"శాస్తుర్లు గారూ' చెప్పేటప్పుడు ఒకటి చెప్పుతరు- చేసేటప్పుడు ఒకటి చేస్తరు. ఆడపోరలకు చదువొద్దని అందరికీ చెప్పుతరు - మీ కాడికి వస్తే వాండ్లను చదివిస్తరు?"
"దొరవారూ! ధర్మం కాలాన్ని అనుసరిస్తుంది. యుగధర్మాన్ని ధిక్కరించి ధర్మం నిలువలేదు. సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి యుగాలను బట్టి అవతారాలను మార్చిండు. పరశురామావతారంలో గొడ్డలి పట్టి క్షత్రియులందరినీ వధించిండు. యుగం మారింది. క్షత్రియుడయిన రామావతారానికి లొంగిపోయాడు"
"ఇంతకు యుగధర్మం కింద ధర్మం దిగదుడుపేనంటరు?" కృష్ణారావు ఆసక్తిగా అడిగాడు.
"ధర్మం యుగధర్మాన్ని అనుసరించాలె లేకుంటే ధర్మానికి నిలకడలేదు. స్త్రీ పురుష భేదం లేకుండా విద్య నభ్యసించడం ఈ యుగధర్మం కాలం ఒకవైపు గుంజుతున్నది. నేనింకో వైపు గుంజుతే నివలగలనా. అందుకే పావనికి చదువు చెప్పించిన బి.ఎ. అయింది"
"ఏంది! పావని బి.ఏ. పాసైనాది? ఎంత ఉండెడిది. గింత పిల్ల ఇంతల్నె అంత పెద్దదయినాది?"
"ఆడపిల్లలు అంతే దొరవరూ! ఇట్ల చూస్తుంటే అట్ల ఎదిగి కూచుంటరు. మా పావనికి స్కూలు టీచరు ఉద్యోగం వచ్చింది"
"శాస్తుర్లూ! మీపనే బాగున్నదయా! ఆ మాట చెప్పుతరు ఈ మాట చెప్పుతరు. పని ఎల్లదీసుకుంటరు. పిల్లకు కొలువిప్పించినవు, ఇగ ఈడెందుకుంటవుగని - పట్నం చేర్తరా!"
శాస్త్రిగారు పట్నం చేరతారనుకుని సంబరపడ్డాడు శివయ్య. ఈ ఒక్క అడ్డంకి వదిలిపోతుంది. మంత్రాలకు జంకడం తన స్వభావం. ఇగ ఊరంతటినీ ఏకఛత్రాదిపత్యంగా ఏలవచ్చు. తనకు దండం పెట్టేవాళ్ళేగాని, తాను దండం పెట్టాల్సిన వాళ్ళు ఊళ్ళో ఉండరు అనుకున్నాడు.
"దొరవారూ! ఈ మట్టిలో పుట్టిన ఇక్కడి మట్టిలోనే కలిసిపోవాలె. మా నాయనగారు, అమ్మగారు ఇక్కడినే పోయిన్రు. నా భార్య ఇక్కడనే గతించింది. నేనూ పెద్దవాణ్ణి అయిపోయిన. పావని ఇక్కడికి వస్తే దాన్ని చూచుకుంట. నాలుగు నాళ్ళుంట. కాటికి కాళ్ళు చాచుకొని ఉన్న, మీరు దయ దలచాలె"
శివయ్య ఆలోచనలు తలకిందులైనాయి. పావనిని తెచ్చి ఈ ఊళ్ళో పెడ్తానంటున్నాడు శాస్త్రులు. అందువల్ల శివయ్య లెక్కలు రాయాల్సిందే. చదువు చెప్పడానికి వీల్లేదు. చదువంటే బెదురు శివయ్యకు. పావని ఆడపిల్ల, లెక్కలు రాస్తుందనే నమ్మకం లేదు. రెండు - శాస్త్రిగారు కాస్త పలుకుబడి కలవాడు. వారి కూతురు బడి పెట్టి చదువు చెబుతానంటే తానేం చేయాలి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని అర్థం అయినా కానట్లు అడిగాడు. "చల్లకొచ్చిన్రు ముంతెందుకు దాస్తరు. ఏం కావాల్నో చెప్పరాదండి సాఫ్ సిదగ"
'శివయ్యగారూ! ఇందులో దాచెడి దేమున్నది? శాస్త్రిగారు వాళ్ళ అమ్మాయిని ఈ ఊరికి బదిలీ చేయించమని వేడుకుంటున్నారు. చేయించండి. నాకు విముక్తి కలిగించండి. పెళ్ళాం అక్కడ, నేనిక్కడ - వండుకోలేక చస్తున్నాను శివయ్యగారూ! మీకు పుణ్యం ఉంటుంది" కృష్ణారావు బతిమలాడాడు.
"మీరు అనుగ్రహించాలె. కాదనరాదు బ్రాహ్మణ్ణి, చేతులు చాపి అడుగుతున్న" శాస్త్రులువారు అర్థించారు.
"మీ సుఖం మీరు చూచుకుంటున్నారు. నాకు లెక్కలు ఎవడు రాయాలె?"
"శివయ్యగారూ! నాకు విముక్తి కలిగించండి. మీకేదయినా ముట్టచెప్పుత. కరుణించండి" కృష్ణారావు డస్కు ముందునుంచి లేచివచ్చి శివయ్య పక్కగా నుంచొని, చేతులు జోడించి ప్రార్థించాడు.
"శాస్త్రుర్లూ! నీ బిడ్డను పట్నంలనే ఉండనియ్యి, ఆడపిల్లలు ఆడ చదువు చెపుతేనే బాగుంటది. మీమంచి కోరి చెపుతున్న - ఆడపిల్ల ఈడ ఉండటం మంచిది కాదు, విన్నారా?" శివయ్య మళ్ళీ ఎవరినీ మాట్లాడనివ్వలేదు. చివాలున లేచి ధుమధుమలాడుతూ ఇంట్లో ప్రవేశించబోయాడు.
మల్లమ్మ గ్లాసులో చాయ్ తెస్తూంది శివయ్య కోసం. తెరచాటుంది, చూడలేదు. శివయ్య విసురుకు ఆమె చేతులోని చాయ్ సాంతం శివయ్యమీద ఒలికింది. గ్లాసు నేలమీద పడి పగిలింది.
శివయ్య చేయి చురుక్కుమంది. పంతులు మీదా శాస్త్రి మీదా ఉన్న కోపం పొంగింది. శివయ్య ఉగ్రుడైపోయాడు.
మల్లమ్మ గ్రహించింది. గడగడలాడి పోయింది.
"ముండా! చా పారపోస్తవటే" అని లాగి చెంపమీంచి కొట్టాడు. మల్లమ్మ మాట్లాడలేదు. కళ్ళల్లో నీళ్ళు దుమికాయి.
శివయ్య అంతటితో ఆగలేదు. మరో దెబ్బ కొట్టాడు. మరో దెబ్బ కొట్టాడు. బాదుతూనే ఉన్నాడు.
శాస్త్రి, కృష్ణారావు బొమ్మల్లా చూస్తూ నుంచున్నారు. "పాపం, దాన్నెందుకు కొడ్తరు" అందామనుకున్నాడు కృష్ణారావు, అనలేకపోయాడు. అక్కణ్ణుంచి సాగిపోయాడు.
"ఈ ఊరికి ఒక రావణాసురుడు దాపరించిండు" అనుకుంటూ సాగిపోతున్న శాస్త్రిగారి మాటలు విని ఆశ్చర్యపోయాడు కృష్ణారావు.
మల్లమ్మ ఏడుపు ఇంకా వినిపిస్తూనే ఉంది. శివయ్య కొట్టే దెబ్బలు వినిపిస్తూనే ఉన్నాయి.
మల్లమ్మ శివయ్యకు బానిస. మల్లమ్మ భర్త పరమయ్య పెళ్ళికి అప్పు చేశాడు. శివయ్యకు అమ్ముడుపోయాడు. చేసిన అప్పుకు గాను వడ్డీ కింద పరమయ్య చాకిరి చేయాలి. నిత్యం తిండికిచ్చే గింజలు మళ్ళీ అప్పు. పనిచేయనినాడు బత్తెం బంద్. ఆనాటి వడ్డీ పెరుగుతుంది. పరంయ్యకు జ్వరం వచ్చింది. చాకిరికి రాలేదు. శివయ్య గింజలు ఇవ్వలేదు. అంతటితో ఆగలేదు శివయ్య. నర్సిమ్మతో పరమయ్యను పట్టి తెప్పించాడు. చెట్టుకు కట్టేసి చితక్కొట్టాడు. వళ్ళు హోనం అయి పరమయ్య ఇంటికి చేరాడు. చెప్పాచేయకుండా ఊరు విడిచి పారిపోయాడు. శివయ్యకు ఆ వార్త తెలిసింది. మండిపోయాడు. గుడిసెకు నిప్పు పెట్టించాడు. మల్లమ్మను తెచ్చి ఇంట్లో చాకిరికి పెట్టుకున్నాడు. ఆమెను పశువుకంటే హీనంగా బాదుతుంటాడు. మల్లమ్మకు ఎక్కడో నలుసంత ఆశ ఉంది - పరమయ్య వస్తాడు - విడిపిస్తాడు అని ఆ ఆశతోనే జీవిస్తూంది.
మల్లమ్మ తమ్ముడు పెంటయ్య కూడా శివయ్యకు అమ్ముడుపోయాడు. ఒక్కడేమిటి ఊరు సాంతం శివయ్యకు అమ్ముడుపోయినవాళ్ళే. ఆ ఊరి జనానికి కష్టాన్ని అమ్ముకునే కనీస హక్కు లేదు. వాళ్ళకు కూలి దక్కదు. జీతాల్లేవు. బత్తెంకోసం పనిచేయాలి_ అదీ కష్టానికి ప్రతిఫలం కాదు_ తీర్చవలసిన అప్పు.
శివయ్య తండ్రి దొరికాడు. తాత దొరకాడు శివయ్య కొద్ది సేద్యంతో జీవితం ప్రారంభించాడు. అతనికి అప్పులు ఇచ్చే నేర్పు - వసూలు చేసే ప్రతిభ వచ్చేశాయి. దాంతో ఊరు సాంతం కొనేశాడు. శివయ్యకు అట్టే చదువురాదు. అంతకంటే ప్రపంచ జ్ఞానం లేదు. అతనికి తన వ్యవహారం తెలుసు. తన వ్యవహార సాగాలంటే ఊళ్ళోకి చదువు ప్రవేశించరాదు. అందుకే స్కూలు బిల్డింగును గిడ్డంగి చేసుకున్నాడు. వచ్చిన పంతులును గుమాస్తాగా మార్చుకున్నాడు.
అతని పెత్తనం అప్రతిహతంగా సాగిపోతూంది.
2
వేగుచుక పొడిచింది
తొలికోడి కూసింది.
మల్లి ఉలిక్కిపడి లేచింది. మల్లి పశువుల కొట్టం పక్కన కుక్కిమంచంలో పడుకుంది. ఆమెకు వళ్ళంతా నెప్పులుగా ఉంది. తల తిరిగిపోతూంది. రాత్రి సాంతం జ్వరంతో వళ్ళు మండిపోయింది. మూలిగింది ముక్కింది. కుక్కిమంచంలో పొర్లింది. అంతకుముందే జ్వరం జారినట్లుంది. కాస్త కునుకు పట్టింది. నిద్ర అన్నిటినీ మరిపిస్తుంది. కోడికూత నిద్రను తొలగదోసింది.
కోడి కూతతో ఆమె లేవాల్సిందే. అది నియమం. దాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు. పశువుకు జబ్బు చేస్తే అరకకు కట్టరు. ఏదో వైద్యం చేయిస్తారు. మల్లి పశువుకాదు. అందువల్ల ఆమె చేసేపని ఆగడానికి వీల్లేదు. ఆమెకు వైద్యం చేయించాల్సిన పనిలేదు.
మల్లి కుక్కిమంచంలో కళ్ళు తెరిచింది. వళ్ళంతా దెబ్బలు కొట్టిపడేసినట్లుంది. కదలడం చేతకావడం లేదు. మెదిలే శక్తి లేదు, తల బరువుగా ఉంది. కళ్ళు మంటలు మండుతున్నాయి. పడుకోవాలనుకుంది. ముడుచుకొని పడుకుంటే బావుండుననిపించింది. ఆ అదృష్టం ఆమెకు లేదు. తొలికోడి కూసింది. లేవాల్సిందే. లేవకుండా ఉండడానికి వీల్లేదు.
మల్లికి చలిగా ఉంది. చలిగాలి వీస్తూంది. వణుకు వస్తూంది. వణికిపోతూంది. మల్లి జ్వరం ఆమెను కుంగదీసింది. శక్తిలేదు. అయినా లేచి కూచుంది. లేవాలి తప్పదు.
మల్లి ముందుకు చూచింది. శివయ్య గారి బంగళా వెనుకభాగం కనిపించింది. బంగళా గట్టిగా ఉంది. సిమెంటుతో కట్టింది. తలుపులూ, కిటికీలూ మూసి ఉన్నాయి. అంత పెద్ద బంగళాలో ఇద్దరే పడుకుంటారు_ శివయ్య, సుభద్రమ్మ బంగళాలో వెచ్చగా ఉంటుంది. బయట చలిగా ఉంది. తాను బంగళాలో దూరగలిగితే ఎంత బావుండేదీ! లేదు తను దూరలేదు. సుభద్రమ్మ అదృష్టవంతురాలు_ తాను???
