Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 20


    మావగారు బతికున్నరోజుల్లో లక్ష్మీపతిని అందరూ కోదండరామయ్య గారల్లుడనే పిలిచేవారు. తన సొంత పేరు తాను సైతం మరిచిపోయే లెవల్లో ఆ గొడవ సాగినా వీసమెత్తయినా బాధపడేవాడు కాదు లక్ష్మీపతి.

 

    పైపెచ్చు-అదొక హోదాగా భావించి మురిసిపోయేవాడు!

 

    కాంట్రాక్టు వ్యవహారాలు బాగా నేర్చుకున్న పిదప ఆ మావగారి చావుకోసం కొన్నాళ్ళు ఎదురుచూసేడు లక్ష్మీపతి. ఆయన చనిపోతే చక్రం తిప్పొచ్చనే ఆశ అతన్ని నిబ్బరంగా ఉంచేదికాదు.

 

    మావగారు ఎంతకీ చావకపోతుంటే తానే చేయి చేసుకుందామనుకున్నాడు. ఆయన తాగే కాఫీలో చిటికెడు విషంపోసి పీడ విరగడ చేసుకుందామని అనేకసార్లు విషంకూడ రహస్యంగా తెప్పించేడు.    కానైతే-మావగారికున్న మంచిపేరు తన ప్రాణమ్మీదికి తెస్తుందేమోనన్న భయంతో ఎప్పటికప్పుడు తన ప్రయత్నాలను చంపేస్తూ వుండేది.

 

    కధ ఈ విధంగా సాగుతుండగా-

 

    పనిమీద ఒంటరిగా ఢిల్లీ వెళ్ళిన మావగారు గుండెపోటువచ్చి అక్కడే ఢామ్మన్నారు.

 

    ఆ విధంగా తన చేతులకు మురికి అంటకుండానే మావగారు గుటుక్కుమన్నందుకు లక్ష్మీపతి ఎంతో ఆనందించాడు.

 

    జనంకోసం మావ పోయినందుకు ఉత్తుత్తి ఏడుపులు ఏడ్చాడు, ఉపవాసాలు చేసాడు.

 

    అతని దొంగవేషాలు అంతో ఇంతో జనం నమ్మినా-అతన్ని కట్టుకొన్న అర్ధాంగి అసలు నమ్మలేదు.

 

    మావగారు కన్నుమూయగానే లక్ష్మీపతి కళ్ళు తెరిచాడు. ఆటోమేటిగ్గా వచ్చిన పెత్తనంతో గబగబా సంపాయించడం నేర్చుకొన్నాడు.

 

    ఆ సంపాదనలో నీతిసూత్రాలు అతనెప్పుడూ పాటించలేదు. ఆ సూత్రాలు పట్టుకుంటే మనిషి పాడయిపోతాడని అతని థియరీ!

 

    ఎవడ్నో ఒకడ్ని ముంచేయడంలోనూ ఎవడి నెత్తిమీదనో చెయ్యి పెట్టడంలోనూ అతను తిరుగులేని వీరుడు.

 

    కలిసొస్తుందని తెలిస్తే తప్పుడు తోవలు తొక్కడానికి వెనుకాడడు. డబ్బు సంపాయించడమే లక్ష్యంగా పెట్టుకొన్నప్పుడు-దానికి ఏ మార్గం అనుసరించినా తప్పులేదంటాడు.

 

    ఏతా వాత-

 

    బందరులో కాంట్రాక్టరుగా అతనికి పెద్దపేరే వుంది, గుణంలో మాత్రం రివర్సు!

 

    లక్ష్మీపతికి ఇద్దరు పిల్లలు. పెద్దవాడు కోదండం. మావగారి పేరు పెట్టుకున్నాం గనుక లక్ష్మీపతికి వాళ్ళబ్బాయంటే వళ్ళుమంట.

 

    దానికి తగ్గట్టు గత అయిదారేళ్ళుగా మిస్టర్ కోదండం బి.ఏ. పరీక్షలకు వెడుతున్నాడేగాని గట్టెక్కడం లేదు.

 

    అంచేత అతనంటే మరీ మంట!

 

    రెండో సంతానం పద్మ. తన తల్లిపేరు పెట్టుకున్నాడు గనక ఆ పిల్లంటే వల్లమాలిన వాత్సల్యం.

 

    పైగా చదువులో ఆ పిల్ల సరస్వతి గనుక మరింత ప్రేమ!

 

    కేవలం గొప్పకోసమే ఆ పిల్లను హైద్రాబాద్ లో చదివిస్తున్నాడు.

 

    లక్ష్మీపతికి సొంత థియరీలు కొన్ని వున్నాయి. కొడుకు పరమ చవటయినా కట్నంలేని పెళ్ళి చేయకూడదు. ఈ బి.ఏ. మిటకరిస్తే తన కొడుకు రేటు లక్ష పలుకుతుందనే ఉద్దేశంతో వున్నాడు.

 

    అల్లాంటిది---

 

    కొడుకు వరస చూస్తుంటే తన ముచ్చటతీరే అవకాశం కనిపించడం లేదు.

