Previous Page Next Page 
పావని పేజి 4


    మల్లిలో ఏవేవో ఆలోచనలు ముసిరాయి. అయితే, ఆమెకు ఆలోచించే సమయం లేదు. కోడి కూసింది. లేవాలి. ఆమెకోసం చాకిరి ఎదురుచూస్తూంది. ఆమె చాకిరి కోసం పుట్టింది. సుభద్రమ్మ సౌఖ్యం కోసం పుట్టింది. ఇది కర్మ సిద్ధాంతపు దేశం. ఈ సమాజానికి ఈ జన్మమీద నమ్మకం లేదు. పూర్వజన్మ మీద విశ్వాసం మెండు. మనం మనిషిని గౌరవించం. రాతి బొమ్మలను పూజిస్తాం.
    మల్లమ్మ రాతిబొమ్మ కాదు, మనిషి.
    మల్లమ్మ మంచంలోంచి లేచింది. నుంచుంది. ఆమె వళ్ళు తూలింది. నిలదొక్కుకుంది. తన చేయి పట్టుకొని తానే చూచుకుంది. వళ్ళు వేడిగా ఉన్నట్లు లేదు. జ్వరం తగ్గినట్లుంది. నీరసం హెచ్చింది. ఆమె నిలదొక్కుకుంది. కుక్కిమంచం ఎత్తి గోడకు పెట్టింది. చింపిరి తల వేళ్ళతో దువ్వుకుంది. కదలలేకుండా ఉంది, అయినా అడుగేసింది_ ముందుకా? వెనక్కా? అది ఆమెకు తెలియదు. అడుగేయటమే ఆమెకు తెలిసింది. ఆమెకు కాదు, అనేకమందికి తెలిసిందీ అదే.
    మల్లమ్మ నాలుగు అడుగులు వేసింది. కాస్త సత్తువ వచ్చినట్లనిపించింది. పడుకున్నదానికంటే పచార్లు చేయడం మేలు! కదిలిన మల్లి కోళ్ళగూటి దగ్గరకు వెళ్ళింది. గూటి మూతలు తీసింది. కోళ్ళు బంధాలు తెంచుకుని బయటపడ్డాయి. ఎగిరి గంతులు వేసి వెళ్ళిపోయాయి. కోడిపుంజు గర్వంతో వళ్ళు విరుచుకుని "కొక్కొరోకో" అని కూత పెట్టింది.
    కోళ్ళకు పగలంతా స్వేచ్చ. రాత్రికి బంధం. మల్లికి పగలూ రాత్రీ బంధమే. శివయ్యగారి ఇల్లు బందిఖానా. మల్లి చెరసాలలో ఉంది. మల్లి కోడికూతతో లేస్తుంది. బాగా రాత్రి అయ్యేదాకా వళ్ళు విరుచుకుని చాకిరీ చేస్తుంది. సుభద్రమ్మ పాసిందీ, పులిసిందీ ఆమె ముఖాన కొడుతుంది. తింటుంది. చాకిరీ చేస్తుంది. ఆమెకు జీతం లేదు. ఆమె భర్త పెళ్ళికి అప్పు చేశాడు. అమ్ముడుపోయాడు. చాకిరీ భరించలేక పారిపోయాడు. శివయ్య మల్లిని తెప్పించి ఇంట్లో పెట్టుకున్నాడు. బానిసను చేశాడు.
    భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది మల్లికి కాదు. మల్లి లాంటివాళ్ళకు కాదు. స్వాతంత్ర్యం శివయ్యకు వచ్చిందందామా?
    మల్లి పేడ తీయడానికి పశువుల కొట్టంలోకి పోయింది. పేడ తీస్తుంటే ఆమె వళ్ళు తూలుతోంది. అయినా ఆమె ఆగడం లేదు. సత్తువ తెచ్చుకుంటోంది. పేడ తట్టలో వేసింది. పేడ పట్టుకొని బావి దగ్గరికి బయలుదేరింది. వళ్ళు తూలుతోంది. పడిపోతానేమోనని భయంగా ఉంది. నిలదొక్కుకుని నడుస్తోంది. అయినా వళ్ళు తూలింది. పేడ తట్ట చేతిలోంచి పడిపోయింది. మల్లి కూడా పడిపోయేదే_ "అక్కా!" అని ఉరికివచ్చి పెంటడు పట్టుకున్నాడు.
    పెంటడు పశువుల మనిషి.
    "అక్కా! ఏమైందక్కా? ఎందుకట్లా సోలినవు?" అడిగాడు మల్లిని పట్టుకుని.
    "ఏం లేదురా! వళ్ళు సోలినట్లయింది. ఇడువు, నీళ్ళు చేదాలె, చాన్పి చల్లాలె. దొర్సాని లేస్తే బతకనీయదు" మల్లి తమాయించుకుని ముందుకు సాగింది.
    "అక్కా! నువ్వెట్లనో ఉన్నవు. చాతనయెటట్లు లేదు. నేను చేదిపోస్త నీళ్ళు నువ్వు చాల్పి చల్లు" అన్నాడు.
    "ఒరే వద్దురా ఇడువు, నీపని నువ్వు చేసుకో. పొద్దుపోతే దొర కొడ్తడు. మనం మనుషులం గామురా - గొడ్లం. గొడ్డు ఒకదానికి ఒకటి సాయం చేస్తదా? ఇడువు పోత"
    పెంటడు అక్కను వదిలిపెట్టాడు కాని అక్కణ్ణుంచి కదల్లేదు. చూస్తూ నుంచున్నాడు. అతనికి అక్కమీద ధ్యాస ఉంది. పనిమీద ధ్యాసలేదు. అక్కను చూస్తుంటే అతని గుండె తరుక్కుపోతోంది.
    మల్లి కదల్లేక కదల్లేక సాగుతోంది. కుండ అందుకుని సాగుతోంది. బావి దగ్గరకు పోతోంది. కుండను అతి జాగ్రత్తగా పట్టుకుంది. కుండ పడకూడదు, పగల కూడదు. కుండ తనకంటే విలువయింది. కుండ పగిలితే దొర సహించడు. తాను పడిపోతే దొరకేం బాధలేదు. తాను పడ్డా కుండ పడరాదు అన్నంత పదిలంగా సాగింది. బావి దగ్గరికి చేరింది.
    పెంటడు చూస్తున్నాడు. అక్కణ్నుంచి కదల్లేదు. అతనికీ పని ఉంది. అయిన అక్కణ్నుంచి కదలడం లేదు. అక్కను ఆదుకోవాలని అతని ఆశయం. తన పని ఆలస్యాన్ని గురించీ, వాటి వలన జరిగే పరిణామాలను గురించీ అతడు ఆలోచించడం లేదు. అనుబంధాలు అలాంటివి. అవి పరిణామాలను గురించి ఆలోచించనీయవు.
    మల్లి కుండను పదిలంగా బావి దగ్గర పెట్టింది. మల్లికి వణుకు వస్తూంది. కాళ్ళు వణుకుతున్నాయి. కళ్ళు మండుతున్నాయి. తల బరువుగా ఉంది. అయినా బొక్కెన అందుకుంది. బావిలోకి విడిచింది. కాళీ బొక్కెన బావిలోకి అప్రయత్నంగా జారిపోతోంది. గిలక చప్పుడుతో బావిలోకి జారింది బొక్కెన. బొక్కెనలో నీళ్ళు నిండాయి. నీళ్ళు నిండిన బొక్కెనను పైకి లాగడం కష్టం.
    మల్లి వంట్లో శక్తిలేదు. జవలేదు. బలంలేదు. అయినా లాగుతోంది. లాగడం కష్టంగా ఉంది. బతుకు లాగుతున్నట్లుంది. కాళ్ళు తేలిపోతున్నాయి. సగం దాకా లాగింది. చేతుల్లో బలం లేదు. చేద వదిలింది. గిలక గిరగిరా తిరిగింది. బొక్కెన బావిలో పడి చప్పుడు చేసింది. మల్లి తూలి పడబోయింది.
    "అక్కా!" అని ఉరికి వచ్చాడు పెంటడు. మల్లిని పట్టుకున్నాడు. "అక్కా! ఏమైందియ్యాల నీకు?" పెంటడి పలుకుల్లో తడి ఉంది, ఆర్ద్రత ఉంది. ఆ పలుకులు విని మల్లి కరిగిపోవాల్సింది. తమ్ముణ్ణి కావిలించుకుని భోరుమనాల్సింది.
    మల్లి అలా అనాల్సిందే, కాని అనలేదు. "తమ్ముడూ! బొక్కెన బాయిల పడ్డదిరా. దొర్సాని బతకనీయదు ఎట్లరా. పెంటా, ఏం చేద్దమంటవు చస్తే నాకేం లేదు మీ బావ వచ్చినంక చస్తరా!" ఆమెలో దుఃఖం ఆగలేదు. కట్టలు తెంచుకోనూ లేదు. కళ్ళలో కన్నీరు దుమికింది.
    పెంటడు అక్కను ఓదార్చాల్సింది. బావను తీసుకు వస్తానక్కా అని ప్రతిజ్ఞ చేయాల్సింది. కల్పనలో అలాగే జరుగుతుంది. సినిమా కథ అలాగే సాగుతుంది. ఇది నిజ జీవితం. కర్కశం అయింది. కంటక ప్రాయం అయింది.
    పెంటడు బావిలోకి చూశాడు. బొక్కెన బావిలో పడింది కాని, చాంతాడు బావి దూలానికి ఉన్న మేకుకు కట్టి ఉంది. పెంటడు ప్రాణం లేచి వచ్చింది. "అక్కా! బొక్కెన బాయిల పడలే. చేంతాడు దూలానికి కట్టి ఉన్నది" అన్నాడు.
    "అట్లనా! బాయిల పడలే, దేవుడు కాపాడిండు. జరుగు నీళ్ళు చేదుకుంట" బొక్కెన బావిలో పడనందుకు ఆమెలో ఉత్సాహం పొంగింది.
    "వద్దక్కా! నేను చేత్తా, నువ్వు కూకో" అన్నాడు పెంటడు. నీళ్ళు చేది కుండ నింపాడు. కూలబడ్డ మల్లి లేచింది. కుండ రెండు చేతులతో లేపబోయింది. కుండ లేవడం లేదు. పెంటడు సాయం పట్టాడు. ఇద్దరూ కలిసి కుండను ఇంటి ముందరికి తీసికెళ్ళారు - దొడ్డిదారి నుంచి.
    మల్లి కుండ అక్కడ పెట్టింది. పొరక అందుకుని ఊడ్పు సాగించింది.
    శివయ్యగారి వాకిలి సువిశాలం అయింది. దాన్ని ఊడవడం కష్టమే. రోజూ ఊడుస్తూనే ఉంది. మల్లికి ఈ రోజు శివయ్యగారి వాకిలి ఊరంత ఉన్నట్లు కనిపించింది. పెంటడు గ్రహించాడు. అక్కకు సాయం చేద్దామనుకున్నాడు కాని మరో పొరక లేదు. అక్క ఊడ్చే వరకు తన పని చేసుకుందామని కొట్టంలోకి వెళ్ళాడు.
    పెంటడు కొట్టంలో దూడలను విప్పుతున్నాడు. దూడలు కట్లు తెంచుకుని చెంగుచెంగున గంతులేస్తూ ఉరుకుతున్నాయి. తల్లుల దగ్గరికి పెంటడు దూడలను విప్పుతున్నాడనేగాని అతని మనసంతా అక్క దగ్గరే ఉంది. వాకిట్లో నుంచి ఏదో కేక వినిపించినట్లయింది. ఆపద విరుచుకు పడ్డట్లనిపించింది. ఉరికాడు.
    వాకిట్లో మల్లి కళ్లాపి చల్లుతోంది. కుండలో నీళ్ళు అయిపోయాయి. కుండడు నీళ్ళు చాలవు - ఆ వాకిలికి ఎన్నో కుండలు కావాలి. పెంటడు నీళ్ళు తోడి తెస్తున్నాడు. మల్లి కళ్ళాపి చల్లుతోంది. సాయం ఒకరుంటే శక్తి వస్తుంది మనిషికి. మల్లి పని చేసుకుపోతోంది. పెంటడికి అక్కకు సాయం చేయడమే అర్థం అవుతోంది. అవతల పని అతనికి గుర్తులేదు. పెంటడు కుండల్లో నీళ్ళు తెస్తున్నాడు, పేడ కలుపుతున్నాడు. మల్లి చాన్పి చల్లుతోంది, అంత పెద్దవాకిలి పచ్చిగా, పచ్చగా కనిపిస్తోంది. ఒకడు పచ్చగా కనిపించడానికి ఎందరి ఎముకలు నుసి అవుతాయో!
    సూర్యునికి ఎముకల్లేవు. అతనికి నుసి కావడం తెలియదు. లోకం చూడాలని ఆదుర్దా అతనికి. అన్నిటికీ సాక్షీభూతుడతను. అతనికి వెలుగుంది, నోరు లేదు. నోరే ఉంటే ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు వివరించగలిగేవాడో! అతనికి నోరులేదు. కన్నుంది. అందుకే అంత తపన! ఆగలేడు పాపం, ఉరికివస్తాడు. ఆకాశంలోకి వచ్చేశాడు సూర్యుడు అన్నీ చూడ్డానికి. చూసిన వాటిని చెప్పలేక మండిపోతూ వచ్చాడు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS