శ్రీ పాపయ్యశాస్త్రి, జంధ్యాల
సైనికుని ఉత్తరము
ఓ నా దేశప్రజలారా!
ఉత్తరం వ్రాస్తున్నా
ఉత్తరం ఇదిగో మరి.
కరాళమృత్యు దంష్ట్రాం
కురాల చాటునుంచి
గంగా యమునా బ్రహ్మపుత్రులు
జన్మించిన చోటునుంచి
ఉత్తరం వ్రాస్తున్నా
ఉత్తరం ఇదిగో మరి.
అత్యంత అమూల్యమైన మానవత్వాన్ని
ఆమూలాగ్రం నాశనం చెయ్యాలని
ప్రత్యేకం పనికట్టుకున్నారు పాతకులు
సత్యాన్నీ ప్రేమనీ శ్రద్ధనీ
హత్యచేస్తున్నారు కిరాతకులు.
ఇద్దరినడుమ సరిహద్దులకోసం
గ్రుద్దులాట కానే కా దిది
సమస్త విశ్వశాంతిని
సవాలుచేసే జటిలసమస్య ఇది.
కుక్కల్లా లెక్కకురాని
దిక్కులేని చావు చావటమో
జయించి జీవిత పరమార్థాన్ని
మహిమాన్వితం చేయటమో
రణంగాదు రణం కాదిది
రామకార్య నిర్వహణం.
బ్రతుకో చావో పవిత్రజాహ్నవీతీరం
స్వామికార్యనిర్వహణం క్షణంభగురం శరీరం.
దేనికిలే పేరు తమ్ముడూ
నేనొక సైనిక వీరుణ్ణి
దీనురాలైన ఒకానొక
వితంతువు కుమారుణ్ణి
బ్రతుకు గతుకుల్లో
ప్రాణాలు బిగబట్టుకొని
అమ్మ పెంచింది నన్ను
అరచేతుల్లో పెట్టుకొని
కరిగి నీరైన కన్నతల్లి
నిండుగుండెల కన్నీళ్ళతో
పెరిగి పెద్దయినాను
చిరిగిన నిరాశ పొత్తిళ్ళలో.
గ్రామం పేరు ఏమంటున్నావా భాయీ?
భారతభూమిలోని గ్రామాలన్నీ
ఒకేలా నాకు కనిపిస్తాయి.
సన్నని సందులు సావిళ్లు
తిన్నని ఎద్దుబండ్లు
కన్నుల విందుచేసే
చిన్న చిన్న పూరిండ్లు-
పైరుపొలాలు, పంటకుచ్చెలలు
పసిడికంకుల కళకళలు
పడుచు లంగా కలంకారీ
అలంకారాల తళతళలు-
సంధ్యారుణ కాంతుల్లో స్నానంచేస్తూ
'అంబా' అని అరుస్తూ
కోడెదూడను నాకుతున్న
గోమాత కన్నుల మిలమిలలు-
ఈ కందకంలో పడివుండి
ఈరోజుకు మూడురోజులు
రగిపోగలు, పగిలే బాంబులు
మండే మంటలు, మృత్యుదేవత
నీలినీడలు పారాడే గుంటలు.
జాముసేపునుంచీ వాతావరణం
కొంచెం శాంతంగానే వున్నది
సైనికులభాషలో శాంతికి
'మరే' సరైన అర్థం ఏమున్నది?
ఎవరివో ఆర్తధ్వనులు
చెవులు బ్రద్ధలుచేస్తున్నవి
దొంగతోడేళ్ళ రంగుగడ్డాల
బరబరలు వినవస్తున్నవి.
ఎముకలు కొరుక్కుతినే చలిలో
కాళ్ళుచేతులు కొంకర్లుపోతున్నవి
రక్తం గట్టకట్టింది
దృష్టి స్తంభించిపోయింది.
ఎదలో వెచ్చవెచ్చగా
మెదలుతూ పదేపదే గుర్తుకు వస్తున్నవి
దూరానవున్న కన్నతల్లి
చల్లని మమతా-
అనురాగమయి అర్ధాంగి
తియ్యని అమాయికతా-
పిట్టల కిచకిచలలో
కిలకిలనవ్వే పాలబుగ్గల
చిట్టిబాబు చిన్నారి పెదవులజతా-
ఎదలో వెచ్చవెచ్చగా
మెదలుతూ పదేపదే గుర్తుకు వస్తున్నవి.
కనిపిస్తున్నవి అవిగో
అమ్మ కనికరపు కళ్లు
జలజల కారుతున్నవి
నులివెచ్చని కన్నీళ్లు
పొర్లిపోతున్నవి గుండెలు
తడిసి ముద్దైవి చెక్కిళ్ళు.
ప్రక్కనున్న పంచాయతీ రేడియో
ఒక్కటే ఆమెకు తోడు
అక్కడే కుక్కిమంచంలో
అమ్మ పడుకున్నది నేడు
మింటి ముంగిట్లో మిలమిల మెరుస్తున్న
ఒకే ఒక నక్షత్రంవైపు
అదేపనిగా పరుగెడుతున్నది
అమ్మ చూపు-
ఎవరైనా చెప్పండి అమ్మకు
ధైర్యంగా వుండమని
నా శిరస్సుపై ఆమె
ఆశీస్సులు కురుస్తుండమని.
అమ్మా! నీవు నిబ్బరంగా వుండు
నీ పేరు తలుచుకుంటూ నేను
ముందుకు నడుస్తున్నాను.
నరులకండలు కొరుక్కుతినే
రక్కసిగ్రద్దల డొక్కలు చించుతున్నాను
బండలమీద బాది
ముక్కులు వ్రక్కలు చేస్తున్నాను.
ధన్యమైన నీ స్తన్యంమీద ఒట్టుపెట్టుకొని
గట్టిగా చెపుతున్నాను తల్లీ!
'వీరమాత' అనే బిరుదం
నీ మెడలో హారంగా అలంకరిస్తాను.
రణరంగంనుంచి తిరిగి
ఇంటికి రాగలిగితే-
నీ కాళ్ళు కళ్ళకద్దుకొని
నీ చేతులు ముద్దుగొని
నీ పాదధూళి మౌళిపై
పులుముకొని పులకించిపోతాను.
లేదా తల్లీ!
కన్నతల్లి గౌరవానికిమాత్రం
కళంకం తీసుకురాను.
ఎవరు నీవు?
అమ్మప్రక్క నిలుచుండి
అశ్రువులు రాలుస్తున్నావు?
ఎందుకలా వెక్కివెక్కి ఏడుస్తావు?
క్షణక్షణం కరిగిపోతూ
జ్వలించే మైనపువత్తిలా-
ఝంఝూమారుతానికి
చలించే రావాకుల గుత్తిలా-
దురంత దుర్దినం దురా
క్రమణలో నిరాశ చెందకు.
నిరంత నిస్పృహతో కుందకు.
నిబ్బరం కోల్పోకు
చింతాక్రాంతురాలివి కాకు.
మంగళమయమైన ఈ సమయంలో
అమంగళంగా అశ్రు తరంగాలు
పొంగి పొరలనీకు
ఇది పూజాసమయం-వేళయింది
జగజ్జనని కాళికాదేవి
ఆలయం తలుపులు తెరువబడ్డాయి
అగరుధూపం అక్షతలూ తీసుకురా-
అసృక్ బిందుల చిందులతో తడిసి వికసించిన
అరుణకమలాలు కోసుకురా-
కా దిది ఒకరిద్దరి సంగతి
యావద్దేశానికి సంభవించింది విపరీత విపత్కర పరిస్థితి
వందలు వేలు వీరసైనికులు నావంటివారు
పందెం వేసుకొని ముందుకువచ్చి పడుతున్నారు
పవిత్ర కర్తవ్య మహాయజ్ఞంలో
ప్రాణాలు ఆహుతి చెయ్యబోతున్నారు
పరమోత్కృష్టమైన ఇటువంటి అదృష్టం
బ్రతుకులో ప్రాప్తించటం ఎంతో కష్టం
అదేదో ఆవేదన గుబగుబ
లాడుతున్నది గుండెలసందున-
ప్రాణం పోయేముందు
ఒక్కమాటు నిన్ను చూడాలి-
పసుపు కుంకుమల బంగారుకాంతి
కెరటాలలో స్నానమాడాలి
ఆలోచనకు సమయంలేదు
ఆత్మార్పణానికి వేళయింది.
విశాలభారత విమోచన
వీరదుందుభి మ్రోగింది
విజయోత్సవం సాగింది.
ఏమాత్రం నీకు నామీద ప్రేమవున్నా
ఈమాత్రం తప్పకుండా చెయ్యాలి
మన బిడ్డల మనస్సులో దిక్కులేనివారమనే
దీనభావం తీసెయ్యాలి
వాళ్ళకు ఆత్మగౌరవం నూరిపొయ్యాలి
వాళ్ళు పెద్దవాళ్ళయి సగర్వంగా తలెత్తుకుతిరగాలి
వాళ్ళ నాన్నపేరు తలుచుకొని
వాళ్ళ దేహాలు నిలువునా పులకించాలి.
కరుణామయీ! కన్నీళ్లు తుడుచుకో
దుఃఖం దిగమ్రింగు
కర్తవ్య నిర్వహణం- ఇది కఠోర పరీక్షాక్షణం
ఇంకేమీ అనుమానం లేదు.
నారీజీవనం నాటికి నేటికీ
ఇలాగే నడిచిపోతున్నది-
గుండెల్లో మండే దుఃఖ
జ్వాలలు భరించుతూ-
పెదవులపై చిరునవ్వులు చిందించుతూ-
పౌరుషపూర్ణమైన నా
ప్రతిజ్ఞకు హారతిపట్టు
పరువు నిలబెట్టు- భారత
వీరగౌరవానికి జేకొట్టు
నీ కన్నబిడ్డలకు నిప్పుతో
చెలగాటం నేర్పు
భావిభారత సంతానానికి మనం
పంచియిచ్చే బహుమానం
త్రివేణియై ప్రవహించే
శౌర్యం ధైర్యం బలిదానం.
వస్తాను-వస్తాను
తప్పకుండా వచ్చేస్తాను
మువ్వన్నెల విజయపతాకంలా
నవ్వుతూ ఎగిరివస్తాను.
గాండీవధరుని నరుని ప్రతిజ్ఞ
తాండవిస్తున్నది నా జిహ్వాగ్రాన
ఇకలేదు తిరోగమనం
సాగింది పురోగమనం
తెస్తాను-తెస్తాను
ముమ్మాటికీ తెస్తాను
విలువైన విజయోపహారం
తీసుకువస్తాను
దురాక్రమితమైన దేశ గౌరవానికి
విముక్తిగీతం ఆలపిస్తాను.
ఇదిగో ఇప్పుడు జ్వలించిపోతున్నాను
హిమాచ్ఛాది శిఖరాలమీద
దేదీప్యమానంగా ప్రజ్వలించుతున్నాను
క్రమ్మిన అమావాస్య
చిమ్మచీకట్లను చీల్చివేస్తున్నాను
అచంచల సౌభాగ్యవతి
అమరభారతి అఖండజ్యోతికి
వేడినెత్తురు-అక్షయమైన
ఆజ్యంగా, అమోఘమైన
అర్ఘ్యంగా అర్పిస్తున్నాను.
* * * *
