Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 1


                                 దాశరథి రంగాచార్య రచనలు -7
        
                                                               అనువాద కథలు

                                                                     తీరని దాహం

                                          

    "దాహం కూడా రోగమే! డాక్టర్లకేం అలాగే అంటారు. వైద్యులకు విద్యలేదు. ధైర్యంగా ఉండు. స్పష్టంగా కనిపిస్తుంది. ఏదో గాలి తాకిడిలా ఉంది. మంత్రగానికి చూపించడం మంచిది."
    "దాహం అంటే మామూలు దాహం అనుకున్నారా? రోజంతా బిందెలకొద్ది నీళ్లు తాగుతుంది. అయినా దప్పి ఆరందే! అదేం దాహమో మరి?"
    "ఇప్పుడిహ రూపమే గుర్తించకుండా అయిపోయింది. అయినా ఊరుకుంటుందా? ఊపిరి ఆడ్డమే కష్టం. అయినా వాగుడు మానదు."
    "రాత్రి అయిందంటే కొండలు విరుచుకుపడ్డట్టే - ఆ దేవుడే రక్షించాలి."
    అవును. నాకు రాత్రులు కొండల్లాగే అనిపిస్తాయి. కొండలు ఎక్కుతూ ఎక్కుతూ జీవితాన్నే కోల్పోయాను. నా చంద్రుణ్ణి పోగొట్టుకున్నాను. కటిక చీకటిలో కొట్టుకుంటున్నాను. నేను గురిచూచుకునే గోడను గురిచూచి తమ ప్రతిభను గుర్తించుకోవడానికి నన్ను లక్ష్యం చేసుకున్నారు. నా మనస్సు అనేక చోట్ల బీటలు వారింది. నా అపజయాల సైన్యం అందులో ప్రవేశించింది. నా గుండె ఖజానా అందుకుని నలువైపులా ఉరుకుతున్నాను. ఖజానా ఏమిటి? ఏమిటి పిచ్చి? ఇంకేం మిగిలింది నాలో? నాలో ఇంకేమైనా మిగిలిందా? ఛా, నాకు మతి లేదు. నేను గుండెకు అదుముకొని తిరుగుతున్న మూటలో నా మనస్సుకు సంబంధించిన ముత్యం ఒక్కటీ లేదు. కొంటె పిల్లలు దానిలో చిత్తుకాగితాలు కట్టారు. నా మనోమందిరాన్ని ఎందరెందరో దోచుకున్నారు. నేను నడిచిన బాటల నిండా ముత్యాలు రాలాయి. వాటిని ఏహ్యంగా చూచి లేచాను. నేల రాలినదాన్ని అందుకుంటారా? ఛీ, నిజమే. ఏమిటీ మాటలు? ఒట్టు, ఎందుకిలా వాగుతున్నాను?
    ఏమిటీ వేడి ఇవ్వాళ? ఎండేనా? ఎందుకీ దాహం? గొంతు ఆరిపోతూంది. భగవాన్! గ్లాసెడు నీళ్లు ఇచ్చేవాడులేడు. అవును నేను తప్పు చేశాను. నిజం కాని మావాళ్ళు నాకు భయంకరం అయిన శిక్ష విధించారు. అపఖ్యాతి అనే ఎడారిలో దాహంతో చావగొడ్తున్నారు. నేను తృప్తిగా కనీసం నీళ్లు తాగలేకపోయాను. జనం ఏమో తాగుతున్నారు. వీళ్లు మావాళ్లు కారు. కసాయివాళ్లు. సలీమ్, నువ్వు లేవకు. వీళ్లు నీళ్ళివ్వరు. కానీ ఇలాగే చస్తాను దాహంతో.
    నేటి రేయి ఇంత నీరసంగా ఎందుకుంది? చంద్రుని కళ్ళు ఎందుకలా మూతలు పడుతున్నాయి? వెన్నెల బిందువులుగా రాలుతున్నట్లుంది. వెన్నెల కన్నీరు రాలుస్తూంది. కన్నీటి చుక్కల్నే తాగుదాం.    
