Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు - 9 పేజి 33


                              శ్రీ రామసోమయాజి, భమిడిపాటి

    ఉరికించు రణభేరి

    ఉరికించు రణభేరి ! ఉరిమించు జయభేరి!
    చైనా దురాక్రమణ చండించు! మండించు!

        కండకావర మూడ, కైలాస మల్లాడ!
        బుద్ధదేవుడె కత్తిబూని యుద్ధంబాడ!
        కాళికాదేవి రక్తపుటేరు లీదాడ!
        మొండిచైనాగుండె ఖండించు! మండించు                               .... ఉరికించు

        నీ కళ్లలో రామనేత్రాగ్ని మెరసింది!
        నీ వ్యక్తి వీరాంజనేయమై దూకింది!
        నీ మూర్తి రణరంగ భీమమై వెలసింది!
        నీ దండ జగమెల్ల నిలచింది తమ్ముడా!                                 .... ఉరికించు

        చైనా మహారాక్షస క్రూర దంష్ట్రాల
        చైనా దురన్యాయ చండాల పక్షాల;
        చైనా దురాశా పిశాచ దుర్భావాల;
        చైనా మసైనా, నుసైనా, విడంబోకు!                                      .... ఉరికించు

        నక్క వినయాలతో, నమ్ర నాట్యాలతో,
        ప్రబల గర్వమ్ముతో, ప్రక్క బల్లెమ్మాయె!
        ఉపకారి కపకార మొనరించు చైనాకు,
        పరువు బ్రద్దలగొట్టు బలియిమ్ము తమ్ముడా!                              .... ఉరికించు

        నీ యాలుబిడ్డలే, నీ తల్లిదండ్రులే,
        నీ దేవతలె శత్రు పాదాల జచ్చిరా;
        బ్రతికినా నీకేమి పరువా? ప్రతిష్ఠయా?
        శత్రువును చెండాడి, జయలక్ష్మి నేలుకో!                                   .... ఉరికించు

        ఉక్కుపాదాలతో త్రొక్కి, చైనాపీక
        నొక్కినా, నిక్కి పైకెక్కినా, ప్రాణాలు
        దక్కించుకొను, ఘోరదాస్యమో, శత్రువుల
        జెక్కి వీరస్వర్గ సీమనో యెంచుకో!                                            .... ఉరికించు

        పడుపు బ్రతుకీడ్చినా గడవదన్నా చావు!
        ఉడుకు నెత్తుటివేడి ఉడిపించి, జగమెల్ల
        మెచ్చ చైనా గుండెజొచ్చి, బ్రద్దలుజేసి,
        భారతీయుని కీర్తి పాలించు, మేలెంచు                                       .... ఉరికించు

        ధనమైన, బంగారు గనియైన, నీ దేహ
        బలమైన, దాచి పూజల సేయ దాగునా?
        లోభించి కడకు సంక్షోభంబు జెందకే,
        జయమందు రణభూమి, సర్వంబు నర్పించి                                 .... ఉరికించు

        కొల్లగొట్టే శత్రు కూటమే వచ్చెనా;
        పాతిపెట్టిన నగలు, వజ్రాలు, సౌధాలు,
        నీవారలెక్కడో నీవెక్కడో లోభి?
        ముందె యర్పించి నీ భూమి కాపాడుకో!                                      .... ఉరికించు

                                         *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS