ఆ దీవెనకు ఆయన పులకించిపోయేడు. ఆ తర్వాత "శాస్త్రీ" అని పిలిచేడు.
శాస్త్రి సారంటు అక్కడ హాజరయేడు.
శాస్త్రి వయస్సు ఇరవై. బక్కగా బ్లేడులాగా ఉంటాడు. తల్లీ తండ్రీ లేరు. మేనమామగారింట్లో కాలక్షేపం చేస్తూ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఆపైన చెప్పించలేమని వాళ్ళు తెగేసి చెప్పి-నీ బతుకేదో నువ్వు బతకమని ప్రపంచంలోకి నెట్టేసేరు.
ఆ విధంగా పొట్ట చేత పట్టుకుని రోడ్డెక్కిన శాస్త్రికి లక్ష్మీపతి తగిలేడు. లెక్కలు రాయడం, కూరలుతేవడం ఇత్యాది పనులన్నీ చేసినందుకు శాస్త్రికి తిండిపెట్టి డెబ్బై అయిదు రూపాయల జీతమిస్తున్నాడు ఆయన.
అదే చాలా ఎక్కువ జీతమని లక్ష్మీపతి ఉద్దేశం. రెండు మూడేళ్ళలో అయ్యగారి మనసు గెలుచుకుని నూరంకె చూడలేమానే ధీమా శాస్త్రికి.
వాళ్ళ అనుబంధం ఆ విధంగా ఏడాదినుంచి సాగుతూనే వుంది.
శాస్త్రితో అన్నాడు లక్ష్మీపతి...
"రామాలయం కట్టిస్తున్నారట, మనవంతు చందాగా పదివేలిద్దామను కుంటున్నాను. చెక్కురాసి తీసుకురా?"
'పదివేల'నే మాట చెవిని పడగానే శాస్త్రికి చెమట్లు పట్టాయి. కాలో నిజమో తెలీక బిక్కమొహం పెట్టేడు.
"నీకే చెప్తూంట, చెక్కు రాయి."
శాస్త్రి చెక్కుబుక్కు తీసుకుని ఎవరి పేరిట చెక్కు రాయాలో తెలుసుకుని, వణికే చేతుల్తో పదివేలూ రాసి లక్ష్మీపతిముందు పెట్టేడు.
ఆయన చెక్కుచించి వచ్చినవాళ్ళలో పెద్దాయన చేతికిచ్చాడు.
తీసుకుంటూ అన్నాడు పెద్దాయన...
"చెక్కుమీద సంతకం చేయటం మరిచిపోయినట్టున్నారు!"
అప్పడు ఆయన లేచి నించున్నాడు, తన తడాఖా ఏమిటో చెవిన పారేసాడు.
"చూడండీ! దానాలందరూ చేస్తారు. నేనుమాత్రం గుప్తదానం చేస్తాను. అంచేత నా పేరూ వగైరాలూ రాసుకోవడం నాకిష్టంలేదు, చెక్కు తీసుకెళ్ళండి,"
చెప్పదలుచుకున్నది చెప్పేసి తనగదిలోకి వెళ్ళిపోయేడు ఆయన.
అప్పటికిగాని ఆ నలుగురిలో కుర్రాయనకి వళ్ళు మండింది కాదు. పెద్దాయన చేతిలోంచి చెక్కు లాక్కుని అక్కడికక్కడే దాన్ని చించిపారేసి తనవాళ్ళతో అన్నాడు.
"విన్నారా? ఇదీవరస! పరమ చండాలుడని చెప్పేను. వినకుండా పదపదమని తీసుకొచ్చారు. సంతకంలేని చెక్కు మన మొహాన కొట్టి పదివేలంటున్నాడు. ఏమిటీ అర్ధమయిందా? ఇంకా నుంచున్నారేం! మీరెంత చచ్చి గీపెట్టినా పైసా కూడా రాల్చడు. సిగ్గూ లజ్జా దాడికి లేకపోయినా మనకుంది, పదండి పోదాం"
ఇంటిమీదకొచ్చి కొట్లాడేరకం కాదుగానుక వెర్రిమొహాలతో వాళ్ళు వెళ్ళిపోయేరు.
అప్పటికిగాని శాస్త్రీకి అయ్యగారి దెబ్బేమిటో అర్ధమయింది కాదు. అర్ధమయిన తర్వాత 'ఔరా' అనుకున్నాడు.
లక్ష్మీపతి తనభార్య అన్నపూర్ణమ్మమీద ఎగిరెగిరి పడుతున్నాడు.
"కన్నావులేవే ప్రబుద్దుడ్ని! మీనాన్న పేరు పెట్టుకున్నందుకు వెధవకి అన్నీ వెధవ లక్షణాలే!"
"మధ్య మా నాన్నగారినెందుకు ఆడిపోసుకుంటారు? అన్నది అన్నపూర్ణమ్మ నిష్టూరంగా.
"నోర్మూయ్! చచ్చి సాధించడమంటే ఇదేనే. ఆ కోదండరామయ్య బతికినంత కాలం ఆ మహానుభావుడికి సేవలు చేయలేక నా తాడు తెగింది. లక్షల్లక్షలు సంపాయించి ఆయన వళ్ళోపోస్తే తిని కూచోకుండా దానధర్మాలు చేసి నన్ను కుదేలు చేసేడు. ఆయన పోయేడు గదాని సంతోషిస్తే ఈ కోదండంగారు వేలిసేడు. ఎంతైనా కన్నబిడ్డగదాని వేలకు వేలు తగలేసి చదువు చెప్పిస్తుంటే- ఆ బి.ఏ. గట్టెక్కలేక నన్ను గుల్ల చేస్తున్నాడు. ఎక్కడా వాడు?"
"అన్నం తింటున్నాడండీ?"
"ఆహా- అన్నం తింటున్నాడా? అన్నం! వాడు తినేది అన్నంకాదే నా ప్రాణం! పెట్టవే పంచభక్ష పరమాణాల్తోపెట్టు! మనిషయ్యేక సిగ్గుండాలే! సిగ్గు!"
... సిగ్గు గురించి అంత స్పష్టంగా తండ్రిగారు చెబుతుండగా విన్న కోదండరాంకి-తను చెయ్యి పెట్టిన కంచంలో కేవలం సిగ్గులేనితనమే కనిపించింది!
అంచేత కన్నీళ్ళు పెట్టుకుని తినేతినే కంచంలో చెయ్యి కడుక్కుని లేచిపోయేడు.
బిడ్డ పరిస్థితికి ఆతల్లి తల్లడిల్లిపోయింది. అవునూ కాదూ అని చెప్పడానికి హక్కులేదు గనక నోరు విప్పి ఒక్క ముక్కయినా అనలేక పోయింది.
అన్నం తినకుండా లేచి పోయినందుకు కించిత్తయినా బాధపడని తండ్రిమాత్రం కొడుక్కి ఒకడ్యూటీ అంటగట్టాడు.
"మొక్కడం అయింది కాబోలు! బలాదూరు తిరక్కుండా ఆ సుబ్బారావు దగ్గిర్నించి అద్దెవసూలుచేసి తగలడు"
కోదండరాం గుప్పిట బిగించేడుగానీ-వెంటనే మళ్ళీ వదిలేసేడు.
లక్ష్మీపతి మళ్ళా హాల్లోకి దయచేసి శాస్త్రిని పలకరించేడు.
"చందాగాళ్ళు వెళ్ళిపోయేరా?"
"వెళ్ళి చాలా సేపయిందండి!"
"వెధవలట వెధవలు! వళ్ళువంచి పనిచేసే వాడికి తెలుస్తుంది డబ్బు విలువ. డబ్బంటే గుర్తుకొచ్చింది- పెడన చౌదరిగారి బాకీ ఏమైందీ? ఈ నెల్లోనైనా చెల్లగొడతాడా?"
శాస్త్రి నీళ్ళు నములుతూ చెప్పేడు-
"చెప్పలేమండీ! అడిగినప్పుడల్లా ఇస్తాంలే పొమ్మంటున్నారు."
"ఓహో! అంతవరకు వచ్చేడన్నమాట! తాడోపేడో తేల్చుకోకపోతే లాభంలేదు."
"అవునండి!"
"అంచేత ఇవాళే పెడన వెళ్ళు"
"తప్పకుండా వెడతానండి!"
"పీకలమీద కూచుని బాకీ మొత్తం వసూలు చెయ్యి"
"ఇవ్వకపోతేనో?" అంటూ నసిగేడు శాస్త్రి.
"నీ జీతంలో ఏభై రూపాయలు తెగ్గోస్తా!"
అంత అల్టిమేటం వినగానే శాస్త్రి గజగజా వణికిపోయేడు. వణుకుతూనే అన్నాడు-
"అన్యాయం సార్!"
"నాకింకేం వినిపించొద్దు! ముందా పనేదోచూడు!" అని లక్ష్మీపతి అక్కడ్నుంచి వెళ్ళిపోయేడు.
నిజానికి పెడన బాకీ తనజీతంతో లింకు పడటం దురదృష్టమే!
అలాంటి దురదృష్ట దౌర్భాగ్య జీవితంలో నిండా నూరురూపాయల జీతం చూసేదెన్నడోనని శాస్త్రి దిగులు పడ్డాడు.
పెడన వెళ్ళి బాకీ వసూలు చేయకపోతే-నూరు జీతం దేవుడెరుగు, వున్న జీతం డెబ్బయ్ అయిదునుండి కేవలం పాతిక రూపాయలకు పోతుందనే భయం కలగ్గానే అక్కడ్నించి పరుగెత్తేడు.
* * *
ఎండాకాలం!
పెడన గ్రామం యావత్తూ పెనంమీద కాలుతున్నట్లు ఫెళఫెళ లాడిపోతోంది.
శాస్త్రి పెడనలో సిటీబస్సు దిగేడు!
జీతం పాతిక్కి పడిపోతుందన్న ఆందోళనతో భోజనం మాట కూడా మర్చి బందర్లో బస్సెక్కిన కారణంగా బస్సు దిగగానే కళ్ళు తిరిగేయి. వళ్ళు తూలింది.
అయినా ఓపిక తెచ్చుకుని చౌదరిగారింటివేపు నడక సాగించేడు.