    అయ్యో - పరీక్షలు వచ్చేశాయా నెత్తిమీదికి? వరండాలో అమ్మూ, షమ్మూ వళ్లువిరుచుకొని నోట్సు రాస్తున్నారు. నాకూ గుర్తుండదు ఈ భూమి - చంద్రుడు - వాటి సిద్దాంతం. పరీక్షలు వచ్చాయంటే గంటల తరబడి బట్టీ పెట్టేదాన్ని. భూమి బొంగరంలా తిరుగుతుంది. దాని వెలుగు భాగం చంద్రుని ముందుకు వస్తే వెన్నెల రాత్రులు అవుతాయి. భూమికీ చంద్రునికీ దూరం కలకాలంగా ఉంది. ఉంటుంది. కొత్త సైంటిస్టులు అది నమ్మరట. నమ్మకపోదురుగాక నాకేటి భయము. నావరకు నాకు భూమి చంద్రునిలోంచి విడిపోయిన భాగం మాత్రమేననిపిస్తుంది. అందుకే విడిపోయిన తన దేహంలోని భాగాన్ని కలుసుకోవడానికి భూమివెంట పరిగెత్తుతూంది. చంద్రునికి నోరుంటే ఎంత బావుండును. అతడు చెప్పగలిగేవాడు తన ఇష్టపూర్తిగా భూమిచుట్టూ తిరుగుతున్నానని.
    హ హ్హ హ్హ ఎంత వింత - అక్కడ ఆకాశంలో కూడా స్వార్థం పురివిప్పుకొని ఆడుతూంది. అక్కడ కూడా అదృష్టం బలవత్తరం అయిందే. అందుకే పాపం భూమి - చంద్రుడూ కలుసుకోలేక పోతున్నాయి. తాకలేక పోతున్నాయి. ఇహ ఇంతేనా? చంద్రుని కన్నీరు వెన్నెల జలపాతాలు కావలసిందేనా? కలయిక లేని ఈ కల్లోలాన్ని లోకం భరించలేదని కాబోలు నేటి రాత్రి నిశ్శబ్దంగా ఉంది. వాయువు స్థంభించింది. అమ్మ అజ్ఞాతంగా కూర్చొని జపంలో లీనం అయిపోయింది. రేయి ఈ విషాద దృశ్యం మీద కంబళి కప్పాలనుకుంటూంది. కాని వసంతంలో శృంఖలాలు వెదుక్కునే వెర్రిగుండెలవాళ్ళను ఆపగలవాడేడి? చంద్రుడు తేపతేప మబ్బుల ముసుగులను చీల్చుకుని వేగంగా ఉరుకుతున్నాడు. కాదు చంద్రుడు నిలిచే ఉన్నాడు. మబ్బులు, మబ్బులతో పాటు నా మంచం, నా ఇల్లు, నా మనసు అన్నీ చంద్రుని వెంట ఉరుకులు పెడ్తున్నాయి, సలీం! చంద్రుడు వెర్రివాడిలా ఉన్నాడు. కాకుంటే ఎందుకలా భూమి వెంటపడి ఉరుకుతాడు? ఏమిటి భూమికి చంద్రునికీ బంధం? వాళ్లు కలుస్తారా? కలుస్తారు పో - ప్రళయం రాదూ? అవును ఈ పరీక్షలూ ప్రళయం లాంటివే? భగవాన్! ఎలాంటి పరీక్షలో పెట్టావయ్యా, ఎన్ని కల్లోలాలు రేపావయ్యా?
    అజీమ్ అక్క గాలిబ్ కవిత చదివించేది. గాలిబ్ కవిత చెప్పేప్పుడు ఆమె తన్మయురాలయిపోయేది. సురయా చూపులు, ఆమె చామనచాయ వదనం నుంచి చిన్ని చిన్ని కళ్ళనుంచి కదిలే పెదవుల నుండీ కదిలేవి కావు. ఆ కదిలే పెదవులు ఏం పలుకుతున్నాయో! నిశ్శబ్దంలో కాగితం మీద పేలనాజూకు వేళ్ళు కదలాడుతున్నట్లుండేది. సురయా శరీరం మీది ప్రతిరోమమూ కన్నుగా పరివర్తన చెందింది.
    "నిన్ను బోలు దాని నేనేడ తెత్తును?"
    అజీమ్ అక్క స్నిగ్ధదృక్కులు క్లాసునిండా పరుచుకున్నాయి.
    "గాలిబ్ కవి ఎవరిని ఉద్దేశించి ఈ చరణం ఆలపించారో చెప్పగలరా?"
    అజీమ్ అక్క వ్యక్తిత్వంలో ఆకర్షణ ఉంది. కాలేజీలోని ప్రతి రెండో అమ్మాయి ఆమె కురుల్లో ఇరుక్కుంది. పురుషులు ఆమెను చూస్తే చూపు మరల్చకపోయేవారు. కాని దగ్గరికి వస్తే గౌరవంగా సంబోధించేవారు. అణకువగా ప్రవర్తించేవారు. అజీమ్ అక్కకు తన బలహీనతలు తెలుసు. నా రూపాన్ని చూచి చిలిపి భావాలు కలిగేవారు నా బుద్ధితో పోటీపడగలరా? నిన్నటికి నిన్న ఒక కవి నన్ను ఉద్దేశించి కవిత చెప్పారు.
    క్లాసులోని అమ్మాయిలంతా కాపీలు మూసి ఆ రోమాంచకమైన వలపును తమ గుండెలమీద రాసుకోవాలని ప్రయత్నించేవారు. అది కాల్పనిక రొమాన్స్. ఆ విషయం అందరికీ తెలుసు. అయినా దానిని కాల్పనికం అనే ధైర్యం ఏ ఒక్క అమ్మాయికీ ఉండేది కాదు. అజీమ్ అక్కలాంటి నిర్భయం గల ఆడది మరొకటి ఏది? ఏడేడు పరదాల్లో దాగటానికి అలవాటుపడిన పల్లెల నుంచి వచ్చిన అమ్మాయిలకు సంజ్ఞలు, సంకేతాలూ అర్థంకాకుంటే, ఫలానా అబ్బాయి నువ్వంటే పడి చస్తాడు ఏదో ఒకటి చెప్పు అని ఆజ్ఞాపించేది. అనేకసార్లు స్టాఫ్ రూమ్ లో ఆమెకు వ్యతిరేకంగా కల్లోలం రేగింది. కాని ఆమెకు యూరోపులోని అన్ని దేశాలకు చెందిన డిగ్రీలున్నాయి. వాటిని మోయాలంటే ఇద్దరు కూలీలు కావలసివచ్చేవారు. అలాంటప్పుడు ఆమెను కదలిమ్చడం ఎవరికీ తరమయ్యేది కాదు. ఆమె ఠీవిగా అనేది చాటుగా మొరిగేవాళ్లు ముందుకు రావాలని.
    సరే ఇదంతా ఆమెను గురించిన భోగట్టా, అసలు కథకు వస్తే ఆమె ప్రశ్న అడిగింది కదా! అలవాటు చొప్పున సురయా లేచినుంచుంది. అజీమ్ అక్క అలవాటేమంటే తానంటే పడిచచ్చే అమ్మాయినే ప్రశ్నించేది. కాని ఆ రోజు విచిత్రంగా సురయాను ఆపాదమస్తకం అవలోకించి తల ఆడించి "కాదు...నిన్ను కాదు. ఈ కవితలో..." ఆమె కనుచూపు అక్కడున్న రూపాలన్నింటినీ వెదికాయి.
    "ఈ కవితలో గాలిబ్ కవి జమాల్ ను ఉద్దేశించారు. ఏమంటావ్ జమాల్?"
    క్లాసు సాంతం ఆ కొత్త అమ్మాయివైపు తిరిగింది. ఆమె ఫస్టియర్ పిల్ల - వెర్రిది. వలపు జ్వాలలంటే ఎరుగనిది. తన అందాన్ని సైతం గుర్తించనిది. ముడుచుకొని కూర్చుంది. గొంతు ఆరుకుపోతూంది. భయంతో చేతిలోని పెన్ను గజగజలాడుతుంది. అమ్మాయిలంతా గొల్లుమని నవ్వారు. అది ఆమెకు వినిపించలేదు. పెనుగాలికి పతాకంలా రెపరెపలాడింది. అజీమ్ అక్క పీరియడ్ అయిపోయింది. ఆమె పర్సు, పుస్తకాలు జాగ్రత్తగా లెక్చరర్స్ రూమ్ కు చేర్చాల్సింది చేర్చకుండానే ఆమె క్లాసు నుండి అమ్ములా సాగింది. గేటువైపు సాగింది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS