Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -6 పేజి 1

                             దాశరథి రంగాచార్య రచనలు -6

                                         ----దాశరథి రంగాచార్య

 

                             దేవుని పేరిట    
                                                            

 

                                 


    
                                             1    
    
    తల్లిదండ్రులు తమ పిరికి బిడ్డలకు ముద్దుగా అజేయుడనీ, విజయరాజనీ పేర్లు పెట్టుకుంటారు. మొద్దులాంటి కారునలుపు కన్యలు మెరుపు తీవెలుగను, కమల మాలికలుగను చెలామణీ అవుతారు. కాని కాలూ అలాకాదు. అతడు తన పేరుకు ర్తగిన బొగ్గులాన్తి నలుపు రంగువాడు. అతని స్వేదం నల్లగా సిరాలా ఉండేది. అతడు చెమట కారుస్తున్నప్పుడు మీ పెన్నుకై వేరే సిరా కొనాల్సిన అవసరం ఉండదు. అతడు స్వయంగానే తన నలుపు రంగును గురించి సహజ హాస్య ధోరణిలో పలికేవాడు.
    "గడ్డు కాలాలు వచ్చాయి. నా గ్రాహకులంతా డబ్బుకు మూడుముళ్ళు వేస్తున్నారు. అలాంటప్పుడు నా కొలిమి మూసేసి ఇంక్ ఫ్యాక్టరీ ఎందుకు ప్రారంభించకూడదు? నా ఒడ్డూపొడుగూ చూడండి. పొయ్యి దగ్గరగా గాని మాంచి ఎండలోగాని ఒక తొట్టిలో కూర్చుంటే అది చెమటతో నిండిపోతుంది. ఏమంటారు?" అనేవాడు.
    కాలూ పెద్దవాడు అవుతున్న కొద్దీ అతని రంగు మెరుగులు పెట్టుకోసాగింది. నడివయసులో అతని వెంట్రుకలు పల్చనై రాలిపోవడాన తల మధ్యభాగం బట్టతలగా తయారైంది. పర్వతంలాంటి అతని శరీరం మీద నున్నగా క్షౌరంచేసి వార్నీసు వేసిన లాంటి తల మకుటంగా ఉండేది. జనులు ద్వంద్వార్ధంతో "శిఖరాన ఒక మృదువైన మచ్చతప్ప అతని శరీరమంతా మూడు మణుగుల ఇనుము. ఆ మృదుత్వమే లేఖ అతని కూతురు" అనేవారు.
    'లేఖ' అనే పేరు వెనుక ఒక చరిత్ర ఉంది. అప్పటికి కాలూ యువకుడు. పెళ్ళై నాలుగేళ్ళే అయింది. ఒకనాడు ఒక బ్రాహ్మడు పగిలిన బకెట్ బాగు చేయించుకోవడానికి కమ్మరి కొలిమికి వచ్చాడు. అతడు ఒక చిన్న ఎత్తు పీటమీద కూర్చున్నాడు. గోడకు ఆనుకోవడంతో తెల్లగా వెల్లవేసిన గోడకు అతని చమురు తల ఒకపెద్ద మచ్చ పడేసింది. కాలూ మోకాళ్ళ మీద కూర్చుని సమ్మెట, కొలిమితిత్తితో పనిచేస్తుంటే ఆ బాపడు తదేక ధ్యానంతో చూడసాగాడు.
    "కాలూ, ఏమిటది? అంత సంబర పడుతున్నావు. చల్లని కర్బూజపండు తింటున్నట్లు నీలో నీవే నవ్వుకుంటున్నావు. బావుంది. బావుంది" అన్నాడు.
    అతని విశాల వదనంమీద చిందుతున్న చిరునవ్వుతో కాలూ తలెత్తి చూచాడు. దట్టమైన నల్లని మీసాలు కూడా నవ్వుతున్నట్లనిపించింది.
    "నేను ఆలోచిస్తున్నా" అన్నాడు.
    "నీకేమైనా పిచ్చెత్తలేదుకదా! నీకేమాలోచన? నీకు ఆలోచించాల్సినపనేముందంట? ఏదో ఆలోచనలో ఉండి నా బొక్కెన అతుకు చెడగొట్టేవు!" అన్నాడు బ్రాహ్మణుడు.
    కాలూ నవ్వుతూనే పని చేస్తున్నాడు.
    "నా ఆడది - మా ఇంటిది కడుపుతో ఉంది. దాని పూర్తిపేరూ......"
    "హయ్యో! ఇంకో పొట్ట నింపాల్సివస్తుంటే నువ్వు ఉబ్బిపోతున్నావా? పిచ్చివాడా!"
    బాపని మాట లక్ష్యపెట్టనట్టే "పాప మగబిడ్డడైతే ఏం పేరు పెట్టాలి? ఆడబిడ్డ అయితే ఏంపేరు పెట్టాలి? అని ఆలోచిస్తున్నా" అన్నాడు.
    "హుష్ ఇంతేనా? మగబిడ్డ అయితే అభిజిత్, ఆడబిడ్డ అయితే చంద్రలేఖ, తెలిసిందా? మేం గొప్పకులాల వాళ్ళం ఇలాంటి పేర్లు పెట్టుకుంటాం. మీ కులపు మట్టిబుర్రలు, ఎంకి, పుల్లి, మల్లి అని పెట్టుకుంటారు. అంతేనా?"
    కాలూ ఆ రెండు పేర్లూ జపించాడు. అభిజిత్, చంద్రలేఖ. అతడు సంబరపడ్డాడు. అభిజిత్, చంద్రలేఖ తలపంకించాడు. నిశ్శబ్దంగా తన పనిలో నిమగ్నుడైనాడు.
    అతకడం పూర్తి అయింతర్వాత ఎంత అని అడిగాడు బ్రాహ్మడు. "పట్టపగలే గొంతు కోయడానికి ప్రయత్నించకు" అన్నాడు.
    కాలూ తల ఊపాడు. "ఇవ్వాల్సిందేదో మీరు ఇచ్చేశారు."
    బాపడు ముందుకు వంగుతూ "ఏమిటీ? ఇదేమి ఆట" అన్నాడు.
    "పేర్లు. కొడుకైతే అభిజిత్, బిడ్డైతే చంద్రలేఖ - ఇంకేం మీరు ఇచ్చేశారు. మీ పాదాలంటుతా."
    ముసలి బాపడు గుడ్లప్ప చెప్పి చూశాడు. కాలూకు ఏమైంది? ఝార్నాలోనే కాదు కాలూలా దోచుకునేవాడు బెంగాల్ మొత్తంలోనే లేడు. కాలూ ఎన్నడూ దమ్మిడీ తగ్గించి ఎరుగడు. అత్డుమంచి పనివాడే అయినా చిన్న చిన్న పనుల విషయంలో సహితం ఎక్కువ శ్రద్ద తీసుకునేవాడు. అందుకే అంతా అతని దగ్గరికే వచ్చేవారు.
    "అతుకు బాగా వేశావా?" అన్నాడు బ్రాహ్మడు కాలూ ముఖం నుంచి అతుకు వేసిన బొక్కెన దాకా తన దృష్టి సారిస్తూ.
    'నమ్మండి బాబూ'అన్నాడు కాలూ బాపని అపనమ్మకాన్నిగుర్తిస్తూ. "సంవత్సరం లోగా అతుక్కు ఏమైనా అవుతే డబ్బులేకుండా కొత్తగా అతుకేసి పెడ్తాగా. మీరు నాకు రెండుపేర్లు ఇచ్చారు. కొడుకైతే అభిజిత్, బిడ్డైతే చంద్రలేఖ. అబ్బ ఎంతమంచి పేర్లు."
    బిడ్డ పుట్టింది. పుట్టుకను సూచించే మంగళ శంఖాలు నినదించలేదు. బిడ్డ భూమ్మీదికి రావడానిగ్గాను తల్లిని మింగింది.
    కాలూ చాలా దుఃఖించాడు. కాని అతని విషాదాంధకారాన్ని చంద్రలేఖా దీపికతో జయించాడు. ఆడబిడ్డ, చంద్రలేఖ, అతనిగుండె నింపేసింది.
    అతడు మళ్ళీ పెళ్ళాడలేదు. అభిజిత్ అనే పేరు పెట్టుకోగల కొడుకు తనకు లేనందుకు విచారించనైతే విచారించాడు కాని కొత్తపెళ్ళాన్ని తెచ్చుకొని తన రత్నాన్ని సవతి తల్లికి అప్పగించ దలచలేదు. అంతేకాక ఆపోయింది పూర్తిగా వదిలింది కాబట్టా! రాత్రింబవళ్ళు ఆమె అతని వెంటనే ఉంటూంది. నడిచినా నిద్రించినా ఆమె కనిపిస్తూంది. పెళ్ళినాటికి ఆమెకు పదిహేనేళ్ళు. బక్కపల్చగా, నీరసంగా ఉండేది. అతడు ఆమెను ఒక్కరోజుకూడా దూరంకానివ్వలేదు. అలాంటప్పుడు ఈలోకాన్ని త్యజించినా ఆమె అతన్ని ఎలా మరిచిపోగలదు? ఆమె తన ముద్దుబిడ్డ చంద్రలేఖను వదిలిపోగలదా?
    అబ్బ! ఎంత ఆనందంతో ఆమె ఆ పేరును అందుకుంది! తన పేరు ఎప్పటిదో తాతల్నాటిది. ఆమెకు పురిటినొప్పులు వచ్చినప్పుడు - కళ్ళు మూసుకొని మంచంలో పడుకొని బాధపడుతున్నప్పుడూ - కాలూ ఆ పేరు చెప్పి ఆమెను సంబరపెట్టేవాడు. అతనిచేతిని తనచేతిలోనికి తీసుకొని తనపొట్టమీద పెట్టుకొని, కనురెప్పలు ఎత్తి అతన్ని తాగేస్తున్నట్లు చూసింది. అతడు ఆమె బిగపట్టిన పెదవుల్లోని బాధను గ్రహించాడు. అలాంటి సమయంలో చంద్రలేఖాభిత్తులు గారడీ చేయగలరని అతనికి తెలుసు. అతడు తనవ్రేళ్ళతో ఆమె శరీరాన్నంతా తాకాడు. తనచేతి తాకిడి- అతని దీవెనా - ఆమెనెప్పులు సడలిస్తాయని ఊహించాడు. "ఇంకో గంట రెండు గంటల్లో అభిజిత్ వస్తాడు. లేదా చంద్రలేఖ వస్తుంది" అని తల పంకించాడు.
    నిశ్శబ్దమైన ఆమె పెదవులు కదలడం - మళ్ళీ కదలడం అతగాడు చూచాడు.
    కొన్నిగంటల తరువాత చంద్రలేఖ వచ్చింది. ఆమె ప్రశాంత నిశ్శబ్దంలో గాఢనిద్రామగ్నమైనట్లు పడిపోయింది. ఆమె నిద్రించింది. కాని శాశ్వతంగా.
    కాలూకు ఒక విధవ పింతల్లి ఉంది. ఆమె అక్కడినుంచి కొన్ని గంటల బండి ప్రయాణపు దూరంలో ఉండేది. ఒకనాటి మధ్యాహ్నం తన సామానంతా ఒక రేకుపెట్టెలో వేసుకొని కాలూ ఇంటికి వచ్చింది. ఆమె ఆ రెండుగదుల ఇంట్లో ఉండి ఇంటిపని చేస్తుంది. బిడ్డను కాపాడుతుంది. కాని లేఖ తన ప్రేమను ఇంకొకరికి పంచి ఇవ్వడం కాలూకు ఇష్టంలేక పోయింది. లేఖ పూర్తిగా అతనిదే. అందులో వేరువారికి భాగం ఇచ్చేది లేదు.
    కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పండక్కు, ఆ ముసలి చంద్రలేఖను తన ఊరికి తీసికెళ్ళింది. రెండురోజులన్నా గడవక ముందే పీక్కుపోయిన ముఖంతో కాలూ తయారైనాడు. లేఖను తీసికెళ్ళడానికే అతడు వచ్చింది.
    "లేఖ ఇక్కడే ఉంటుంది" అన్నది ముసలి సూటిగా.
    కాలూ నిరుత్తరుడై బిడ్డను అమాయికంగా చూడసాగాడు. అప్పటికి అయిదు సంవత్సరాలు మాత్రమే ఉన్న లేఖ సహితం అతని విచారాన్ని గుర్తించింది. ఆమె పరిగెత్తి తన లేత చేతిని అతని పెద్దచేతికి అందించింది.
    "ఇవి పండుగ రోజులు. పది చేతులతల్లి విగ్రహం దొరఇంట్లో నిలపెట్టారు. అంతా ఆ దేవిని దర్శించుకొని పూజిస్తున్నారు. దొర ఇంటికి పోవడానికి పిల్లలంతా పండగ బట్ట లేసుకుంటారు. దేవి ప్రసాదం, కొబ్బరి మిఠాయి దోసిళ్ళకొద్ది పంచి పెడ్తారు. అదంతా తమాషాగా ఉంటుంది. ఏమంటావు లేఖా?" అన్నది వృద్ధ.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS