శ్రీ కొండమాచార్య, ఎం.
శక్తి రథోత్సవమ్
కదలె కదలె శక్తి రథము
కదలె ప్రజాశక్తి రథము
కనత్కనక కింకిణీక
గల గల గల ఘంటాచయ
గణ గణ గణ రవములతో
శోణ శుక్ల హరిత వర్ణ
సుందరమగు టెక్కెముతో
నీల జలద గర్జోపమ
నేమి భయద ఘోషముతో
కదలె కదలె శక్తి రథము
కదలె ప్రజాశక్తి రథము
కనక తప్పెటల మ్రోతలు
కాహళికా నిస్వనములు
సకలదిశా కర్పరముల
శకల శకలములు సల్పగ
కదలె కదలె శక్తి రథము
కదలె ప్రజాశక్తి రథము
మధ్యందిన మార్తాండుని
మండల పటు తేజముతో
కాలు వచ్చినట్టి వింధ్య
శైల రాడ్విలాసముతో
కదలె కదలె శక్తి రథము
కదలె ప్రజాశక్తి రథము
గిరి కంధరములఁ బొంచిన
అరి వృకముల హతమార్పుడు
శైల వనుల డాగిన రిపు
జంబుకములఁ బరిమార్పుఁడు
శ్రుతి చతుష్క చక్రమ్ముల
శోభిల్లెడు తేరు గదలె
బలవద్రిపు రుధిరముతో
కల యంపిని జల్లరండు
కపట కుశల వైరి శిరః
కాండమ్మును బగులనడచి
తెల తెల్లని పునుకలతో
జిలుఁగు మ్రుగ్గు లిడగ రండు
తల్లి కొంగు ముట్ట పగఱ
పిల్ల పిల్ల తరముఁ బట్టి
పొలి పొలి పొలి పొలి పొలియని
బలిదీయుడు బలిదీయుడు
నలువది కోటుల శిరాల
వెలుఁగు మహాకాళి యిద్ది
ఎనుబది కోటుల కరాల
వెసఁగు మహాచండి యిద్ది
ఒక్క కంట సుధా వృష్టి
ఒక్కట అంగార వృష్టి
జడి గొల్పెడి రమ్య ఘోర
శాంత వీర మూర్తి యిద్ది
పగతుర రణరంగ మందు
భుజింపంగ నరుగుచున్న
తల్లిని మరిమరి నుతింప
తరలిరండు తరలిరండు
జయ జయ భారత సవిత్రి!
జయ విరోధి విలయ కర్త్రి!
జయ భారత జనయిత్రీ!
జయ నాస్తిక జీవహర్త్రి!
జయ భరత ప్రియజననీ!
జయ మంగళ సంధాయిని!
జయ జయ జయ జయ జయేతి
సాధు వచనములు పల్కుడు
కదలె కదలె శక్తి రథము
కదలె ప్రజాశక్తి రథము
* * * *
