకారం పులుముకుంది. రిక్షాసందులోకి రాగానే సూర్యం సగం చచ్చి పోయాడు. ఇంటికి వెళ్ళే ధైర్యం చిక్కలేదు. చప్పున దిగి యింటి గల యజమాని యింట్లో దూరాడు. అతన్ని చూడగానే "ఏం బాబూ- ఎలా వుంది?' అని ముందు కొచ్చాడు. సూర్యం జవాబు చెప్పక పోవటం దగ్గరగా వచ్చి అతనిని తాకుతూ 'మాట్లాడవేం బాబూ?'
'ఏం చెయ్యటమో తోచకుండా వుంది. చిన్నవాడ్ని ఇక్కడ మీరు తప్పించి నాకెవరూ లేరు.'
'పోయాడా?'
'అవును . రాత్రి మా చెల్లెలి కేలా చెప్తాను?' సూర్యం యేడుపు యిక ఆపుకోలేక పోయాడు. ఇంటి యజమాని కళ్ళూ నీటితో నిండి పోయాయ్. అతను ఓదారుస్తూ "నేనున్నా బాబూ! నువ్వేం అధైర్య పడక. రా కూర్చో ధైర్యం తెచ్చుకో." బలవంతాన వాలు కుర్చీ మీద, కూర్చో బెట్టి 'ఒకరి నొసటి రాత నువ్వు కాదు గదా భగవంతుడు కూడా తప్పించ లేడు.'
అతను భార్యను పిల్చాడు. ఆమె మెల్లగా సూర్యం యింట్లో కాలు పెట్టింది. ఒక్కసారి చెల్లెలి గగ్గోలు విన్నాడు. యెగిరి పోతున్న గుండెను పట్టు కోడానికి ప్రయత్నిస్తున్నట్లు అతని చేతిని వక్షం మీద పెట్టుకుని గట్టిగా పట్టుకున్నాడు. కాళ్ళు చల్లబడే వున్నాయ్. ఒళ్ళంతా నిస్త్రాణతో పీక్కుపోతోంది.
ఇంటి యజమాని ,అతని భార్య అంతా స్వంత యింట్లో జరిగిన సంఘటనలా తీసుకున్నారు. సూర్యం ని తమ ఇంట్లో నించి కదల నివ్వలేదు. వెంటనే సూర్యం తండ్రి కి టెలిగ్రాం యిచ్చాడు. ఆసుపత్రి కి వెళ్ళి శవాన్ని తీసుకు వచ్చే ఏర్పాట్లు చేసాడు. ఊర్లో మీవాల్లేవరూ వున్నారా?' అని అడిగాడు. లేరని విన్నాక "తంతులన్నీ నేనే జరిపించనా బాబూ' అన్నాడు. సూర్యం అన్నిటికీ తల వూపేశాడు.
శవం యింటికి వచ్చాక దుఃఖం భరించ రానిదైంది. అందులో చెల్లెలు గగ్గోలు వినలేక పోయాడు. ఆమె వేపు చూడలేదు. తలుచుకుంటేనే హృదయం స్పందిస్తూ దిగజారిపోతోంది. నిన్న ఆమె భర్త దగ్గరకు వెళ్ళనీయకుండా తను జీవితం లో యెన్నడూ చెయ్యని తప్పు చేశానని బాధపడ్తున్నాడు. దీనికి సంజాయిషీ , సంతృప్తి ఆమెకే కాదు తన అంతరాత్మ కు తనే యిచ్చుకోలేదు.
అంతా పై వాళ్ళే గోవిందరావు కట్టెను మోసారు. పై వాడె తలకు నిప్పంటించాడు. సూర్యం వెళ్లాలని ప్రయత్నించాడు. గుండెలో నొప్పిగా వుంది. కాలు కదిపితే గుండె దడ హెచ్చవుతోంది. పాదాలు మంచులో ముంచినట్లున్నాయ్. ఇంటి యజమాని యెంత మాత్రం సూర్యం కదలటానికి ఒప్పుకోలేదు.
ఇంటావిడ గౌరిని విడిచి పెట్ట లేదు. 'నువ్వు యేడుస్తూ కూర్చుంటే అన్నయ్య వినలేడు. అప్పుడే గుండె దిగజార్చు కున్నాడు. ఆ బాబు కోసమైనా నివ్వు దుఃఖాన్ని దిగిమింగమ్మా' అని బ్రతిమాలింది.
ఆమె యేడుపు వినకపోగానే సూర్యం మనసు పరిపరి విధాల పోయింది అన్నయ్య గురించి దుఃఖాన్ని దిగమింగు తోంది. లేక మూర్చపోయిందేమో? ఎలా గుందోయేమో?
చెల్లెలు యింట్లోనూ , తను యింటి గల వాళ్ళ యింట్లో నూ సాయంత్రం వరకూ గడిపారు. అప్పటికీ సూర్యం తండ్రి, మేనమామ , తల్లి దిగబడ్డారు. లబో లబోమని తల్లి తలకోట్టుకుంది. కూతురి గతి అలా వుంచి కొడుకు పరిస్థితి చూసి మరింత కంగారు పడిపోయింది. చీకటి పడ్డాక సూర్యం మెల్లగా యింటి గుమ్మం లో కాలు పెట్టాడు.
'టెలిగ్రాం చూసి నమ్మలేక పోయాం నాయనా' తండ్రి అన్నాడు.
'గోవిందరావు కోపం తెలుసు గదా! కోపం మీద ఏం చేసాడో? నిన్ను పోలీసులు పట్టుకొని ఏం అల్లరి పెట్తున్నారో అనుకున్నాం. హమ్మయ్యా-- బలవంతం చావు కాదు -- వాడికి ఆయుస్సు లేదు -- మనం ఏం చేస్తాం' అని మేనమామ మానసు కుదుటపడి మెల్లగా అన్నాడు.
సూర్యం దేనికీ జవాబివ్వలేదు. మతి తప్పిన మనిషిలా వున్నాడు. జీవితంలో ఒక పెద్ద తుఫాను లో చిక్కుకుని దెబ్బలు తిని నీరసపడ్డ మనిషిలా వున్నాడు. తల్లిని దగ్గర వుంచి రెండు రోజుల్లో గౌరిని తోడ్కుని తండ్రి మేనమామ తిరిగి యింటికి వెళ్ళిపోయారు.
