Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు - 9 పేజి 48


                                                     శ్రీ వేంకట రామకోటిశాస్త్రి, కె.

    పంచానన ప్రస్తుతి

    ఘోరము ఘోర ఘోరతర
        ఘోషణ భీషణమై అధర్మ సం
    హార సముత్సుకత్వమున
        యందు విజృంభణమున్ బొనర్చు గం
    భీరుని దక్షిణ ప్రధిత
        భీకరవక్త్రము మాదుశత్రు సం
    హార నిమిత్త మీ సమయ
        మందున జాగరితాత్మ మయ్యెడున్.

    ఏకముఖమ్ముగా నిలిచి
        ఏచెడు రాక్షస శక్తినెల్ల తా
    వైకృతముం బొనర్చి బల
        భద్రము సల్పెడు నట్టి ఆత్మలిం
    గాకృతి కాలరుద్ర భయ
        దాద్భుత పూత్ర్కుతియౌచు వామదే
    వాకృతి వొల్చు ఉత్తరము        
        వక్త్రము మాకరి నాశకమ్మగున్.

    తానయివచ్చి బాంధవము
        ధర్మము పెంచుకనిచ్చి పుచ్చుకో
    పూనికచేసి విశ్వజగ
        ముం గనగా కృతకార్యుడై తుదిన్
    హీనపు బుద్ధిజ్జేసి కల
        హించిన దక్షుని పీచ మార్పగా
    నైనది వీరభద్రము మ
        హ స్సరిసూదన మౌత మాకిటన్.

    క్రూరమృగాత్మతన్ వెడగు
        గొన్న మనుష్య పరాక్రమమ్ము క్రో
    ధారభటిన్ ప్రపంచకము
        నామెతగా గొనగోరి సాగి సం
    చార మొనర్చుచో జగము
        శాంతికినై ఎదురొడ్డి పోరి సం
    హార మొనర్చినట్టి శర
        భాకృతి మాకరిభీతి డుల్చుతన్.

    ఈ సిడి మానదండమని
        యెవ్వరు చెప్పిరి దీని, దీనితో
    వీసములేదు మాకు పని
        వీరునకా గిరిగీత లంచునున్
    త్రోసుక దేవతాత్మపయి
        దొమ్మియొనర్చి పురోగమించు చై
    నాసుర కైతవమ్ము నణ
        గార్చుత శాంభవ వీరమియ్యెడన్.

                                         *  *  *  *   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS