శ్రీ నారాయణరావు, కాళోజి
కలము కుంచె కదలాడెను
పగటి దొంగ సమూహాల
పొగరణచెడి మొనగాడా!
సరిహద్దును కాపాడే
సైనికుడా! వినుము వినుము
కొండచాళ్ళ మంచుమీద
కొంకర్లుపోవు చలిలో
వీరోచితముగ నీవు
వైరులతో పోరుచుండ
అష్టపదుల జావళీల
ఆలాపన మాని నేడు
గళము కూడ రణ దుందుభి
కళల బూని పాడుచుండ
కలము కుంచె కులము వారు
కామిని చేలాంచనముల
కదలించెడి దొంగచాటు
కలలే చిత్రిస్తారా?
వాల్జడలో నల్లతాచు
వాలకమును కను కనులకు
ప్రాకారము ప్రాకివచ్చు
పన్నాగము లగుపడవా?
క్రీగంటి చూపులకే
క్రిందుమీదులౌ యెడదలు
పగబూనిన కోరచూపు
దగడుల గమనింప లేవా?
'నిగా' బెట్టి వగలారుల
'దగా' లెన్ను చతురులకు
పంచతంత్ర కుతంత్రాల
వంచన 'అంచన' లేదా!
శీతకరునిచే నిప్పులు
చెరగించెడి మాంత్రికుల
శివుని కొసరు కంటిలోన
చిచ్చును రగిలింపలేరా?
కుసుమాలకు కూడా అమ్ము
కొసల పదును పెట్టువారు
కలమును కుంచెను మెత్తని
కత్తి జేసి వాడలేరా?
వాత్స్యాయన నిగూఢాల
వాస్తవ మెరిగిన ఘనులు
వర్తమాన పరిస్థితుల
స్వరూపాల నరయ లేరా?
తంజావూరీ రాజుల
తరహా లాలస మాని
సమయోచిత వీరావే
శమును బూని పూనింపక
కలము కుంచె కదలాడెను
గళము తోడుగా పాడెను
సుఖ లాలస కనిపెంచిన
'నఖరా'లను మాని జనము
జాతి రక్షనార్థము తగు
రీతిగాను సాయపడగ ||కలము||
కొండచాళ్ళ మంచుమీద
కొంకర్లుపోవు చలిలో
కండ బలమునకు తోడుగ
గుండె బలము చేకూర్చగ ||కలము||
నేల కాళ్లు నెరయదన్ని
నింగిముట్ట తల నిగుడ్చి
అస్తాద్రిని ఉదయాద్రిని
అంటగ బారలు సాచగ ||కలము||
అన్నలమని ఆప్తులమని
తిన్నగ సరిహద్దుదాటు
ఆతతాయి సమూహాల
నాపి హడలుగొట్టుటకని ||కలము||
ఆంధ్రావళి అండదండ
ఆసాముకు అందింపగ
నయ్యర్లకు తోడ్తోడుగ
నాయర్లను నిలిపివుంచ ||కలము||
బదరీనాథుని రక్షకు
మధురను కంచిని కదుపగ
కాశ్మీరమునకు జంటగ
కన్యకుమారిని నిలుపగ ||కలము||
బిహారీల రణభేరిగ
మహారాష్ట్రము హుంకరింప
గురుగోవిందుని గర్జన
ఘూర్జరులను కదలింపగ ||కలము||
కర్నాటక చాముండియె
కలకత్తా కాళి కాగ
కైలాసము పిలుపును విని
కాకతి చిందులు త్రొక్కగ ||కలము||
బారాహుట రక్షణకై
భద్రకాళి తలయెత్తగ
రెంటచింత మంట లెగసి
మింటి మంచు మండింపగ ||కలము||
ఉత్కళీయ ఉత్సాహము
ఉత్తరాన్ని ప్రోత్సహింప
ఏడుకొండ లెలుగెత్తుచు
హిమవంతుని పురికొల్పగ ||కలము||
గంగోత్రీ పావిత్ర్యము
వంగీయులు కాపాడగ
బ్రహ్మపుత్ర రక్షణకై
పంజాబీ పరుగులెత్త ||కలము||
శ్రీనగరము చేయూతకు
శ్రీరంగము ఎగిరి దుముక
శ్రీ శైలము గంతులిడుచు
శీతనగము నాదుకొనక ||కలము||
బోమిడిలా పరిసరాల
బొబ్బిలి పెడ బొబ్బలిడగ
లద్దాఖును చేరి కాయ
పుదుచ్చేరి కదంత్రొక్క ||కలము||
* * * *
