శ్రీ రాధాకృష్ణ, పరిగి
జాతిగర్జన
భాయి భాయి అంటూనే
బల్లెం విసిరింది చైనా
నీతులు వల్లిస్తూనే
గోతులు తవ్వింది చైనా
పెరిగిపోవు జనాభాకు
తిండి పెట్టలేక చైనా,
పచ్చని మన సిరిని గాంచి
పడింది మన పైనా
చైనా కిదె హెచ్చరిక
దురాక్రమణ సాగ దిక
రొమ్ము విరుచుకుంది జాతి
పొమ్మని గర్జిస్తోంది
గుండెల్లో వేడి రుధిరం
లావావలె ఉబుకుతోంది
కండల్లో చైతన్యం
నిండుగా నర్తిస్తోంది
సమరాంగణమున చిందే
ప్రతి రక్తపుబొట్టుకూ
వేనవేన శివాజీలు
ప్రాణాలతో లేస్తారు
కుతంత్రాలు సాగించే
కుళ్లుపోతులార వినుడు
మా దేశం మేలుకొంది
మీ కపటం తెలుసుకొంది
"నీరోలం" కాము మేము
"జీరోలం" కాము మేము
పిరికిజాతి కాదు మాది
నరకుతుంది శత్రువు నిది
పదునుబెట్టి ప్రబోధించు
చైనా గర్వాన్ని అణచు
జాతిలో శక్తిని పెంచు
కార్మికుడా! కర్షకుడా!
ఓ కళాకారుడా!
జాగరూకులు కండి!
జాగుచేయక రండి
మనపైన పడింది పిశాచి
వీస్తున్నది విషవీచి
మ్రోగించాలి "రణభేరి"
పోరాడాలి హోరాహోరి
మనవైపున్నది న్యాయం - మన నీతే మనకు సాయం
ముందుకు సాగాలి మనం - అందుకొనగ ఘనవిజయం.
* * * *