 

    ఆడపిల్లను కట్నంలేకుండా ఏ బిర్లా కొడుక్కో అంటగట్టాలనే తాపత్రయము లక్ష్మీపతికి మెండుగావుంది.

 

    అందుకతను చిల్లర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

 

    శ్రీ లక్ష్మీపతి ఇంటికి దయచేయండి! అరుగో ఆ మేడలోనే ఉంటారు.

 

    శ్రీవారు ఆ ఉదయం పక్కింటినుంచి తెప్పించుకున్న పేపరు తిరగేస్తున్నారు.

 

    పేపరులో వారు వార్తలు చదవరు. సంపాదకీయాలు చదవరు. ఫోటోలకు కళ్ళప్పగించరు.

 

    కేవలం టెండర్లే చూస్తారు.

 

    అనువయినవి తగిలితే ఆనందిస్తారు. లేకపోతే విసుక్కుంటారు. పాడుపేపరని తిట్టుకుంటారు.

 

    పేపర్లన్నీ వార్తలు మానేసి టెండర్లు మాత్రమే ప్రకటించాలని వారు కోరుకుంటారు. ఆమాటకొస్తే భూగోళం యావత్తు టెండర్లలోనే తిరుగుతుందని వారి ప్రగాఢ విశ్వాసం!

 

    టెండర్ల అవలోకనంలో లక్ష్మీపతి అవస్థపడుతున్న వేళ... ఆ పేట వాళ్ళు నలుగురు నమస్కారమంటూ వచ్చేరు.

 

    ఆకారం చూసి, బరువూ గట్రాలు తూచి నమస్కారాలు చేయడం లక్ష్మీపతికి అలవాటు.

 

    లాభముంటుందని తెలిస్తే లక్షసార్లు నమస్కారం పెట్టేందుకు అతడు వెనుకాడడు. అవస్థే తప్ప ఆదాయం సున్నా అని గ్రహిస్తే తాను నమస్కారం చేయకపోవడమే గాకుండా నమస్కరించిన వారికి ప్రతి నమస్కారం కూడా చేయడు.

 

    తన ఇంటికి వచ్చినవాళ్ళ అవతారం అంతంతమాత్రంగా ఉండటంతో వళ్ళు మండిపోయింది. ఇంక ప్రతినమస్కారం ఏం చేస్తాడు?

 

    వచ్చినవాళ్ళలో పెద్దాయన అన్నాడు...

 

    "అయ్యా... మనవీధిలో ఒక రామాలయం కట్టించాలని పెద్దలంతా ఒక తీర్మానం చేసేరు."

 

    "సంతోషం. పుణ్యకార్యం ఎవరు తలపెట్టినా మంచిదే! చందాల కోసం వచ్చినట్టున్నారు?" అడిగాడు లక్ష్మీపతి.

 

    "చిత్తం భక్తులు తమ తమ తాహతునిబట్టి చందాలేస్తున్నారు. అయిదూ పదులేగాకుండా వందా వేయి కూడా యిచ్చిన దాతలున్నారు. తర్వాత తమ చిత్తం!"

 

    తన చరిత్ర తెలిసికూడా ధైర్యంగా వచ్చింది చాలక... అంతకంటే ధైర్యంగా తనని చందా అడిగేవారి చొరవకి చురక తగిలించాలని అప్పటికప్పుడు అనుకున్నాడు లక్ష్మీపతి.

 

    దానికి ప్రాతిపదికగా...

 

    "నా తాహతు మీకు తెలుసుగా నా చందా ఎంతో చెప్పండి" అడిగేడు లక్ష్మీపతి.

 

    పెద్దాయన వినయంగా బదులిచ్చాడు.

 

    "వెయ్యిన్నూటపదహార్లు తక్కువగా కాకుండా..."

 

    "అంటే? నా స్థితికి ఆ పద్దు తప్పదంటారా?"

 

    "కాదంటే ఇహ మీ ఇష్టం, మీకు తోచినంత."

 

    లక్ష్మీపతి క్షణం ఆలోచించి గంభీరంగా అన్నాడు...

 

    "నా స్థితిగతులు చాలా తక్కువగా అంచనా వేసినందుకు సిగ్గుపడుతున్నాను, నా మట్టుకు నాకు పదివేలు ఇవ్వాలని వుంది!"

 

    వచ్చినవాళ్ళు ఆ మాటవిని అదిరిపడ్డారు.

 

    అతని ఉదార స్వభావానికి ఒకపక్క ముచ్చటపడినా-అతని లెవల్ని తక్కువ అంచనా వేసినందుకు మరోపక్క నొచ్చుకున్నారు.

 

    "ఆ మాటకొస్తే మొత్తం దేవాలయం నేనే కట్టించగలను. ఆ పని చేస్తే మిగతా భక్తులు బాధపడతారనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం చేయడం లేదు" అన్నాడు లక్ష్మీపతి ఠీవిగా.

 

    వచ్చినవాళ్ళలో పెద్దాయన లక్ష్మీపతికి చేతులు రెండూ జోడించేడు.

 

    "అంతా రామునిదయ! ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు" అని దీవించేడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS