శ్రీ వెంకటేశ్వరులు, విశ్వనాథ
చీనా దురంతము
చెంగిజ్ ఖాను శిష్యుడు
దొంగముఠా గురువు దారిదోపిడి కాడున్
అంగిట విసమును మాటల
పొంగెడు తేనియలు చిందు బూచి దొరయునున్.
చౌయన్ లై భారత దే
శాయతి కన్నెఱ్ఱగాఁగ నగజాపతికిన్
బ్రేయంబగు కొండల న
న్యాయముగా నాక్రమించి యదరిపడియెడున్.
ఎఱుగడు భారతి సత్తను
నెఱిగి యెఱింగియును దూకి యీడ్గెలబడెడున్
కఱకులు భారతి కత్తులు
తుఱుమును టెంకాయఁబెట్టి తుఱుమినయట్టుల్.
తరముల పొలిమేరలలో
సరిసరి పూర్వపు తరాల సందులు గొందుల్
మఱగి మఱగి తనవనుచున్
గిరికీలను గొట్టు పొగరు క్రేళ్వారంగన్.
కార్మిక సమతా సిద్ధాం
తోర్ములలో నన్యరాజ్య యోగము కనుచున్
దుర్మతి భూతలమెల్లను
దోర్మూలగతంబు సేయ దుందుడుకు పడున్.
హిట్లరు ముస్పోలిను లే
గట్లంబడి పోయినారొ కనలే కెన్నో
పాట్లు పడు వీని కాలము
చిట్లెన్ నేటికి వినాశ సిద్ధింగనుతన్.
భరత త్రివర్ణకేతన
గురుతర వహ్నికలఁగాలి కుమిలెడు నాడేన్
బిరుసు చెడి భరతవీరుల
గరిష్ఠతయు దెలియవచ్చు గాదే తనకున్.
కాషాయంబుల బుద్ధుని
వేషమునన్ విషపుకీట వికృతిం బూనున్
రోషమయ తరువు వీనిన్
భేషజముగఁ గాల్పకున్న బృథ్వి మిగులునే?
దండము దశగుణ మగునన్
చండవచన ఫక్కి దుష్టసత్త్వము వీనిన్
గండడచి తోలకున్నన్
దండియె భారతపతాక ధారుణి నున్నే?
స్వస్తియగు భరతమాతకు
స్వస్తియగుత మంచుగొండ సరదారులకున్
ధ్వస్తంబై చైనాయు న
పాస్తం బగుగాత భరతు లాహవధాటిన్.
* * * *
