శ్రీ నారాయణరెడ్డి, సి.
క్రొవ్వెక్కిన చైనా
వెన్నవంటి భరతజాతి
వెన్నున నిప్పంటించిన
దెవ్వరు? నువ్వేనా!
క్రొవ్వెక్కిన చైనా!
ఎదరొమ్మున బాకు రువ్వి
యే మెరుగనిలా దిక్కులు
చూచు నంగనాచీ!
ఛీఛీ విషవీచీ!
నమ్ముకొన్న నేస్తకాని
నాడులు తెగనరుక నెంచు
క్రవ్యాదుడ వీవు; గోము
ఖవ్యాఘ్రం నీవు!
సామ్యవాద మను పేరిట
సామ్రాజ్య పిపాసదీర్చ
నెంచు కుటిలజాతీ!
ఇదా రాజనీతి?
సరిహద్దుల తగాదాల
బురఖాలో ద్వేషవిషం
బుసకొట్టెనులేరా! నిను
పసికడితిమి పోరా!
ప్రక్కయింటి ద్వారానికి
పచ్చతోరణాలు చూచి
కళ్ళుమండె నీకు; నీ
కథ తెలిసెను మాకు.
తిండికి సరిపోకుంటే
తిరిపె మెత్తుకోనుంటివి;
జనం పెరిగితే మిత్రుల
శరణు వేడుకోనుంటివి.
తోటి దేశమున చొరబడి
దురంతాల కొడిగట్టే
బూజుబుద్ధి తగదుర! చెం
గీజుఖాను సోదరా!
భాయీయని బుజముదట్టి
చేయి చేయి కలిపినట్టి
గడియ మరతువేమి? బుద్ధి
గడ్డితిన్న దేమి?
భరతజాతి సత్త్వమ్మును
పరీక్షించబోకుము; అది
సహనానికి ఏలిక! ఈ
సమరానికి కాళిక!!
* * * *
