సుభద్రమ్మ తనమీద ఉన్న భర్త చేతిని పదిలంగా జరిపింది. దుప్పటి కప్పింది. వళ్ళు విరుచుకుంది. జుట్టు ముడి వేసుకుంది. లేచింది. గది తలుపు తెరుచుకుంది. బయటికి వచ్చింది. వెనక తలుపు తెరిచింది. కింద మెట్టుమీద అడుగు పెట్టింది. కొట్టంలోకి చూచింది. ఎండ కొట్టంలోకి వచ్చేసింది. దూడలు గేదెల పాలు కుడుస్తున్నాయి. నీళ్ళ పొయ్యి దగ్గర ఉండాల్సిన మల్లి లేదు. పాలు పితకాల్సిన పెంటడు లేడు.
ఉండాల్సిన ఇద్దరూ లేరు. రావలసిన పాలు దూడలు కుడుస్తున్నాయి. సుభద్రమ్మకు లోకం తలకిందులయినట్లనిపించింది. తన పెత్తనం కూలిపోతున్నట్లనిపించింది. తన ఆస్తి హరించుకుపోతున్నట్లనిపించింది. సూర్యుడు కూలినట్లూ, కొండలు గిరగిర తిరిగినట్లూ, సముద్రం చెలియలి కట్ట దాటి పొంగినట్లూ అనిపించింది.
సుభద్రమ్మకు క్షణం ఏమీ తోచలేదు. మరుక్షణం కర్తవ్యం స్ఫురించింది. ఆమెలో కోపం పెల్లుబికింది. ప్రతీకార జ్వాల ప్రజ్వరిల్లింది. గదిలోకి ఉరికింది. శివయ్యను లేపింది.
"కొంప మునిగిందండీ, లేవండీ! పెంటడు, మల్లి పారిపోయిన్రు. పాలన్నీ దూడలు తాగిపోతున్నాయి. ఇక మనకు పాలు లేవు. ఇంట్లో మనిషి లేడు లేవండి, జల్దీ లేవండి!"
శివయ్యకు శివం వచ్చింది. అమాంతంగా మూడో కన్ను తెరుద్దామనుకున్నాడు. ప్రళయ తాండవం చేద్దామనుకున్నాడు. లోకాన్ని కాల్చేద్దామనుకున్నాడు. శివయ్యకు మూడో కన్ను లేదు కాబట్టి సరిపోయింది.
శివయ్య ముసుగు తన్నేశాడు. లేచాడు. దొడ్లోకి ఉరికాడు చూశాడు.
నీళ్ళ పొయ్యి దగ్గర మల్లి లేదు.
గొడ్లకాడ పెంటడు లేడు.
శివయ్యకు లోకం శూన్యంగా కనిపించింది. గ్రహాలూ_నక్షత్రాలూ రాలుతున్నట్లనిపించింది. కొండలూ కోనలూ అంటుకున్నట్లనిపించింది. ఆ అగ్గి తన మీదికే ఆవహిస్తున్నట్లనిపించింది.
పెంటడు గతిలేనివాడు నిజమే వానిలోనూ నిప్పుంది. అది రాజుకోరాదు. అంటుకోరాదు. అలుముకోరాదు. అల్లుకోరాదు. పెంటనికి బుద్ధి చెప్పకుంటే ఊరు తన చేతిలో ఉండదు. ఒక్కడు ఎదురు తిరిగితే ఊరే ఎదురు తిరగవచ్చు. మంట రాజుకోకముందే ఆర్పేయాలి. కాలితో నలిపెయ్యాలి.
"పెంటా!" అరిచాడు శివయ్య. అరుపుకు ఇల్లు ప్రతిధ్వనించింది. సుభద్రమ్మ ఉరికి వచ్చింది. శివయ్య ఉరకబోతున్నాడు, ఉగ్రంలో ఉన్నాడు. ఆమె అదిరిపడింది. తన భర్తకు ఏదో ఆపద వస్తుందనుకుంది.
"ఇగో, ఉట్టి చేతుల్తో పోకండి. కట్టె పట్టుకుని పోండి. వాళ్ళను నమ్మలేం, ఏదైనా చేస్తారు" అని కట్టె అందించింది.
కర్ర అందుకుని అడుగు వేయబోయాడు శివయ్య. శివయ్య కేక విన్న పెంటడు ఉరికి వచ్చాడు. ఉరికి వచ్చిన పెంటడికి కొట్టంలో పాలు కుడుస్తున్న దూడలు కనిపించాయి. ఎదురుగా మండిపోతున్న శివయ్య కనిపించాడు.
పెంటడి ప్రాణాలు పైపైనే పోయాయి. నోట మాట రాలేదు. ఒళ్ళంతా చెమటలు పట్టింది. పెనుగాలికి పండుటాకులా వణికిపోతున్నాడు.
పెంటడు రెండు చేతులూ జోడించి మొక్కాడు "దొరా! తప్పయింది, బతకనియ్యి, పానాలు తియ్యకు, బాంచాన్ని, గులామునైత"
వణికిపోతూ, చేతులు జోడించుకుని పలుకుతున్న అతని పలుకులు పాషాణాల్ని కరిగించేట్టున్నాయి. మూర్తీభవించిన దుఃఖంలా, నిరాశలా, నిర్వేదంలా, నిరాశ్రయంలా ఉన్నాడతను.
అతని ఆక్రందనకు దూడలు పాలు మాని చూస్తున్నాయి. పశువులు మోరలెత్తి తమ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాయి. మల్లి ఉరికివచ్చి దూరంగా నుంచుని చూస్తోంది, సుభద్రమ్మ ఆశగా చూస్తోంది.
శివయ్య శివం తొక్కుతూ ఉరికాడు "లంజ కొడకా! దూడల్నిడిచి వెళ్ళిపోతావు, నీ తోళ్లొలుస్త" అని కర్ర తీసుకుని ఉరికాడు.
"దొరా! బతకనీయండి కాల్మొక్త, తప్పయింది, ఇగచెయ్యను"
పెంటడు అక్కణ్ణుంచి కదల్లేదు. పారిపోవడానికి ప్రయత్నించలేదు. కనీసం దెబ్బ తట్టుకోవడానికి చేతులెత్తలేదు.
"చావు లంజకొడక!" శివయ్య కర్ర పెంటడి వీపుమీద పడింది.
"దొరా, తప్పయింది చంపకు, కాల్మొక్త!" పెంటడు బతిమాలుతున్నాడు. కాళ్ళు పట్టుకుంటున్నాడు, దెబ్బలు పడుతున్నాడు, తప్పుకోవడానికి ప్రయత్నించడం లేదు.
పెంటడు లొంగుతుంటే శివయ్యకు శివం ఊగుతూంది. కొడుతున్నది మనిషిని కానట్లు, పశువునయినట్లూ బాదుతున్నాడు. కాదు, పశువయితే కనీసం పారిపోయేది.
"దొరా! తప్పయింది చంపకు, కాల్మొక్త" పెంటడు కేకలు పెడుతున్నాడు. ఆ కేకలకు కొండలు కరుగుతున్నాయి. అధికారానికి గుండె లేదు, అది కరగదు.
మల్లమ్మ దూరంగా నుంచుంది. బొమ్మలా నుంచుంది. ఆమె మనిషి ఆమెకు గుండె ఉంది, ఆవేదన ఉంది, ఆత్రం ఉంది, ఆత్మీయత ఉంది, అనురాగం ఉంది. అయినా ఏం చేయలేదు. ఎదురుగా తమ్ముణ్ణి బాదుతున్నాడు శివయ్య. తమ్ముడు కేకలు పెడుతున్నాడు, మొత్తుకుంటున్నాడు. ప్రాణాలకోసం తల్లడిల్లుతున్నాడు.
మల్లి మనసులో చిచ్చు రగలడం లేదు. ప్రతీకారజ్వాల ప్రజ్వరిల్లడం లేదు. ఆమె హృదయం ఆక్రోశిస్తూంది. తల్లడిల్లుతూంది. తపిస్తూంది. ఆమె శివయ్యకు ఎదురుతిరగాలనుకోవడం లేదు. తమ్ముణ్ణి కాపాడుకోవాలనుకుంటూంది. తనకోసం వాడు దెబ్బలు తింటున్నాడు. తనకోసం ప్రాణాలు వదులుకోడుగదా!
"అక్కా, చస్తి" అంది పెంటని కేక. ఆ కేక మల్లి గుండెలో తుఫాను రేపింది. అటు చూచింది. పెంటడి ముక్కులోంచి బళబళా రక్తం కారుతోంది.
రక్తం నెత్తురు!!
రక్తం నెత్తురు!!
పెంటడి ముక్కులోంచి కారిన రక్తం మల్లి కళ్ళల్లో కనిపించింది.
మల్లి ఉరికింది.
శివయ్య చేతిలోని కర్రను పట్టుకుంది.
శివయ్య బొమ్మలా నించున్నాడు.
తుఫాను నిలిచిపోయింది.
పెంటడు కాస్త అవతలికి జరిగాడు. ముక్కులోంచి రక్తం కారుతోంది. తుడుచుకోవడానికి గుడ్డ సైతం లేదు.
శివయ్య మల్లిని చూచాడు.
మల్లి కర్ర వదిలేసింది.
శివయ్య కాళ్ళమీద పడిపోయిది. భోరున ఏడ్చింది, కన్నీటితో కాళ్ళు కడిగింది.
"దొరా! మా తమ్ముణ్ణి చంపకు. బతకనియ్యి. నన్ను కొట్టు, చంపు, చీరు" తల నేలకు కొట్టుకుని ఏడుస్తూంది మల్లి.
పెంటడు దూరంగా నుంచున్నాడు.
శివయ్య ఏమనుకున్నాడో తెలియదు. కాళ్ళు వదిలించుకున్నాడు. చరచరా ఇంట్లోకి నడిచిపోయాడు.
"అయ్యో! మీ అంగీమీద నెత్తురు" వాపోయింది సుభద్రమ్మ.
"అక్కా!" అని మల్లిని కావలించుకున్నాడు పెంటడు.
పెంటడి రక్తంతో మల్లి పయట తడిసింది.
చెట్టుమీది కాకి కావుకావుమని అరిచింది. అరిచిందో ఏడ్చిందో మనకు తెలియదు.
3
పిచ్చమ్మ చచ్చిపోయింది.
పిచ్చమ్మ గూడెంలో ఎవరూ లేనప్పుడు చచ్చిపోయింది.
పిచ్చమ్మ కుక్కి మంచంలో ప్రాణాలు విడిచింది.
గూడెంలో ఎవరూ లేరు. నిర్మానుష్యంగా ఉంది. గూడెం సాంతం శివయ్య పొలాల్లో పనిచేయడానికి వెళ్ళిపోయింది. గూడెంలో ఉన్నవాడు ధర్మయ్య ఒక్కడే. ధర్మయ్య ముసలివాడు. అతనికి కాళ్ళూ చేతులూ పడిపోయాయి. అతడు లేవలేడు. మంచంలో పడి ఉంటాడు. పిచ్చమ్మ చచ్చిపోయిన విషయం అతనికీ తెలియదు.
పిచ్చమ్మ కుక్కి మంచంలో కన్ను మూసింది. గూడెంలోని బుడుతలు యదాలాపంగా పిచ్చమ్మ గుడిసెలోకి వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు ఆమె వారిని అదిలించేది. ఆమెకు ఉన్న ఆస్తి సాంతం రెండు కుండలు. పిల్లలు ఆ కుండలు బద్దలు కొడ్తారని ఆమె భయం, పిల్లలను గుడిసెలోనికి రానిచ్చేది కాదు.
ఆరోజు పిల్లలు గుడిసెలోకి వెళ్ళారు. ఆమెను రెచ్చగొట్టడానికే ఆమెతో తిట్లు తినడానికే పిల్లలు గుడిసెలో దూరారు. అయినా పిచ్చమ్మ పలకలేదు. పిల్లలు నిరాశ చెందారు.
"అవ్వా, కుండలు పగలగొడుతున్నాం, ఇగో" ఒక పిల్లవాడు బెదిరించాడు.
పిచ్చమ్మ పలకలేదు. ఆమె కుండ ఎప్పుడో పగిలిపోయింది. ఇహ అది అతుక్కోదు, నీరు సాంతం కారిపోయింది.
