శ్రీ పద్మనాభస్వామి, యామిజాల
వీరభారతము
మంచుంగొండ యటంచు, నెంచితొ హిమ
క్ష్మాధ్రంబు నీ గుండెలన్
దించున్ ప్రాక్తన యోగిపుంగవ తపో
గ్ని జ్వాలలన్ గాల్చి, భ
క్షించున్ నాటి కపర్ది జేత చటులా
గ్ని స్ఫారరోషచ్ఛటల్
నించున్ నీపయి నిష్ఠురాశుగములన్
జేకొట్టి చైనీయుడా!
మింటిని మంట కేకమయి
మీర హరోం హర సింహగర్జనల్
కంట మిణుంగురుల్ చెదర
గా నదె భారత వీరసైన్యమున్
దంటతనాన ముందడుగునన్
బడనున్నది దారుణాస్త్రముల్
గెంటగ నిన్ను; నీ గురుని
కిన్ వినిపింపుము నీదు దుస్స్దితిన్.
దురహంకార విముగ్ధ వర్తనము సై
దోడై నినున్ లేప ని
ష్ఠుర మాయాకవచంబు తొడ్గి కరుణా
శుంభద్గజేంద్రంబుపై
నురకన్ జూచిన శ్వానమైతి; విది ఓ
హో ఎంత కైలాటమో!
భరమౌ సుమ్ము, గజేంద్ర ముగ్రమయినన్
ప్రాణావన మ్మాపయిన్.
సరసుల్ సత్యపరాక్రమక్రము లహిం
సా ధర్మ సద్వర్తముల్,
కరుణామూర్తులు భారతీయులని లో
కం బేకమై సంస్తుతుల్
నెరపన్ మెత్తని వారలంచును మదిన్
నీవెంచి యీ వంచనన్
కరమున్ జూచుట కారుచిచ్చుపయి త్రొ
క్కం జూచుటే యౌనులే!
పండిట్జీ జవహర్ ప్రధాని కరుణా
బంధుడు క్రుద్ధుండునై
గాండీవంబు ధరించినాడు, జలధుల్
గర్జించు నుద్రిక్తతన్
కొండల్ చెండులుగాగ, దిగ్గజ శిరః
కూటంబు మాటాడ, నీ
గుండెల్ వ్రీలగ; ఆత్మరక్షణము నీ
కున్ సాధ్యమే యీ పయిన్?
భారత ధర్మబోద్ధలు కృ
పారస ముగ్గొగ నీదుజాతికిన్
నేరుపుమీర నేర్పిరి, వి
నిర్మలశాంతగుణంబు దానికిన్.
వేరుగ నీవు చూపినది
నిష్ఠుర తాయుత వక్రబుద్ధి
వౌర! ప్రజావినాశకుడ!
వైతివి నీ తెలి వారిపోయెనే!
భారతవీరగాథ రిపు
వర్గ హృదంకుశమై చెలంగె, నె
వ్వారును నెత్తిపై కరము
వైచిన వారలు కానరారు, నీ
తీరున నూరకే యెగసి
దిగ్గున నేలకు డిగ్గ జూచితే!
మూరకు బార వైవగను
మోమెటు చెల్లెర నీకు దుష్టుడా!
నెత్తురు ద్రావువాడ వయి
నెత్తికి కుంపటి నెత్తజాచితే!
పొత్తును జూపుచున్ భరత
భూమికి ద్రోహము చేయజూచినన్
మిత్తికి భృత్యువౌట సుమ,
మీదు నెరుంగక కత్తిదూసితే!
జిత్తులు సాగవింక నిను
"ఛీ" యని రావలి తెల్లవారలున్.
రంతుల్ మానర భారతాక్రమణ మా
రంభించి యీపాటికిన్
గంతుల్ మానర భారతాధిపతితో
కయ్యానకున్ రేగుటల్
సంతాపంబునకే యటం చెరుగరా
సయ్యాటలా దంతితో
క్రంతల్ దూరు విధంబు మానర, జగ
త్కళ్యాణ మాసింపరా!
రక్షో నైజగుణమ్ముతో రుధిర సా
మ్రాజ్యాభిషేకమ్ముతో
అక్షు ల్మోడ్చి చరింప జూచితివె సిం
హాకారు డౌ జహ్వరున్
వీక్షింపన్ దర మౌనె నీ కిక; ఎవో
నీకున్న ఆ ఆయుధాల్
రక్షింపన్ గలవంచు త్రుళ్లకుము! వీ
రమ్మన్య! చౌఎన్ లయీ!
మారణకాండమే సలుప
మా జవహర్బుధు డెంచెనేని, యీ
ధారుణి దిర్దిరం దిరుగు
తప్పను వార్థులు పాదులెల్ల, హా
హా రవ ముప్పతిల్లును ది
శాల గణమందు మహీధ్రవర్గముల్
భోరన వ్రీలు నీ వలయ
మున్ గననెంచితె చౌఎనూలయీ!
* * * *
