Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు - 9 పేజి 5


                                శ్రీ అయ్యవారు, టి బి ఎం

    నేఫా మహావీరుడు

    (నేఫాలో ఎనిమిదిమంది చైనీయులను ఒక్క చేతితో వధించి వీర స్వర్గాన్నలంకరించిన సైనికోద్యోగి నుద్దేశించి)
    నీ యూరేమో కాని
    నీ పేరేమో కాని
    నిజంగా నీవు భారతీయుడవు
    నిర్భర సంగరాంగ ణాకాశంలో
    నిష్ఠుర దంభోళిలా మెరిశావు!
    నీ పరాక్రమ సమాటోపాలు
    నిర్జరులకే వెరగు పుట్టించాయి!
    నిక్కం చెప్పాలంటే
    నీవే నిర్జరుడ వోయి
    మేమంతా ఉన్నాము
    మిడిమేలపు బ్రదుకులతో
    మాతృభూమి సంక్షేమానికి
    మరణించు ధైర్యం చేయలేక
    నీ యూరు పేరు
    నీ పేరు తీరు
    నిదానించి చూస్తే
    మా కెందుకులే నేస్తం
    ఏనాడో చెప్పాడుకదా మా నన్నయ్య
    ఏరులూ శూరులూ ఒకటేనని
    ఎవరికీ తెలియదు వారి జన్మమనీ
    వీరత్వమంతా నీలో - మి
    న్నేరై ముంచెత్తి వైచింది
    దాని తరంగాల తాకిడికి
        తుట్టుకోలేని చైనీయులు
        ఇలపై సికతా సేతువులై
        ఎనిమిది మంది కూలారు.

    గతంలోని ఏ వీరుని
    గాధలతో పోల్చి నిన్ను
    గౌరవించమంటావో
    కదనసింహ చెప్పవోయి!

        నీ యుదాత్తాశయాల
        నిగ్గులేని వారితోన!

    భార్యకోసమో లేక మరింకేదైనా
    స్వార్థంకోసమో

        కత్తి నెత్తి సవాళ్లే
        గతంలోని మన మా సీళ్లు.

    కనిపెంచిన మాతృభూమి
    గాసి తీర్చి నడుం కట్టి
    నీవలె నిస్వార్థంగా    
    నిలిచి పోరినారో! వారు
    
        అందుచేతనే నీకూ వాళ్ళకూ
        ఆశయాల పావిత్ర్యం వల్ల
        హస్తి మశకాంతరం
        అవలీలగా ఉంది.

    ఓ నేఫా వీరవర్య!
    ఉదిలపడకు మాత్మయందు
    పాంచ భౌతికమ్ము లీనూ
    బంధము రాలె నటంచును

        అచ్ఛేద్యుడ వమరుడ నీ
        వగుదు వింతపట్టు నిజము!

    శౌర్యగుణానికె - మహదా
    చార్యకంబు నెరపజాలు
    నీ చేతన రుద్రాకృతి
    నిచ్చలు నడిపించు మమ్ము!
    దురాక్రమణ మన్న మహా
    దుష్టాంధక తమము చీల్చు.

        మృషాసమాధు లేల నీకు
        మృణ్మయాలు దృషన్మయాలు!
        నలభై కోట్లకు పైబడి
        నట్టి మాదు హృదయమ్ములె
        స్వర్గసమాధులు నీ కగు
        చంద్రారుణ తారకముగ.

    స్వస్తి! స్వస్తి! మహావీర!
    సర్వలోక పథాల నీకు!
    స్వస్తి! స్వస్తి! నీ భారత
    జనయిత్రి కహర్నిశమ్ము!

                                                        *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS