శ్రీకృష్ణాచార్య, కాశి
భారతీయోద్బోధ
శో|| బ్రాహ్మం క్షాత్రం బలం, ధైర్యం, వర్ధతాం నఃప్రథా జయః
వీరాణాం భారతీయానాం| "రణభేరీ" ప్రఘోషణాత్.
ఉ|| సోదర భారతీయ! విన
కుంటి వొకో, రణభేరీఘోష? చై
నా దనుజాధముల్, పరమ
నాస్తికు లక్రమవృత్తిఁ బూర్వ మ
ర్యాదలఁ ద్రోసిరా జని - క
టా! మన పావన మాతృభూమిఁ గా
లూఁదుచు నున్న వార; లెదు
రొడ్డఁగ లె, మ్మెదు రొడ్డ రమ్మిఁక౬.
ఉ|| శాంతియు, మైత్రియు౬, సమత,
సత్యము - మున్నగు నున్నతార్య సి
ద్ధాంతము లెల్ల మాకును హి
తంబులె యంచు, హిమాచలోత్తర
ప్రాంతముఁ గొల్లఁ గొట్టినటు
లల్లదిగో 'రణభేరి' మ్రోఁగు; నా
హంతల నాత్మశక్తి హత
మార్పఁగ సోదర! లెమ్ము, రమ్మిట౬.
చ|| జననియు, జన్మభూమియుఁ బ్ర
శస్తిని హెచ్చెను స్వర్గ సీమ కం
టెను; మఱి తత్ప్రరక్షణమె
నీతి సుపుత్త్రుల; కే తదర్థ మ
ర్పణ మొనరింపగాఁ దగును
బ్రాణ ధనంబు లటంచు వీర ఘో
షణ "రణభేరి" సేయు; నను
జా! కృతకృత్యతఁ గాంచ లెమ్మిఁక౬.
చ|| ఉరుతరుణార్కమూర్తిఁ బురు
షోత్తముఁ, గాకతి వీర రుద్ర భూ
వరునిఁ, బ్రతాపసింహుని, శి
వాజి స్మరించుచు - భారతీయ సో
దరవరులార! చైనీయుల
దాడి నడంపఁగ లెం డటంచుఁ జె
చ్చెర "రణభేరి" మ్రోఁగు; నెడ
సేయక రండు ధృతాస్త్రశస్త్రులై,
* * * *
