శ్రీ జ్ఞానానందకవి
సమరాహ్వానము
రారండోయి యఖండ పౌరుష గుణ
ప్రారంభ భాగ్యోదయ
శ్రీ రాజ న్నవవీర భారత పురం
ధ్రీ పుత్త్రికా పుత్త్రులా
రా! రంహస్సున దుర్నయుండు 'చయినా'
రాకాసిఁ జక్కాడఁ గా
శ్మీరారంభక సైతవాంత వసుధా
సీమాస్థ సంతానమా!
జగతీచక్ర ప్రశంస లందిన యహిం
సా వాది బాపూజి ధ
ర్మ గుణైకోజ్జ్వల మార్గమందుఁ జని సం
పాదించుకొన్నట్టి పే
రొగి మీ గొప్పదనానకు న్నిలయమై
యొప్పున్ సమీచీనమై
పగలం బెంచిన దుర్జనుండు 'చయినా'
వాని న్నిరోధింపుడి.
పంచప్రాణములన్ దెగించి యొముకన్
బాధించి వేధించు పెన్
మంచు గొండల శీతలాధికతకున్
రవ్వంత లెక్కింపకన్
కించిన్మానవు లౌ నరాతిజన వ
క్రీభూత దౌష్ట్యాలు ఛే
దించెన్ భారతవాహినుల్ గదలి మీ
దే ధర్మయుద్ధం బగున్.
ప్రమాధాధీశునితో సవాలు నొనరిం
పంజాలి నా డొక్క దు
ర్దమ బాహాపటు శక్తిశాలి, హడలె
త్తం జేసె సచ్చక్తియై
యమునిన్ గొండొక పుణ్యశాలిని మగం
డాయుప్రమాణంబుతో
డ మనన్ భారతవీర విప్లవపు ఘ
ట్టా లివ్వి జై కొట్టుడీ.
పేచీపెట్టి యశాంతిరేపి భరతో
ర్విం జుట్టి ముట్టాడగా
లేచెన్ దుష్టవిరోధి తండములు లే,
లే, లెండు మీ సాహస
ప్రాచుర్యంబులుఁజూప వేళ యిదె యౌ
రా! భీషణోన్మాద పై
శాచిం జంపగ దిగ్దిగంతములు మె
చ్చన్ దీక్షం గైకొం డహో!
కైలాసాచల శృంగసంగతుడు దు
ర్గా ప్రాణనాథుండు జే
జేలం దన్పిన చంద్రశేఖరుడు ర
క్షించున్ మహాభారత
క్ష్మాలక్ష్మీ విజయైక చిహ్నత శుభ
స్వచ్చ స్వతంత్ర ప్రధా
శ్రీలన్ నాట్యకళా కలాపుడు శివ
శ్రీమూర్తి కల్పాంతమున్.
దీక్షాకంకణ ధారులై భరత ధా
త్రీ మాతృ మాంగళ్య సం
రక్షా దీక్షితులారా! యీ భువనముల్
శంసించు మీ త్యాగపున్
దక్షత్వమ్మున కేటి కోళ్లు జగదానం
ద ప్రభూతమ్ము మీ
యక్షయ్యంపు స్వతంత్ర జీవనకథా
వ్యాజైక సిద్ధాంతముల్.
సాగండోయి విశాల భారత జన
స్వాతంత్ర్య సంస్థాపనా
శాగంభీర మనస్కులార! హృదయా
బ్జాతమ్ము పొంగార ను
ద్వేగోద్విగ్న మనస్కయైన 'చయినా'
విద్వేషణారంభముల్
వ్రీగన్ శాంతి రసైక భావములు పృ
ధ్వి న్నిండ నశ్రాంతమున్.
కదలండోయి యవక్ర విక్రమ రణై
క స్ఫార విస్తార సం
పదకుం బట్టగునట్టి భారతజన
మ్మా! దుష్ట వైధేయులన్
తుదముట్టింపగ మీ ప్రయత్నములు శ
క్తుల్ నింపి గెల్పించెడిన్
ఇదె స్వాతంత్ర్య పథానకుం దెరవు కా
దే? లెండు యోధాగ్రణుల్.
* * * *
