"అవ్వా! అవ్వా!!" కుక్కి మంచంలోని పిచ్చమ్మను కదిలించారు. పిచ్చమ్మ కర్రలా ఉంది. చల్లగా ఉంది. పిల్లలకు భయం అయింది. బయటికి ఉరికారు.
కోడిపెట్టలు గుడిసెలోకి వచ్చాయి. మంచం మీదికి ఎగిరాయి. పిచ్చమ్మ మీద వాలాయి. పిచ్చమ్మ కదల్లేదు. మెదల్లేదు. కోడిపిల్లలు పిచ్చమ్మ కళ్ళలో పొడిచాయి. పిచ్చమ్మ కళ్ళు తెరవలేదు.
పిల్లలు బయటనుంచొని అంతా చూస్తున్నారు. ఎందుకో వారికి బాధ అనిపించింది. కోడిపిల్లలు పిచ్చమ్మను అలా పొడవడం చూడలేకపోయారు. కోడిపిల్లలను వెళ్ళగొట్టారు. ఆటలు ఆడుకునే పిల్లల్లో ఏదో ఉదాసీనత వ్యాపించింది. వారు మౌనంగా ధర్మయ్య తాత దగ్గరికి వెళ్ళారు.
"తాతా! పిచ్చవ్వ కదుల్తలేదు, పలుకుతలేదు, కోడిపిల్లలు పొడుస్తున్నాయి" ఒక బాలుడు చెప్పాడు.
"పిచ్చమ్మ కదుల్తలేదు, పలుకుతలేదా!" జరిగిపోయిందాన్ని గ్రహించినట్లు, వేదాంతిలా మాట్లాడాడు ధర్మయ్య.
ధర్మయ్య తనను తాను చూచుకున్నాడు. కాళ్ళు లేవు. చేతులాడవు. అతని మనసు తల్లడిల్లింది. గుండె ఏడ్చింది. ధర్మయ్య ఏడవగలడు మరేం చేయలేడు.
"పిచ్చమ్మ చచ్చిపోయింది!" ఏదో కఠినమైన సత్యం చెపుతున్నట్లు చెప్పాడు.
"తాతా! పిచ్చవ్వ పలకదా?"
"పలకదురా! పలకదు, ఇంకెన్నటికీ పలకదు. బాధలనూ, బంధాలనూ తెంచుకుని వెళ్ళిపోయింది"
పిచ్చమ్మ బాధలను, బంధాలను తెంచుకొని వెళ్ళిపోయింది.
పిచ్చమ్మ ముఖాన సూర్యునిలా వెలిగే కుంకుమ చెరిగిపోయిన్నాడే పిచ్చమ్మ సగం చచ్చిపోయింది. పోచయ్యను వరించి పెళ్ళాడింది.
పోచయ్య కండలు తీరిన నిండు మనిషి, మగసిరి నిండిన మొనగాడు. గూడెంలో పడుచులంతా పోచయ్యంటే పడి చచ్చేవారు. పోచయ్యకు పిచ్చమ్మే నచ్చింది. పిచ్చమ్మ కళ్ళల్లో పరువం పడగనిప్పేది. పోచయ్యా, పిచ్చమ్మా పచ్చని పొలాల్లో కలుసుకున్నారు, గలగలపారే సెలయేటిలా నవ్వుకున్నారు, బాసలు చేసుకున్నారు,బండల చాటున విహరించారు.
"బావా! నన్ను ఇడిచిపోవుకద!" అమాయకంగా అడిగింది పిచ్చమ్మ.
"చచ్చిపోతేనే" అన్నాడు పోచయ్య - పిచ్చమ్మ సిగలో ముద్దబంతి ముడుస్తూ "అట్లనకు, నేనూ నీతో వస్త" అన్నది పిచ్చమ్మ బెదురు కళ్ళతో.
"అట్లనా?" అని కౌగిలించుకున్నాడు పోచయ్య, విడిపోతుందేమో పిచ్చమ్మ అనే భయంతో.
ఆమె విడిపోలేదు. అతనే మోసం చేశాడు, మొదలే వెళ్ళిపోయాడు పిచ్చమ్మను వదిలి. పిచ్చమ్మ మొదలు నరికిన చెట్టయింది. ఇవ్వాళ ఎండిపోయింది, ఇహ చిగురించదు.
పోచయ్య, పిచ్చమ్మల ప్రణయాన్ని గూడెం సహించలేదు. ఆస్తులు అంతస్తుల పేర అగాధాలు సృష్టించింది. పిచ్చమ్మ అర్ధరాత్రి కట్లు తెంచుకుని వచ్చేసింది. పోచయ్యను కావలించుకుని ఏడ్చేసింది. పోచయ్య పిచ్చమ్మను వదల్లేదు. గూడెం ముక్కుమీద వేలువేసుకుంది, ధర్మయ్య నీతులు చెప్పాడు, కనీసం పెళ్ళిచేసుకొమ్మన్నాడు, పోచయ్య అంగీకరించాడు.
పెళ్ళంటే ఈ సమాజంలో ఒక జీవితపు అప్పు. పేదలు బానిసలు కావడానికి పెళ్ళిళ్ళు, దినాలే ప్రధాన కారణాలు. పెళ్ళి పేరుమీద మనుషులు పశువుల్లా అమ్ముడుపోతారు. జీవితాంతం కాదు, తరతరాలు బానిసలు అయిపోతారు.
పోచయ్య పరువపు మైకంలో ఉన్నాడు. శివయ్య దగ్గరికి వెళ్ళాడు, పెళ్ళికి అప్పు ఇమ్మన్నాడు. శివయ్య ఉదారంగా ప్రవర్తించాడు. అప్పు పెట్టాడు పోచయ్యకున్న నేలచెక్క రాయించుకున్నాడు. ఒక్క అంగుష్టపు ముద్రతో రైతు వెట్టివాడిగా మారిపోయాడు. పోచయ్యకు ఉన్న నేల చెక్క పోయింది. వడ్డీకింద పోచయ్య బానిస అయినాడు. పోచయ్య తిండికి శివయ్య అప్పు పెడతాడు. ఆ అప్పు హనుమంతుని తోకలా పెరుగుతుంటుంది. ఆ అప్పు అతని జీవితకాలంలో తీరదు. శివయ్య కోసం పోచయ్య బానిసలను కొంటాడు.
బానిస అయినా బాధపడలేదు పోచయ్య. పిమ్మట వారి మనస్సులు కలిశాయి. మనసులు కలిసినచోట మహా ప్రళయాన్నయినా ఎదిరించవచ్చు. జంటగా ఉన్నవారికి వెంకడు కలిగాడు. వెంకణ్ణి చూచి వారు మురిసిపోయారు. గంజి తాగినా పరమాన్నం తిన్నట్లు బతుకుతున్నారు.
గూడెంలో ఒక తగాదా పోచయ్య ప్రాణం మీదికి తెచ్చింది - తుదకు ప్రాణాలు తీసింది. బాసలు చేసిన పోచయ్య వెళ్ళిపోయాడు. వెంకణ్ణి వదల్లేక పిచ్చమ్మ మిగిలిపోయింది. ఇప్పుడు వెంకడిని వదిలేసి పిచ్చమ్మ వెళ్ళిపోయింది - పోచయ్య దగ్గరికి.
గూడెంలో కొత్తగా పెళ్ళయిన దంపతులు మగనికి పెళ్ళాం మీది అనుమానం వచ్చింది. పెళ్ళానికి రంకు కట్టాడు. చావతన్నాడు, వెళ్ళిపొమ్మన్నాడు. పెళ్లాం తనవల్ల తప్పులేదంది. ఏడ్చింది, మొత్తుకుంది. మగని కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడింది. మగడు వినలేదు, జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చి గుద్దులు గుద్దాడు, వెళ్ళిపొమ్మన్నాడు.
పోచయ్య అది చూచాడు, భరించలేకపోయాడు, రంగంలోకి దిగాడు. మగణ్ణి లాక్కొచ్చాడు, మూలకు కూలబడేశాడు,కట్టుకున్నదాన్ని విడిచిపెట్టడం పాపం అని చెప్పాడు. పెళ్ళాం వల్ల దోషం లేదని వప్పించాడు. వాళ్ళిద్దరినీ ఏకం చేశాడు. గుడిశలో వేసి తలుపేసి బయటికి వచ్చాడు.
బయటికి వస్తున్న పోచయ్యను ధర్మయ్య చూచాడు "ఒరే పోచిగా! పంచాయితీలు చెప్పటంతోనివైనావుర. గూడెంల పంచాయితీలు దొరింట్లనే తెగలె నువ్వెందుకు చేతులు కాల్చుకుంటావురా. మనం బాంచోళ్ళం, మన జగడాలు దొరే తీర్చాలె. అట్లనే జరుగుతాందింత వరక, నువ్వెందుకు ఏలుపెట్టినవు?" అన్నాడు ధర్మయ్య. అతని స్వరంలో భయం గోచరిస్తోంది.
"తాతా! అన్నాలమేమన్న చేసినానే న్యాలమే చెప్పినగద" పోచయ్య తనను రక్షించుకోవడానికి అన్నట్లు అన్నాడు.
"న్యాలమయినా, అన్యాలమయినా దొరలే చెప్పాలె, మనం ఇనాలె, ఇట్లనే నడిచింది ఇంతకాలం. దొరకు ఎరికాయెనా, పానం తీస్తడు పదిలంగుండుపో" అన్నాడు ధర్మయ్య తాత, ధర్మానికేదో విఘాతం జరిగిందని కాదు_ పోచయ్యకేదో అపాయం రానున్నదని.
పోచయ్య ఆ రాత్రి నిద్రపోలేదు. "నువ్వెందుకు పోయినవు_ఆ పంచాయితీలోకి?" అని వాపోయింది పిచ్చమ్మ. ఆమె ఆ రాత్రంతా పీడకలలు కన్నది. పోచయ్యను లాక్కుపోతారేమోనని కరిచి పట్టుకు పడుకుంది.
శివయ్యకు ఊరంతటా వేగు ఉంది. తెల్లవారకముందే ఈ వార్త అక్కడికి చేరింది. నర్సిమ్మ బల్లెం పట్టుకుని పోచయ్య గుడిసె ముందు ప్రత్యక్షం అయినాడు. నర్సిమ్మ శివయ్యకు కుక్క లాంటి బంటు. నర్సిమ్మంటే గూడేనికి భయం, యమభటుణ్ణి చూచినట్లే.
"ఒరే పోచిగా! ఎళ్ళు దొరపిలుస్తాండు పొద్దెక్కిందిలే_ఇంకెంతసేపు పండుతవు. పెళ్ళాంతన దొర పిలుస్తాండు ఎళ్ళు"
పిచ్చమ్మ గుండెలో గునపాలు గుచ్చుకున్నాయి, ఆమె బయటికి ఉరికి వచ్చింది.
"ఏందే అన్నా _ ఎందుకు పిలుస్తాండు దొర?"
"నీ మొగడు మొనగాడయితాండట - జర అర్చుకుందమని పిలిపించిండు"
"ఏందే నరసన్నా! ఎందుకు పిలుస్తాండే దొర?" పోచయ్య స్వరంలో భయం తాండవిస్తోంది.
"ఒరే పోచిగా! మనం బాంచోల్లంరా బాంచోల్లంగానే బతకాలె, బలం చూపిస్తే బతకలేంరా! బతికితే బాంచెలోలె బతకాలె అంతె ఇగ చెప్పలేను" ధర్మయ్య స్వరం రెక్కలు తెగిపడినట్లుంది.
"నాకేమో గుబులుగున్నది. పోవద్దనలేను ఉండమనలేను ఏం చేతు?" అనంతమయిన ప్రశ్న పోచమ్మ మనసులో పొటమరించింది.
"నడవరా పోచిగా - ఏమో దొరలె నిలబడ్డవు" మెడపట్టి ముందుకు గెంటాడు నర్సిమ్మ - దొరకు నమ్మిన బంటు.
పోచయ్య ముందుకు తూలి నిలదొక్కుకుని నడక సాగించాడు. బల్లెం పట్టుకున్న నర్సిమ్మ వెనక నడుస్తున్నాడు. పోచయ్య వెనక్కు తిరిగి చూచాడు. గుడిసె కనిపించింది. గుడిసె ముందు పిచ్చమ్మ, వెంకడు కనిపించారు. ఇద్దరూ శోక మూర్తులుగా ఉన్నారు- ఏడుస్తున్నారు- ఇటే చూస్తున్నారు. గూడెంలో జనం సాంతం గుడిసెల ముందు నుంచున్నారు. ధర్మయ్య తాత కాళ్ళ మీద లేవాలని ప్రయత్నిస్తున్నాడు.
పోచయ్య ఊళ్ళోంచి సాగిపోతున్నాడు. అతనికి ఎడారిలోంచి పోతున్నట్లనిపించింది. మండే ఇసుకలోంచి నడచిపోతున్నట్టుంది. మంటల గాలులు వీస్తున్నట్లుంది. తానేం తప్పు చేశాడు? ఏం నేరం చేశాడు? ఎందుకు తనకీ శిక్ష? విడిపోయే జంటను కలిపాడు తప్పా? తాను తప్పు చేయలేదు. తాను తప్పు ఒప్పుకోడు. దొరేం చేస్తాడు?
పోచయ్య శివయ్య ముంగిట్లో అడుగుపెట్టాడు.
"దొరేం చేస్తాడనుకుంటున్నావ్ లే. నీ తోళ్ళొలిచి చెప్పులు కుట్టించుకుంట. లంజకొడకా! కుక్కిన పేనోలె పడుండరా అంటే పంచాయితీలు చెపుతావు గాడ్ది కొడకా! దొరనయన్ననుకున్నవా?" శివయ్య గర్జించాడు.
