శ్రీ కృష్ణమాచార్య, దాశరథి
జాతి మేల్కొన్నది!
గిరి మేల్కొన్నది, పురి మేల్కొన్నది
గిరి గుహలో కేసరి మేల్కొన్నది
గిరి, పుర, వనముల ధర మేల్కొన్నది
నర, నారీ సంతతి మేల్కొన్నది.
మెత్తని పుష్పమువంటి భారతము
కట్టిబట్టి కేలెత్తి లేచెను
శాంతి సహనములు కురియు భారతము
అంతులేని కోపాన చూచెను
నటస్వామియై తాండవించెను
కుటిలశత్రువుల గుండె చించెను
గంగ యమునలే పొంగివచ్చెను
అంగారమ్ముల నుమియజొచ్చెను
మంచుకొండలో, మనిషిగుండెలో
మహావహ్ని శిఖ లుద్భవించెను
స్వేచ్చాభారత పరిరక్షణకై
వివిధవర్గములు మైత్రి పెంచెను
అణువణు వొక అణుబాంబై విరిసెను
అరివర్గముపై అనలము కురిసెను.
తెలుగువాడనీ అరవవాడనీ
కులమువేరనీ మతమువేరనీ
ఎల్లభేదములు కల్లలాయెను
పల్లె పట్టణం ఏకమాయెను
మిల్లుకూలికీ పల్లెరైతుకూ
ఉల్లమొక్కటై ఉల్లసిల్లెను
తరుణీతరుణుల శిరముల ఉరముల
భరతపతాకము రెపరెపలాడెను
గిరిశిఖరముపై పురసౌధముపై
తరుశాఖలపై తళతళలాడెను
తీగెను పువ్వై, నదిలో తరగై
మదిలో తలపై వలపై వెలసెను.
శత్రువుగుండెల శస్త్రముగ్రుచ్చగ
సాగిరమ్మనుచు జనులను పిలిచెను
ధైర్యమునేర్పెను శౌర్యముకూర్చెను
తరతరాల మన దాస్యముతీర్చెను
మనకు దీపమై మాతృరూపమై
అరికి శాపమై అవతరించెను
ఇంద్రచాపమై నింగిదారిలో
డెందమలరగా అందగించెను
పగరగుండెలో వాడిబల్లెమై
మంచుకొండతలుపులకు గొళ్ళెమై
స్వతంత్రతా ధనరాశి కాచెను
నిఖిలశత్రువుల నేలరాచెను
సత్యాహింసల కాలవాలము
ధర్మవిరుద్ధుల పాలి శూలము
భరతపతాకము చేత ధరించి
అరివర్గముపై జయము వరించి
మహాసైనికులు, మహానాయకులు
మనదేశమ్మును కాపాడేరు.
కదనభీములై పరశురాములై
పదండి భారత వీరుల్లారా!
భరతజాతి కిక తిరుగులేదురా!
పరాక్రమింపుడు శూరుల్లారా!
గిరిమేల్కొన్నది పురిమేల్కొన్నది
గిరిగుహలో కేసరి మేల్కొన్నది
గిరి, పుర, వనముల ధర మేల్కొన్నది
నరనారీసంతతి మేల్కొన్నది
* * * *
